మౌన సంభాషణలెన్నో
మనసు పొరల్లో…
ప్రవహించే గీత నదులెన్నో
అంతరాంతరాళాల్లో…
ఊపిరాడని అవస్థల్లోనూ
మైదానమంత కవిత్వం పుడుతుంది
మూసిన కిటికీలపై
మనసు భాషను అది చిలకరిస్తుంది
చుక్కల జెండాలను పట్టుకుని
చిగురు చిరునామాగా ఊతమౌతుంది
బువ్వలోని మట్టి పరిమళమౌతుంది
జీవితాన్ని వడగట్టిన కన్నీరవుతుంది
అర్థం చెప్పి ఆచరణవుతుంది
గాలికి ఆయువు పోసి
ఆకుపచ్చని పాటవుతుంది
వాస్తవమై గుండెల్లో స్థాపితమౌతుంది
జరామరణాలు జయించి
అజరామరమవుతుంది
నదీ హృదయమవుతుంది
అనుభవాల అగాధలపై
ఆలోచనాలోచనమవుతుంది
జీవన చైతన్యదాయినిగా వికసిస్తుంది
నిశ్శబ్ద గీతమై…
previous post
2 comments
మీ కవితా కౌశలం భలే రస రమ్యంగా వుండి
హృద్యంగా ఉంది మాకు మాటలు రావడం లేదు.
మా అనుభవంలో అతనిపై విశ్లేషణ అంతకన్నా ఏముంటుంది
జై శ్రీమన్నారాయణ.