Home కథలు చిన్నారి తల్లి

చిన్నారి తల్లి


           ఎల్బీనగర్ లోని  ఓ మొబైల్ షాప్ నడుపుకుంటున్న,   చంద్రపురి కాలనీ అపార్ట్ మెంట్ లో వుంటున్న మహేశ్ మనసు మంటలై మండిపోతున్నది.. అంతకంతకూ అవమానభారంతో అతడి ఆంతర్యం ఉడికిపోతున్నది. తన ఫ్లాట్ కెదురుగా వున్న ఆ ఇంటి ఓనర్, గవర్నమెంట్ టీచర్ అయిన రామచంద్ర పైన ఆ కోపం ఉప్పెనలా పొంగిపొర్లుతున్నది. రెండు నెలలుగా తరచూ రాత్రిపూట తాను ఫ్రండ్స్ తో కూడి సరదాగా తన ఫ్లాట్ లో పేకాడుతున్న సంగతి తెలిసి అతడు అభ్యంతరం తెలిపినా తాను వినక ఆట కొనసాగించేసరికి,  ఆయన సోమ్మేదో పోయినట్టు పోలీసులకు సమాచారమిచ్చి తమనరెస్టుచేయించి అందరిలో అవమానంపాలు చేశాడు. కొంత పెనాలిటీతో మరికొంత రాజకీయ ప్రాబల్యంతో బయట పడగలిగాడు కానీ.. కాలనీలో మాత్రం అప్పట్నుండీ   చుట్టుపక్కలందరూ, తెలిసినవాళ్లింకొందరు తననదోలా చూడడం, అవహేళన చేయడం భరించలేకపోతున్నాడు. ‘మొగుడు కొట్టినప్పుడు లేని బాధ తోడికోడలు నవ్వినందుకు కలిగింది’ అన్నట్టుగా, మునుపు తాను పేకాడుతాడని వీళ్లకు తెలిసినా ఎవరూ పట్టించుకోలేదుగానీ.. పోలీసులరెస్టుచేయడంతో అందరికీ అలుసైపోయాడు తాను. చట్టాలు శాసనాలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఊదరగొట్టే ఆ రామచంద్రగాడివల్లనే ఇదంతా జరిగింది. ఏదో చేసి వాడిని కూడా జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేయాలి. వాడి కూతుర్నెత్తుకెళ్లి చంపిపారెయ్యాలి.
అంతకుమించి మరో శిక్ష లేదు వాడికి.. అనుకొంటూ
కసిగా పిడికిళ్లు బిగించాడు.
పదేళ్ల ఆ పిల్ల శ్రధ్ద తనకు బాగానే పరిచయం. తోటి పిల్లలతో కలిసి అంకుల్ అంకుల్ అంటూ తనతో కేరమ్స్, ఛెస్ ఆడడానికొచ్చేది. ఆన్ లైన్ క్లాసులప్పుడు ఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెట్ రైట్ చేయించుకొని, థ్యాంక్స్ చెబుతూ “మంచి అంకుల్ మీరు” అంటూ వెళ్లేది. తానంటే ఆపిల్లకెంతో అభిమానం. ఏదో చెప్పి తనవెంట ఎక్కడికి రమ్మన్నా వస్తుంది. ఆ నిర్మానుష్య ప్రాంతానికి దాన్ని తీసుకెళ్లి, ఆపిల్ల గొంతునులిమి ఆ బ్రిడ్జ్ కింద పడేస్తే సరి.. అని.. ఆ ప్లేస్ కూడా  నిర్ణయించుకొని,  అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఆ ఇంటివైపే ఓ కన్నేసి వుంచాడు మహేశ్ . ఆ వారంలోనే ఆ సమయం రానే వచ్చింది. తల్లీ తండ్రీ ఏదో ఫంక్షన్ కు వెళ్లడం, స్కూల్ కి సెలవు కావడంతో ఆ అమ్మాయి శ్రధ్ధ ఒక్కతే ఇంట్లో వుండిపోవడం గమనించి, ఏవో మాయమాటలతో శ్రధ్దను తనవెంట తీసుకెళ్లడానికి వెంటనే ఆ ఇంటికి బయల్దేరాడు ప్రతీకారేచ్చతో మహేశ్ .
                    
     ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికడుగు పెట్టబోయాడు మహేశ్ . అంతలోనే హటాత్తుగా, ఊహించని రీతిగా ”భౌ” అన్న పెద్ద శబ్దంతో మీదికి దూకబోయినట్టనిపించిన కుక్కను చూసి అదిరిపడి , గేటు చివరిమెట్టు తట్టుకొని బోక్కబోర్లా పడిపోవడం, చీరుకుపోయివున్న కుక్కగిన్నె అంచు బలంగా నుదుటికి తగిలి గాయమవడం క్షణంలో జరిగిపోయింది.
ఆ శబ్దానికి మెరుపులా బయటికి పరుగెత్తుకొచ్చిన శ్రధ్ద “అయ్యో అంకుల్ ” అంటూ వెంటనే అతడిని సమీపించించింది.
“అరెరె.. మీకు దెబ్బ తగిలింది.. రక్తం వస్తోంది” అంటూ తన అరచేత్తో ఆ రక్తాన్ని అదిమిపట్టి వుంచింది కాసేపు.
“ఇలా జరిగినందుకు సారీ అంకుల్ .. లోపలికి రండి” అంటూ అతడు లేవడానికి తన శాయశక్తులా సాయంచేసింది. అతడి చేతిని పట్టుకొంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చుండబెట్టింది.
వెట్ వైబ్ తో గాయాన్ని తుడిచి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గాయానికి బాండేజ్ వేసింది. “అంకుల్.. ఇలాంటి అవసరాల కోసమే నాన్న ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నింట్లో వుంచుతాడు!” అని చెబుతూ, మంచినీళ్లందించింది. పాలు వేడిచేసి పసుపువేసి తీసుకొచ్చింది.”పసుపుపాలు మంచిదంట.. ఇన్ ఫెక్షన్ కానివ్వదంట..తాగండి!” అంటూ అతడి నోటికందించడంతో, నోట మాట రాక శిలాప్రతిమలా మారిపోయాడు మహేశ్ . మరుక్షణం ఒక అనిర్వచనీయభావంతో ఆ చిన్నారి వైపు చూశాడు.
“అంకుల్ .. కాంపౌండ్ లో కుక్క వుందని మీకు తెలీదు కదూ? మా ఫ్రెండ్ వాళ్లు ఊరెళ్లిపోతూ, మాకు బాగా అలవాటుందని రెండ్రోజులకోసం మా ఇంట్లోనే ఒదిలి వెళ్లారు. సో సారీ అంకుల్  ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మి” అంటూ అపాలజీగా తన చేతులు పట్టుకొన్న శ్రధ్దను చూస్తూ చలించిపోయిన మహేశ్ కళ్లలో నీళ్లు ధారకట్టాయి.
“దెబ్బ బాగా నొప్పిగా వుందా? రేపటికల్లా తగ్గిపోతుంది లెండి.. ఏడవకండి అంకుల్ !” అంటూ పువ్వంటి తన చేతి స్పర్శతో ఆ గాయాన్ని సున్నితంగా తడిమింది శ్రధ్ద.
అమాయకమైన ఆ బాలిక స్వఛ్చమైన ప్రేమకు  పూర్తిగా కదిలిపోయిందతడి హృదయం.
అమ్మలా ఆరిందాలా ఆప్యాయత పంచుతూ, తన చిన్న చిన్న చేతులతో ఓడాక్టర్ లా ఓ నర్స్ లా తనకు సేవలందించిన ఆ బాలిక శ్రధ్దకు ముగ్ధుడైపోయిన మహేశ్ అణువణువునా  పశ్చాత్తాపం చోటుచేసుకొంది.
కాటేయవచ్చిన పాముకే పాలుపోసి ఆదరించిన ఆ పసితత్వంముందు పశుత్వం తలవంచింది.
‘ఇంత చిన్న అమ్మాయితనంలో సైతం అధ్బుతమైన అమ్మతనాన్ని ఆస్వాదించగలిగాను. పగ ప్రతీకారాలతో అమ్మాయినే కాదు అమ్మాయిలోని అమ్మనే అంతం చేయబోయిన దుర్మార్గుణ్ణి తల్లీ నేను! నీ పసితనపు అమాయకత్వంతో, ఆ అమాయకపు అమృతత్వంతో నాలోని విషపు భావాలను హరించివేశావమ్మా.. నాకే కాదు నాలాంటి ఎందరికో నీ అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూపించి కల్మషాలెన్నో కడిగేయడానికై నిండు నూరేళ్లు  జీవించు చిన్నారితల్లీ!’                                                    అని మనసులోనే దీవిస్తూ, శ్రధ్ద తలనిమిరాడు. ఆపై “నన్ను మన్నించు తల్లీ” అన్న మనో భావనతో ఆ పదేళ్ల అమ్మాయి పాదాలపై తన శిరసునుంచి మౌనంగా క్షమాభిక్ష వేడుకున్నాడు.
“అయ్యో అంకుల్ మీరు నాకన్నా పెద్దవారు. అలా చేయకూడదు” అంటూ తనను వాటేసుకున్న శ్రధ్దను పదిలంగా, పవిత్రంగా, ప్రాణంగా పట్టుకొని ఆ చిన్నారితల్లిని గుండెలకు హత్తుకొని కన్నీటితో అభిషేకించాడు.
‘పదేళ్ల పాపలో కూడా వందేళ్ల సంస్కారాన్ని నింపి మరీ పెంచిన మీ మహోన్నత వ్యక్తిత్వానికి వేనవేల జోహార్లు రామచంద్రగారూ!’ అనుకొంటూ అతడికి అజ్ఞాత వందనాలర్పిస్తూ ఆ ఇంటి నుండి వెనుదిరిగాడు మహేశ్ .
                    *
                                             కె.వీణారెడ్డి.

You may also like

Leave a Comment