Home వ్యాసాలు అన్నం తిని పోయి ఆడుకోరా..

అన్నం తిని పోయి ఆడుకోరా..

by Chandu Pendyala

అని ఓ అమ్మ పిలుపు,బాబూ ఎప్పుడూ ఆటలేనా కాస్త చదువుకోండిరా పరీక్షలు వస్తున్నయిరా అని అదే ఊళ్ళో కిరాయికి వుంటూ ఆ ఊరి ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పే సారు,అమ్మ పిలిచినా రాలేదు ఇంటికి అని కోప్పడే సోదరుడు , ఇంత మంది ఇన్ని తీరులుగ మందలించినా ఆట నుండి అర అడుగు కూడా ముందుకు వేయనివ్వని చిన్నప్పటి ఆటలు మనసును పొరలు పొరలుగా మెలిబెడుతుంటే బాల్యపు బడుద్దాయి చేష్టలు,అల్లరులు,మరి ముఖ్యంగా ఆడిన ఆటలు “అరటాకు లాంటి కాగితంలో ఆరబోయక తప్పదు”.

పక్క పక్కన ఇండ్లు,ఇండ్లను ఆనుకుని గుడిసెలు , అక్కడక్కడ అద్దాల మిద్దెలు అన్నిటిని అనుసంధానం చేస్తూ వాడలు , మధ్య మధ్య సన్నని సందులతో కూడిన పల్లెలు.ఆ పల్లెలో ఇంటికిద్దరు అన్నదమ్ములు ఇంటికిద్దరు అక్కచెల్లెలు.భారము లేని చదువులు,సమయాన్ని లెక్కించని లెక్కలు.
ఇవన్నీ ఆటలకు అనుకూలించే అంశాలు.
“దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ ఎలుక భద్రం కోర్ ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ ” అని గోడ చాటుకు పోయి పది లెక్కపెట్టేసరికి దోస్తులంతా తలుపుల చాటుకు,గడ్డివాముల చాటుకు దాచుకుంటే లెక్కపెట్టినతను దొరకబట్టకుంటే వెనుక నుండి పోయి వీపులో కొడితే వాడు మళ్ళా లెక్కబెట్టాలె”.
” చిర్రా గోనె అనే ఆటలో రెండు వైపులా కొచ్చెగా చెక్కిన చిన్న కర్రనే చిర్ర.గోనె అంటే పొడవాటి కర్ర.ముందుగా చిన్న రంధ్రం ( బద్ది ) తవ్వి చిర్రను బద్దికి అడ్డంగా పెట్టి గోనెతో

చిర్రను లేపి కొడితే అది పైకి ఎగరగానే అదే గోనెతో గట్టిగ కొడితే దానిని అవతలి వాడు పట్టుకుంటే కొట్టిన వాడు అవుటయినట్లు”.
” బొంగరం అయితే అది రయ్యిన తిరుగుతూ కాలాన్ని కూడా తిప్పేది.దానితో నేలతో పాటు అరచేతిలో కూడా తిప్పిన అనుభవాలు”
” నీ నేలంత తొక్కి తొక్కి పాడుచేస్త, రాయి రంగన్న , కట్టెలమోపు అనే హుషారైన ఆట”
” వినవే బాలా నా ప్రేమ గోల”
తొక్కుడు బిళ్ళ ఆడా రావే ” అని హాస్య నటుడు రేలంగి హీరోయిన్ తో పాతాళభైరవి సినిమాలో సరదాగా ఆడుతూ పాడే పాటలోని ఆ తొక్కుడు బిళ్ళ ఆటలో చిన్న’ పెంకాసు’ ను నాలికకు అద్దుకుని ఎనిమిది డబ్బాలు గీసి ఆ పెంకాసును అందులో వేసి దానిని కదిలిస్తూ కుంటుతూ ఆడే ఆట “.
” చింత గింజలతో ఆడే ఓనగుంటల ఆట”
” కచ్చకాయల ఆట “
” గోలీలాట లో రంగురంగుల గోలీలు రకరకాల సైజులతో ఎక్కువగా పిల్లలు ఆడే ఆట అది”.

ఇటువంటి ఎన్నో ఆటలు నాడు పిల్లలకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేవి.ఖర్చు తక్కువతో తల్లిదండ్రులకు భారం కాకుండా,తోటి సమాజానికి హాని జరుగకుండా ఆడిన ఆటలు నేటి పిల్లలకు కూడా నేర్పితే కొంతైనా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేయగలమేమో…

You may also like

Leave a Comment