చీకటి తెరలుతొలగించుకొని చిరువెలుగులు పరచుకుంటున్నాయి/
వెలుగులు విరజిమ్ముకుంటూవేకువ వెల్లువౌతోంది
తూర్పుకనుమలపొత్తిళ్ళు తొలగించుకొని /
కందగడ్డలాంటిముఖంతో కళ్ళుతెరచి చూస్తున్నాడు భానుడు .
ఉర్వీకాంత ఉద్విఘ్నభరితమౌతుంటే /
కమలబాంధవుడు కనులు విప్పార్చి చూస్తున్నాడు .
సూర్యుని సొగసుచూసి సిగ్గుల మొగ్గైన కమలిని/
కమలముల చాటున దాకున్నదృశ్యం కమనీయంగా ఉంది .
పసుపుగడపలపై పడిపరావర్తనం చెదుతున్న ప్రభాతకిరణాలు /
ముత్యాల ముగ్గులపైపడి మెరసిపోతున్నాయి
కోదండరాముని శిఖరంపై కోవెలగంటలపైపడి
పవిత్రతపొందిన ప్రభాకర కిరణాలు/
శిరస్సులను స్పృశించి శిరోధార్యమౌతున్నాయి …
చరాచర జగత్తునంతాచైతన్యపరచే బాలభానుని బంగరుకిరణాలు భేదభావం లేకుండా/
ప్రసరిస్తూ ప్రమోదాన్ని కలిగిస్తున్నాయి
గుండెలనిండా ఊపిరిపీల్ఛుకొని గూళ్ళనుండి బయిటకొస్తూ
కలసికట్టుగా ఆహారాణ్వేషణకు బయిల్దేరిన పక్షులగుంపులు/
సమైక్యతాత్మక జీవనానికి సజీవసాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
పచ్చనిపైరులనుండి విచ్చుకుంటున్నవిరులపైనుండి
వీస్తున్న గాలులు ప్రేమగా శరీరాన్ని నిమురుతూ /
ప్రకృతిని కాపాడుకోమని పరోక్షంగా చెప్తున్నాయి .
శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా సాగిపోయే
కర్షకులతో కార్మిక శ్రామికులతో కలకలలాడుతూ
సౌందర్యానికి సాకామైన ఆ ఊరు /
ఉత్సాహంగా ఉగాది సంబరాలకు ముస్తాబౌతోంది .
నిండు గర్భిణిలా నూతనోత్సాహంతో ఉన్న ప్రకృతికాంతకు
సీమంతం చేయడానికి సిద్ధమైన వసంతం /
పచ్చనిచెట్ల పసుపు ఎర్రనిచిగుర్ల కుంకుమతో
ఎదను పులకింప జేస్తోంది .
గున్నమామిడి చెట్లగుబురులలో నుండి మావిచిగుర్లు తిని
మత్తెక్కి కూసున్న కోయిల /
కాల మహావిపంచిలోని ఈ శుభకృతు నామ సంవత్సర
తంత్రిని మీటుతూ కుహు కుహురావాలతో
ఈకొత్త సంవత్సరానికి స్వాగతం పల్కు తోంది
ఊర్లో ఉగాది ఉషోదయం ఉత్సాహాన్నినింపుతూ
కనులపండువ చేస్తోంది
ఇట్లాంటిగ్రామాలేకదా!గాంధీజీ కలలుగన్నగ్రామసౌభాగ్యమును
అభివృద్ధి చేస్తాయి అన్నట్లుంది ఊర్లో ఉషోదయం ..