Home వ్యాసాలు కుక్కతో మొదలై కుక్కతో ముగిసిన మహాభారత గ్రంథం!!

కుక్కతో మొదలై కుక్కతో ముగిసిన మహాభారత గ్రంథం!!

by N. Uma

ఔనా!!?? అలా ఎలా? అనుకుంటారు సోదరీమణులు కొందరు.

ఔను. అలానే మేము ఇదివరకే చదివాము అంటారు. మరికొందరు తెలియని వారి కోసమే ఈ సేకరణ.

మహాభారతం

ప్రపంచం గుర్తించిన మహాకావ్యం. కులమతాలకు కాలమానాలకు అతీతమైన ఆదర్శ గ్రంథం. వేదవ్యాసుడు 18 పర్వాలలో రాసిన ఈ మహాగ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, కవులు మహా కావ్యమని, ఐతిహాసికులు ‘ఇతిహాసం’ అనీ, పౌరాణికులు ‘పురాణం’ అని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని కొనియాడుతారు. ఈ గ్రంథం వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు తాళపత్రాలపై ‘లక్ష’ శ్లోకాలుగా రచించాడు. దేవతలూ, దేవర్షులూ రాసిన ఈ మహాగ్రంథం (కావ్యం) కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. ఔను ఇది నిజం !! నమ్మశక్యం కాని నిజం.

మహాభారత కథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలయి కుక్కకు జరిగిన సన్మానంతో ముగుస్తుంది. వ్యాసుడు ఎందుకు కుక్కకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? అందులోని దేవరహస్యం ఏమిటి? అందులోని అర్థాన్ని పరమార్థాన్ని నిక్షిప్తంగా దాగి వున్న నిజాన్ని నేను విని మీకు అందిస్తున్నాను.

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు కొంతకాలం హస్తినాపురాన్ని పరిపాలించిన తర్వాత అర్జునుని మనవడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు చక్రవర్తి అవుతాడు. జనమేజయుడు ఒక ‘మహాయజ్ఞం’ చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోనికి దేవతల కుక్క ఐన ‘సరమ’ బిడ్డ ‘సారమేయ’ ప్రవేశిస్తుంది.

సారమేయను చితకబాది జనమేజయుని కుమారులు, బావమరుదులు వెళ్ళగొడతారు. సారమేయ తన తల్లి సరమ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగిన సంగతి చెపుతుంది.

వెంటనే సరమ బిడ్డను తీసుకుని యజ్ఞ ప్రాంగణంలోనికి వచ్చి జనమేజయునితో రాజా నీ కుమారులు నా బిడ్డను అకారణంగా హింసించారు. నా బిడ్డ అంత అన్యాయమేం చేసిందని జరిగింది. జనమేజయుడు తన కొడుకులను పిలిచి విచారించగా యజ్ఞం జరిగే ప్రాంగణంలో కుక్క వస్తే కొట్టక సన్మానిస్తామా? అని పొగరుగా జవాబు చెప్పారు. దానికి తల్లికుక్క సరమ తీవ్రంగా వ్యతిరేకించి రాజా మేము కుక్కలం ఆహారాన్ని ఆశించడం, తిండి ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెదకడం మా స్వభావం. అదిలిస్తే వెళ్ళిపోతాం. ఇంతగా కొట్టడం తప్పుకాదా అని నిలదీసింది. రాజా తప్పు నువ్వు చేసినా నీ బంధువులు చేసినా నువ్వు చేసినట్టే. నువ్వు ఈ దేశానికి చక్రవర్తివి. ప్రజలనే కాదు, సమస్త జీవరాసుల బాగోగులు నువ్వే చూడాలి. ధర్మజ్ఞుడైన ధర్మరాజు మనవడివి. నీ వాళ్ళు అహంకారంతో విచక్షణ కోల్పోయి మూగజీవిని హింసించారు. నా మనసు శోకించింది. నువ్వు అకారణంగా బాధల పాలైతావని సరమ తన బిడ్డ సారమేయను తీసుకుని వెళ్ళిపోయింది.

ఆది పర్వం ప్రథమాశ్వాసంలోని ఘట్టం ఇది.

వ్యాసుడు – రాజులు ఎలా పరిపాలన చేయించాలో కుక్కతో చెప్పించాడు.

ఇక వ్యాసుడు కుక్కకు జరిగిన సన్మానంతో ఎలా ముగించాడో చూద్దాం.

ఈ భూమండలంతో మీ ఋణానుబంధం తీరిపోయింది. మహాప్రస్థానానికి సిద్ధం కండి అని వ్యాసుడు పంచ పాండవులకు ద్రౌపదికి ఆదేశించాడు. నార చీరలు, జింక చర్మాలు ధరించి అంతఃపురాన్ని దాటి పురవీధుల వెంట నడుస్తున్నారు. ఒక ‘కుక్క’ వారిని అనుసరిస్తోంది. ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారంలో వున్న పరీక్షిత్తు మిగతా మంత్రులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనంపారు. భారతదేశ ఉత్తరం దిక్కుగా వారి మహాప్రస్థానం సాగుతోంది. హిమాలయాలు దాటి మేరుపర్వతం చేరుకున్నారు. వారిని కుక్క అనుసరిస్తున్నది. మొదట ద్రౌపది తర్వాత వరుసగా నలుగురు తమ్ములూ తనువు చాలించారు. చివరగా ధర్మరాజు అతనితో కుక్క మేరు పర్వతం చేరుకున్నారు. దేవేంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించాడు.

ధర్మరాజు మొదట కుక్కను రథం ఎక్కించమన్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంతో పుణ్యం చేసివుండాలి. కుక్కలకు స్వర్గలోక ప్రవేశం లేదంటాడు. అప్పుడు ధర్మరాజు మేము హస్తినలో బయలుదేరినప్పుడు ప్రజలు, రాజులు, మంత్రులు, చివరకు నా భార్య తమ్ములు ఒక్కొక్కరుగా నన్ను వదిలేసినా ఈ కుక్క నాతోనే ఇంతవరకూ వచ్చింది. ఏమీ ఆశించకుండా రేయింబవళ్లు నాతోనే వున్నది. ఇంత విశ్వాసం వున్న కుక్క స్వర్గ ప్రవేవానికి అర్హురాలే కదా! నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి ఇంతదూరం వచ్చిన ఈ కుక్కను వదిలి నేను స్వర్గానికి వస్తే అదే పాపం నాకు వస్తుంది కదా ఇంద్రా, అందుకే నేను రాను అంటాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారినాడు.

ధర్మరాజా ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వేదోక్తిని కాపాడిన నువ్వు రక్షించినావు. అదే ధర్మం క్కు రూపంలో వచ్చి నిన్ను ఇంతదూరం వచ్చి రక్షించింది అని దేవేంద్రుడు ధర్మరాజును ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజును కాపాడుతూ చివరివరకూ అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథ ప్రారంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కతో ధర్మరక్షణ ధర్మనిరతిని చెప్పించాడు.

కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను శరీరంతో స్వర్గానికి ధర్మరాజు తీసుకెళ్తానన్నాడని ముగించాడు.

You may also like

Leave a Comment