అమాయకత్వానికి మరో పేరు చంద్రమోహన్. అందరూ తెలివి తక్కువ వాడని అవహేళన చేసినా ముఖం చిట్లించుకునే రకం తప్ప ఎదురు జవాబు చెప్పడు. అమాయకత్వానికి తోడు చదువు కూడా అబ్బలేదు. మూడు సార్లు దండ యాత్రల తర్వాత పదవ తరగతి సర్టిఫికెట్ చేతికి దక్కింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో అంతటితో చదువు ఆపేసాడు. రెండు గదుల పోర్షన్ లో ముందు గదిలో తల్లి చిన్న కిరాణా కొట్టు నడిపించేది. వెనుక గదిలోనే కుటుంబమంతా నివాసం. చదువు మీద పెద్దగా శ్రద్ధ లేకపోవటంతో అప్పుడప్పుడు తల్లికి తోడుగా కిరాణా కొట్టులో కూర్చునే వాడు. యుక్త వయసు రాగానే ఆర్ధికంగా అంతంత మాత్రమే ఉండే మేనమామ బాలనర్సు కూతురు రమ్యతో ఇరు కుటుంబాల వారు వివాహం జరిపించారు. రమ్య కూడా పదవ తరగతితో చదువు ఆపేసింది. పెళ్ళైన కొంత కాలానికే చంద్రమోహన్ తల్లి కాలం చేసింది. కిరాణా కొట్టును రమ్య చూసుకోసాగింది. తెలివైంది కావటంతో ఆర్ధిక ఇబ్బందులను దాటుకుంటూ కొద్ది సంవత్సరాల్లోనే వ్యాపారాన్ని ఓ మోస్తరుగా వృద్ధి చేసింది. కాలం గడుస్తుంటే చంద్రమోహన్ దంపతులు కొడుకు, కూతురుకు జన్మ నిచ్చారు.
ఇంటికి ఆనుకొని ఉన్న స్వంత ఖాళీ జాగాలో కూడబెట్టిన పైస పైసాతో చంద్రమోహన్ తండ్రి తన హయాంలోనే మూడు గదుల పోర్షన్ ను కట్టించి జనార్ధన్ కు కిరాయికి ఇచ్చాడు. దాదాపు ఇరవై సంవత్సరాల నుండి జనార్ధన్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆ ఇంట్లో చేరినప్పటి నుండి అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఆ ఇల్లు తమకు అచ్చి వచ్చినట్టుగా జనార్ధన్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అదే ఇంట్లో ఉంటూ కూతురు రాణి వివాహం భారీగా కట్నం ఇచ్చి ఘనంగా జరిపించాడు. కొడుకు రాకేష్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మరో రెండు సంవత్సరాల్లో విదేశాలకు పంపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంత సంపాదించి కూడా ఇరుకైన మూడు గదుల ఇంట్లోంచి మారాలనే ఆలోచన ఏనాడు కలుగలేదు. జనార్ధన్ ప్రస్తుత స్థాయికి ఆ ఇల్లు ఏమాత్రం సరిపడదు. చనువుగా ఉండే బంధువులు, స్నేహితులు కలుగజేసుకొని విశాలమైన ఇల్లుకు మారవచ్చు కదా అంటే, “ఇప్పుడు నేనుండేది నా స్వంత ఇల్లే, దీన్ని వదిలి వేరే ఎక్కడో ఎందుకుండాలి” అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు. ఆ సమాధానం లోని అంతరార్ధం పసిగట్టలేని వాళ్లు సైలెంటుగా ఉండేవారు. మనిషి మానసిక స్థితి ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో నివాసముంటూ నెలనెలా విద్యుత్ చార్జీలు కడుతున్నందుకు ఇంటిపై అన్ని హక్కులు తనకు దక్కుతాయనే భావనతో ఉన్నాడు జనార్ధన్.
పిల్లల వయస్సు పెరుగుతుండటంతో కుటుంబమంతా ఒక్క రూములో సర్దుకోవటం రమ్యకు ఇబ్బందిగా అనిపించసాగింది. పిల్లలు చదువుకోవాలన్నా, రాత్రులు నిద్రపోవాలన్నా సతమతం అవుతున్నారు. అదే విషయం భర్తతో చెప్పింది. అమాయకంగా ముఖం పెట్టి
“ఇల్లు సరిపోకుంటే నన్నేం చేయమంటావు” అన్నాడు చంద్రమోహన్.
“అది కాదయ్యా, జనార్ధన్ సారు వాళ్లను ఖాళీ చేయించి ఆ పోర్షన్ కూడా మనమే ఉంచుకుందాం” అన్నది రమ్య. “అయితే నువ్వే అడుగు జనార్ధన్ సారును” అన్నాడు. మరుసటి రోజే సమయం చూసుకొని రమ్య జనార్ధన్ ఇంటికి వెళ్లి, తన పిల్లలు పెరుగుతున్నారని, ఒక్క రూంలో సర్దుకోలేక పోతున్నామని, ఇల్లు ఖాళీ చేస్తే ఆ పోర్షన్ ను కూడా తామే ఉంచుకుంటామని వేడికోలుగా చెప్పింది.
“ఇల్లు నేను ఖాళీ చెయ్యటమేమిటి, గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇందులో మాకు యాజమాన్య హక్కు ఏర్పడింది, ఇది ఇప్పుడు నా స్వంత ఇల్లు, మమ్మల్ని ఖాళీ చేయించే హక్కు మీకు లేదు ” జవాబిచ్చాడు జనార్ధన్.
“అదెలా సార్, ఈ ఇంటిని మా మామయ్య తన స్వంత జాగాలో స్వంత డబ్బులతో కట్టించాడు. మీరు కిరాయికి ఉన్నంత మాత్రాన హక్కు ఏర్పడిందని ఎలా చెబుతారు. మా పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు. మాకూ అవసరాలు ఉంటాయి సార్. దయచేసి ఖాళీ చేయండి” అంటూ ఈ సారి గట్టిగానే చెప్పింది రమ్య.
“కుదరదమ్మా, కరెంటు బిల్లు, నీటి పన్ను నేనే కట్టుకుంటున్నాను. ఇంట్లో చేరినప్పటినుండి అన్ని రిపేర్లు నేనే చేయించుకుంటున్నాను. పన్నెండు సంవత్సరాల పాటు అద్దెకు ఉంటే చట్ట ప్రకారం ఇంటి మీద హక్కులు ఏర్పడతాయి. మీకు తెలియదేమో నేను చెప్తున్నాను. అర్ధం చేసుకో. మీరు ఎంత అరచి గీపెట్టినా ఇల్లు ఎప్పుడో నా స్వంతమైంది, కావాలంటే కోర్టును ఆశ్రయించు” అంటూ రమ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంటి లోపలికి వెళ్లి పోయాడు జనార్ధన్.
కళ్ళ నుండి కారిన నీళ్లను చీర కొంగుతో తుడుచు కుంటూ దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది రమ్య. జరిగిన విషయం తెలిపింది భర్తకు. న్యాయాన్యాయాలు ఏమిటో బోధపడలేదు చంద్రమోహన్ కు.
“నిజంగానే ఇల్లు జనార్ధన్ స్వంతం అవుతుందా? మరి ఇప్పుడు మనమేం చేద్దాం రమ్యా? ” ప్రశ్నించాడు చంద్రమోహన్.
జనార్ధన్ చెప్పిన విషయం పదే పదే మెదడును తొలిచేస్తుండటం మూలాన రమ్యకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. చంద్రమోహన్ కు మాత్రం ఎటువంటి ఆలోచన లేదు. మరుసటి దినం లాయర్ చక్రవర్తి రోజు మాదిరే తన కిరాణా కొట్టు ముందు నుండి నల్లకోటు వేసుకొని బైకుపై వెళ్ళటం రమ్య గమనించింది. కొన్నాళ్ల క్రితం చక్రవర్తి పేరు విన్నది. ఆయనతో తనకు ఇప్పుడు అవసరం ఏర్పడింది. తనకు వరుసకు సోదరుడైన రామచంద్రం పొలం విషయంలో పెట్టిన కేసులో చక్రవర్తి బాగా సహాయం చేశాడని, మంచి పేరున్న లాయరని విన్నది. ఇంటి విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికొచ్చింది రమ్య. వెంటనే రామచంద్రంకు ఫోను చేసింది “అన్నా బాగున్నారా ” అంటూ. బాగున్నామని రామచంద్రం జవాబిచ్చాడు.
“అన్నా, నా ఇద్దరు పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు నీకు తెలుసు కదా. ఇప్పుడు మేముండే చిన్న గదిలో సర్దుకోవటం కష్టంగా ఉంది. మా మామయ్య కట్టించిన పక్క పోర్షన్ లో కిరాయికి ఉండే జనార్ధన్ సార్ ఖాళీ చేస్తే అది కూడా మేమే ఉంచుకుందామని ఖాళీ చెయ్యమన్నాను. నా పెళ్ళికి ముందు నుండే ఆయన ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయింది. ఇరవై ఏళ్ల నుండి ఉంటున్నాను కాబట్టి తనకు ఇంటిమీద యాజమాన్య హక్కులు ఏర్పడినాయని ఖాళీ చేసేది లేదని ఖరాఖండిగా అంటున్నాడు జనార్దన్ సారు. ఈ విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే ఏదైనా సలహా ఇస్తాడని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ అన్నా “.
“మంచిదే. చక్రవర్తి సారు న్యాయం కోసం కొట్లాడే మనిషి. తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ రోజు సాయంత్రం నేను నీ కొట్టు దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి ఆయన దగ్గరకు వెళ్దాం” అంటూ ఫోను పెట్టాడు రామచంద్రం.
చెప్పినట్టే అదేరోజు సాయంత్రం రామచంద్రం రమ్య కిరాణా కొట్టు దగ్గరకు వచ్చాడు. ఇద్దరు కలిసి లాయర్ చక్రవర్తి ఆఫీసుకు వెళ్లారు. రామచంద్రం రమ్యను చక్రవర్తికి పరిచయం చేశాడు. తనకు, జనార్ధన్ కు మధ్య జరిగిన విషయాన్ని ఏడుస్తూ రమ్య చక్రవర్తికి విశదీకరించింది. “లాయరు గారూ, మా మామయ్య కష్టార్జితమైన ఇల్లును మేము పోగొట్టుకున్నట్లేనా, దీనికి పరిష్కారం ఏమిటి ” అడిగింది.
“లేదమ్మా, మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఇల్లు కిరాయిదారైన జనార్ధన్ కు ఎప్పటికీ స్వంతం కాదు. ఎన్నేళ్లు ఉన్నా అతడు కేవలం కిరాయిదారు మాత్రమే. మీరు అమ్మితే తప్ప అతడు ఇంటిపై యాజమాన్య హక్కులు పొందలేడు. యాజమాన్య హక్కు ఉండదనే విషయం తెలిసి కూడా మిమ్మల్ని మోసం చేసి అమ్మకం పత్రం రాయించుకోవాలనే దురుద్దేశంతో అన్నాడో లేక తెలియక అన్నాడో కానీ నీవు చెప్పిన విషయాలను బట్టి అతడికి ఇల్లు ఖాళీ చేయాలనే ఆలోచన లేదనిపిస్తుంది.” వివరించాడు చక్రవర్తి.
“లాయర్ గారూ, ఎట్లైనా చేసి మీరు ఇల్లు రమ్య కుటుంబానికి దక్కేలా చేయండి. ముందే ఆమె భర్త అమాయకుడు. ఈమె కూడా పెద్దగా చదువుకోలేదు. చిల్లర కొట్టు తప్ప వేరే ఏ ఆదాయం లేదు. ఇద్దరు పిల్లలు, భర్తతో సంసారాన్ని నెట్టుకొస్తుంది.” జోక్యం చేసుకుంటూ అన్నాడు రామచంద్రం.
“నీకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా సహాయం చేస్తాను. కాకపోతే ఇదంతా వారం పది రోజుల్లో తేలే ముచ్చట కాదు. కొంచెం ఓపిక పడితే ఓ మూడు నాలుగు నెలల్లో ఒక కొలిక్కి వచ్చేట్లు ప్రయత్నం చేస్తాను. ఈ రోజే ముందుగా ఈ నెలాఖరుకల్లా ఇల్లు ఖాళీ చేయాల్సిందని జనార్దన్ కు నోటీసు పంపిస్తాను. అతని జవాబును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుందాం “.
లాయర్ చక్రవర్తి వెంటనే నోటీసు తయారు చేయించి జనార్ధన్ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశాలిచ్చాడు. నెల రోజుల పిదప కలువమని రమ్యకు చెప్పాడు. సరిగ్గా నెల రోజుల అనంతరం చంద్రమోహన్, రమ్య చక్రవర్తిని కలిశారు. తను పంపిన రిజిస్టర్డ్ నోటీసు జనార్ధన్ అందుకున్నట్లు, అతడి నుండి ఎటువంటి జవాబు రాలేదని చక్రవర్తి చెప్పాడు.
“కోర్టులో కేసు వేస్తే తీర్పు రావటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పైగా కోర్టు ఫీజుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా లోక్ అదాలత్ లో దరఖాస్తు ఇద్దాం. పైసా ఖర్చు ఉండదు. తీర్పు కూడా త్వరగా వస్తుంది.” అంటూ సలహా ఇచ్చాడు చక్రవర్తి. కంప్యూటర్ మీద దరఖాస్తు తయారు చేయించి, చంద్ర మోహన్, రమ్యల సంతకాలు తీసుకొని మరుసటి రోజే లోక్ అదాలత్ న్యాయాధికారికి సమర్పించాడు చక్రవర్తి. దరఖాస్తును పరిశీలించిన న్యాయాధికారి అది సక్రమంగా ఉన్నందున జనార్ధన్ కు నోటీసు పంపిస్తూ లోక్ అదాలత్ బెంచి ముందు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకనుగుణంగా జనార్ధన్ ముగ్గురు సభ్యులతో కూడిన లోక్ అదాలత్ బెంచి ఎదుట నిర్ణీత తేదీ నాడు హాజరయ్యాడు. తను ఇరవై సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నట్టు, కాబట్టి యాజమాన్య హక్కులు తనకు సంక్రమించినట్లు వాదన వినిపించాడు. వాదనతో పాటు కరెంటు బిల్లులు, నీటి పన్ను తనే కడుతున్నట్లు సాక్ష్యంగా సమర్పించాడు.
“జనార్ధన్, నీవు ఒక విషయం గమనించాలి, కరెంట్ బిల్లులు, నీటి పన్ను కట్టినంత మాత్రాన నీకు యాజమాన్య హక్కులు సంక్రమించవు. ఏ చట్టం కూడా ఆ విధంగా చెప్పలేదు. ఎన్నేళ్లయినా కేవలం కిరాయిదారుగా మాత్రమే ఉంటావు. నీవు ఇరవై ఏళ్లుగా ఉంటున్నావు, నీ కూతురు వివాహం చేశావు, ఎదిగిన కొడుకు ఉన్నాడు, నీ వ్యాపారం బాగానే వృద్ధి చెందిందనేది వాస్తవం. చంద్రమోహన్ అమాయకుడు. దంపతులిద్దరు చిల్లరకొట్టు నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఒకే ఒక్క గదిలో జీవితం వెళ్ళదీస్తున్నారు. ఇప్పటి పరిస్థితిలో కొంచెం విశాలమైన ఇంట్లో ఉండాలనుకోవటం నిస్సందేహంగా వారికున్న హక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిపై వారికి సర్వాధికారాలు ఉంటాయి. చంద్రమోహన్ కోర్టులో కేసు వేస్తే నీవు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని తీర్పు రావటమే కాకుండా అతడికి అయిన ఖర్చులన్నీ నువ్వే తిరిగి కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇద్దరికీ పైసా ఖర్చు ఉండదు. కావాలంటే ఖాళీ చెయ్యటానికి కొంత గడువు నీవు కోరటంలో తప్పేమి లేదు. ఒక గంట సమయం తర్వాత ఈ కేసును మళ్ళీ పిలుస్తాం. ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు ” అంటూ బెంచి లోని న్యాయాధికారి సలహా ఇచ్చాడు.
ఒక గంట తర్వాత కేసును పిలవటం జరిగింది. బెంచి లోని సభ్యులు జనార్ధన్ ను ఏమి నిర్ణయం తీసుకున్నావని ప్రశ్నించారు. “సార్, ఇల్లు ఖాళీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాకపోతే ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు నాకు అందుబాటులో ఉండదు కదా. కనీసంగా ఒక మూడు నెలల గడువిస్తే ఈలోగా వేరొక ఇల్లు చూసుకుంటాను” జవాబిచ్చాడు జనార్ధన్.
చంద్రమోహన్, లాయర్ చక్రవర్తి కూడ జనార్ధన్ ప్రతిపాదించిన గడువుకు ఒప్పుకున్నారు. సమస్య సులువుగా పరిష్కారమైనందుకు లోక్ అదాలత్ న్యాయాధికారి, ఇతర సభ్యులు హర్షం వెలిబుచ్చారు. జనార్ధన్ మూడు నెలల్లోగా ఇంటిని ఖాళీ చేయాల్సిందని, అప్పటిదాకా ఒప్పుకున్న అద్దె చెల్లించాలని, కరెంటు, వాటర్ బిల్లులు చివరిదాకా చెల్లించాలని, ఇంటిని ప్రస్తుతమున్న స్థితిలో చంద్రమోహన్ దంపతులకు అందజేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చంద్రమోహన్ కోర్టు సహాయం కోరవచ్చని లోక్ అదాలత్ బెంచి తుది తీర్పు ఇచ్చింది. అదే విధంగా ఈ మూడు నెలలపాటు చంద్రమోహన్ దంపతులు జనార్ధన్ ను ఏ విధమైన అక్రమ పద్ధతుల్లో జబర్దస్తీగా ఖాళీ చేయించే ప్రయత్నం చేయరాదని కూడ నిబంధన విధించింది. ఆమోద యోగ్యమైన అంగీకారానికి సుముఖత తెలియజేసి సత్వర పరిష్కారానికి తోడ్పడినందుకు లోక్ అదాలత్ బెంచి అభినందనలు తెలియజేస్తూ, అశోక చక్రంలో ఉండే 24 ఆకులకు భావాలుగా భావించబడే వివేకం, నైతికత, న్యాయం ఇరు వర్గాల వారు పాటించి ధర్మాన్ని గెలిపించారని, ఇది ఎవరి గెలుపో, ఓటమో అని భావించ రాదని, చంద్రమోహన్, జనార్ధన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ తీసుకోవాలని కోరుతూ తీర్పు ప్రతులు ఇరువురికి అందజేసింది.
**
చూస్తుండగానే మూడు నెలల గడువు ముగిసింది. జనార్దన్ ఇల్లు ఖాళీ చేసే రోజు రానే వచ్చింది. ఇన్నేళ్లుగా తమదిగా భావించిన కిరాయి ఇల్లును వదిలి మరో కిరాయి ఇంటికి వెళ్ళాల్సి వస్తున్నందుకు జనార్ధన్, అతని భార్య, కొడుకు ఏదో కోల్పోతున్న వారిలా దిగులుతో ఉన్నారు. సామాన్లు తీసుకుపోవటానికి లారీ వచ్చింది. కూలీలు సామాన్లను లారీ మీదకు ఎక్కించారు. హడావిడిని గమనించి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని “ఇల్లు ఖాళీ చేస్తున్నారా జనార్ధన్ గారూ” అంటూ పలకరించారు. “ఏమి బతుకులో ఏమో, దేవుడు నోటీసు పంపిస్తే ఒళ్ళు ఖాళీ చెయ్యాలి, కోర్టు నోటీసు పంపిస్తే ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందే, మనిషి బతుకే కిరాయి బతుకు” నిర్వేదంగా జనార్ధన్ అంటుండగా లారీ భారంగా కదిలింది మరో చోటుకు.
*****