దేశభాషలందు తెలుగు లెస్స అని పేరు తెచ్చుకొన్న మన తెలుగుభాష ద్రావిడభాషలలో ఒకటి. ద్రావిడ భాషలు సుమారు 31 ఉన్నాయి. వాటిలో తమిళం అతి ప్రాచీనమైన భాష. అందుకే తమిళ భాషలో మన నన్నయ కంటే ముందే సాహిత్య భాష పుట్టింది.
తొలక్కాపియం వంటి రచనలు వచ్చాయి. తమిళం నుండి తెలుగు, కన్నడం ,మలయాళం భాషలు వేరైనట్లు పరిశోధకులు భావిస్తున్నారు. క్రీస్తుశకం ఆరవశతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
నన్నయ భారతరచనలో సంస్కృత శబ్దాలను (తత్సమాలు) అధికంగా వాడడం వల్ల తెలుగు సంస్కృత జన్యమని పండితులు భావించారు. కానీ అది నిజంకాదు. తెలుగు ద్రావిడ భాషల నుండి విడివడి స్వతంత్ర భాషగా ఏర్పడినది.
మన మాతృభాష తెలుగు.ఈ తెలుగుకు ఆంధ్రం , తెలుగు,తెనుగు అని మూడు పేర్లను పర్యాయపదాలుగా వాడుతున్నాము.
ఆంధ్రము:-
ఆంధ్ర’ అంధ్ర అనే శబ్దాలు రూపాంతరాలైన సంస్కృత పదాలు.ఇవి జాతి పరంగానూ,భాషాపరంగాను ప్రయోగించడం జరిగింది.శాశన ప్రామాణికతను బట్టి ‘అంధ్ర ‘అనేది ప్రాచీనరూపమైతే ఆంధ్ర అనేది అర్వాచీన రూపం.చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి ఆంధ్రుల గురించి రాశారు. అశోకుని శాసనాల ద్వారా ఆంధ్రులను ఒక జాతిగా పేర్కొన్నారని తెలుస్తున్నది. భాషాపరంగా నన్నయ తన స్నేహితుడైన నారాయణభట్టు గురించి “ఆంధ్రభాషా సుకవి శేఖరా” అని సంబోధించాడు నన్నయ్య రచించిన నందంపూడి శాసనంలో ‘ఆంధ్ర శబ్దం’ భాషా వాచకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విధంగా ఆంధ్రశబ్ధం మొదట జాతి పరంగానూ తర్వాత భాష పరంగానూ తర్వాత దేశ పరంగానూ ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది .
తెనుంగు…తెనుగు
తెనుగు పదము త్రినగము పదము నుండి ఏర్పడింది. త్రినగములనగా ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం ఈ నడుమ ప్రాంతంలో ఉన్న ప్రదేశాన్ని త్రినగ ప్రాంతమని ,ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషను తెనుగు ప్రజలని వ్యవహరిస్తున్నారు. తెనుంగు ,తెలుగు అనే పదాలు కవులెందరో ఉపయోగించారు.నానారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు మహాభారత అవతారికలో “తెలుగున రచియింపుమధిక ధీయుక్తి మెయిన్” అని భాషాపరంగా ఉపయోగించారు. నన్నెచోడుడు,పాల్కురికి సోమన జాను తెనుగు పదాన్ని వాడారు. ఈ విధంగా తెనుగు పదము భాషాపరంగా ఉపయోగించారు
తెలుగు :-*
తెలుగు శబ్దము త్రిలింగములున్న దేశం త్రిలింగదేశమని అదే తరువాత ‘తెలుగు’ పదంగా మారిందని ఊహించడం జరిగింది.తెలుగు త్రిలింగ సిద్ధమని అది ప్రాచీనమైన పదమని సాహితీకారులు భావించారు .
మొత్తం మీద ఆంధ్రం,తెనుగు, తెలుగు పదాలు సమానార్థక పదాలనీ అన్నిటికీ సమప్రాధాన్యం కలిగి ఉందని తెలుస్తున్నది .
ఈ తెలుగు భాష గొప్పదనం తెలుసుకునే ముందు మనం సంస్కృత, ప్రాకృత భాషలో పరిచయం కూడా కొంత తెలుసుకుందాం!
సంస్కృతం:- సంస్కృతమును దేవనాగరి భాష లేదా ఆర్య భాష అంటారు.ఈ భాషలో అనంతమైన సాహిత్యసంపద ఉంది. “పరమేశ్వరుని ఢమరుకనాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష” అని విజ్ఞులు చెబుతారు. అలా వెలువడిన 14 రకాల సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు.ఢమరుకం నుండి వెలువడిన ఈ అక్షరధ్వనులను పాణిని ప్రఖ్యాత వ్యాకరణమైనా అష్టాధ్యాయిని రచించాడు.
- అ ఇ ఉ ణ్
- ఋ లుక్
- ఏ ఓ జ్
- ఐ ఔ చ్
- హ య వ ర ట్
- లణ్
- ఞ్ మ జ్ ణ న మ్
- ఝ భ ఞ్
- ఘ ఢ ధ వ్
- జ బ గడ శ్
- ఖ ఫ చ ఠ థ చ ట త వ్
- క ప య్
- శ ష స ర్
- హ ల్ అచ్చులు:-
మహేశ్వర సూత్రాల్లో 1 2 3 4 తీసుకోగా మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రం చివరి అక్షరం చ్ కలిపితే అచ్చు అవుతుంది .ఇవే అచ్చులు.అ ఇ ఉ ఋ లు ఏ ఓ ఐ ఔ (చ్) హల్లులు :-
మహేశ్వర సూత్రాల్లో 5 నుండి 14 వరకు తీసుకోగా 5 సూత్రంలో మొదటి అక్షరం’ హ’ 14 వ సూత్రంలో చివరి అక్షరం ల్. ఈ రెండిటిని కలపగా హల్ గామారి ఏర్పడింది. అవే హల్లులు.
హ య వ ర ల ఞ్ మ జ్ ణ న ఝ భ ఘ డ ద జ బ గ డ ద ఖ ఫ ఛ ఠ థ చ ట త వ క ప శ ష స (ల్)
పై మహేశ్వర సూత్రాలను ప్రత్యాహారాలు అంటారు. పాణిని సూత్రాలను అల్పాక్షరాలతో చెప్పడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నాడు.
శివుడు తాండవానంతరం ముక్తాయింపుగా ఢమరుకం మీద 14 అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి.
నృత్తావసానే నటరాజ రాజో
సనాద ఢక్కమ్ నవ పంచవారమ్
ఉద్దుర్తు కామః సనకాది సిద్ధానే
తద్విమర్శే శివ సూత్ర జాలమ్
బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి, పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని స్మరించడం.
సంస్కృత భాషలో ఆదికవి వాల్మీకి రామాయణం రాశాడు. వ్యాసుడు భారతం, అష్టాదశ పురాణాలు రాశాడు. కాళిదాసు, భవభూతి, దండి, విశాఖదత్తుడు, భాణుడు, బాసుడు , అభినవగుప్తుడు, ఆనందవర్ధనుడు, విద్యానాధుడు, విశ్వనాథుడు మొదలైన ఎందరో కవులు అద్భుత కావ్యాలు రాసి మనకు అందించారు.
ప్రాకృతం :-
అసలు ప్రాకృతం అంటే …..
షడ్వధేయం ప్రాకృతశ్చ శూరసేనీచ మాగధీ
పైశాచీ చూళికా పైశా చ్యప్రభంశ ఇతి క్రమాత్
అంటే ప్రాకృతం ఆరురకాలుగా ఉందన్నమాట.
- ప్రాకృతం, 2.శూరసేని, 3.మాగధి, 4. పైశాచి, 5.చూళిక, 6.అపభ్రంశ పైశాచి
ప్రాకృతం అంటే అర్థం “అప్పటికి వ్యవహారంలో ఉన్న వాడుక భాష” అని దానికి ఐదు రకాల మాండలిక భాషలు చేరాయి. ఈ విధంగా ప్రాకృతం ఆరు రకాలు. భారతదేశాన్ని క్షత్రియులు పాలించినప్పుడు ప్రాకృతభాష రాజభాషగా చలామణి అయింది. అశోకుని శాసనాలు ప్రాకృత భాషకు సంబంధించిన తొలి ప్రస్థావనాలు. శాతవాహనులకాలం నాడు ప్రాకృతం రాజభాషగా చలామణి అయింది. హాలుడు తన గాధాసప్తశతిని ప్రాకృతంలో రాశాడు. గుణాడ్యుడు ప్రాకృతంలోని పైశాచిక మాండలికంలో బృహత్కథ అనే గొప్ప కథలు రాశాడు. ఇంకా ఎందరో ప్రాకృత కవులు ఉన్నారు.
వర్ణోత్పత్తిక్రమం
సంస్కృత, ప్రాకృత, తెలుగు భాషకు ఉన్న అక్షరాలు పరిశీలిద్దాం.
చిన్నయసూరి బాలవ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో మొదటి సూత్రంగా ఇలా చెప్పారు.
సంస్కృతం:- సంస్కృతమునకు వర్ణములేబది వచించారు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ లు లూ ఏ ఐ ఓ ఔ అం అః
క ఖ గ ఘ జ్ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ
ప్రాకృతం :-* ప్రాకృతమునకు వర్ణములు నలుబది.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః
క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సహళ
ఇక్కడ సంస్కృతంలో ఉన్న అక్షరాల్లో ఋ ౠ లు లూ ఐ ఔ మరియు జ్ ఞ శ ష అనే 10 అక్షరాలు ప్రాకృతంలో లేవు .కేవలం 40 అక్షరాలు మాత్రమే ప్రాకృత భాషలో ఉందని చెప్పబడింది.
తెలుగు :-
ఇక మన తెలుగు భాషకు చిన్నయసూరి చెప్పిన అక్షరాలు పరిశీలిద్దాం
తెలుగుకు వర్ణములు ముప్పదియారు.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క గ చ చ(దంత్యం) జ జ(దంత్యం) ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ
సంస్కృత భాషలో లేకుండా కేవలం తెలుగుభాషలో ఉన్న అక్షరాలు 4. ఎ ఒ చ జ(దంత్యాలు) వీటితోబాటు తెలుగులలో అరసున్న( ఁ) శకటరేఫము (ఱ) ఉన్నాయి.
సంస్కృతం నుండి 19 అక్షరాలను తెలుగులోకి వచ్చాయి .వాటిని చిన్నయసూరి ఇలా సూత్రీకరించారు.
ఋ ౠ లు లూ విసర్గ ( ః) ఖఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ జ్ ఞ శ ష లు
సంస్కృత సమములగూడి తెనుగున వ్యవహరించబడు
ఇలా తెలుగు భాషకు మొత్తం 56 అక్షరాలుగా వెలుగొందుతూ నన్నయ నుండి నేటి కవుల కలములో నర్తిస్తూ అందరినీ అలరిస్తుంది.