ఆ ఇద్దరమ్మాయిలు పడవలో అలా వెళ్ళిపోతున్నారు. పూడుకుపోయిన గొంతులో పగిలిన పాట లాగ, చేజారిన గుండెలో చిక్కుకున్న మాటలాగ.. ఉలుకు లేదు..పలుకు లేదు.
చుట్టూతా నీళ్లు, సగం పైగా పడవలో పూలు, పూల చివరన పొడుచుకొచ్చిన ముళ్ళలాగా వీళ్ళు.. నీటి మీద నిటారుగా పరుచుకున్న వారి మిసిమి మిలమిల ల మధ్య చొరబడ్డ నిశ్శబ్దాలు ప్రతిఫలిస్తుంటే.. తేలి ములిగిపోతున్న చేపల్ని తేటగా తేరిపార చూస్తూ తెడ్లు వేస్తున్నారు.
అప్పుడప్పుడూ తోటలో తొంగిచూసిన కలుపు మొక్క లాగ,శూన్యాకాశపు చిరిగిన పొట్లం నుంచీ ఒక మేఘం నీడ ముసిరినప్పుడు మాత్రం తొలి రజస్వల తొందరపాటు లాంటి మానవమానాలు తోడిన తొక్కిసలాంటి, రగడి రాపాడిన రక్తపు చార లాంటి, బహుశా ఒక భయద భూకంపం లాంటి భూస్థాపితమైన జ్ఞాపకం బాధించినట్టుంది. క్షణం సేపే… కొంచెం మ్లానమైన ముఖాలతో కసురుకున్నట్టు, కలవరబడ్డట్టు కాస్త కటువుగా కనుబొమ్మలను కదిపారు.
వాళ్లు యుద్ధంలో శాంతి సందేశాలు పంపుతూ పట్టుబడిపోయిన పావురాల లాగా ఉన్నారు. అలాగని బంధనాలు వేసిలేవు.. వాళ్ళ సాచిన రెక్కలను ఎవరో సావకాశంగా కత్తిరించిన సార్ధకతతో సంతోష సరాగాలు ముద్దాడిన మౌనరాగాలలో ముద్దలు ముద్దలుగా మొలకలెత్తే ఒక మట్టి వాసన, ముకుళించుకుని మురిసిపోతోంది.
అయినా వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లా లేరు. తేరు మీద తీక్షణంగా వెలుగుతూ తేలిపోయే దీపాల్లాగ, లేత గులాబీ జెండాల్లాగా రెపరెపలాడుతున్నారు. జోడి గా కోరికోరి ఎవరో జగజ్జేతే వస్తాడని గవ్వలని గట్టుమీద గబగబావేసి ఎవరో జోస్యం గబుక్కున చెప్పినట్లున్నారు. అది వాళ్ళు ఎంత మాత్రమూ నమ్మ లేదు.అయినా ఎవరితో జెట్టీలు పెట్టుకోకుండా, జతకూడడానికే జాగ్రత్తగా జాజిపూలు గుట్టగా పోసుకుని గుడి పండుగలో మాలలుగా గుది గుచ్చడానికి, నిస్త్రాణగా తెల్లబోయిన నింగిని నీటిలో తొలగతోస్తూ, గాటంపు గాయాల గాఢత దాస్తూ, అంత గాడ్పు లోనూ గడుసుతనంతో గమిస్తున్నారు.
వాళ్ల గురించిన స్పష్టత వాళ్లకు సాంతం ఉందన్పిస్తోంది. అంతలోనే… వాళ్ళ ఉదంతం ఒక అంతం లేని కథన్పిస్తోంది. వాళ్లు శాంతంగా ఉన్నారు… స్త్రీత్వపు గరిమ గురించి చాలాసార్లు సుదీర్ఘంగా విన్నారు. పడవ చుట్టూ తిరుగుతున్న చేప పిల్లల్ని నీటి పలక మీద తెల్లటి అక్షరాల్లా చూశారు. కన్యలైనా, కుంతి అనే ఇంతి గురించి అంతో ఇంతో తెలుసుకున్న వాళ్ళు కదా… పసిబిడ్డల ఆలోచనతో వాళ్ళ పరువం కొంచెం పలకరించింది. ఫలదీకరణ ప్రక్రియ పరాకుగా గుర్తుకొచ్చి కాబోలు.. సిగ్గు చెందిన ఆలోచనలతో శిరస్సు వంచుకున్నారు. వాళ్ళ హృదయాలు వద్దన్నా ఉప్పొంగాయి. ఇంకా వాళ్ళు చెట్టు, పుట్ట, చేపబుట్ట లలో పుట్టిన విచిత్ర శిశువుల భాగోతాలు, అనంతరాయుడు, అగంతక వాయువు స్త్రీలను ఆనందంగా ఆశీర్వదించి ఉచితంగా పునిస్త్రీలు గా చేసిన పురాణ కథలు బోలెడు పూర్తిగా పుక్కిట పట్టి ఉన్నారు. అందుకే ఎడతెరిపి లేకుండా తెడ్లు వేస్తూ, అలసటతో వచ్చిన చెమట చుక్కల్ని చూపుడు వేలుతో గబుక్కున తాకి కాస్త కలవరపడ్డారు. చేపలు, కప్పలు చెమట చుక్కల్ని మింగి గర్భవతులవడం గుర్తుకొచ్చి కాస్త గాబరా పడ్డారు.
వాళ్లకు స్త్రీత్వపు ఔన్నత్యం గురించి కూడా బాగా తెలుసు. ఓ నారీ! సుకుమారి! కుసుమ కుమారి..!! అనే అనవసరపు పొగడ్తలు, ‘సురారులమ్మ..కడుపారగబుచ్చిన యుద్ధభేరీ’ లాంటి అమోఘమైన స్తోత్రాలు సైతం శృతం చేసి ఉన్నారు. వాళ్ళ జీవిత పథాన్ని నిర్దేశించే మదాలస, యశోద ల లాంటి ఆదర్శమాతల అద్భుతమైన గాథల్ని ఔపాసన పట్టేశారు. అడవి వాసన తగలని అతివ ఊర్మిళ నిదుర వద్దని ఆ రొద ని ఉదయాన్నే ఎర్రబడ్డ కళ్ళతో ఏటివాలుగా ఎటో ఎగరగొట్టేశారు. సావిత్రి సుధను మధువు లా ఆ మధ్యాహ్నమే పుచ్చుకున్నారు. సత్యవతి కథనం సంపూర్ణంగా సాయంత్రం సుగంధం పూసుకు విన్నారు. ఐదుగురి అలవి కాని అనురాగం పొందిన ఆ పాంచాలి వ్యథను అసహ్యం కలగని అనురక్తితో ఆ రాత్రి పూట అప్పటికప్పుడు పడవకు అటూ ఇటూ, లోపటా- బైటా తమ చుట్టూతా పట్టు పావడాల్లా కట్టారు.
వాళ్ళిద్దరి పడవ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తడవ తడవకూ తప్పటడుగులు వేయని పడవ అది. తన పనిలో తాను నిమగ్నమైన భగ్న నౌక. అది చైత్రమాసంలో రెండు కొండల నడుమ లోయలో చిక్కుకున్న చిన్న మబ్బు ముక్కలాగుంది. కానీ అది యజ్ఞవాటిక లోంచో, నాగలి చాలు లోంచో ఒక్క పెట్టున ఆవిర్భవించిన ఆశ్చర్యం కాదు. ఏళ్ళు పూళ్ళు అడవిలో అజ్ఞాతంగా మొలచి ఋతుమతి ఐన దగ్గర నుంచీ అలవి కాని ఆరు ఋతువులకు ఆలవాలమై, చేవదీరిన చెట్టు కొమ్మలతో చేసిందది. అడ్డుగా అక్కడక్కడా అమావాస్య గీతలు, పైపూతగా పున్నమి చారలు గీసుకుంది. పలు ప్రమాదాలు దాటి వచ్చిందది. అందుకే చేవదీరినా ఇంకా పచ్చి ఆకులు కాలిన వాసన చెక్కల్లో ఇంకిపోయే ఉంది. అదొక సాదాసీదా పడవ. ఏ వాదప్రతివాదాలు చేయకుండా ఆ ఇద్దరమ్మాయిలను మోసుకుంటూ, తోసుకుంటూ వెళ్తోంది. జలస్పర్శతోనే తన జావళీలను జప్తు చేసుకుంది. నీళ్లు తాకినా నిర్మోహంగానే ఉంది. ‘జాగ్రత్త’ మాత్రమే దాని ఇప్పటి ఆచారం. ఏ తీరపు తొందర లేనిది దాని సంచారం. తేనె పిట్ట ల్లాంటి తరుణులను తీసుకువెళ్తున్నా వాళ్ల మనసులోని మసక చేదు చూడగలగడం దాని గ్రహచారం. నాచు పట్టిన క్రింది భాగంలో నానాజాతి సమితుల ఛాయలు ప్రతిఫలిస్తున్నా దానికంటూ ప్రత్యేకంగా ఏ చిహ్నమూ లేకపోవడం దాని అసంశయాత్మక సమాచారం.
వాళ్ళిద్దరి గురించి ఎంతో వివరించాలి… అసలు వాళ్లు ఎక్కడివాళ్లు.. ఈ పడవలో కెలా వచ్చారు… కానీ ఎందుకో మనస్కరించట్లేదు. విచారము, వినోదమూ కాకుండా ఏ వ్యగ్రతా లేకుండా, నిర్వికారంగా ఉన్నారనిపిస్తున్నారు. అయితే వాళ్లు నిజాయితీగా ఉన్నారని మాత్రం నిస్సంకోచంగా, నిష్కర్షగా చెప్పొచ్చు. అది నిజానికి తేలికగా చెప్పడం చాలా సులువైన పని…అలా ఉండటం అనితరసాధ్యం.
విభా-ప్రభాతాలలో ఏ విభ్రమము, విస్మయము లేకుండా ఉన్న వాళ్ళిద్దరూ ఒకరు తెలుపు ఒకరు నలుపు కాదు. రౌద్రమైన రక్త వర్ణంలో కాస్త తెల్లటి శాంతి పూల రంగు చిలకరించి చుట్లు చుట్టిన గులాబీ రంగు తీగలా ఉంది వాళ్ళ దేహం. తెల్లమద్ది వృక్షాల పూచిన తోపులా ఉంది వాళ్ళ మొహం. నది నడుమన పెదాల మధ్య నాలుక నొక్కి పట్టి వాళ్ళ హృదయాలు అమలినాలని గుర్రపు డెక్క ఆకులు గోల పెడ్తున్నా, పడవ అడుగుకు తోసేసిన పసితనపు నిసి రాత్రి నిజాలు నిటారుగా ఉండుండి నీటిపాముల్లా లేచి నిలదీస్తున్నట్లు ఈల వేస్తున్నా, కాలం కొయ్యకు ఉరితీసిన ఉదయపు ఉత్పాతాల హేల ఉద్రేక పరుస్తున్నా, రాత్రి రంగేళీల రంగవల్లి రక్తి కట్టిస్తానంటున్నా… అవేవీ పట్టించుకోకుండా అమ్మాయిలిద్దరూ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అసహనంతో దేన్నో అందుకోవాలనుకుంటున్నట్టున్నారు. సర్దుకుపోవడం, సహన గీతం సదా పాడడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాగనే సూర్యుణ్ణి, చంద్రుడ్ని రెండు సున్నాల లాగా, సరి సమానంగా శిశు స్థాయిలోనే దిద్దుకున్నారు.. గుండెలకు గట్టిగా అదుముకున్నారు.
వాళ్ళు ఏ తీరం గురించీ ఇంకా ఆనుపానులు, ఆరాలు తీయట్లేదు. తేరగా దొరికే తీరం కూడా వాళ్ళ గమ్యం కాదనుకుంటా. కనుకునే తొలి జామైనా మలి జామైనా ఏదీ తూచకుండా ,తూగకుండా అనుభూతిస్తూ తాపీగా తెడ్లు వేస్తున్నారు. గుడి దగ్గర జరిగే ఉత్సవంలో గరగల్ని కచ్చితంగా మోయాలని మాత్రం వాళ్లకు తెలుసు. నీటి నురగ లని అందుకే గభాలున తోసేస్తున్నారు. స్థిమితంగా కూర్చోలేకపోవడం, శీఘ్రగతిన చెదరడం , చీమ చిట్టుక్కు మన్నా బెదిరిపోవడం… అంతలోనే మళ్లీ సర్దుకు కూర్చోవడం.అంతే. ఇంకే చిలిపి ఆలోచన వాళ్లకు లేదు.
ఆ ఇద్దరమ్మాయిలు ఆ పడవలో అలా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకో మాత్రం ఒకే ఒక్కసారి ఇద్దరూ కలిసి నవ్వారు. కాటుక కొండల కారడవిలో కబళించాలని చూసే కార్చిచ్చును అదాట్టున కురిసిన ఒక స్వప్న జలపాతం అనాయాసంగా చల్లార్చిందని…ఆ నీరు ఆ ఇద్దరి కన్నీరే నని… గట్టుమీద చెట్టులా పాతుకుపోయిన ఎవరో పురుష పుంగవడు కొంచెం గొంతు తగ్గించి అసహనంగానో, అర్థవంతంగానో అన్నట్టున్నాడు. సుదూరంగా ఉన్నందువల్ల కాబోలు లేదా ఆత్రంగా నేత్రాలలో శుభ్రజ్యోత్స్నలు నింపుకొని వెలిగిపోతున్నందు వల్లనో ఎందుకో ఆ ఇద్దరి కీ ఆ సూత్రం వినబడలేదు, కనబడలేదు.
సర్వస్వతంత్రురాలు కాని, హద్దులు, పొద్దులూ ఎరుగని పడవ మాత్రం ఒక్కసారి హృదయం సర్దుకుని..అటూ ఇటూ ఒరిగి నిట్టూర్చింది. పాము పడగల్లా తలెత్తిన రెండు బుడగలు తెడ్లు వేసిన తాకిడికి తలక్రిందులయ్యాయి.