క్షీరసాగర మధనంలో
అందం తాలూకు అమృతబిందువుల్ని
మహిళాలోకం ఒడిసిపట్టుకున్నారా బహుశా
అందం కురిసిన అసలు ఆ రాత్రి
ఆడవాళ్లు మాత్రమే మెల్కొని ఉన్నారేమో తెలివిగా,ఆశగా
పారిజాతంలా ,పున్నాగంలా
నా వాక్యాలకు అందని ఇంకాఏదోఅవ్యక్తసౌందర్యరాశిలా
‘అందం’ వాళ్ల వశమై పరవశమయ్యింది
మగమానవుడు వాళ్లకౌగిట జీవిత ఖైదే ఈనాటికికూడా
సహనంత్యాగం,సాహసం వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు
అందం,ఆనందం, సున్నితత్వం వాళ్లతో ముడిపడ్డాయి అనాదిగా
అతివలదే ఘనతంతా
వనితలదే చరితంతాను
బ్రహ్మచారికిమోక్షంగృహస్థాశ్రమంలోఉందంటారుపండితులు
మగువతోడు లేని మగరాయుడిజీవితమంతా సన్యాసం కాదంటే శూన్య విన్యాసమే అంటారు బాధితులు
శిశిర మోడుల మౌనాకాశంలోంచి
శిలలశిధిల పరమ నిశ్శబ్దంలోంచి
ఒక వసంతగాన పులకిత పుడమిలా
మగాడు గాయపడ్డప్పుడు
ఈ బాధామయ,కన్నీటికధల నుంచి
గుండె పగిలే క్షణాల్నుంచి
ఆమె అమలినప్రేమవర్షంతో తడుస్తూ
అనంత ఓదార్పు నదిఒడిలో స్నానిస్తూ
ఆమెఅనంతదయాపారావారం తీరం చేరి
ఉపశమనిస్తున్నాడు,తిరిగి మానవత్వమున్న మనిషౌతున్నాడు పురుషపుంగవుడు
రేయి పగలు యుగయుగాలుగా….
శక్తి,చేతనత్వాలకు పర్యాయపదం కదా మానవి
స్థావర జంగమాత్మక ఈజగత్తు సమస్తం
సమ్మోహనపరాశక్తి స్త్రీ సంతకమే కాబోలు
ఏమని చెప్పనుఇంకా ఎంతని చెప్పగలను
నాతో నడుస్తున్న మా ఆవిడకు
నన్ను నడిపిస్తున్న మా అమ్మకు
అందమైన మనసుగల ఈ ఆడాళ్లకు
ఈ జన్మకు కృతజ్ఞతలు తప్ప.