Home కథలు జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ

by Y. Sujatha


           నా ఒడిలో పెరిగి చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా వదలి పై చదువులకనీ వలసవెళ్ళిపోతున్నారు పిల్లలు. విదేశీ వ్యామోహంతో స్టేటస్ కోసమని ఉద్యోగాల పేరుతో మరెంతో మంది వెళ్ళిపోతున్నారు. రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు వెళ్ళిపోతున్నారులే అనుకుని సరిపెట్టుకున్నాను. కానీ ఈ తల్లిని విడిచి వార్ధక్యం మీద పడి ముక్కుతూ మూలుగుతూ కాలక్షేపం చేస్తున్న వృద్ధమాతవు, నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు… ఏం బావుకుందామని! పిల్లలని వదిలి ఉండలేక అంటావా! వట్టిపోయిన గోమాత లాగ మరి ఈ తల్లిని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, బేలగా అడుగుతోంది భారతమాత.
        తూలి ముందుకు పడబోయి నిలదొక్కుకుంది శాంతమ్మ. “పలుగు, పార పట్టుకుని తవ్వే పురుషుడు పడ్డప్పుడు, ‘ఆ బాగా పడ్డావులే’ అంటుందట… అదే ఆలికి ముగ్గువేసే ఆడది పడితే, ‘అయ్యో బిడ్డ పడ్డవా’ అంటుందట ఆ భూమాత”. అత్తగారు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి శాంతమ్మకు. లేస్తూనే మంచం దిగుతూ భూమి మీద పాదం మోపుతూ, ‘తల్లీ భూమాత నన్ను క్షమించు తల్లీ’ అని భూమాతకు నమస్కరించాలట. అలా చేస్తే ఆ భూమాతనే కాపాడుతుందట. తను ఎన్నిసార్లు పడిందో, ఆ తల్లి కాపాడుతోంది. మెల్లగా కూర్చుండిపోయింది. అలసిన ప్రాణం సేద తీర్చుకోవాలనుకుంటే ఇక్కడ నీకు నేను ఉన్నాను. మరి ఆ పరాయి దేశంలో… భూమాత ప్రశ్నిస్తున్నట్లు ఉంది.
      శాంతమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి. ‘నిజంగా భూమాత నిన్ను పలకరించిందా… అంతా నీ ఊహ’ అని, తల్లి వంగి నమస్కరిస్తుంటే చూసి పెద్దకూతురు పారిజాతం వెక్కిరించింది చాలాసార్లు తల్లిని.
      పుట్టిన ఊరుని కన్నతల్లిని, పెట్టిన చేతిని, చేసిన మేలుని మరిచిపోకూడదట. కాని ఇప్పుడు అందరూ చేసేది అదే. చివరికి తను అదే చేస్తుంది. కన్నీళ్ళు ఆగనంటున్నాయి. “అంబవైనా నీవేనమ్మా భారతాంబ… జగదాంబవైనా నీవేనమ్మా భారతాంబ… రత్నగర్భీనానీ పేరు గాంచితివమ్మా. నేడు రాళ్ళను కన్నావమ్మా భారతాంబ..”. అన్న పాటని నిజం చేస్తుంది ఇప్పటి యువతరం పోకడ.
     ‘అమ్మా… అలా దిగులుగా కూర్చున్నావెందుకమ్మా! నేను నీ కన్న కొడుకునే కదమ్మా… వచ్చేది నా దగ్గరికేగా… అలా దిగులుపడకమ్మా! ఏదైనా మొదట్లో అదోలా అనిపిస్తుంది. తర్వాత అదే అలవాటవుతుంది. నాన్న పోయాక ఒంటరిగా నీవు ఎలా ఉంటున్నావో అని నాకు బెంగగా ఉందమ్మా! నాన్న పోయి సంవత్సరం అయినాక వస్తానన్నావు కదమ్మా. అన్ని తంతులు జరిగిపోయినాక కూడా ఎందుకమ్మా… నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళితే నలుగురు నానారకాలుగా అనుకోవటం ఏమోగాని నిన్ను విడిచి వెళ్ళి ఏదో అపరాధభావంతో నేను బ్రతకలేనమ్మా… నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామమ్మా! నన్ను నమ్మమ్మా…’ అన్నాడు వినయ్, తల్లి భుజం మీద చేయి వేస్తూ అనునయంగా.
       ‘దిగులు ఎందుకు ఉండదు! అన్నీ వదిలి దేశంగాని దేశంలో నీవు ఎంత మంచిగా చూసుకున్నా బంగారు పంజరంలో చిలుక బ్రతుకులాగే ఉంటుందిరా ఈ వయస్సులో… రావడం అవసరం అంటావా! ఈ జీవిత చరమాంకం ఇక్కడే గడిపేయాలని ఉందిరా’ గొంతు పెగలక గుండెల్ని దాటిన ఆ మాటలు పెగుల్చుకుని వచ్చాయి.
       ‘సరేలే సంతోషంగా ఉండు, ఇంకా టైం సరిపోదు. అన్నీ సర్దుకోవాలి. నీ మెడికల్ ఫైలుతో సహా ఏది మరిచిపోయినా కష్టమే. నీ గురించి అందరూ వస్తుంటారు, ఆ హడావుడితో సరిపోతుంది. కొన్నికొన్ని మనసుకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాలంతో పరుగు తీయక తప్పదమ్మా… ఇప్పుడే వస్తాను’ అంటూ బయటకు వెళ్ళిపోయాడు వినయ్.
       మౌనంగా లేచి వాకిలి తుడిచి, తులసికోట కడిగి, ముగ్గు పెట్టుతుంటే చెయ్యి ఒణికింది శాంతమ్మకు. రేపటి నుండి నా ఆలనా పాలనా ఎవరు చూస్తారు! నన్ను వదిలి నువ్వు వెళ్ళినా, నిన్ను నేను ఎలా మరిచిపోతాను! ఆలనాపాలనా లేక నీమీద బెంగతో వాడి కృశించి పోతాను సుమా! అంటూ పుష్పవిలాపంలోని పూలమొక్కలా దీనంగా అంటోంది తులసికోటలోని తులసి మొక్క ‘ఈ అశక్తురాలిని క్షమించు తల్లి’ అంటూ కన్నీళ్ళతో చేతులు జోడించింది శాంతమ్మ.
      ‘వసుధ భర్త పోయాడట. మన ఇంట్లో పెరిగిన పిల్ల ఒక్కసారి చూసి వస్తాను రా’ దు:ఖం ఆగలేదు శాంతమ్మకు.
    ‘సరే, త్వరగా వచ్చేయమ్మా… నాకు మాత్రం పంపాలని లేదు. ఈ సమయంలో… సరే వెళ్ళిరా…’ విసుగ్గానే అనేసి వెళ్ళిపోయాడు వినయ్.  జనం ఏడుస్తున్నారు. వసుధ భర్త మంచితనాన్ని చెప్పుకుంటూ కంటతడి పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. ‘అమెరికాకు వెళ్తున్నావటగదా! నీకెందుకమ్మా, ‘కృష్ణా రామా’ అని కాలక్షేపం చేసుకోక మరీ చోద్యం కాకపోతే’ బుగ్గలు నొక్కుకుంటూ అడుగుతోంది పక్కింటి పార్వతమ్మ.
 
        ‘భారతదేశం పుణ్యభూమి అంటారు. ఈ పుణ్యభూమిలో కలిసిపోతే పునర్జన్మ ఉండదని విదేశీయులు సైతం మన కాశిలో కలిసిపోవడానికి వస్తారు. నువ్వేమిటమ్మా అక్కడ తనువు చాలించాలంటూ వెళ్తున్నావు. అక్కడ నీకు ఏమన్నా అయితే, దిక్కు దివాణం ఉండదు. నీకోసం ఏడ్చేవాళ్ళు కూడా ఉండరు, నీ పిల్లలు తప్ప. అక్కడ ఏదో కరెంటు కుర్చీలో కూర్చోబెడతారట. క్షణంలో బూడిదేనట. ఇన్ని ఏళ్ళు ఇక్కడ బతికి ఏం లాభం… ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చినట్లు ఏం కర్మ! చెప్పు తప్పుగా తీసుకోకమ్మా, నాకు తోచింది చెప్పానమ్మా!’ లెంపలు వేసుకుంటూ మరొకరు.
      ‘అంటే ఇదేనా నిన్ను ఆఖరిసారిగా చూడటం, ఇంకా నిన్ను చూడమా…’. అక్క అంది. అలివేలు ఆ కళ్ళలో సన్నటి నీటిపొరా, అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా పెదాలని నవ్వుని అతికించుకుని చెప్పింది శాంతమ్మ. శాంతమ్మ మనసు ఎంత వర్తమాన కాలాల్లో ఆలోచించుకున్నా గతంలోకే పరుగుతీస్తుంది. ఉన్న బంగారం అంతా అమ్మి లోను పెట్టి, పార్ట్ టైం చేసి రాత్రి పగళ్ళు కష్టపడి ఈ ఇంటిని కొన్నాడు రఘురామయ్య. తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిముందు కొబ్బరి, అరటి ఎన్నో రకాల పూలచెట్లు, ఇంటివెనక పనస, మామిడి, జామ, సపోటా, నారింజ చెట్లను పెంచాడు. ఏ కాస్త తీరిక దొరికినా వారికి ఆ చెట్ల మధ్య కాలక్షేపం, వెలుగురేకులు విచ్చుకోక ముందే లేచి ఆ చెట్ల కింద నులక మంచం వేసుకుని కూర్చునేవాడు.
    ‘ఇంత పొద్దున్నే ఎందుకండీ లేవడం, మంచు పడుతుంది.. అలా చెట్ల కింద కూర్చోకండి…’ విసుక్కునేది శాంతమ్మ.
    ‘ఆ పక్షుల కువకువలు, మామిడి చెట్ల మీదుగా వచ్చే సువాసనలు… ఆ గాలి కొబ్బరి చెట్ల ఆకుల నుండి జాలువారే మంచు బిందువులు… నీకు ఎలా చెబితే అర్థం అవుతుంది!’ అనేవాడు.
     ‘నిజమే నాకు అర్థం కాదు. ఈ పిల్లలతో ఈ చాకిరీ నాకు సరిపోతుంది.నాకు అంత తీరిక లేదు’ విసురుగా వెళ్ళిపోయేది శాంతమ్మ.
    ‘శాంతా… నేను లేని ఈ రెండురోజులు మొక్కలకి నీళ్ళు పోయలేవు… చూడు ఈ మొక్కలు ఎంత అల్లాడిపోతున్నాయో… మొక్కలని పెంచడం కష్టం కాదు. వాటి గొంతులో గుక్కెడు నీళ్ళు పోస్తూ వాటి ఆలనాపాలన చూస్తే అవి రేపు నీకు ఎంతటి ఫలితాన్నిస్తాయో తెలుసా… కన్నపిల్లలైనా రేపు మనల్ని సరిగ్గా చూస్తారో చూడరో కాని ఈ మొక్క అలా కాదు. నీడ నిచ్చి సేద తీరుస్తాయి. ఆకలిని తీరుస్తాయి. వాటిపట్ల ఇక ముందైనా శ్రద్ధ చూపు’… మొక్కలకి నీళ్ళు పోస్తూ మందలించాడు. నొచ్చుకుంది. భర్త మందలించినందుకు కాదు. గుక్కెడు నీళ్ళు పోయనందుకు, ఎంతో అపరాధభావంతో, మామిడి, పనస ఏపుగా పెరిగాయి. ఫలవంతమైన ఆ చెట్లని చూస్తుంటే ఆ కళ్ళల్లో ఎంత ఆనందం. కొబ్బరి కూడా విరగ కాచేది. అలా ఏళ్ళు గడిచాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. వాస్తు బాగ లేదు వెనకాలా మెట్లు మార్చాలంటే పనస చెట్లని, మామిడి చెట్లని కొట్టేయాలని పట్టుబట్టారు ఇద్దరు మగపిల్లలు శ్రీను, వేణు.
    ‘శాంతా ఈ పిల్లలని చూడు ఇవాళ మనకే ఎదురు తిరిగారు. నా ప్రాణంలో ప్రాణమైనది కొట్టేస్తే నేను… నేను బతుకలేను… రఘురామయ్య కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
     ‘ముగ్గురు పిల్లలు చాలంటే’ భర్త ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ఆనాడు.
      ‘శాంతా నారు పోసినవాడు… నీరు పోయకమానడు. పిల్లపిల్లకే ఆదాయం పెరుగుతుంది. ఆ మాట ఇంకా అనకు’ అన్నాడు. ఫలభరితమైన చెట్లని చూపిస్తూ నవ్వుతూ ‘చూడు అవి నీలా ఆలోచించాయా’ అని.
        కాని తన ఆలోచనా విధానమే తప్పని ఆలస్యంగా తెలుసుకున్నాడు. అధిక సంతానం దుఃఖానికి హేతువు. శ్రీను, వేణు, వినయ్ ముగ్గురు మగపిల్లల తర్వాత పారిజాత, సరిత, శోభ ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి ఆడపిల్లల, మగపిల్లల చదువులు, పెళ్ళిళ్ళు చేశాడు. ఆరుగురు ఆరు తరహాలు. గతం చెదిరింది. భర్తని ఎలా అనునయించాలో తెలియక మౌనంగా అతడి తల నిమురుతూనే ఉండిపోయింది. తను మాత్రం ఏమి చేయగలదు. తండ్రిని కాదన్న పిల్లలు తల్లి మాట వింటారా! తనకీ బాధగానే ఉంది. ఫలభరితమైన ఆ చెట్లు లేనిచోటు ఊహించుకోలేకపోయింది.ఏడాది తిరగకుండానే రఘురామయ్య కన్ను మూశాడు. ఆ మామిడి చెట్టు, ఆ పనస చెట్టు లేదు. ఆ యజనమాని లేడు. కాని, ఆ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి.
     ‘అమ్మా’ అనగానే గతంలోంచి ఈ లోకంలోకి వచ్చి చేరింది శాంతమ్మ. చివరి ప్రయత్నంగా ‘నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానురా… ఆడపిల్లలు వచ్చి చూసి వెళ్తారు అప్పుడప్పుడు. నేను నీతో రాలేనురా… పెదవి దాటనీ ఆ మాటలని కంఠం నొక్కేసింది. ‘అమ్మా నువ్వు నాతోనే ఉంటావు. ఇంకేదో చెప్పాలని చూడకు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇంకేమీ ఆలోచించకు మరోసారి చెప్పాడు వినయ్. శ్రీను ఎప్పుడో వెళ్ళిపోయాడు. విదేశాలకి. వేణు వెళ్లేది మరో దేశమట. చాలా దూరమట. మనుష్యులకి కాని, దూరభారాలు మనసులకు కాదుగా. అలాంటప్పుడు మమతానురాగాలు పంచుకోవడానికేం… ఎందుకింత పట్టుదలలు, పంతాలు… ఒకరి వెనుక ఒకరు విమర్శలు, వేళాకోలాలు. రక్తసంబంధీకులేనా వీళ్లు?… అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు అని పిలుపులు లేవు. అదిగో పెద్దాడి నుండి వచ్చింది. పెద్దవాడు వచ్చాడు. చిన్నది, చిన్నోడు వచ్చారు. ఇదేనా రక్త సంబంధం. అనుబంధం ఆత్మీయతా ఏవి లేవా…
       నా భర్త, నా భార్య, నా పిల్లలు ఇంతేనా కుటుంబం అంటే. ఎవరింటికీ ఎవరు వెళ్ళరు. పిల్లల్ని కదలనివ్వరు. ఎంతసేపు చదువు, పరీక్షలు, ఇతర వ్యాపారాలు ఇదేనా వీళ్ళనుండి ఆశించేది. ఆయన ఉన్నప్పుడు దీపావళి వస్తే ఎంతో సందడిగా ఉండేది. అందరూ ఎక్కడున్నా రావలసిందే… అందరికీ సరిపడా అరిసెలు దగ్గరుండి మరీ చేయించేవారు. నవ్వులతో, కేరింతలతో ఎలా ఉండేది ఇల్లు. ఇప్పుడు… ఈ పిల్లల కోసమా తను బాధపడేది… గుండె బరువెక్కింది.
    ‘అమ్మా… ఏం చేస్తున్నావు?’ హడావుడిగా వచ్చారు పిల్లలు.
     ‘ఇండియా ఈజ్ మై కంట్రీ… ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ మూడేళ్ళు నిండని మనవరాలు త్రైలోక్య ముద్దుముద్దుగా చెపుతుంది. అందరూ నవ్వుతున్నారు దాని ముద్దుమాటలకు. తల్లి వనజ బంగారు కన్నమ్మ అని ఎత్తుకుని ముద్దులాడింది. ఆ పదం అర్థం తెలియదు ఆ తల్లిదండ్రులకి. ఒక కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళల్లో వాళ్ళకే బ్రదర్స్, సిస్టర్స్ అనే మమతానురాగాలు లేవు. ఇంకా దేశంలోని ఆల్ ఇండియన్స్ అంతా బ్రదర్స్, సిస్టర్స్ ఆహా… శాంతమ్మ పెదాల మీద నవ్వు వచ్చింది. ఆడపిల్లలు అమ్మను పట్టుకుని ‘అమ్మా… బెంగగా ఉందే’ అని కంట తడిపెట్టారు.
        ‘జాగ్రత్తగా ఉండండీ. డబ్బుతో కొనలేనిది ప్రేమ ఆప్యాయతలు. రక్తసంబంధాన్ని మించింది ఏదీ లేదు. ప్రేమానురాగాలను మరిచి ఏదో కావాలని, లేని దేనికోసమో పరిగెట్టాలని ప్రయత్నించకండి. పట్టుదలలు, పంతాలు మాని అహంకారాన్ని వదిలి ఆరుగురూ ఒకటిగా బ్రతకండి. ఇదే తల్లిగా నేను మీ నుండి కోరే కోరిక.. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త… అంటూ మెల్లిగా లేచి తులసి కోట దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెట్లని నిమిరింది. తులసి చెట్టు వాడింది ఎందుకో… వెళ్ళొస్తా తల్లీ… కాదు నేను వెడుతున్నానమ్మా… కన్నీరు ఇప్పుడు వచ్చింది. కొబ్బరి, సన్నజాజి, పారిజాతాలు, గులాబీలు మౌనంగా తమ విషాదాన్ని తెలుపుతూ వీడ్కోలు చెబుతున్నాయి. ఇన్నేళ్ళు మీతో కలిసి బతికాను, మీకు చేసిన సేవ తక్కువే, ప్రతిఫలం మాత్రం ఎక్కువే పొందాను. మీ ఆలనా, పాలనా రేపటి నుండి ఆ దేవుడు చూడాలి. ఆ వానదేవుడే కరుణించాలి. కన్నీటి మధ్య ఆకాశం వైపు చూస్తూ నమస్కరించింది.
 
        ఎంతోమంది వచ్చారు. ఇదే ఆఖరి వీడ్కోలు అన్నట్టుగా ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. తల్లిగా ఒదిలి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇలా వృద్ధాప్యంలో కూడా మీరు వెళ్ళిపోయి నన్ను బాధప్టెటం ఏం న్యాయం.. నేను భరించగలనా! కసాయివాడిని నమ్మి తన లేగదూడను విడిచి పోతున్నట్లుగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. భారతమాత. తన లేగదూడతో పాటు తాను కూడా బ్రిటిష్ వాడికి బానిసలా ఊడిగం చేయడానికి పోతున్నట్లు మనసులో మూగగా రోదిస్తుంది. శాంతమ్మ భూదేవికి వంగి నమస్కరించి ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అని మనస్సులో పదే పదే వల్లిస్తూ కారు ఎక్కింది బరువైన గుండెతో, అయిపోయింది. ఈ ఇంటికీ, ఈ ఊరికీ, ఈ దేశానికీ, తనకీ ఋణం తీరిపోయింది. ఆ ఊహ గుండెల్ని పిండేస్తుంది. రేపటి రోజు గురించి ఆలోచించలేక కళ్ళు మూసుకుంది.
     ఎయిర్పోర్ట్ చేరారు అంతా. అంతా ఏడుస్తున్నారు. శాంతమ్మ వాళ్ళనెవరినీ చూడడం లేదు. ఆకాశంవైపు, భూమివైపు మార్చిమార్చి చూసి లోపలికి వెళ్ళిపోయింది కొడుకును అనుసరిస్తూ. అంతా హడావుడిగా ఉంది. ఆవును వదిలిన లేగదూడలాగా ఇంకొద్దిసేపు అంటే ఈ దేశాన్ని ఒదిలి తను వెళ్ళిపోతుంది. మళ్ళీ తను తన మాతృభూమిని చూస్తుందో లేదో… అక్కడే కళ్ళు మూస్తుంది. తన కోసం కన్నీరు కార్చేవారుండరు. ఎవరు నాకు అన్నీ యధావిధిగా చేయరా… కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి బూడిద… వద్దు… వద్దు… అరిచాననుకుంది.
           ‘అబ్బా…’ గుండెల్లో గునపంతో పొడిచినట్లు కలుక్కుమంది.
      ‘నాన్న నాన్నా నానమ్మ…’ త్రైలోక్య అరిచింది. వినయ్ తన సీటు వదిలి తల్లి దగ్గరికి వచ్చాడు కంగారుగా. పరిస్థితి అర్థమైనది తనెంత తప్పు చేసాడో…
      ఉరుకులతో, పరుగులతో శాంతమ్మను ఎయిర్పోర్టు లోకి తెచ్చారు. పిల్లలూ, వచ్చిన బంధువులూ ఎవరూ ఇంకా వెళ్ళలేదు. అందరూ శాంతమ్మని చుట్టుముట్టారు ఏడుస్తూ. అంత బాధలోనూ శాంతమ్మ “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి” అంటూ తేరిపారా తృప్తిగా చూసింది. ఆమె నవ్వుతున్నట్లు పెదవులపై నవ్వు మెరిసింది. తన తల్లి ఒడిలోనే తనువూ చాలిస్తున్నానన్నట్లుగా తృప్తిగా ఆ చూపులు చుట్టూ పరికించాయి. ఆకాశం వైపు, భూమి వైపు చూసింది.
        ‘ఎలా ఉందమ్మా, చెప్పు. నీకేం ఫర్వాలేదు!’ వినయ్ కన్నీటి మధ్య అన్నాడు.
 
 
       శాంతమ్మ పెదవుల మీద అదే చెరగని చిరునవ్వు. ప్రపంచాన్ని జయించినంత సంతోషం. తను తన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. భారతదేశము నా మాతృభూమి… ఆ పెదాలు కదులుతున్నాయి అతికష్టం మీద. ఇది చాలు నాకు. ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా తృప్తిగా చూసింది. అంతే… శ్వాస ఆగిపోయింది. ఎంత అదృష్టవంతురాలు శాంతమ్మ అనుకుంటున్నారు అంతా.
                           ………………………….

You may also like

Leave a Comment