మొదటి కాకతీ రుద్రుని కళాపోషణకి, కళారాధనకి శాశ్వత ఉదాహరణగా నిలిచిపోయిన మహామంటపము ఉన్నరామప్ప గుడికి మేమందరము వెళ్ళాము సెలవలు మొదలవగానే. ఆ కట్టడం నిర్మాణం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకు మేమందరము అక్కడే గడిపాము. ఆ తరువాత రోజున నాతో వచ్చిన వాళ్ళందరూ వేరే ప్రదేశాలు చూడటానికి వెళ్లారు.
నేను ఆరోజు కూడా అక్కడే ఉండిపోయాను. మరోసారి మనసారా ఆ మహామండపంలోనే గడపాలనిపించింది. అందుకు ఒక ప్రత్యేక కారణం కూడా ఉన్నది. తెలుగు దినపత్రిక లో నాడు నేడు అనే శీర్షికలో ఒక్కపుడు అదే రోజున సంఘటనలను గుర్తుచేసే అంశాలు ప్రచురించబడతాయి. ఆ రోజున కూడా నేను దినపత్రిక తిరగ వేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని నాలుగు-అయిదు శతాబ్దాలకి చెందిన బుద్దుడి శిల్పాలను డైనమిట్స్ ని ఉపయోగించి పేల్చివేయబడ్డాయి అన్న వార్త చదివినప్పుడు మనసు కలచివేసింది. విదేశీ దాడులనుంచి మన శిల్పసంపదను కాపాడుకోవడం కోసం కొన్ని దేవత మూర్తులను ఉన్న చోటునుంచి తరలించి దాచారని, అలాగే కదల్పలేని పెద్ద శిల్పాలను మట్టి కుప్పలలో దాచి ఉంచారని చరిత్ర పాఠాలలో చదివినప్పుడు నిజమేనా అనిపించింది. కానీ ఈ సంపద ఒకసారి చేయిజారిపోతే తిరిగి పొందడం అసాధ్యం.
ఈ శిల్పాలు మానవ మేధస్సుకి ప్రతీకలు. అలాటి శిల్ప సంపద మానవాళి పురోగతికి సాక్షులుగా ఎంత కాలమైనా నిలిచిఉంటాయి. కేవలం మానవ మస్తిష్కంలో చేరిన ద్వేషం అనే చీడ పురుగు యొక్క అతి భయంకరమైన రూపమే ఈ చర్య. మన ఈ అపూర్వ మైన శిల్ప సంపదను కాపాడుకోగలమా అనిపించింది. అందుకే నా మనసు తీరా ఆ దేవాలయ ప్రాంగణంలో ఇంకొద్దిసేపు గడపాలని అక్కడికి చేరుకున్నాను.
ఆ తరువాత రుద్రేశ్వరుని కోసమై నిర్మించిన ఆలయ వేయిస్తంభాల మంటపం చేరుకున్నాను. ఆ వేయిస్తంభాల మధ్యన తిరుగుతూ మంటపం మధ్యకి చేరుకున్నాను. ఎంతో చల్లగా హాయిగా అనిపించింది. అక్కడ స్థాపించబడిన శిలా శాసనం దగ్గర నిలబడి ఆ ఆలయ నిర్మాణ తీరుని గురించి తెలుసుకున్నాను. ఆ ఆలయ నిర్మాణానానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో కూడా తెలియాడేటంత తేలికయినవని చదివి అబ్బుర పడ్డాను. మానవ శాస్త్రీయ సాంకేతిక నిపుణతకి ఈ నిర్మాణం ఒక మైలురాయి అనిపించింది. అలా ఎన్నో శిల్పాలను తనివితీరా చూస్తూ వాటితోనే మమేకమైన నేను ఎంత సేపు అక్కడే ఉన్నానో తెలియలేదు. అప్పటికి సందర్శకులు కూడా తగ్గిపోయారు. ఆ మండపం మధ్య భాగంలోని నక్షత్ర ఆకారములో ఉన్న అష్టదళ పద్మం ని చూస్తూ ఒక విధమైన ధ్యానస్థితి లోకి వేళ్లానేమో. గాఢమైన సుషుప్తి.
***********************************
అంతా చీకటి. ఎక్కడి నుంచో సన్నని వెలుతురు. అక్కడి నుంచి నన్నెవరో పిలుస్తున్నట్లనిపించింది. ఆ వెలుగు రుద్రేశ్వరుని ఆలయం లోనున్న దీపం నుండి అని అర్ధమయింది. ఎవరు కనిపించలేదు. కానీ ఒక మధురమైన స్వరం నన్ను పిలుస్తున్నట్లనిపించి అటువైపుగా నడిచాను. అది రుద్రేశ్వరుని కోసం నిర్మించబడిన గర్భాలయం. ఎవరో అక్కడ నిల్చున్నట్లనిపించి అక్కడకి చేరుకున్నాను. గర్భాలయద్వారం కిరువైపులా వింజామరులు వీచుతున్న సుందర నారీమణుల అద్భుతమైన శిల్పాలు. అవి శిల్పాలు – కాదు శిల్పాలుగా చెక్కబడిన శిలలు. ఆలా అనుకుంటూ వెళ్ళడానికి తిరిగాను .
“ఓయీ!సందర్శకుడా!. ఇంత దూరం వచ్చి మాతోటి మాట్లాడకుండా పోతావేమిటీ?”అని నాతో అన్నట్లనిపించి వెనక్కి తిరిగాను. ఆశ్చర్యం ముప్పిరిగొనగా గర్భాలయం ముఖ ద్వారం దగ్గరికి చేరుకున్నాను. నా ఎదురుగ ముఖమండపద్వారానికి ఇరువైపులా నిలుచుని ఉన్న శిల్పసుందరీమణులు. వారిలోంచి ఒక శిల్పకాంత నాతో మాట్లాడుతున్నది.
“నీకు నన్ను చూస్తే ఆశ్చర్యమనిపిస్తున్నది కదూ! శిలలు మాట్లాడటమేమిటీ అని అనుకొంటున్నావా? శిలలపై సప్త స్వరాలూ పలికించిన మేధావి మా చేత మాట్లాడించలేడా! ఆ శిల్పకారుడి కళానైపుణ్యానికి కదలి, కరిగి ఆత్మరూపమై సుందర మానవాకృతిలోకి పరిణామం చెందిన మదనికను. నా కధ ఆలకించుదువా?” అని మదనిక చిరుదరహాసంతో అడిగింది. వశీకరించబడినట్లు నేను ఆమె చెప్పబోయే కధని వినడానికి ఆమె ముందు మోకరిల్లాను.
“కాకతీరుద్రుని సామంతుడు రుద్రాసేనాని కాకతీయ కళావైభవానిక ప్రతీకగ ఈ ఆలయ మంటప నిర్మాణము చేపట్టడం జరిగింది. ఎందరో తపస్యుల పూజాఫలం ఈ మంటపము. ఆ సమయంలో ఎందరో మహా శిల్పులు రుద్రసేనాని సభలో ఆసీనులై ఉన్నారు. జయ సేనాని ఆచార్యులందరికి వారి హొదానుసారంగా నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ముఖ మండప నిర్మాణం ఎవరికి అప్పగించాలి అన్న యోచనలో ఉన్న రుద్రేశ్వరునికి ఎదురుగ మధ్యవయస్కుడైన శిల్పి వచ్చి నిలుచున్నాడు. జయసేనాని అతన్ని పరికించి చూసాడు. సూక్ష్మ దృష్టి గల విశాల నేత్రాలతో, శిలలతో బంతులాడినట్లుండిన భుజస్కంధాలతో, ఉలితో ప్రబంధ రచనలు చేసినట్లు కాయలు కాచిన చేతులతో అతను కనిపించాడు.
పట్టుపీతాంబరం మోకాలి పైవరకు మడిచి, పైన ఏ ఆచ్చాదనా లేక కేవలం గాయత్రి మంత్రం సంప్రోక్షణతో పవిత్రమైన జంధ్యం ధరించి, నుదుటి పైన విభూతి , ఫాలభాగం మధ్యలో దేవి కుంకుమ తో బ్రహ్మ కై తపస్సు చేసిన తపస్విలా , అర్ధాంతరంగా తపస్సును చాలించి వచ్చిన రాజర్షి విశ్వామిత్రునిలా కనిపించాడు ఆయన.
“తమరి పేరు?”
“విరించి”.
“తమరి అనుభవం?” మళ్ళీ ప్రశ్నించాడు.
“తమరు అవకాశమిస్తే శిల్పాకృతిలో చూపిస్తాను.” ఎంతో ఆత్మ విశ్వాసం ఆయన స్వరంలో కనిపించింది.
“మంచిది. తమరికి ముఖ మండప నిర్మాణ విధిని అప్పగిస్తాను. తమరి ప్రజ్ఞ పాటవాలు నిరూపించుకోండి. ఉత్తమమైన పనికి రాజ బహుమానం. నష్టమైనచో రాజ దండన. ఈ రెండింటికి సిద్దమేనా ?”
తలాడించాడు విరించి అంగీకారంతో. జయసేనాని అనుజ్ఞ పత్రం ఇచ్చి సభాభవనం నుండి రుద్రాసేనాని తో సహా నిష్క్రమించాడు.
విరించి తృప్తిగ ఇల్లు చేరుకొన్నాడు. తన సతి భారతి కి జరిగినదంతా చెప్పాడు. రేపటి నుండి తను ధ్యాన నిమగ్నుడవుతానని, ఎలాంటి అవరోధం కలిగించకూడదని ఆమెకు చాల నిష్కర్షగా చెప్పాడు. ఆ రాత్రి అంతా విరించి హృదయం పరిపరి విధాల ఆలోచనలతో నిండి పోయి నిదురకు దూరమైంది.
**********************************************
ప్రాతః కాలం కలకూజితారావాలతో మనోజ్ఞమైన రవికిరణ శోభలతో ప్రకాశించింది. పెరటి లో ఉన్న మోటుబావి లో కి దిగి కాసేపు ఈత కొట్టి, పైకి చేరి సూర్యనమస్కారములను ఆచరించి దేవుని మందిరంలో మృగాసనం పై పద్మాసనాసీనుడై గాయత్రీ మంత్రోచ్ఛారణ మొదలు పెట్టాడు విరించి.
“ఓమ్ భూర్భువఃస్వాహా ; ఓంతత్స వితర్వరేణ్యం ;
భర్గో దేవస్య ధీమహి ; దీయో యోనః ప్రచోదయాత్.”
జ్యోతి ధ్యానం తో ప్రారంభమైన విరించి ఓంకారం మనసులోమెదులుతుండగా తిన్నగా కనులు మూసుకున్నాడు. తాను చూస్తున్న జ్యోతి కిరణాలూ శరీరమంతా వ్యాపించాయి. అంతర్లీనంగా విరించిలో దివ్యమైన కాంతి ప్రజ్వరిల్లుతున్నది. ఆయన భృకుటి విశాలమైంది. అంతర్మధనం ఆగిపోయింది. అన్వేషణ మొదలయింది.
కుండలిని స్థానంలో ప్రారంభమైన ఆ కాంతి పుంజం నాభి స్థానం, ఉదర స్థానం, హృదయస్థానం, కంఠ స్థానము , అధర స్థానము దాటి భృమధ్య స్థానం చేరుకున్నది. అక్కడ కేంద్రీకృతమైనది.
మిరిమిట్లు గొలిపే దివ్య కాంతి. తెల్లని హిమవత్ పర్వత శ్రేణి, కైలాసగిరి. ప్రధమగాణ పరివేష్టితుడై లయకారుడు,మృత్యుంజయడు, గంగ-గౌరి సమాలంకృతుడు, యోగీశ్వరుడు యోగముద్రను వీడి నాట్య ముద్ర లోకి వచ్చాడు. సృష్టిని లయించి, తిరిగి సృష్టికి ఆధారమైన పంచభూతాల అధినాధుడు నర్తిస్తున్నాడు. రౌద్రం మూర్తీభవించిన వేళ లయం చేస్తాడు, కారుణ్యంతో కనికరించి సృష్టి ని కాపాడే ఆ దేవదేవుడు వాయు రూపుడై, జ్యోతిస్వరూపుడై ,సైకతరూపుడై , మనోరూపుడై, జలరూపుడై , సమస్థ సృష్టికి ప్రాణనాధుడై నర్తించే శివుని పదఘటనలలో లీనపైపోతుంది ఈ సృష్టి. అతడే రుద్రేశ్వరుడు . ఆ స్వామి అలసిన వేళ వీవన లేచే సుందరి సామాన్యురాలు కాదు. ఆయన శిరస్సునే పీఠం చేసుకున్న గంగాభవాని,అర్ధభాగంలో ఇమిడిఉన్న ఈశ్వరి, ఫాలనేత్రం లో విరాజిల్లే దివ్యజ్యోతి గాయత్రీ, సౌందర్య లహరే ఆ దేవా దేవునికి వింజామారలు పట్టాలి. అలాంటి దివ్య సుందరమూర్తులే రుద్రేశ్వరుని ద్వారానికి అలంకారాలుగా నిలవాలి. విరించి ధ్యానం ఫలించింది. దివ్య సుందర రూపం గోచరించింది. అద్భుతమైన స్త్రీ మూర్తి వింజామర ను పట్టి ఎదుట నిలిచింది. విరించిలోని శిల్పి మేల్కొన్నాడు. ఆ దివ్య సుందరి ఆకార లక్షణాకృతి మనసుతోనే బేరీజువేసాడు.
“ధన్యోస్మి” అని కనులు తెరిచాడు.
**************************************************
అప్పటికి సరిగ్గా మూడురోజులయింది సేనాని ఆమోదం పొంది.
విరించి వడివడిగా ధ్యానాసనం నుండి లేచాడు. అలౌకికమైన ఆనందం ఆయన ముఖంలో తాండవిస్తుంది. ఆయన సతి భారతి భర్తను పలకరించలేదు. ఆమెకు తెలుసు తన పలకరింపు ఆయన తపస్సు ను భగ్నపరుస్తుందని.
వడివడిగా విరించి వంటి మీదన ఉన్న ధోవళి తోనే మండపానిర్మాణ స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే కొందరు శిల్పాచార్యులు పనులు ప్రారంభించారు. మావటివాళ్ళు నల్లరాతి గండ్ర శిలలను ఏనుగుల సాయం తో అక్కడకి చేరుస్తున్నారు. విరించి శ్రేష్టమైన పది అడుగుల పొడవు, నాలుగుఅడుగుల వెడల్పు ఉన్ననల్ల రాయిని ఎంచుకున్నాడు. గాయత్రి,గణపతి మంత్రోఛ్ఛారణతో ఆ శిలని సంప్రోక్షణ చేసాడు. పసుపురాసి కుంకుమ అద్దాడు. ఆ శిల కెదురుగా పద్మాసనంలో కూర్చొని తమ వంశ మూలపురుషులను తలచి, విశ్వకర్మ ను ధ్యానించి ఉలి చేతపట్టాడు.
“ఓయీ సందర్శకుడా వింటున్నావా ! నా ఈ ఆకృతి రావడానికి కొన్ని నెలలు పట్టింది. తల్లి గర్భంలో పిండస్థ దశలో ఉన్న శిశువు నవమాసానికి స్పష్టమైన ఆకృతిని పొంది , తల్లి ప్రసవవేదనతో అతి రహస్యమైన యోని మార్గంగుండా ఈ ప్రపంచంలోకి వస్తుందో, అలాగే నేను ఆవిర్భవించాను. ఒక గండ శిలాకారంలో ఉన్న నేను,కంటికి కనిపించని మేధాశక్తి తో శిల్పిహృదయాంతరాలలో ఎదుగుతూ ఈ సుందర రూపంతో పృధ్వి పైకి వచ్చాను.
వయ్యారంగా సుందరసుమనోహరముగా అలవోకగా వింజామారను ఎత్తి నిలుచుని ఉన్న నా ఈ భంగిమ కి రుద్రేశ్వరుడు సహితం అచ్చరువొంది తన నాట్యం నిలిపి, నా వింజామర గాలికి సేద తీరునేమో అన్నంత అద్భుతంగ నన్ను మలిచాడు నా జనకుడు విరించి. ఆలా అనేకానేక సుందర శిల్పలకు ప్రాణం పోసి తాను చరితార్థుడైనాడు.
“ఓయీ విను! మీరు చంచల మనస్కులు. మేము నిశ్చలంగా ఉంటాము. మా మనసులు అకల్మష క్షేత్రాలు. మేము శాశ్వతం. మాకు మరణం లేదు. ప్రకృతి ఉత్పాతాలను ఎన్నింటినో దాటుకొని జరిగిన కొన్ని శతాబ్దముల చరిత్రకు సాక్షులం. నేటివరకు మానవ జిజ్ఞాసకు, మేధస్సు పరిణామానికి షట్ సాక్షిభూతమై నిలిచిఉన్నాం. పృథ్వి నిలిచి ఉన్నంత వరకు ఈ ప్రకృతి విలయతాండవం మమ్ములనేమి నేమి చేయలేదు.ఒక్క మానవుని వికృత ధోరణి తప్ప. పరిణామక్రమములో వెర్రితలలు వేస్తున్న మానవ వికాసానికి బలికావలసి వస్తున్నది. మతద్వేషాలతో మమ్ములను అందవిహీనంగా చేసారు. స్వార్ధంతో మమ్ములను విఫణి వీధులలో చేర్చారు. అయినా మీ మనసుకు తృప్తి కలగండంలేదు. కొన్ని వేల మంది కళాకారుల తపోఫలమైన మా మీద కూడా మీరు దాడిచేస్తున్నారు. మమ్ములను చూస్తే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా! విను! ఈ మానవాళి శాంతి అనే పదంకూడా వినపడని ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఆ అశాంతి లో శాంతి కోసం మమ్మల్ని వెదుకుతూ తిరిగి మా చెంతకే చేరుకుంటారు. ఇదే ఈ శిలాసుందరి మదనిక ఇచ్చే శాపము-వరము”, అని ఆ మదనిక చిరుధరహాసం తో మౌనం గ నన్ను శాసిస్తున్నట్లు నిలిచిపోయింది.
**************************************
ఒక్కసారిగా ఉల్లికి పడి లేచాను. నా చుట్టూ పరికించాను. నిశబ్దంగా జరిగిన , జరుగుతున్న , జరుగబోవు చరిత్రకు పంచభూతాలతో పాటుగా షట్ట్ సాక్షిభూతులుగ నిలిచి ఉన్న ఆ శిల్ప కళాఖండాలు కనిపించాయి. శిల్పసుందరి మదనిక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. శాపంలాంటి వరమా లేక వరంలాంటి శాపమా ఇది? రాబోయేతరాలే నిర్ణయించాలి.