Home కథలు ‘గమనిక’

‘గమనిక’

by C.S. Rambabu


కొంతమందికి పేరెందుకు వస్తుందో తెలియదు. కానీ పేరొచ్చిన వాళ్ళేం చేసినా చెల్లుబాటవుతుందని శంకర్రావును చూశాక ఎవరికయినా అర్ధమవుతుంది. అతనేం చేస్తుంటాడో మాకెవరికీ తెలీదు కానీ మా కాలనీలో పండగ వచ్చిందంటే మాత్రం శంకర్రావు లేకుండా జరగదు.  వినాయక చవితితో మొదలు పెడితే ఉగాది వరకూ ఏ పండగైనా అతని కనుసన్నల్లోంచి బయటపడలేదు.  చందాలు వసూలు చేస్తాడు.పూజలు ఆర్గనైజ్ చేస్తాడు.ప్రసాదాలు పంచుతాడు.  ఆర్కెస్ట్రాలు పెడతాడు.నిమజ్జనం అంటే పిల్లా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్కచోట చేరుస్తాడు.అతను జై శ్రీరామన్నా, జై భారతమాత అన్నా తిరుగులేదు.ఒకసారెవరో చందా ఎందుకివ్వాలి అని అడిగినట్టున్నారు, అలా అడిగినందుకు ఆ వ్యక్తిని ఉతికి ఆరేశాడు.అలా ఇలా కాదు, మరక మంచిది కాదన్నట్టు సంస్కారవంతంగా ఆరేశాడు.ఆ దెబ్బకు మళ్ళీ ఇంకొకరు అలాంటి ప్రయత్నం చేయలేదు.ఒక్క మాటలో చెప్పాలంటే He is a law unto himself… తను చెప్పిందే చట్టమన్నట్టు ప్రవర్తించే శంకర్రావంటే కోపమున్నవాళ్ళూ లేకపోలేదు.  అయితే వాళ్ళందరూ అర్భకజీవులు మా కాలనీలో.  అసోసియేషన్ పెత్తనమంతా శంకర్రావు, ఇంకా అతని బృందానిదే కాబట్టి మెజారిటీ అతని వైపే ఉండేవారు.  మాలాంటి వారు మైనారిటీ వర్గం కిందే లెక్క.  
 
శంకర్రావు ఏ రోజూ లెక్కలు చెప్పిన పాపానపోడు. ‘అన్నా నువ్వేం చెప్పక్కర్లేదు ఎవడికీ’ …. అనే కోరస్ డిజిటల్ సౌండ్ తో వినిపిస్తుంటే అడిగే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది …. చూశారా నా వెంట ఎంతమందున్నారో అనే అతని తిరస్కార చూపు మాకు ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ ఉండేది… ఎప్పుడూ లేంది ఈ సారి సంక్రాంతికి కూడా సంబరాల పందిరేశాడు శంకర్రావు.  రోజూ కాలనీ వాళ్ళతో ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టించాడు … పోటీలన్నాడు …ఈసారి డబ్బుల వసూలు గొడవలేదన్నాడు … అందరూ ఊపిరి పీల్చుకున్నారు … సంక్రాంతి సరదాలంటూ మగవాళ్ళకూ పోటీలు పెట్టాడు.  పోటీలకు వెళ్ళని మాలాంటి వాళ్ళం ఉడుక్కుంటూ కూర్చున్నాం … ప్రతి సంక్రాంతికీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే శంకర్రావు ఈ సారి ఇలాంటి హింస పెట్టాడెందుకా అని మాలో మేం కొట్టుకు చస్తుంటే శంకర్రావు ఎవరితోనో  కొట్లాడుతూ ఉండటం మమ్మల్ని ఉలిక్కిపడేలా చేసింది …
 
సంక్రాంతి పండగ చివరి రోజున అయ్యవార్లను పిలిచి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు శంకర్రావు.  తెల్లటి లాల్చీతో ఎర్రటి బొట్టుతో మెళ్ళో పచ్చని కండువా వేసుకుని కొత్త దేశభక్తుడిలా ధగధగమంటున్నాడు.  ఆ ధగధగలలో ఈ బుసబుసలేమిటా అని చూద్దుము కదా ఒక గంగిరెద్దు వాడితో గొడవపడుతున్నాడు శంకర్రావు.
మేం చూడని శంకర్రావు ఆ అవతారంలో ముక్కంటిలా కాల్చేస్తున్నాడు… దూర్వాసుడిలా దూషిస్తున్నాడు… ఇంతకీ ఆ గంగిరెద్దు అతను కాస్త ఇనాము ఇప్పించు సామీ అని వేడుకుంటున్నాడు …. మరి దానికి ఇంత సీరియస్ అయిపోయి కొట్లాట స్థాయికి ఎందుకొచ్చాడు శంకర్రావు … అర్ధంకాని అయోమయంలో మేమంతా ఉండగా శంకర్రావు తిట్లతోకూడిన గాలి తరంగాలు  దుర్గంధంలా మమ్మల్ని చేరుతున్నాయి.
విచిత్రంగా ఆ గంగిరెద్దు వాడు కూడా తగ్గటం లేదు.  అదే స్థాయిలో నేనేమన్నా దొరా అని శిలా ప్రతిమలా నుంచున్నాడు.  చూసేవాళ్లకు అది వినోద స్థాయిలో ఉందేమో కానీ శంకర్రావంటే కోపమున్న మాకు కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించింది.  ఈలోగా రంకెలేస్తున్న శంకర్రావుని పక్కకు తీసుకెళ్లారెవరో …
 
మాలో ఒకరం కదిలి ఆ గంగిరెద్దు వాడిని సముదాయించి వాడి చేతిలో నూట పదహారు పెట్టి ఇక మమ్మల్ని వదల్రా నాయనా అని బతిమాలాం…
నాకెందుకో చిన్న అనుమానమొచ్చి వాడిని ఫాలో అయ్యాను.  నన్ను గమనించినట్టున్నాడు ఆ గంగిరెద్దువాడు.  నాకో దండం పెట్టాడు.  వాడితో మాటలు కలపటం మొదలుపెట్టాను…
‘ఏ ఊరు స్వామీ మీది ….నీ పేరేంది’
‘పక్కనే మారాజా … ఇక్కడికి 20 కిలోమీటర్లుంటది… నన్ను రాములంటారు’
‘మీరు రోజూ వచ్చివెళ్తూ ఉంటారా’
‘లేదు మారాజా … మా ఊరోళ్లందరం ఒకచోట ఉంటున్నాం కలిసి, పండగ అయినంక ఎల్లిపోతాం’
‘గిట్టుబాటవుతుందా … చూస్తే ఎవరూ ఇస్తున్నట్టులేరు’
‘ఇచ్చే మారాజులు ఇస్తరు సారూ’
ఈ సంభాషణ ఎటూ సాగటం లేదనిపించి అడగదలుచుకున్న విషయం అడిగేశాను.
‘మా శంకర్రావు సారూ ఎందుకో నీ మీద కోపంగా వున్నాడు …. ఆయన ఎవరినీ అట్లనడే … నువ్వు తెలుసా ఆ సారుకి’ అలా చీకట్లో బాణమేసాను కానీ, తగులుతుందనుకోలేదు…
‘నాకెరికే  సారూ,  శంకరన్న అంటాం మేమా సారుని’ అన్నాడు రాములు
‘నువ్వు తెలిస్తే మరెందుకు నీమీద కోప్పడ్డాడు’
‘అదా సార్ … ఆ సారు మా ఊర్లో పొలం కొనబట్టిండు … తక్కువ ధరిచ్చి కొన్నాడు సార్.  ఆ పొలం మా పెదనాయన కొడుకుది… మా MLA సార్ కి చెప్పి బెదిరించాడు … అందుకే ఆయనంటే మా ఊర్లో అందరికీ కోపం’
‘ఆయన ఇక్కడే ఉంటాడని తెలుసా నీకు’ ఆశ్చర్యంగా అడిగాను
‘తెలిసే వచ్చినా సారూ’ …
రాములు ధైర్యానికి నాకు ముచ్చటేసింది.
ఇదా శంకర్రావు అసలు రూపం … ఎందుకో రహస్యం తెలుసుకున్నానన్న సంతోషం కన్నా అన్యాయం చేశాడన్న బాధే కలిగింది…
‘ఆయన నిన్ను గుర్తు పట్టాడా ?’ జాలిపడుతూ అడిగాను…
‘గుర్తు పట్టిండు సార్ …అందుకేగా ఎల్లగొడదామని చూసిండు … అందుకే నేనూ వదల్లే’
ఈ రాములు లాంటి వాళ్లకి ఎలా అర్ధమవుతుంది.  క్రూర జంతువులు బయట ఎక్కడ్నించో రావని, మన మధ్య ఉండే మనుషులే ఆ రూపం దాలుస్తారని ఎలా చెప్పగలుగుతాం అనిపించింది… పర్సుదీసి చూస్తే కొన్ని నోట్లు కనిపించాయి. అవి అతని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాను.  
 
 నిత్యం గంగిరెద్దులా కనిపించే ఈ శంకర్రావు గంగిరెద్దు వేషం వేసుకున్న గుంటనక్క అని ఎలా చెప్పాలి అన్న ఆలోచనలో పడ్డాను.
అప్రయత్నంగా ప్రయాణీకులకు ముఖ్య గమనిక అని రైల్వే స్టేషన్ లో జేబుదొంగల గురించిన ప్రకటన గుర్తుకొచ్చింది.  శంకర్రావు లాంటి వారికి కూడా వర్తించే ఆ ‘గమనిక’ అందరికీ చెప్పాల్సిందే అనుకుంటూ దుఃఖంతో నిండిన మనసును ఊరడిస్తూ ముందుకు సాగాను ….

You may also like

Leave a Comment