స్పృహకి ఐదేళ్లు. ఈ మధ్యనే బడికి పోవడం మొదలు పెట్టింది.
ఆ రోజు ఉదయం బద్దకం గా లేచింది.
అమ్మ లేపగా లేపగా లేచింది. వెళ్లి హాల్ లో అటు ఇటు పచార్లు చేసింది.
అబ్బా.. ఇప్పుడు తయారై బడికి పోవాలా .. !
ఏంటో .. అమ్మానాన్న రోజు బడికి పోవాలని చెప్తారు. బడి అంటేనే బోర్. ఎంచక్కా ఆడుకుంటే ఎంత బాగుంటుంది. టీవీ చూస్తే ఎంత బాగుంటుంది… ఈ పెద్ద వాళ్లకేం తెలియదు
వెళ్లి టీవీ ముందు కూర్చుంది స్పృహ. ఆ వేళ బడికి పోవద్దు అని నిర్ణయించుకుంది.
“బడికి టైమ్ అవుతున్నది. గబగబా తయారవ్వు” అని అమ్మ తొందర పెట్టింది.
“నేను ఈ రోజు బడికి పోను. ఇంట్లోనే ఉంటా”. ఎదురుగా కనిపించిన రిమోట్ తీసుకుని టీ వీ పెట్టింది. సోఫాలో కూలబడింది స్పృహ.
అమ్మ నాన్న మారు మాట్లాడలేదు. స్పృహని ఒక సారి అలా చూసి వదిలేశారు.
పది నిమిషాలు ఆగితే తానే బయలుదేరుతుంది అనుకున్నారు.
కానీ స్పృహ కదలడం లేదు.
అమ్మ నాన్న ఉదయం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ఆమెని పట్టించుకోలేదు.
స్పృహ సంతోషంగా టీవీ చూడడంలో బిజీగా ఉంది . కిడ్స్ ఛానెల్ లో కార్టూన్స్ చూసింది కాసేపు. ఆ తర్వాత ఛానెల్స్ అటు ఇటు పైకి కిందకి తిప్పింది.
కాసేపటికి పొట్టలో ఆకలి మొదలైంది. కిచెన్ లోంచి కమ్మటి వాసన వస్తున్నది. స్పృహకి ఆకలి మరింత పెరిగింది. నెమ్మదిగా లేచి వెళ్లి బ్రష్ చేసుకుంది .
అప్పటికే అమ్మ తమ్ముడికి టిఫిన్ పెట్టింది. వాడు తింటున్నాడు.
తనకి కూడా పెడుతుందేమోనని కొంచెం సేపు ఎదురు చూసింది. టిఫిన్ ప్లేట్ అమ్మ ఇవ్వలేదు.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం స్పృహకి ఇష్టం ఉండదు. అయినా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి తమ్ముడు పక్కన కూర్చుంది.
అప్పుడు కూడా అమ్మ టిఫిన్ పెట్టలేదు. తన ప్లేట్ తీసుకుని పెట్టుకుందామని చూసింది. కానీ ఆ గిన్నె టేబుల్ పై లేదు .
ఎలా .. ?
నాన్న కిచెన్ లోంచి ప్లేట్ లో పెట్టుకొచ్చుకున్నాడు. వచ్చి స్పృహ పక్కనే కూర్చుని తిన్నారు. కానీ స్పృహని పలకరించలేదు. టిఫిన్ తినమని అనలేదు.
రోజు ప్లేట్ లో పెట్టి పిలిచే అమ్మ పిలవడం లేదు. తినకపోతే బతిమాలి తినిపించే నాన్న పట్టించుకోవట్లేదు. స్పృహకు ఏడుపొచ్చింది.
ఆకలితో పొట్టలో పేగులు అరుస్తున్నాయి. ఆఖరికి పాలు కూడా తాగలేదు.
అంతలో తమ్ముడు పాలగ్లాసుతో అక్కడికి వచ్చాడు. అది చూసి ఉక్రోషంతో ఉడికిపోయింది స్పృహ.
పాపం అక్క. అమ్మ అక్కకి ఏమీ పెట్టలేదు.
అక్క మొహంలోకి చుశాడు. అయ్యో.. అక్కకి ఆకలేస్తుంది అని బాధపడ్డాడు.
అక్కా.. పాలు తాగు అంటూ తన పాల గ్లాస్ ఇవ్వబోయాడు.
ఉక్రోషంతో ఉడికిపోతున్న స్పృహ ఆ పాల గ్లాస్ ని ఒక్క తోపు తోసింది. పాలు కింద పోయాయి .
తమ్ముడు భయంతో కెవ్వు అన్నాడు. ఆ ఏడుపుకి ఏమైందని అమ్మ నాన్న అటు చూశారు.
ఇల్లంతా చెల్లాచెదురైన పాలు ..
తమ్ముడు ఏడుస్తూనే వెళ్లి ఇల్లు తుడిచే పాత గుడ్డ తెచ్చాడు. చిట్టి చేతులతో తుడుస్తున్నాడు.
అమ్మ నాన్న ఏమి అనలేదు. అక్కడేమి జరగనట్లే తమ పనిలో వాళ్ళున్నారు.
స్పృహ నెమ్మదిగా వెళ్లి తమ్ముడికి సారీ చెప్పింది. ఆ తర్వాత, తమ్ముడితో కలిసి తాను కూడా బట్టతో శుభ్రం చేసింది.
ఆ పని చేస్తూ తనను అమ్మ నాన్న చూస్తున్నారో లేదో అని ఓరగా చూసింది.
అమ్మ నాన్న అదేమీ పట్టించుకోనట్టు ఉన్నారు.
అమ్మ మరో గ్లాసులో పాలు తెచ్చి తమ్ముడికి ఇచ్చింది.
అక్కడే ఉన్న స్పృహని ఒక్క మాట కూడా అనలేదు. కోప్పడలేదు. తినమని చెప్పలేదు. బడికి పంపలేదు.
తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె కి అర్థమైంది .
హూ .. నేను కూడా వాళ్ళని పట్టించుకోను అనుకుంది. మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ విసవిసా ఇంట్లోంచి బయటకు నడిచింది.
ఇంటి వెనుక జామ చెట్టు కింద కూర్చుంది. ఆకలి వేస్తుంది కదా.. !
చెట్టుపై చూసింది. జామపండు కోసం కళ్ళతో వెతికింది స్పృహ.
“చిట్టి తల్లీ .. ఆకలేస్తుందా .. అయ్యో ఒక్క పండు కూడా లేదే తల్లీ.. నీ కడుపు నింపడానికి” అని జామచెట్టు స్పృహని చూసి బాధ పడింది.
జామ చెట్టు మాటలకు స్పృహ లోపలున్న దుఃఖం పొంగి పొర్లింది.
ఏదో అయినట్టు బిగ్గరగా ఏడ్చేసింది. అయినా అమ్మ నాన్న తనని పట్టించుకోలేదు.
స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. తమ్ముడు పొట్టనిండా తిన్నాడు. పాలు తాగాడు.
అమ్మకి నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని బాధ తన్నుకొచ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆ ఏడుపు విని “ఎందుకు పాపా ఏడుస్తున్నావ్? అమ్మ కొట్టిందా .. నాన్న తిట్టారా ..? ” అని అడిగింది చెట్టుపై ఉన్న రామచిలుక .
వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది స్పృహ .
“అయ్యో .. మీ అమ్మ నాన్నలకి నీమీద ప్రేమ లేదని ఎవరన్నారు?” అడిగింది రామచిలుక
“నేనే అంటున్నా. లేకపోతే నన్ను బతిమాలి తినిపించాలి గా.. బడికి పంపాలిగా..” కళ్ళనుండి కారుతున్న నీరు గౌను తో తుడుచుకుంటూ అన్నది స్పృహ.
“ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఒక్క మాటైనా అన్నారా.. ఒక్క దెబ్బైనా వేశారా.. కనీసం కోపంగా చూశారా..?” ప్రశ్నించింది రామచిలుక
“ఊహూ .. లేదు” అంటూ తల అడ్డంగా ఊపింది స్పృహ
“అంటే నీ పై కోపం లేనట్లేగా.. “అన్నది రామచిలుక
“మరి నాకు స్నానం చేయించలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు. టిఫిన్ పెట్టలేదు” దిగులుగా చెప్పింది పాప.
“నువ్వు అమ్మ నాన్న చెప్పిన మాటలు వినలేదు. బడికి పోవాల్సిన సమయంలో టీవీ ముందు కూర్చున్నావు. అది తప్పు కదా.
ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. లేకపోతే నీకే కష్టం. నష్టం ” అన్నది జామచెట్టు.
అవును, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను.
పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళింది. అమ్మకి, నాన్నకి సారీ చెప్పింది.
నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయను మాట ఇచ్చింది స్పృహ.
నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దిచ్చారు అమ్మా నాన్న. చప్పట్లతో అక్క పక్కన చేరాడు తమ్ముడు.