Home కథలు తొలి అడుగు

తొలి అడుగు

by Bandi Usha

‘‘నారాయణ రాలేదు.. ఎక్కడికి వెళ్ళాడు?’’ పక్కనే ఉన్న పొలంలో కలుపు తీస్తూ అడిగింది మంగమ్మ.

‘‘మిరప తోటకు మందులు తెస్తానని పొద్దన్నే పట్నం వెళ్ళాడు పిన్ని’’ బెండకాయలు కోస్తూ చెప్పింది ఆదిలక్ష్మి.

‘‘ఒక్క దానివే అన్ని బెండకాయలు కోయాలంటే చాలా కష్టం’’

‘‘అవును పిన్నీ. చేతులు బాగా దురద పెడుతున్నాయి. ఒక్కరోజు ఆగితే ముదిరిపోతున్నాయి’’.

‘‘నిజమే. ఇక అన్నం తిని కాసేపు కూర్చుందాం పద’’

‘‘వస్తున్నా’’ అంటూ బెండకాయలు కోయటం ఆపింది ఆదిలక్ష్మి.

కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరూ చెట్టు క్రిందికి చేరారు.

‘‘ఏం కూర తెచ్చావు?’’ అడిగింది మంగమ్మ.

‘‘ఆయన పొద్దున్నే వెళ్ళాడు. నేను ఊళ్ళో పాలు పోసి వచ్చేసరికి పొద్దెక్కింది. కూర చేయలేదు. నిన్న నూరిన గోంగూర పచ్చడే తెచ్చాను’’

‘‘నేను నువ్విచ్చిన బెండకాయలే వండాను వేసుకో’’

అన్నం తింటూ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. నారాయణ రాలేదు. మళ్ళీ పనికి లేచారు.

తోటలోనే బేరగాళ్ళకు బెండకాయలు అమ్మి గేదెల్ని తోలుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంది ఆదిలక్ష్మి.

నారాయణ జాడలేదు. పాలు తీసి అందరికీ పోసేసరికి బాగా చీకటి పడిరది. అన్నం కూడా వండి ఇంట్లో పనయ్యేసరికి ఎనిమిది అయ్యింది.

పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడంతో పక్కనే ఉన్న మరిదికి చెపుదామని బయటకొస్తుండగా అప్పుడు నారాయణ తూలుకుంటూ వచ్చాడు.

ఎప్పుడో చుట్టం వచ్చినప్పుడు కొద్దిగా తాగే మనిషి ఇట్లా తాగాడు ఏమైంది నీకు’’ అని అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఏమీ కాలేదు. మన బతుకులు బాగుపడుతున్నాయి’’

‘‘ఏం మాట్లాడుతున్నావు’’

‘‘మందులు తెద్దామని పట్నం బయలు దేరానా.. దారిలో సర్పంచ్‌గారు కలిసి మంత్రి గారి దగ్గరకు తీసుకెళ్ళారు’’

‘‘ఎందుకు’’

‘‘ఓట్లు వస్తున్నాయి కదా. నన్ను మన కాలనీ చూసుకోమన్నారు. ఇదితో నాకు ఫోన్‌ కూడా ఇచ్చారు’’.

‘‘కష్టపడి బతికేటోళ్ళం. మనకెందుకు ఇలాంటివన్నీ?’’

‘‘పాతికేళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఈ గుడిసె తప్ప ఇల్లయినా కట్టుకోగలిగామా?’’

‘‘బాగానే బతుకున్నాం కదా. పిల్ల పెళ్ళి జేసినం. పిలగాడు చదువకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వెనకేసుకున్నాము. మంచిరోజులు చూసి మొదలుపెడదాం అనుకున్నాముగా’’

‘‘ఓట్ల పండగ కానివ్వు. పెద్ద భవంతే కడదాం’’

‘‘నీ మాటలు ఏమీ అర్ధం కావడంలేదు. ఈ సంసారాన్ని ఏం చేస్తావో. ఇక అన్నం తిందువు రా’’

‘‘నాకొద్దు. సర్పంచ్‌గారు బిరియానీ పెట్టించారు’’

‘‘పెద్దోళ్ళతో నీకెందుకు?’’

‘‘చెప్పింది చాల్లే. నువ్వు తిని పడుకో’’ అని మంచి మీదకి ఒరిగాడు.

ఆదిలక్ష్మి కాసేపు ఆలోచనలో పడినా పగలంతా కష్టపడడంతో కాసేపట్లో వొళ్ళెరగకుండా నిద్రపోయింది.

*      *     *

రోజూ తెల్లవారురaామునే లేచే నారాయణ లేవలేదు. ఆదిలక్ష్మే లేచి పాలు తీసింది. పాలు పోయడానికి నారాయణను లేపింది.

‘‘నేనలాంటి పనులు ఇక చెయ్యను’’ కరాఖండిగా చెప్పాడు నారాయణ.

ఆదిలక్ష్మి పాలు పోయడానికి వెళ్తూ ‘‘ఈరోజైనా పురుగుమందులు తీసుకొని రా. తోట పాడువుంది’’.

‘‘తెస్తాలే’’

‘‘త్వరగా రా. వెంటనే మొదలు పెడదాం’’

‘‘వీలవదు. సర్పంచ్‌గారు ఇవాళ మీటింగ్‌కు వెళ్ళాలన్నారు’’

‘‘నీకేదో పిచ్చి పట్టింది’’

‘‘అవునే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలన్న పిచ్చి పట్టింది’’

‘‘ఏదీ వట్టిగా రావాలి అనుకోవద్దు. ఒకసారి అటువైపు అడుగువేస్తే ఆ బురద కడిగినా పోదు’’

‘‘నీకే తెలవదులే. ఇక ఆపు వెర్రిమొహమా’’ అంటూ బయటకెళ్ళి పోయాడు నారాయణ.

*      *     *

‘‘నారాయణ ఇవాళ కూడా రాలేదేంటే ఆదిలక్ష్మీ..’’ మధ్యాహ్నం అన్నం తింటూ అడిగింది మంగమ్మ.

‘‘నాకు ఆయన ఎవ్వారం చూస్తుంటే భయమేస్తుంది పిన్నీ’’ అని జరిగినదంతా చెప్పింది ఆదిలక్ష్మి.

ఈ వోట్లేమో గానీ మన సంసారాలు పాడవుతున్నాయి. మీ బాబాయి కూడా వోట్లప్పుడే కదా నాటుసారాకు అలవాటయి చనిపోయింది.

ఆ మాటలో మరింత దిగులు పట్టుకుంది ఆదిలక్ష్మికి.

‘‘భయపడకు అన్నిటికి భగవంతుడే ఉన్నాడు. బెండకాయలు కోయటానికి నేనూ సాయం వస్తాను పద’’ అంటూ ఆదిలక్ష్మిని లేపింది.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళే సరికి నారాయణ జాడలేదు. పాలుతీసి కాలనీలో పోయడానికి వెళితే అక్కడ నారాయణ కనిపించాడు.

‘‘ఇక్కడేం చేస్తున్నావు’’

‘‘మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి. నీకెందుకు? ఇంటికెళ్ళు’’ కోపంగా అన్నాడు నారాయణ.

ఎంతో నెమ్మదిగా మాట్లాడే నారాయణ రెండు రోజుల్లోనే మారిపోయాడు. ఆదిలక్ష్మి ఏమీ అనలేక ఇంటికొచ్చి అన్నం, కూర వండిరది. బాగా పొద్దుపోయాక నారాయణ తూలుకుంటూ వచ్చాడు. మాట్లాడే పరిస్థితిలో లేడు.

ఆదిలక్ష్మికి బాగా భయం పట్టుకుంది. ఏదో ఇంత తిని పడుకుంది.

*      *     *

నారాయణ పక్కమీద నుండి లేవకముందే ‘‘సర్పంచ్‌గారు రమ్మంటున్నారు’’ అని వచ్చాడు పాలేరు రంగడు.

దిగ్గున లేచి తయారవుతుంటే ‘‘పెద్దోళ్ళతో మనకెందుకు?’’ అంది ఆదిలక్ష్మి.

‘‘మనమూ పెద్దోళ్ళమవుతాం’’

‘‘ఆకాశానికి నిచ్చెనలు వేయక భూమి మీద నడువు’’

‘‘ఆడపెత్తనం ఆపు’’ అంటూ వెళ్ళిపోయాడు.

*      *     *

‘‘తోటనిండా పురుగులు ఎక్కువవుతుంటే ఎన్ని రోజులు అలా ఉంచుతారే’’ మంగమ్మ తోటలో తిరుగుతూ అడిగింది.

‘‘ఆయన నా మాట వినేలా లేడు పిన్నీ’’

‘‘పెద్దోళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళతో తిరిగితే మనమే నష్టపోతాము’’

‘‘ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు’’

‘‘పిలగాడితో అయినా తెప్పించరాదు’’

‘‘వాడికిలాంటి పనులు చెపితే చదువు ఆగమవుతుంది’’

‘‘ఏదో ఒకటి చెయ్యి. చేతికొచ్చిన తోట పాడవుతుంది’’

‘‘రేపు మా అన్నను పిలిపించి మందుకొట్టిస్తా’’

‘‘సరే ఇక పని మొదలు పెడదాం’’ అంటూ లేచింది మంగమ్మ.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళేసరికి కొడుకు శ్రీకాంత్‌ బ్యాగ్‌ ఉంది.

వీడు ఇప్పుడెందుకు వచ్చాడు. ఇప్పుడేమీ సెలవులు లేవుగా అనుకుంటూ ‘‘శ్రీకాంత్‌..’’ అని పిలిచింది.

‘‘అన్న బయటకెళ్ళాడు’’ బజార్లో ఆడుకుంటున్న ఎదురింటి అబ్బాయి వంశీ చెప్పాడు.

స్నేహితుల దగ్గరకు వెళ్ళాడేమో అనుకొని కొడుక్కి ఇష్టమయిన పప్పు చేసింది. ఎంతకీ రాకపోయే సరికి వాకిట్లోకి వెళ్ళింది.

‘‘ఏమిటి వదినా తీరిగ్గా ఉన్నావు’’ అడిగాడు మరిది రాంబాబు.

‘‘శ్రీకాంత్‌ వచ్చాడు. ఎటు వెళ్ళాడా అని చూస్తున్నాను’’

‘‘అన్నయ్యా, శ్రీకాంత్‌.. సర్పంచ్‌ ఇంట్లో ఉన్నారు’’

ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది ఆదిలక్ష్మికి. రాత్రి పదకొండు గంటలకు తండ్రీ, కొడుకులు వచ్చారు.

అన్నం తినమంటే సర్పంచ్‌ గారింట్లో తిన్నామని చెప్పారు.

‘‘నువ్వు కాలేజీ వదిలి ఎందుకొచ్చావురా?’’

‘‘నాన్న రమ్మన్నాడు’’

‘‘ఎందుకు’’

‘‘ఎలక్షన్లు కదా. యూత్‌ కోసం ప్రచారం చేయాలన్నాడు. డబ్బులు కూడా ఇస్తారన్నాడు’’

‘‘నీ చదువు ఏమవుద్ధి?’’

‘‘నాలుగు రోజులకు ఏమీ కాదులే’’

ఎంతచెప్పినా వినిపించుకోకుండా తండ్రి బాటే పట్టాడు శ్రీకాంత్‌.

*      *     *

పొద్దున్నే వెళ్ళి తండ్రితోపాటే రాత్రి బాగా పొద్దపోయాక వచ్చేవాడు శ్రీకాంత్‌. ప్రచారాల జోరు బాగా ఊపందుకుంది. తండ్రీకొడుకులను సర్పంచ్‌ మెచ్చుకోవడంతో వీళ్ళు ఎక్కడా ఆగడం లేదు.

ఆదిలక్ష్మి వాళ్ళ అన్నయ్యను పిలిపించి తోటకు మందు కొట్టించింది. కొడుకు ఎక్కడ పాడవుతాడో అన్న బెంగ రోజురోజుకూ ఎక్కువవుతోంది.

ఓట్ల ముందు రోజు రాత్రి తండ్రీకొడుకులు ఇంటికే రాలేదు. మద్యం ఏరులా ప్రవహింపచేశారు. ఎన్నడూ లేనిది ఓట్ల రోజు నారాయణ ఖద్దరు బట్టలు వేశాడు. సర్పంచ్‌ పక్కనే తిరిగాడు.

ఓటు వేయడానికి ఆదిలక్ష్మి వెళితే ‘‘మీ ఆయన గొప్పోడు అవుతున్నాడే’’ అంది సుబ్బలక్ష్మి.

‘‘అసలుకు మోసం రాకపోతే చాల్లే అక్కా’’ అంది ఆదిలక్ష్మి.

‘‘వాళ్ళ ఆయనే కాదు, కొడుకును కూడా రాజకీయాల్లో దించింది’’ అన్నాడు కోటయ్య.

‘‘నాకేం తెలుసు బాబాయ్‌.. చదువుకోమంటే నాలుగు రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాడు’’

‘‘సర్పంచ్‌ సంగతి తెలుసుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి’’

‘‘అదే బాబాయ్‌ నా బాధ’’

*      *     *

ఓట్లు ముగిశాయి. లెక్కింపుకు నాలుగు రోజులు ఉంది. తండ్రీ కొడుకులిద్దరూ లెక్కలు చూసుకోవాలి అంటూ సర్పంచ్‌ ఇంటికి వెళ్తుంటే.. ‘‘ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట. సామానంతా తెప్పించుకొని ఇల్లు మొదలుపెడదాం. అది కాగానే శ్రీకాంత్‌ను కాలేజీకి పంపిద్దాం’’ అంది ఆదిలక్ష్మి.

‘‘ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి’’

‘‘ఏందయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు. ఇల్లు కడదామని బ్యాంకులో ఐదు లక్షలు దాచాము కదా’’

‘‘ఓట్ల కోసం పెట్టాను’’

‘‘ఓట్ల కోసం నువ్వు పెట్టడమేంటి?’’ వణుకుతున్న స్వరంతో అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఓట్లయ్యాక డబుల్‌ ఇస్తాను అని సర్పంచ్‌గారు పెట్టమంటే పెట్టాను’’

‘‘ప్రపంచంలో ఇలా ఎవరయినా నమ్మి పెడతారా? అయినా అంత ఆశ ఎందుకు?’’

‘‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతాం’’ అంటూ బయటకు విసురుగా వెళ్ళిపోయాడు నారాయణ.

*      *     *

ఆదిలక్ష్మికి ముద్ద సహించడం లేదు. నిద్రలేదు. ఆ ఐదు లక్షలు ఏమవుతాయో అన్న భయం పట్టుకుంది.

పాతిఏళ్ళ కల నెరవేరే సమయంలో ఇలా జరిగింది. ఆ డబ్బు వెనకేయడానికి పగలనకా, రాత్రనకా ఎంత కష్టపడిరది గుర్తొస్తుంటే దుఃఖం ఆగడం లేదు.

ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చింది. నారాయణ తిరిగిన పార్టీ ఓడిపోయింది. నారాయణకు ఏదో తెలియని భయం పట్టుకుంది. తెల్లవారి ఉదయం సర్పంచ్‌ ఇంటికి వెళ్ళాడు.

‘‘ఏంటి ఇలా వచ్చావు?’’

మాటలో తేడాను గ్రహించాడు నారాయణ.

‘‘డబ్బులు ఇచ్చేస్తే ఇల్లు మొదలు పెట్టుకుంటాను’’

‘‘పార్టీ ఓడిపోయింది. ఏ మొహం పెట్టుకొని మంత్రి గారిని డబ్బులు అడుగుతాము’’

‘‘మరి నా డబ్బులు’’

‘‘నీవి ఐదు లక్షలే. నావి పాతిక లక్షలు’’

‘‘మేం ఇంటిల్లిపాది రెక్కలుముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది కష్టపడి సంపాదించుకన్న డబ్బు. అలా అంటే ఎలా?’’

‘‘ఏం చేయమంటావు నన్ను’’

‘‘మీరే ఇవ్వాలి నాకు. గట్టిగా అన్నాడు’’

‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకిచ్చావా. ముందు బయటకు నడువు’’

‘‘నీవిచ్చేంతవరకు వెళ్ళను’’

‘‘వీడిని బయటకు నెట్టండిరా’’ అనుచరులకు చెప్పాడు.

ఆ తోపులాటలో నారాయణ తలకు గోడ గట్టిగా తగిలి రక్తం బాగా కారడంతో ‘‘లేనిపోని సమస్య మనకెందుకు’’ వాడిని ఇంటికి పంపించండి అన్నాడు సర్పంచ్‌.

*      *     *

నారాయణ తలకు దెబ్బ చూసి ఏడవడం మొదలు పెట్టింది ఆదిలక్ష్మి. శ్రీకాంత్‌ డాక్టర్‌ను పిలవడానికి వెళ్లాడు.

‘‘నీ మాట విన్నట్లయితే ఇట్లా జరిగేది కాదదు ఆదిలక్ష్మి’’ ఎగపోసుకుంటూ అన్నాడు నారాయణ.

‘‘బాధపడకు. బతకడానికి ఏదో ఒక దారి ఉంది కదా’’

‘‘మోసపోయాను. పాతికేళ్ళ కష్టం వృథా అయింది’’

నారాయణ తల నిమురుతూ ‘‘ఏం కాలేదులే కాసేపు మాట్లాడకు’’

డాక్టర్‌ వచ్చేసరికి ఎగపోత ఎక్కువయి ప్రాణం విడిచాడు నారాయణ.

ఆదిలక్ష్మి కుప్పకూలిపోయింది.

*      *     *

నారాయణ చనిపోయిన పదిరోజులకు ఆదిలక్ష్మి స్పృహలోకి వచ్చింది. తల్లి పరిస్థితి చూసి సర్పంచ్‌ దగ్గరకు వెళ్ళి తాడోపేడో తేల్చుకోవాలి అనుకున్నాడు శ్రీకాంత్‌.

‘‘మీ నాన్నలాగే అవుతావు’’ అని మేనమామలు, బాబాయి పోనివ్వలేదు.

నాన్న చదువకోక, నేను చదువుకున్నా అనుభవం లేక ఇద్దరం రాజకీయ ఉచ్చులో చిక్కాం. మేమే కాదు ఇలా ఎంతమంది చిక్కారో. దీనికి ముగింపు ఉంటుందా?

పూర్తిగా ఉండదేమో కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళనైనా చైతన్య పరచాలి. చదువు పూర్తిచేసి నాకాళ్ళ మీద నేను నిలబడ్డాక సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడూ ఇలాంటి ఊబిలో దిగకూడదు.

జరిగినదంతా పీడకల అనుకోలేను గానీ గుణపాఠంగా తీసుకోవాలి. ఇదో మేల్కొలుపు. ఆలస్యం చేయకుండా చదువులో నిమగ్నమవ్వాలి. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని ‘‘అమ్మా.. నేను కాలేజీకి వెళ్ళాళి’’ అన్నాడు.

‘‘వెళ్ళు నాన్నా’’ కొడుకు తల నిమిరింది.

‘‘ఇక ఎప్పుడూ నిన్ను కష్టపెట్టను. నువ్వు గర్వపడేలా తయారవుతాను. నన్ను నమ్ము అమ్మా’’

ఆదిలక్ష్మికి దుఃఖం పొంగుకొచ్చింది.

శ్రీకాంత్‌ కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత తల్లి బాధ్యతలను మేనమాలకు అప్పగించి బ్యాగు తీసుకొని మరో నూతన ఉషస్సు వైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళాడు.

కాదు కాదు మార్పుకు శ్రీకారం చుట్టే బాటలో అడుగువేశాడు.

You may also like

Leave a Comment