రంగడు సోమరి.  అతడు  ఏ పనీ పాటా లేకుండా స్నేహితులతో తిరిగేవాడు . అతనికి ఒక్క అవ్వ తప్ప నా అన్న వాళ్లెవరూ  లేరు .  ఆమె వృద్ధురాలు.    ఆమె ” నా మనవడు కష్టపడి వృద్దిలోకి రాకపోతాడా!” అని ఇన్నేళ్లు ఎదురు చూసింది.   కానీ రంగనిలో మార్పు రాలేదు . ఒకరోజు ఆమె ” ఒరేయ్!   ఈ సోమరితనం వదిలిపెట్టరా! కష్టించి పనిచేయడం నేర్చుకో” అని అంది.   అప్పుడు రంగడు “అవ్వా!   నేనేం చేయాలో నీవే చెప్పు” అని అన్నాడు.  అప్పుడు ఆమె ” ఒరేయ్! నీకు ఇష్టమైన పని చేయరా! అది మన కడుపు నింపేదైతే చాలు ” అని అంది.  “సరేలే అవ్వా! నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం .  నేను రేపు చేపలు పట్టడానికి పొరుగూరిలో గల  చెరువుకు వెళతాను” అని అన్నాడు. ఆ అవ్వ ఎంతగానో  సంతోషించింది.   
         మరునాడు  అతడు తన అవ్వ బాధ పడలేక  పొరుగు గ్రామంలోని చెరువుకు తన వలను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు .  అతడు  చేపలు పట్టడానికి  ఆ వలను నీటిలో  వేశాడు.    అప్పుడు ఆ వల కొంచెం బరువుగా అనిపించి రంగడు ఎంతో సంతోషపడ్డాడు.  కానీ ఆ వలను తీసి చూస్తే  అందులో అన్ని కప్పలు కనిపించాయి.  ” అయ్యో! ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని ఎవరో చెప్పగా విన్నాను. కానీ నాకు ఒక్క చేప కూడా  వలలో పడలేదు. ఈ  కప్పలను నేను ఏం చేసుకోను” అని వాటిని తీసి తిరిగి నీటిలోకి వదిలి మళ్లీ వలను వేశాడు.   ఈసారి వల ఇంకా బరువుగా అనిపించింది.  అతడు  తన పంట పండిందని అనుకున్నాడు.   కానీ ఈసారి కూడా అతనికి నిరాశనే ఎదురైంది.   అందులో పెద్ద తాబేలు పడింది .  “అయ్యో! ఈ తాబేలును నేను ఏం చేసుకోను “అని దాన్ని కూడా నీటిలోకి వదిలాడు. 
        ఆ  తర్వాత  అతడు ఈసారి తప్పకుండా తనకు పెద్ద చేప పడుతుందనే ఆశతో తన వలను మళ్ళీ నీటిలోకి వేశాడు.   ఈసారి ఆ వల చాలా బరువుగా అనిపించింది. దాన్ని అతి కష్టం మీద లాగాడు .  అందులో ఒక చిన్న మొసలి పిల్ల కనిపించింది .  “అమ్మో !మొసలీ “అని భయపడి రంగడు ఆ వలను మొసలితో సహా  నీటిలోకి వదిలిపెట్టి ఇంటికి పరుగెత్తి జరిగిన విషయం తన అవ్వకు చెప్పాడు.   ఆమె అతడిని ఊరడించి ఉత్సాహపరచి  ” ఒరేయ్! ఆ వల పోతే పోని! మరొక వలను తీసుకొని వెళ్లు. నీ ప్రయత్నం మానకు.  కష్టపడితే తప్పకుండా నీకు  ఫలితం వస్తుంది  చూడు!” అని అంది.
           మరునాడు  రంగడు పట్టువీడకుండా ఎలాగైనా కష్టపడి ఆ పెద్ద చేపను పట్టుకుంటానని తలచాడు.  వెంటనే  పొరుగింటి వారిని మరొక వలను అడిగి తీసుకొని అదే చెరువుకు వెళ్లి  ఆ వలను నీటిలో  వేశాడు . ఈసారి ఆ వలలో  ఒక పెద్ద చేప పడింది .  అక్కడే ఉన్న గ్రామస్థులు అది  చూసి “అబ్బో! నీ పంట పండింది .  మాకు ఎవ్వరికీ  వలలో పడని పెద్ద చేప నీకు పడింది.  ఈ రకం చేప కొరకు చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరికీ ఇది దొరకలేదు.  నీవు చాలా అదృష్ట వంతుడివి. ఇది  చాలా ఖరీదు చేస్తుంది.   దీన్ని  అంగడిలో అమ్ముకో!” అని అన్నారు.   రంగడు సంతోషించి వెంటనే వెళ్లి ఆ చేపను  అంగడిలో  విక్రయించాడు.   దానికి చాలా డబ్బు వచ్చింది . అతడు తన అవ్వకు ఆ డబ్బును చూపాడు. ఆమె ఎంతో సంతోషించింది.  తర్వాత   అతడు” మా అవ్వ చెప్పినట్లు ఎంతో కష్టపడితేనే  చివరకు ఫలితం దక్కుతుందన్నమాట .  ఎన్నిసార్లు వేసినా నన్ను కరుణించని ఆ పెద్ద చేప ఈసారి మాత్రం నాకు దొరికింది . పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ  ఏమీ లేదు ” అని ఆనాటి నుండి  తన సోమరితనాన్ని వీడి కష్టపడడం నేర్చుకున్నాడు .    అతడు సోమరితనం  వదలిపెట్టినందుకు   అతని  అవ్వ ఎంతగానో సంతోషించింది. 

You may also like

Leave a Comment