Home ఇంట‌ర్వ్యూలు రచనను విమర్శ చేయాలంటే లోతుగా అధ్యయనం చేయాలి – ఆచార్య భూమయ్య

రచనను విమర్శ చేయాలంటే లోతుగా అధ్యయనం చేయాలి – ఆచార్య భూమయ్య

by Aruna Dhulipala

2. మీరు ఎంఫిల్ ప్రాచీన సాహిత్యం పైన, పిహెచ్ డి ఆధునిక సాహిత్యం పైన చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
జ.. నేను తీసుకున్న విషయాలు రెండూ పద్యకావ్యాలే. నాకు ప్రాచీన కవిత్వం మీద ఎంత మక్కువో ఆధునిక కవిత్వం పైన కూడా అంతే మక్కువ. పద్యం మీద ప్రేమే ఆ దిశగా ప్రోత్సహించింది. నేను ఎమ్.ఏ తెలుగు చదివిన తర్వాత వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో మొదటిసారి జూనియర్ లెక్చరరుగా చేరాను. ఎంఫిల్ చేయాలనిపించింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పి.జి. సెంటర్ వరంగల్ లో ఉంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లనవసరం లేదు కదా! అటు ఉద్యోగం చేస్తూనే ఎంఫిల్ చేయడానికి అవకాశం ఉంది. కొరవి గోపరాజు “సింహాసన ద్వాత్రింశిక” మీద చేయాలనుకున్నాను. ఈ టాపిక్ ను సూచించింది డా. పాటిబండ మాధవ శర్మ గారు. దానికి సూపర్ వైజర్ కోవెల సుప్రసన్నాచార్య గారు. 1976లో ఎంఫిల్ అయిపోయింది. వెంటనే కాకతీయ యూనివర్సిటీ లో ( అప్పుడే ప్రారంభం అయింది.. తెలుగులో మొదటి రిజిస్ట్రేషన్ నాదే) చేరాను. సుప్రసన్నాచార్య గారే నలుగురైదుగురు భావ కవుల పేర్లను సూచించారు. ఇదీ అని చెప్పలేదు. అందులో నేను నాయని సుబ్బారావు గారిని ఎంచుకున్నాను. దానికి రెండు కారణాలు. మాకు ఎమ్ఏ లో అధ్యాపకురాలు నాయని కృష్ణకుమారి గారు. వారి నాన్నగారే సుబ్బారావు గారు. అందువల్ల ఆ పేరు తెలుసు. ఆమె మాకు బోధకురాలు కావడం వల్ల ఒక ఆత్మీయత ఉంటుంది కదా! ఇది ఒక కారణమైతే అంతకుముందు ఆయన మీద పిహెచ్ డి ఎవరూ చేయకపోవడం రెండవ కారణం. తదనంతర కాలంలో ఎవరికైనా సుబ్బారావు గారి సమాచారం కావాలంటే నా థీసిస్ చూస్తారు కదా! కొరవి గోపరాజు గురించి కూడా అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాక నాయని సుబ్బారావు గారిలో ఇతరులకు లేని ప్రత్యేకత ఏంటంటే ఆయన తన జీవితాన్నే కవిత్వంగా రాసుకున్నారు. గొప్పకవిగా పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు గారిలోను, మహా భావకవిగా పేరు తెచ్చుకున్న కృష్ణశాస్త్రి గారిలోనూ ఇది లేదు. అందువల్ల నేను ఆయన పట్ల ఆకర్షితుడనయ్యాను. ఆయనపై పరిశోధన 1980లో అయిపోయింది. 1981లో అచ్చు వేయించాను. ఎంఫిల్ పుస్తకం 1983 లో అచ్చయింది.

3. మిమ్ములను అంతగా ప్రేరేపితులను చేసిన నాయని సుబ్బారావు గారి భావ కవిత్వ గొప్పదనం ఎటువంటిది?
జ…..ఇంతకుముందే చెప్పాను కదా! నాయని సుబ్బారావు గారు తన జీవితాన్నే కవిత్వీకరించారని. మొదట ఆయన “సౌభద్రుని ప్రణయ యాత్ర” రచించారు( 1922-25 ) ఆయన మేనమామ కూతురు హనుమాయమ్మ. కానీ ఆయన ‘వత్సల’ అని రాసుకున్నారు. మొదట ఆ అమ్మాయిని మేనమామ ఈయనకు ఇస్తాననడం కారణాంతరాల వల్ల నిర్ణయాన్ని మార్చుకోవడం, తిరిగి అంగీకరించడం.. ఇదంతా అభిమన్యుడు, శశిరేఖల పరిణయాన్ని పోలి ఉండడం వల్ల దానికి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య రెండేళ్ల కాలం విరహాన్ని అనుభవించి విరహగీతాలు రాశారు. ఒకచోట కృష్ణశాస్త్రి ఈయనను గురించి రాస్తూ ” కవిత్వం రాయకపోతే ఈయన ఏమై పోయేవాడో ” అన్నారట. తన వేదననంతా కవిత్వం ద్వారా తొలగించుకున్నారు.
వివాహం జరిగిన తర్వాత ఫలశ్రుతి (1926) అని కూడా రాసుకున్నారు. అయితే ఈ ఫలశ్రుతి ప్రబంధ ధోరణిలో కాకుండా ఆధ్యాత్మికమైన స్పర్శతో ఉంటుంది. పెళ్లయిన తర్వాత బీఏ పరీక్షలు రాస్తుండగా పరీక్ష హాలులో మూడు పద్యాలు రాశరట. ఇవి సంయోగ శృంగారాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి.
ఉదా.. “మత్పురానేక పుణ్య జన్మములు పండి/ జాహ్నవీ స్వచ్ఛవును సుధా సాధుమూర్తి/ వైన నీ దివ్య సాన్నిధ్యమందుకొంటి/ పుడమికిన్, స్వర్గమునకొక్క ముడి రచించి…ఇలా అద్భుతమైన భావాన్ని పండించారు.
విశ్వనాథవారు, సుబ్బారావు గారు చాలా సన్నిహితులు. విశ్వనాథ వారు “వేయిపడగలు” లో వీరి వియోగ, సంయోగ శృంగారాల గురించి కిరీటి, శశిరేఖ పేర్లతో కొన్ని పేజీలు ఉపాఖ్యానంగా రాశారు. నేను ఒక ఇంటర్వ్యూలో సుబ్బారావు గారి భార్య వత్సల గారిని ‘ఇది నిజమేనా?’ అని అడిగితే చివరలో వుండే చిన్న కల్పన తప్ప అంతా నిజమే అని చెప్పారు. ఇక సుబ్బారావు గారి తల్లి మేన కోడలు తన ఇంటి కోడలుగా రావాలన్న కోరిక తీరకుండానే మరణించడంతో ఆయన రాసుకున్న పుస్తకం ‘మాతృగీతాలు’. ఇందులో 63 పద్యాలున్నాయి. ప్రతీ ఖండికకు నెంబర్ -1అని పెట్టి మూడు పద్యాలు రాశారు. అందులో “ఒక్క ఏడాది అయినా ఆగకపోతివి” అంటూ తల్లిని గురించిన బాధతో విషాద కావ్యంగా రాసినారు. ఒకటి వియోగ సంయోగ కావ్యం, మరొకటి విషాద కావ్యం. ఈ రెండు కావ్యాలు 1922 – 26 మధ్య వచ్చాయి. ఇవి ఆయనకు గొప్ప భావ కవిగా పేరు తెచ్చాయి. ఆ తర్వాత మూడు దశాబ్దాల వరకు ఆయన రచనలు వెలువడలేదు.
రిటైర్మెంట్ తర్వాత హైద్రాబాదుకు వచ్చి ఆగిపోయిన కవిత్వాన్ని తిరిగి ఆరంభించి 1958లో “భాగ్యనగర కోకిల” రాసారు. ఆ తర్వాత తానెదుర్కొన్న పరిస్థితులను “వేదనా వాసుదేవం” గా రాశారు. దీంట్లో 108 పద్యాలున్నాయి. మకుట నియమం, ఛందో నియమం లేకపోయినా ఇది కొన్ని శతక లక్షణాలతో శతకంగా పేర్కొనబడింది. వేదన అంటే ఒక అర్థం భక్తి అని కదా! తన బాధను చెప్పుకున్నట్టే వుంటూ భక్తి భావంతో ఉంటుంది. అందుకే విష్ణు సహస్ర నామాలలోని వాసుదేవ తత్వం యొక్క ప్రభావం ఉందని థీసిస్ లో రాశాను. నేను రాసిన పుస్తకాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైన కృష్ణకుమారి గారు “మా నాన్నగారు బతికి ఉంటే ఎంత బాగుండు?” అన్నారు.
మరో బాధాకరమైన విషయం సుబ్బరావు గారి ఒక్కగానొక్క కొడుకు హఠాత్తుగా మరణించాడు. అతని పేరు మోహన్ రావ్. ఆ పేరు మీద ఆయన “విషాద మోహనం” కావ్యం రాశారు. 75 ఖండికలు, ఒక్కో దానికి మూడు పద్యాల చొప్పున 225 మధ్యాక్కరలతో రాసిన కావ్యం. నంబర్ -1 అని రాస్తూ 3 పద్యాలు, నంబర్ – 2 అని రాస్తూ 3 పద్యాలు రాసుకుంటూ వచ్చారు. ఆ మూడు పద్యాల్లో ఒకే భావం ఉంటుంది. ఈ కావ్యంలో, ఎవరైనా చనిపోయినప్పుడు మనిషికి ఉండే దుఃఖాన్ని సహజమైన స్థితిలో వర్ణిస్తూ దుఃఖ తీవ్రత, దుఃఖ ఉపశమనం, స్మృతి…ఇలా మూడు దశలుగా చెప్తారు. చివరకు రాసిన పద్యాల్లో విష్ణువును స్మరిస్తూ “లోకానికి శాంతి కలుగు గాక” అనే శాంతివచనాలు ఉంటాయి.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యం రాశారు. వీటన్నింటి గురించి విపులీకరించాను.

ఆచార్య భూమయ్యగారితో ఇంటర్వ్యూ గ్రహీత శ్రీమతి అరుణధూళిపాళ

5. ‘భౌమ మార్గం’ లో వెలువడిన మీ రచనలేవి?
జ. భౌమ మార్గంలో వెలువడిన నా విమర్శ గ్రంథాలు 7. అందులో అయిదు తెలుగు కవిత్వం అయితే 2 సంస్కృతం. 2000 సంవత్సరంలో ఈ వరుసలో నాలుగు పుస్తకాలు అచ్చు అయినాయి. తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో ఒక సెమినార్ జరిగింది. అందులో పాల్గొని “కర్పూర వసంతరాయలు” కావ్యంలోని దాంపత్యంపై పత్ర సమర్పణ చేశాను. ఆ నేపథ్యంలో “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే స్ఫురణ వచ్చింది. లోతుగా పరిశీలిస్తే సినారె గారి ఋతుచక్రం , గుఱ్ఱం జాషువా ముంతాజ్ మహల్ , విద్వాన్ విశ్వం పెన్నేటి పాట మొదలైనవి. వాటిలో సంపత్ అనే కలం పేరుతో శంఖవరం రాఘవాచార్యులు విశ్వనాథ విజయం అనే కావ్యం రాశాడు. చాలా అందమైన కావ్యం. ఇలాంటి కొన్ని కావ్యాలు తీసుకొని వాటిలో దాంపత్యం ఎంత గొప్పగా చిత్రించబడిందో చెప్తూ “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే విమర్శ గ్రంథం రాశాను. మూడవది “కర్పూర వసంతరాయలు- కథా కళాఝంకృతులు”.
ఇందులో కర్పూరవసంతరాయలు గేయ కావ్యంలోని కవితావిశేషాలను వివరించాను. వస్తు స్వీకృతిలో, వస్తు నిర్వహణలో,పాత్రల చిత్రణలో, సన్నివేశ కల్పనలో సినారె గారి ప్రతిభను వివరించాను. ఇక నాల్గవది సురవరం ప్రతాపరెడ్డి గారు 354 మంది కవులతో వెలువరించిన “గోలకొండ కవుల సంచిక” ఆధారంగా “గోలకొండ కవుల సంచిక” రాశాను. 2012 లో “వేమన అనుభవసారం” కూడా ఇదే మార్గంలో రాశాను. ఇందులో 15 శీర్షికలు ఉంటాయి. మానవ జీవితంలోని మంచి చెడులను, మనిషికి ఉండాల్సినవి, ఉండకూడనివి అయిన లక్షణాలను కాచి వడబోసి చెప్పిన కవి ఆయన. ఒక యోగిగా మారితే తప్ప ఆ యోగిని అర్థం చేసుకోలేము. అంతటి తత్త్వవేత్త ఆయన. ..ఇక సంస్కృతంలో శంకరాచార్యులవారి సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల పైన కూడా ఇదే మార్గంలో విమర్శ పుస్తకాలు రాశాను.

6. నాయని సుబ్బారావుగారి రచనల సమాహారంగా ” నాయనితో కాసేపు ” అనే పుస్తకంలో సుబ్బారావు గారి కవిత్వాన్ని గురించి చెప్పిన విషయాలేవి?
జ.. నాయని సుబ్బారావు గారు 1899 లో జన్మించారు. 2000 సంవత్సరంలో ఆయన శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో ఒక వ్యాసం కాకుండా పుస్తకమే రాయాలనిపించింది. దీంట్లో నాయని సుబ్బారావు గారి కృతులన్నిటి గురించి గురు శిష్యుల సంవాద రూపంగా రాశాను. నా పిహెచ్ డి లో ఆయన రాసిన ‘జన్మభూమి’ గురించి ఎక్కువగా రాయలేదు. ఒక చాప్టరుగా రాశాను. అందుకే దాని గురించి సవివరంగా రాయలనుకున్నాను. అంతకు ముందు నేను విమర్శ గ్రంథాలు రాసి, తర్వాత 5 పద్య కావ్యాలు రాశాను కాబట్టి కవిత్వం, దాని శ్రమ అన్నీ అవగతమైనాయి. దానికి తోడు నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా! అందుకే ఈ పద్యకావ్యాల తర్వాత వచ్చిన విమర్శ వినూత్నంగా వచ్చింది. అప్పటి, విమర్శకు, తర్వాతి విమర్శకు మధ్య ఉన్న శైలీ పరమైన తేడాను గుర్తించారు కాబట్టే చేకూరి రామారావు గారు భౌమమార్గం అన్నారు. అదేంటంటే ఎమ్ ఏ చదివిన విద్యార్థులు పి హెచ్ డి కోసం ఏ టాపిక్ రాయాలనే దాని కోసం మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అలా వచ్చే స్టూడెంటును కల్పన చేసుకొని అతని చేత ప్రశ్నలు వేయించు కున్నట్టుగా నేను ఈ విమర్శ రాయడం మొదలు పెట్టాను. దీంట్లో సీరియస్ నెస్ ఉండదు. కవిత్వం యొక్క అందచందాలు చెప్పటమే ఉద్దేశ్యం. పాఠకుడిని కవికి దగ్గర చేయడం ప్రధానం. ప్రశ్న జవాబుల పద్దతిలో రెండూ నేనే అయి చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పడం.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యంగా రాశారు…. “ఇతర జనపదముల నేను ప్రవాసినై/ మరచి యైన మేను మరచి యైన/ కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు /లుంచి యెపుడు పవ్వళించ లేదు” అంటారాయన. ఊరిమీద ఆయనకున్న అపారభక్తికి తార్కాణమిది. ఇందులో 5 ఖండాలుంటాయి. 1. ప్రకృతి ఖండం 2. తటాక ఖండం 3. ధరణిధర ఖండం 4. శివ ఖండం 5. శక్తి ఖండం. ఊళ్ళో ఉన్న ఆలయాల్లో కొన్నింటికి పూర్వగాథలు సేకరించి రాశారు. ధరణి ధర ఖండంలో కొండపై వెలసిన నరసింహ స్వామి, శక్తి, శివ ఖండాల్లో అమ్మవారి, శివునికి గల కథలను ప్రత్యేకంగా చెప్పడం ద్వారా వైష్ణవ, శాక్తేయ, శైవ సంప్రదాయాలను ఆయన వివరించినట్టు తెలుస్తుంది. కవిత్వంలో తప్పిపోయి కూడా విదేశీయత ఉండదు. ఆయన వర్ణనలన్నీ ప్రకృతికి, భారతీయతకు, సనాతన వైదిక ధర్మాలను కలుపుతూ ఉంటాయి..
ఉదా.. మర్రిచెట్టు మధ్యలో తాటి చెట్లను వర్ణిస్తూ “ఈ మర్రిచెట్టు కొమ్మలు శివుడు తాండవం చేస్తుండగా ఊగిన జడలు” అంటారు. తాటిచెట్టును త్రిశూలంగా వర్ణిస్తారు. అంతటి గొప్ప భావుకత ఆయనది. నాయని గారి రచనలన్నింటినీ ఇందులో వివరించినా జన్మభూమి గురించే 60 పేజీలు రాశాను.

7. ” తెలంగాణా భావ విపంచిక” గా మీరు రాసిన “గోలకొండ కవుల సంచిక ” కు ప్రేరణ ఏమిటి?
జ. సురవరం ప్రతాపరెడ్డి గారు నడిపిన పత్రిక ‘గోలకొండ’ మన ప్రాంతాన్ని నిజాం స్టేట్ అనేవారు. అప్పుడు తెలంగాణా జిల్లాలతో పాటు గుల్బర్గా, రాయలసీమ, పక్కన కన్నడ దేశంలో ఉండే 2, 3 జిల్లాలు, మహారాష్ట్రలో కలిసిన దౌలతాబాద్, ఇంకో రెండు, మూడు జిల్లాలు మొత్తం 10 జిల్లాలు కలిపి గోలకొండ అనేవాళ్ళు. 1934 వ సంవత్సరంలో ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ప్రతాపరెడ్డి గారికి ఒక వ్యాసం పంపుతూ ప్రాసంగికంగా “నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం” అని రాసినాడు. రాయడం తప్పే అయినప్పటికీ అందరూ అనుకుంటున్న విషయం అదే కదా! అధికార భాష ఉర్దూ. తెలుగు పాఠశాలలు లేవు. అలాంటప్పుడు కవులు ఎలా ఉంటారు? అని వాళ్లకున్న దురభిప్రాయం. ఆంధ్ర కూడా ఇందులో కలిసి లేదు. ఆ మాటలు సురవరం ప్రతాపరెడ్డి గారిని బాగా కదిలించాయి. దీన్ని సవాలుగా తీసుకొని పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. “వచ్చే దీపావళి ప్రత్యేక సంచిక. కవుల గురించి వేస్తున్నాము. ఇందులో ఎవరైనా ఆధునిక కవులు పద్యాలైతే 5, కథాత్మకంగా పద్యాలు రాస్తే 5 పేజీలు మించకుండా పంపండి” అని, 1900 సంవత్సరం పిదప పుట్టిన వాళ్ళందరినీ నేను ఆధునికులు అనుకుంటున్నాను. దాని ప్రకారంగా పుట్టిన వాళ్ళంతా పద్యాలు పంపండి. దాంతో పాటు, ఊరు, బిరుదులు, రాసిన పుస్తకాలు, ఏ జిల్లా, ఏ కులం…ఇవన్నీ రాయమన్నారు. వాటికొక లిస్టు కూడా ఇచ్చారు. దానికి వచ్చిన స్పందన అమోఘం. వచ్చిన వాటన్నింటినీ జిల్లాలు, కులాల వారీగా చేరుస్తూ 354 మంది కవులతో “గోలకొండ కవుల సంచిక” తయారు చేశారు ప్రతాపరెడ్డి గారు. ఇందులో పదిమంది కవయిత్రులు కూడా ఉన్నారు. నాటి తెలంగాణా స్థితి గతులకు దర్పణం ఈ పుస్తకం.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ వారు సురవరం
ప్రతాపరెడ్డి గారి మీద ఒక సెమినార్ తలపెట్టారు. అప్పుడు నేను వరంగల్ లో ఉన్నాను. ఆయన రచించిన అనేక విషయాల పైన మాట్లాడడానికి ఒక్కొక్కరు సిద్ధం చేసుకున్నారు. గోలకొండ కవుల సంచిక జనాలకు పరిచయమే లేదు. ఆ సెమినార్ ను నిర్వహించింది ఎల్లూరి శివారెడ్డి. ఆయన కూడా మహబూబ్ నగర్ వాడే అవడం వల్ల అభిమానంతో సెమినార్ నిర్వహించారు. “గోలకొండ కవుల సంచిక”
పైన 10, 12 పేజీల వ్యాసాన్ని సెమినార్ లో చదివాను. ఈ వ్యాసం రాసిన తర్వాత అది నన్ను వెన్నాడి పుస్తకం రాసేదాకా వదిలి పెట్టలేదు. అలా గోలకొండ కవుల సంచిక కూడా నాదైన విమర్శశైలిలో రూపు దిద్దుకుంది. ప్రతాపరెడ్డి గారి కవితా సంకలనం గురించి నేను రాసినదే మొదటి విమర్శ గ్రంథం.

9. ‘మాలపల్లి’ నవలను కేవలం దాంట్లోని రెండు గీతాల ఆధారంగా “అభ్యుదయ మహా కావ్యం”గా నిరూపించానని చెప్పారు…అందులో ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి అభ్యుదయభావాలు ఎటువంటివి?
జ: ‘మాలపల్లి’ నవల నేను ఎంఫిల్ చేస్తున్నప్పుడు చదివాను. వేయిపడగలు రాస్తున్నప్పుడే దీన్ని కూడా రాయాలనే సంకల్పం కలిగింది. 1992 లో నేను రాస్తున్నప్పుడు అంతకుముందు నేను దీని గూర్చి రాసిన పేజీలు దొరకలేదు. దొరకక పోవడం మంచిదయింది… (నవ్వుతూ). ఈ మధ్యకాలంలో నా ఆలోచనలు మారాయి. నా విమర్శకు బలం వినూత్నంగా ఆలోచించడమే. ఇందులో ఆయన రెండు గీతాలు రాశారు. ఒకటి భారతదేశ కులవ్యవస్థకు సంబంధించినదైతే మరొకటి దేశ ఆర్థిక దుస్థితి గురించి. ఇందులో అగ్రవర్ణాలకు, బడుగు వర్గాలకు మధ్య ఉండే ఇబ్బందుల్ని చిత్రించడం ఒకటైతే…రష్యాలో వచ్చిన బోల్ష్ విక్ ఉద్యమం (1917) రెండవది. ఉన్నవాళ్లను దోచి లేనివాళ్లకు పెట్టి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ఇందులో ప్రధానం. సమానత్వం కోసం విప్లవం జరిగి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ‘ఇజం’ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అప్పుడంతా రాజరికమే కాబట్టి ప్రజల తిరుగుబాటు వలన రాజరికం నశించి ఇలాంటి ప్రభుత్వం ఏర్పడడం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యమాలు రావడం వేరు. దానివల్ల రాజరికం నశించడం విశేషం కదా! ఆ ఉద్యమాన్నే ఒక పాత్ర ద్వారా ఇందులో ప్రవేశ పెట్టారు లక్ష్మీ నారాయణ గారు.
భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యల ఆధారంగా అంత పెద్ద నవలను రాశారు. కులవ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘చరమగీతం’ అని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘సమతాధర్మం’ అని పేర్లు పెట్టారు. 1917 లో రష్యాలో విప్లవం వస్తే మాలపల్లి నవల 1922లో వచ్చింది. అంత తొందరగా ఆయన ఆ ఉద్యమం చేత ఆకర్షించబడ్డారు. ఒక దళితుడిని కథా నాయకునిగా పెట్టి నవల రాయడం అంతకు మునుపు ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైన చర్య. ఈరెండు గీతాల వ్యాఖ్యానమే ఈ నవల. అభ్యుదయం అంటే ఉన్నతమైన భావాలతో సమాజం అభివృద్ధి చెందడమే కదా! అందుకే దీన్ని నేను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. ఈ అభ్యుదయ కవిత్వాన్ని మార్క్సిజం భావాలతో మొదట రాసింది శ్రీ శ్రీ అని చెబుతున్నారు. అట్లా కాదని ఉన్నవ గారి గీతాన్ని ఉదాహరణగా చూపుతూ ఒక వ్యాసం రాశాను. ఆ గీతంలో ఒకచోట ఉన్నవ లక్ష్మీ నారాయణ రావు గారు “తిరుగుబాటు చేయండి” అని అంటారు. 1922 లోనే ఆయన ఈ మాట అనగలిగారు. శ్రీశ్రీ మహాప్రస్థానం 1934 నుండి వచ్చిన కవితలు. కాబట్టి మాలపల్లి నవలను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. నా పుస్తకంలో రెండు వ్యాసాలుంటాయి. ఆయన గీతాలకు సంబంధించినది ఒకటి. ఆయనే మొదటి అభ్యుదయ కవి అని చెప్పేది మరొకటి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక మహానుభావుడు నా పుస్తకాన్ని చదివి ఇది అభ్యుదయ మహాకావ్యం అని కాకుండా “తొలి అభ్యుదయ మహాకావ్యం” అనవలసింది అన్నారు.

10.కట్టమంచి వారి “ముసలమ్మ మరణం” కావ్యాన్ని తొలి ఆధునిక కావ్యంగా ఎలా నిరూపించారు? అంతకు ముందున్న కావ్యాలకు, దీనికి గల భేదం ఏ అంశాలకు సంబంధించినది?
జ: “ముసలమ్మ మరణం” గురించి రాయడానికి మొదటి ప్రేరణ ఏంటంటే వరంగల్ రేడియో స్టేషన్ వాళ్ళు ఈ కావ్యం మీద ప్రసంగం చేయమన్నారు? ప్రసంగం చేసిన సమయం 11 నిమిషాలే. కానీ అది నన్ను వెన్నాడింది. దాని మీద ఇంకా రాయాలనిపించింది. దీనిమీద నాలుగు వ్యాసాలు రాసి ఆంధ్రభూమి పత్రికకు పంపించాను. వాళ్ళు వరుసగా ప్రచురించారు. అయితే పుస్తకం రాయడానికి ఇంకో కారణం ఉంది. సినారె గారి సిద్ధాంత గ్రంథం “ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు” ఆధునిక విమర్శ చేసేవాళ్ళు తప్పనిసరిగా చదవవలసిన గ్రంథం. దీంట్లో ఆయన ముసలమ్మ మరణాన్ని మొదటి కావ్యం అని చెప్పలేదు. అరుణోదయం అని, వేగుచుక్క అని ప్రశంసించారు. కానీ ఆధునిక కావ్యమని రాజముద్ర వేసింది రాయప్రోలు వారి తృణకంకణానికే.. సినారె గారు భావ కవిత్వానికి లక్షణాలు చెబుతూ వస్తువు,భావం,రచన…ఈ మూడింటిలో నవ్యత ఉన్నప్పుడే అది ఆధునిక కావ్యం అన్నారు. ఇదే విషయాన్ని అంతకు ముందు చెప్పినవారు కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు. ఆయన తన “నవ్యాంధ్ర సాహిత్య వీధులు” పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వీరికంటే ముందు చెప్పినవారు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు”నాచన సోముని నవీన గుణములు” అనే వ్యాసంలో ప్రాస్తావికంగా కవిత్వానికి మూడు అంగాలు ఉంటాయని అన్నారు. రచన వస్తువుకు, వస్తువు భావానికి ఒదిగి ఉన్న కవిత్వమే రస ప్రధాన కావ్యంగా ఉంటుందని రాళ్లపల్లి వారు సిద్ధాంతీకరించారు. ఈ మూడింటిని ఆధునిక కవిత్వానికి ఆపాదించుకుంటూ రచనా నవ్యతకు ఆద్యుడు గురజాడ అని, భావ నవ్యతకు రాయప్రోలు అని అన్నారు. అక్కడే పడింది నా కన్ను. ఇది కాక రాయప్రోలు సుబ్బారావు గారికి కట్టమంచి రామలింగారెడ్డి గారు అనుయాయులు అన్నారు. అక్కడ నాకు మరో ఆలోచన తట్టింది. కట్టమంచి వారు తాను 1899 లో బీఏలో ఉండగా పోటీ కోసం రాసిన కావ్యం “ముసలమ్మ మరణం” కావ్యం. ఇది 1900 సంవత్సరంలో అచ్చు అయింది. రాయప్రోలు సుబ్బారావుగారు ‘తృణకంకణం’ రాసి కట్టమంచి వారి దగ్గరకు వెళ్లి చదివి వినిపించాడన్నది అందరికీ తెలిసిందే. అదీకాక ముత్యాల సరాలు వచ్చింది 1909లో. తృణ కంకణం వచ్చింది 1913లో. కట్టమంచివారి కావ్యం వస్తు నవ్యతతో కూడుకొన్నది. అంతకుముందు విషాదాంత కావ్యాలు లేవు మనకు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ అది. లార్డ్ మెకంజీ సేకరించిన కైఫీయత్ లో ఉన్న కథ. గ్రామ క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన బసిరెడ్డి చిన్న కోడలు ముసలమ్మ కథ. ఆధునిక కవిత్వంలో కథా నాయిక మరణాన్ని నవ్యతగా నిరూపించాను. ఎందుకంటే అంతకు మునుపు లేనివిధంగా ఇదే క్రమంలో గురజాడ వారి పూర్ణమ్మ, దువ్వూరి వారి నలజారమ్మ, రాయప్రోలు వారి స్నేహలత విషాదాంత కావ్యాలు ముసలమ్మ మరణాన్ని అనుసరిస్తూ వచ్చినవే.
ఆద్యుడు అని ఎందుకు పెట్టానంటే ఆయన కవిత్వానికే కాదు విమర్శకు కూడా ఆద్యుడే. నేను రాసిన పుస్తకంలో మొదటి వ్యాసం ముసలమ్మ మరణం అయితే రెండవ వ్యాసం కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారానికి సంబంధించినది. “ఆద్యుడు కట్టమంచి” పుస్తకానికి మా గురువు గారు సి.నారాయణరెడ్డి గారితో ముందుమాట రాయించాను. మొత్తం చదివి ఒక పేజీ రాశారు. “భూమయ్య తన వాదాన్ని ఎదుటి వారిని నొప్పించకుండా, అతి జాగ్రత్తగా తనదైనటువంటి భావాన్ని సుతారంగా ప్రవేశపెడతాడు” అని రాశారు. రేడియోలో పనిచేసే నాగసూరి వేణుగోపాల్ అనే ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఒక వ్యాసం ‘మెత్తని పులి’ అనే పేరుతో రాశాడు (నవ్వేస్తూ).

11. మధునాపంతుల సత్యనారాయణ గారి ఆంధ్రపురాణాన్ని “భారతీయ సంసృతీ వైభవం” గా రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: మధునాపంతుల సత్యనారాయణ గారు ఆంధ్రుల చరిత్రను శాతవాహనులు మొదలుకొని దక్షిణాంధ్ర దేశాన్ని పరిపాలించిన నాయక రాజుల వరకు మొత్తం 9 విభాగాలుగా చేసి వాటికి పర్వాలు అని పేరు పెట్టారాయన. మొదటి భాగానికి ‘ఉదయపర్వం’ అన్నారు. ఆంధ్రుడికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు ఏ పురాణంలో కనిపిస్తున్నాయో అన్నీ వెలికితీసి ఉదయపర్వంలో రాశారు. ఏడు, ఎనిమిది వందల సంవత్సరాల్లో పరిపాలించిన తెలుగు రాజవంశాల చరిత్ర ఇది. చరిత్రను కావ్యంగా మలిచారు. ఒక్కో రాజవంశంలో ఎంతోమంది పరిపాలిస్తారు. అందులో ఎవరు గొప్పవారనే విషయాన్ని గ్రహించి రాయడంలోనే ఆయన ప్రతిభ వ్యక్తమవుతోంది. ఉదా.. కాకతీయ వంశం తీసుకుంటే గణపతిదేవ చక్రవర్తి, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి..ఇలా ప్రముఖులు కనిపిస్తారు…లోతుగా పరిశీలిస్తే వైదిక ధర్మానికి సంబంధించిన యజ్ఞ యాగాదులు, ఆలయాలు ఇట్లా ధార్మిక పద్ధతిలో పాలన చేసినవారిని ఆయన తీసుకున్నారని అవగతమవుతుంది. పురాణ లక్షణాలైన సర్గ, ప్రతిసర్గలు ఇందులో లేవు కానీ ‘వంశానుచరిత’ లక్షణ ప్రధానంగా రాశారు.
నాకొక ఆలోచన వస్తే తప్ప పుస్తకం రాయను. పాయింట్ దొరికితే తప్ప వ్యాసం రాయాలనుకోను. అలాగే దీని గురించి రాయడానికి కూడా నేపథ్యం ఉంది. శాస్త్రిగారు మరణించాక వారి కుటుంబీకులు ప్రతీ ఏటా ఆయన జయంతికి ఒక పండితుని పిలిపించి శాస్త్రిగారి గురించి ఉపన్యాసం ఇప్పించి సత్కారం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పదవ సంవత్సరంలో నన్ను పిలిచారు. అది రాజమండ్రిలో జరిగే సభ. శాస్త్రిగారు రాజమండ్రి వాస్తవ్యులు. వారి జీవితమంతా అక్కడే గడిచింది. ఆయనకు ఎంతోమంది శిష్యులు కూడా ఉన్నారక్కడ. నేను ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఆ సభాధ్యక్షుడు, శాస్త్రిగారి తమ్ముడు సూరయ్య శాస్త్రిగారు ” ఈ కావ్య రచనలో మా అన్న ఇన్ని రహస్యాలు పెట్టినాడా? మళ్లీ ఒక్కసారి దీన్ని నేను చదవాలి” అన్నారు ఆశ్చర్యపోతూ. ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెబుతుండగా ‘ఆంధ్రపురాణం’ రాసింది ఈయనే. అలాగే ధూళిపాళ మహాదేవమణి అనే పండితుడు రాజమండ్రిలో ఉన్నాడు.”చాలా బాగా మాట్లాడారని” నన్ను ప్రశంసించారు. నాకు కవిత్వం ద్వారా పరిచయమున్న సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ సభలో. ఆయన “బాగా మాట్లాడినారని” మెచ్చుకున్నారు. వీరు ముగ్గురి మాటలు విన్న తరువాత, ఆంధ్రపురాణంలో వీళ్లకు కూడా తెలియని ఏదో ప్రత్యేకత ఉందని నాకర్థమైంది. దాంతో మొత్తం మళ్లీ చదివి పుస్తకం రాశాను.
దీన్ని నేను భారతీయ సంస్కృతీ కోణంలో చూశాను. అందుకే “భారతీయ సంస్కృతీ వైభవం” అని పేరు పెట్టాను. శాస్త్రిగారు శాతవాహనులతో కాకుండా ‘ఉదయపర్వం’తో ప్రారంభించారు. పురాణంలో పుట్టిన ‘ఆంధ్ర’ శబ్దమాధారంగా కథ ఉంటుంది. సంతానం లేని రాజుకు వరుణదేవుని అనుగ్రహం వల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు. అంటే దీని అర్ధం భగవంతుని అనుగ్రహం వల్ల జన్మ కలుగుతుందనే కదా! చిట్టచివరి నాయక రాజులను వివరిస్తూ…ఆ రాజుకు అన్నదానం చేయడం ఎంతో ఇష్టమైన సత్కార్యం. ఇలాంటి ధార్మికమైన పనులు రాజ్యాన్ని సంక్షోభం లోంచి బయటపడేస్తాయి. గ్రంథం చివరి భాగానికి “ముక్తామణి దర్శనం” అనే ఉప శీర్షిక ఉంటుంది. కావ్యం మొత్తంలో మధ్యలో ఒకచోట అమ్మవారి ముక్కుపుడక మాయమయిందని చెప్పి, “ముక్తామణి దర్శనం”లో అది దొరికిందని కవి అందమైన పద్యాల్లో రాశారు. రాజవంశాలన్నీ వేరు వేరుగా ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. అందువల్ల నాకు, ఈ కావ్యానికి కథా సూత్రం ఎట్లా తయారు చేయాలని ఆలోచిస్తే ‘ఆంధ్రుడు’ అన్న దగ్గర సమాధానం దొరికింది. ఈ రాజవంశాలన్నింటికీ ‘ఆంధ్రుడు’ అనేదే సంకేతం. ఉదయపర్వం అంటే ఆంధ్రుడు ఉదయించాడు అన్నదే. అక్కడ ఏ రాజవంశాలతో పని లేదు. పాలనంతా చేసింది ఆంధ్రులే అయినప్పుడు ఆంధ్రుని యొక్క పురాణమనే కదా అర్థం. ఆంధ్రరాజుల పురాణం కాదు. చివర్లో ముక్తామణి దర్శనం కలగడం అంటే నాకు అది ‘ఆత్మదర్శనం’ అని స్ఫురించింది. ఉపనిషత్తులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం యొక్క ప్రభావమది. ఆత్మదర్శనం తోనే కావ్యాన్ని ముగించారాయన. జీవితానికి కావలసింది అదే కదా! ఈ ఆంధ్రుడు ఆత్మ దర్శనం పొందడానికి కారణాలు ఏంటంటే వైదిక మార్గంలో సాగడం. అంటే వ్యక్తి వైదిక మార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్న పాయింట్ నాకు దొరికింది. మధ్యలో వైదిక ధర్మాలకు సంబంధించి, యజ్ఞ యాగాదులు చేసిన వారిని గురించి ఉంటుంది. దీన్నిబట్టి మొదటగా భగవంతుని అనుగ్రహం వల్ల పుట్టిన మనిషి వైదిక ధర్మమార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్నది సారాంశం.

ఆచార్య భూమయ్య రచించిన పుస్తకాలు

12. పల్లా దుర్గయ్య గారి “గంగిరెద్దు” కావ్యం మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి?
జ: తెలంగాణ జీవితాన్ని చిత్రించే కావ్యం ‘గంగిరెద్దు’. మనకు సంక్రాంతి పర్వదిన సమయంలో కనిపిస్తుంది. ఎద్దే కానీ గంగిరెద్దు ఎలా అయ్యిందన్నది ఇందులోని ఒక పాయింట్. గంగి అంటే పూజ్యమైన అని అర్థం కదా! దున్నుతున్న ఎద్దు పూజనీయం కాదు. గంగిరెద్దు పూజింపబడేది. ఆయన టీచరు కాబట్టి తెలివి తక్కువ పిల్లలకు చదువు చెప్పడం ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ఒక పశువును గంగిరెద్దుల వాడు ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దాడన్న విషయాన్ని ఆయన రాసిన తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. 400 పై చిలుకు పద్యాల అద్భుత కావ్యమిది. ఇందులో కవి పేదవారైన కాపువాడు, గంగిరెద్దుల వాడు ఎలాంటి స్థితిని అనుభవిస్తుంటారో తెలుపుతూ కోడెదూడ గంగిరెద్దు కావడానికి నేర్చిన విద్య, గంగిరెద్దు యొక్క పూర్వపు రెండు జన్మలు, ఒక జంతువు, మనిషి వల్ల పడ్డ కష్టాలను ఎంతో హృద్యంగా వివరిస్తారు.
పల్లా దుర్గయ్య గారు ఈ కావ్యం ద్వారా ఒక గంగిరెద్దు ఆవేదనను, దాని జీవితాన్ని, అందులోని మూడు దశలను అద్భుతంగా వర్ణించారు. ఇది ఆయన కవితాత్మకతకు నిదర్శనం. మూగ ప్రాణిలోని ఆవేదనను పరోక్షంగా దర్శించి, దాన్ని మనకు అనుభూతి చేయించడం నన్ను బాగా ఆకట్టుకుంది.
ఒక వికృతమైన ఆకారంతో పుట్టి, వ్యవసాయానికి పనికి రాని ఎద్దు అందరిచేత పరిహసింపబడి తిరిగి వాళ్ళచేత పూజలందుకున్నట్లు ఉదాత్తంగా చిత్రించారు దుర్గయ్య గారు. అలా వికృతంగా పుట్టడానికి ముందు రెండు జన్మలు కారణమయ్యాయి. మొదటి జన్మ ఆవుగా పుట్టడం, రెండో జన్మలో ఎద్దులా పుట్టడం.. కానీ ఈ రెండు జన్మలో అది అనేక కష్టాలను అనుభవించింది. ఇక మూడవ జన్మలో రెండు తోకలు, మూపురంపైన ఒక కాలుతో వికృతంగా కోడెదూడగా పుట్టింది. దాన్ని చూసి వ్యవసాయానికి పనికిరాదని కాపు వేదన చెందుతాడు. దూడ తల్లి కూడా ఆవేదనతో మరణించింది. ఒకవైపు అనాథగా మారడం, మరోవైపు అందరి అవహేళనలకు గురికావడం, తన యజమానికి తను ఏ రకంగానూ ఉపయోగ పడకపోవడం..వీటితో నిరాశకు గురి అయిన దూడ ఇంటినుంచి పారిపోతుంది. గమ్యం లేకుండా తిరుగుతూ ఒక మర్రిచెట్టు నీడలో నిద్రిస్తూ ఉంటే గంగిరెద్దుల వాడు దాని ప్రత్యేక ఆకారాన్ని చూసి తీసుకుపోతాడు. తన తెలివితో దానికి మరో ఆవు చేత శిక్షణ నిప్పించి గంగిరెద్దుగా మారుస్తాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న గంగిరెద్దును ఊళ్ళు తిప్పుతూ దాని స్వంత ఊరుకు తీసుకొస్తాడు. కాపు దాన్ని చూసి గుర్తుపట్టినా తాను చీదరించుకున్న దూడను గంగిరెద్దుల వాడు తీర్చిదిద్దిన వైనానికి ఆశ్చర్య పోతాడు.. చివరకు కాపుతో పాటుగా ఊరంతా దానికి పూజలు చేస్తారు..
ఇందులో ఆయన దాన్ని కవిత్వీకరించిన తీరు అనన్య సామాన్యం. ” ముందు చన గోయి, వెనుకకు బోవ నూయి/ మోట పని యెద్దులకు చాల మోసమమ్మ”… “ముక్కునకు త్రాడు బిగియించె, ముందు వెనుక/ కాళ్ళు బంధించి, నాల్గు డెక్కలకు నినుప/ నాడె ములు గొట్టె”…..” మొద్దు చుట్టుగ దిరిగెడు ప్రొద్దులందు/ కాశికిం జేరుదుము చక్కగా నడిచిన”…..” ఆ యెండ దెబ్బ కోర్వక/ కాయం బుడుకెత్త, కాళ్ళు కంపింపగా”…..ఇలాంటి పాదాలు ఎద్దు ఆవేదనకు అద్దం పడతాయి. చివరగా ” కావున,నాట్య కళా పుం/ భావ గిరాందేవియైన పశువు బసవడై/ ఏ వృషమును, నర
పశువును/ భావింపగ రాని గౌరవం బంది కొనెన్”…అంటూ ఎంత పూజనీయంగా మారిందో చెప్తారు. ఒక ఉపాధ్యాయునిగా.. ఒక్కొక్కప్పుడు తెలివితక్కువ పిల్లలు ఇంట్లో తిడుతుంటే ఇంట్లో నుండి పారిపోవడాన్ని దూడ పారిపోయినదానికి అన్వయిస్తారు. సరియైన గురువు ఉంటే విద్యార్థులు రాణిస్తారని, గంగిరెద్దులవాడు దేనికీ పనికిరాని జంతువును పూజనీయంగా మార్చిన పద్ధతిని అన్యాపదేశంగా చెప్తారు.

14. భక్తి రస ప్రవాహాలైన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల గురించి కూడా మీ మార్గంలో ఎలా రాయగలిగారు?
జ: సంస్కృతం అంటే నాకు ఎంతో అభిమానం. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాలకు పలువురు పండితులు టీకా తాత్పర్యాలు రాసినారు. సౌందర్యలహరిలోని తాత్త్వికతతో పాటు కవితా విశేషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది సామాన్య జనులు అందుకోవాలంటే సరళమైన వచనంలో రాయాలి. దానికి మళ్లీ నా మార్గాన్నే ఎన్నుకున్నాను. ఒక విద్యార్థిని ఊహించుకొని , ప్రతిరోజూ ఆ విద్యార్థికి పది శ్లోకాలు చెప్పినట్టు, ఒకటవరోజు, రెండవరోజు అని చెబుతూ పదిరోజుల్లో వంద శ్లోకాలు చెప్పినట్టు రాశాను. కేవలం తత్త్వం మాత్రమే చెప్తే కుదరదని ఇందులో భక్తి అంశంతో పాటు కవిత్వ సొబగులను వివరించాను. “సౌందర్య లహరి – భావ మకరందం” అనే పుస్తకం రాశాను. 2013లో ముద్రితమైంది.
శివానందలహరిని కూడా ఇలాగే రాయాలనుకున్నాను. 100 శ్లోకాలు పూర్తి చేశాను. 2018లో పూర్తి అయింది. రెండూ వేరు వేరు అయినా ఆ రెంటినీ కలిపి “శివ సౌందర్యలహరి” పేరుతో 2019లో ఒక సంపుటంగా వేశాను.

15. మీ మొదటి కావ్యం “వేయినదుల వెలుగు” దేన్ని చిత్రిస్తుంది?
జ: ఆ కావ్యం పేరు అందులో రాసినటువంటి పద్యాల్లోని ఒక పాదం. ‘దేవి’ అని పెట్టాలనుకున్నాను. ప్రతీ పద్యంలో దేవి అని వస్తుంది. శతక మకుటంలా కాదు. పద్యం మొత్తంలో ఒకచోట వస్తుంది. ఇదంతా భక్తి రస ప్రాధాన్యమే. పురాణ గాథే. కానీ “కనికరింతువే నాకొక్క పనిని చెప్పి” అన్నాను. అంటే ఆమె అనుగ్రహం కావాలనే కదా!”వరములిమ్మని వారలెవ్వరి అడుగున పడనె లేదు నేనింతవరకు…నీ అభయవర పదమ్ముల నమ్మి” అంటూ విన్న విషయమే అయినా దాన్ని నాదిగా చేసుకొని నేను ఆ భావంలో మమేకమై రాశాను. ” దేవి! నీ పాద నఖ దీధితి నిశిత శర జాలము కురిసి రాక్షసి చచ్చి చెడును” అంటే అమ్మవారిని నమ్ముకోవడం వల్ల ఇలాంటి కృపకు పాత్రులవుతామని చెప్పడం..ఇలా ఇందులో భక్తి భావమే గోచరిస్తుంది. “దేవి ! ఈ జలపాతపు తీవ్రమైన ధాటి ఇది ఎక్కడిది? నేను తట్టుకొనకపోయితిని గదే.. ఇందుండి పుట్టి వచ్చి నన్ను తాకినది ఒక వేయి నదుల వెలుగు” అని ఒకచోట రాశాను. జలము నుండి విద్యుత్తు పుట్టినట్టు అది ఒక కిరణ రేఖ కాదు. ఒక నది అంత వెలుగు కాదు. వేయినదులు ఒక్కసారి వెలుగుగా ప్రసరిస్తే ఎట్లా ఉంటుంది? అమ్మవారిని గురించి వర్ణించేటప్పుడు శతకోటి సూర్య తేజముల వెలుగు అంటారు. ఇలా కవితాత్మకమైన పాదం రావడం వల్ల దీనినే కావ్యానికి పేరుగా పెట్టడం జరిగింది. దీన్నే మొదటి పద్యంగా పెట్టుకున్నాను. 1992లో నా విమర్శ కావ్యాలు అచ్చు కాగానే 1993లో ఈ పద్య కావ్యం రాయడం జరిగింది. ఇది 1994 లో అచ్చు అయ్యింది. దీనికి ముందు మాట రాస్తూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు ” మాతృ శిశు సంబంధం లాగా ఉన్నాయ” ని ప్రశంసించారు. అమ్మవారిని భయంతోనో, భక్తితోనో కొలవలేదు. సాక్షాత్తు నా తల్లిలా,వాత్సల్య మూర్తిగా కొలిచాను. “దేవి! నీ పాదరజమింత తీసి నా నుదుట తిలకము దిద్దగా తోచె, కవిత యను మరాళమొకటి నీ వదన విశాల గగనమందున తెల్ల రెక్కలను విప్పి” కవిత్వం నీ వల్ల వచ్చిందని చెప్పుకోవడం. దీంట్లో కొన్ని సౌందర్యలహరి భావజాలంతో వచ్చిన అనువాదాల్లాగా ఉంటాయి. చివరలో అమ్మవారి నామ స్మరణతో చేసిన పద్యాలు కూర్చాను. ఇట్లా నామాలు, శ్లోకాల భావాలు నాకు పద్యాలైనాయి..

16. “వెలుగు నగల హంస” కూడా ఇదే క్రమంలో వచ్చిన కావ్యమేనా?
జ: అవును. దానికి వెనువెంటనే ఆరు మాసాల వ్యవధిలో 1995 లో “వెలుగు నగల హంస” వచ్చింది. ” మౌనముద్ర దాల్చి మానస సరసులో నున్న తనకు నీవె కన్నులందు మెరసినావు…దేవి!
మురిసి తానై ముందుకు ఎగిరివచ్చె వెలుగు నగల హంస”… అంటూ మొదటి పద్యంగా రాశాను. ఇందులో 5 ఖండికలు ఉంటాయి. ప్రతీ ఖండికకు అమ్మవారి నామాలలోని పూల పేర్లను పెట్టాను. కదంబ కుసుమం, చాంపేయ కుసుమం, పాటలీ కుసుమం, మందార కుసుమం, చైతన్య కుసుమం.
“వేయినదుల వెలుగు” లో సౌందర్యలహరికి, లలితా సహస్రనామాలకు సంబంధించిన భావానుగుణంగా పద్యాలున్నాయి. “వెలుగు నగల హంస” లో నావి ఎక్కువ ఉంటాయి. “త్రాగు నీటికై ఒక బావి త్రవ్వుచుండ.. దేవి! ఈ భూమి గుణమేమొ కానీ, దీనిలోన బాధలే ఊరుచున్నవి..బ్రతుకిదెల్ల బాధలనె తోడుకొని త్రాగవలెనె?” ఇలాంటి పద్యాలెన్నో.. “వేదముల తోడ దేవి! నివేదన లొనర్ప గల యంత కాదు..స్వర్ణముఖి జలములట్లు నోటితో తెచ్చెడునంత కాదు. మధ్యతరగతి నా భక్తి మనసు పడుదె” నా భక్తి మరీ అంత గొప్పది కాదు, మరీ అంత లేనిది కాదు( నవ్వుతూ )మధ్యస్థం… అలాగే వ్యవసాయానికి సంబంధించిన పద్యమొకటి..
“పెట్టుబడి అప్పు.. చల్లెడు విత్తనాలు నాగు. భూమి కౌలుకు కొని, నన్ను దున్నుకున్నట్లె దీనిని దున్నినాను..నేనె పంటనై అమ్ముకున్నాను నన్ను..” ఇలా భక్తి భావంతో సాగుతూ ఉంటాయి ఈ రెండు కావ్యాలు కూడా…

17. “లోకం దృష్టి ఒకవైపు అయితే భూమయ్య గారిది లోచూపు” అన్నట్లు జ్వలిత కౌసల్య, మకరహృదయం లాంటి ప్రత్యేక రచనలతో
మనసులను ఆకట్టుకున్నారు… ఆ విభిన్న దృక్కోణాన్ని వివరిస్తారా?
జ: నిజమే! ఇంతకు ముందు చెప్పాను కదా! కొత్త విషయం లేకుండా రాయనని. దేన్ని చదివినా దాంట్లో నూతన అంశం ఏదైనా ఉందా అని ఆ దిశగా ఆలోచిస్తాను. అట్లా రూపుదిద్దుకున్నవే మీరడిగిన కావ్యాలు. వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు కౌసల్య దుఃఖం నన్ను కంట తడి పెట్టించింది. కైకేయి ఆజ్ఞ ప్రకారం వనవాసాలకు వెళ్ళడానికి శ్రీరాముడు తల్లి అనుమతికై కౌసల్య మందిరానికి వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది వాల్మీకి రామాయణంలో, తెలుగు రామాయణాల్లో ఎక్కడా ఏకపత్నీవ్రతుడన్న మాట కనిపించదు. లోక వ్యవహారంలో ఉన్నది మాత్రమే. కౌసల్యాదేవి రాముని చూసి “భర్తతో ఎలాంటి సుఖం పొందలేదని, సపత్నుల వల్ల పొందిన పరాభవాలు తనను తీవ్ర దుఃఖంలో ముంచాయని, గొడ్రాలుగా మిగిలిపోయినా ఈ బాధ ఉండేది కాదని” తీవ్రంగా దుఃఖిస్తుంది. అప్పుడు రాముడు తల్లి దుఃఖానికి బహుభార్యాత్వం కారణం కాబట్టి తల్లి ముందు ప్రతిజ్ఞ చేశాడన్న ఊహ వచ్చి “ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు/ ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య” అని మాటిచ్చి ఊరడించాడు అన్నట్టుగా వెలువడింది ‘జ్వలిత కౌసల్య’…
త్రిజట స్వప్న వృత్తాంతం తీసుకుంటే ఆమె ఒక రాక్షసిగా పక్కకు పెట్టడం తప్ప వేరే రాక్షస గుణాలు కనిపించవు. ఆమె పరమ సాధ్వి. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఆమె రాముని స్వప్నంలో దర్శించింది. ఆ ఊహతో రాసిందే త్రిజట. ఆమె తన స్వప్నంలో భవిష్యత్తును దర్శించింది. తన స్వప్నాన్ని రాక్షస స్త్రీలకు చెప్పి సీతతో పరుష వాక్యాలు మాట్లాడరాదని, రావణుని మాట వినరాదని చెబుతుంది. రాముని గాంచిన కలను చెప్పి రాముడు రానున్నాడని సీతకు ధైర్యాన్నిస్తుంది. రాముని దర్శించిన ఆమె ఎంతటి అదృష్టవంతురాలో కదా! అందుకే ఆ దృష్టితో ఆలోచించాను.
“ప్రవర నిర్వేదం”లో హిమాలయాల్లో పాదలేపనం కరిగిపోయి అగ్నిదేవుని ద్వారా ఇంటికి చేరిన ప్రవరుడు జరిగిన ఉదంతాన్ని విచారిస్తూ భార్యకు వివరించినట్లుగా చెప్పి, అతడు కర్మ యోగం నుండి, జ్ఞానయోగాన్ని పొందడానికి అగ్నియే గురువుగా జ్ఞానబోధ చేశాడని చెప్పడం జరిగింది. ‘కబంధమోక్షం’ లో కబంధుడు శాపవశాత్తు వికృత రూపం కలవాడైనా రామునికి సుగ్రీవ మైత్రి లభించే దిశగా మార్గ నిర్దేశం చేసిన వానిగా తద్వారా సీతాన్వేషణ సులభతరం కావడం.. అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని కబంధుణ్ణి ఒక ఉదాత్త పాత్రగా చిత్రించాను. కథలో మార్పులేదు. చెప్పిన విషయమే వైవిధ్యం..
గజేంద్రమోక్షం అందరికీ తెలిసిందే. కానీ మకరి చేసిన పాపం ఏమిటి? అని కొత్త ఊహ వచ్చింది (గట్టిగా నవ్వేస్తూ). అందుకే
“నా నివాస గృహమునకు తాను వచ్చి/ అల్లకల్లోల మొనరింప నడ్డుపడగ/ వలదొ? ఇదియు నేరమగునొ? వచ్చినట్టి/వాడు వనరాజు
వాని గర్వమ్ము గనవొ!” అంటూ మకరి ఆవేదన చెంది విష్ణువును ప్రశ్నించినట్టుగా రాశాను. ఇక “పారిజాతావతరణము” అన్నది నంది తిమ్మన “పారిజాతపహరణము” కావ్య ప్రేరణ. ఇక్కడ దీన్ని అపహరించినట్టుగా కాక పారిజాత వృక్షము యొక్క మాహాత్మ్యం తెలిసిన సత్యభామ భూలోకంలోని ప్రజల సంక్షేమార్థం కృష్ణుని పారిజాత వృక్షాన్ని తెమ్మని కోరినట్లుగా చిత్రించాను. సత్యభామ పాత్రను కొత్త కోణంలో ఉదాత్తంగా ఆవిష్కరించాను..

19. “మా ఊరు చెరువు బడి గుడి” కూడా విద్యార్థుల రచనలతో వచ్చిందేనా? ఆ వివరాలు చెప్పండి.
జ: అవును…”ప్రతిభా త్రయి” లో విద్యార్థుల రచనను బట్టి వాళ్లలో రచనాశక్తి ఉందని గ్రహించాను. ఇంకో పుస్తకం వాళ్ళతో రాయించాలనిపించింది. టీచింగ్ గురించి రాయగలిగారు. ఇంకోటి దేని మీద రాయించాలి అని ఆలోచించినపుడు కావ్యం గురించి ఇస్తే వాళ్ళు రాయలేకపోయారు. దీన్నిబట్టి కావ్య విమర్శ చేసి రాసేంత శక్తి వాళ్ళల్లో లేదు అని అర్థమయింది. అయినా వాళ్ళతో ఏదైనా రాయించాలని మీ ఊరి గురించి రాయండి అన్నాను. “మా ఊరు చెరువు బడి గుడి” అని టాపిక్ ఇచ్చాను ప్రతి ఊళ్ళో చెరువు ఉంటుంది. దానికి సంబంధించి ఈతకొట్టిన అనుభవాలో ఏవో ఉంటాయి. ఆడపిల్లలైతే బతుకమ్మ మొదలైన ఆటలు ఇలా ఏదైనా వుంటుంది కదా! ఇక బడి విషయాలు… వాళ్ళ స్కూలును జ్ఞాపకం తెచ్చుకొని చదువుకున్న చదువు, వాళ్ళ టీచర్లు, స్నేహితులు ఇలాంటివి రాస్తారు. గుడి అయితే గుళ్ళో జరిగే పండుగలు, జాతరల అనుభవాలు, అనుభూతులు రాయమన్నాను. నా దృష్టిలో ఊరును ఒక మనిషి అనుకుంటే ఆ ఊరుకు శరీరం వంటిది చెరువు. అది పంటలకు ఆధారం. పంటలు సరిగా పండితే ఆహారపోషణతో వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. బడి అన్నప్పుడు చదువుకోవడం కాబట్టి బుద్ధికి ప్రతీకగా పెట్టుకున్నా. గుడి అనేది హృదయ సంబంధం. భక్తి అనేది మనసుకు సంబంధించినది. మనిషికి భౌతిక శరీరం, బుద్ధి వీటితో పాటు హృదయ పవిత్రత ముఖ్యం. అందుకే ఈ మూడింటి గురించి రాయమనడం నా ఉద్దేశ్యం. 24 మంది వరకు స్పందించి చక్కగా రాశారు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ కింద నాల్గు జిల్లాలు ఉండేవి. విద్యార్థులను వాళ్ళ మాండలికాల్లో రాయమని చెప్పాను. ఇందులో రెండు ప్రయోజనాలు. ఒకటి వాళ్ళల్లో రచనా శక్తిని పెంపొందించడం. రెండు…ఆయా ప్రాంతాల్లో మాండలికాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం. ఒక 25 సంవత్సరాల క్రితం ఆయా జిల్లాల సామాజిక పరిస్థితులు వీటివల్ల తెలిశాయి. ఇదీ నా దృక్పథం.

అరుణధూళిపాళకు పుస్తకాల బహూకరణ

20. చాలా బాగుంది సార్..ఇంకో ప్రశ్న. పోతన భాగవతం అందరికీ తెలుసు..మరి “పోతన రామాయణము” అని మీ సంపాదకత్వంలో వచ్చింది కదా! దాని గురించి చెప్పండి.
జ: పోతన భాగవతంలో రామాయణానికి సంబంధించిన పద్యాలు ఉన్నాయి. భాగవతం పురాణం కదా! పురాణ లక్షణాల్లో ఒకటైన “వంశానుచరిత” అనే లక్షణంతో రఘు వంశాన్ని గురించి రాస్తూ రాముని గురించి చెప్పే సందర్భంలో ఆయన ఈ పద్యాలను రాశారు. వీటిని ఎవరూ అంతగా పట్టించుకొనరు. వంద పద్యాలు ఉంటాయి అవి. ఆ వంద పద్యాలకు 15 పేజీల పీఠిక రాసి “పోతన రామాయణము” ( 2019 ) అనే పేరుతో అచ్చు వేయించాను. రామాయణంలో నారదుడు వంద శ్లోకాల్లో వాల్మీకికి సంక్షిప్త రామాయణాన్ని వివరించినట్టు ( దానికి ఇది అనువాదం కాదు ) పోతన వంద పద్యాల్లో రాముని చరితను రాశారు. నా సంపాదకత్వంలో చిట్ట చివర వచ్చిన పుస్తకం ఇది.

21. “పద్యాలయం” పేరుతో వెలువడిన నాలుగు సంపుటాలలోని విభాగాలకు అమ్మవారి నామాలు వచ్చేటట్లుగా పేర్లు పెట్టడంలో అంతరార్థమేమిటి?
జ: ‘పద్యాలయం’ అనేది నా ఆలోచనకు తగిన పద్దతిలో నా సంపాదకత్వంలో వచ్చిన నాల్గు సంపుటాలు. పద్యాలయం అని నేనొక వాట్సాప్ గ్రూపు పెట్టాను. దాని నుండి పుట్టిందే ఇది. అంటే దానికి కొనసాగింపుగా పుస్తకంగా వచ్చినటువంటింది. దానిని నేను మూడు విభాగాలుగా చేశాను. ఒకటి ప్రాచీన కవుల పద్యాలు ఒక భాగం, రెండవ భాగం ఇప్పటి కవులు ఏదైనా రాయొచ్చు. అంటే వాళ్ళు రాసిన పద్యాలు. మూడవది పద్య కావ్యాలకు సంబంధించిన విమర్శ వ్యాసాలు. “పద్యం చదవండి, పద్యం రాయండి, పద్యం గురించి రాయండి”. పద్యం చదవండి అన్నప్పుడు పూర్వ కవులను చదవాలి. అంటే అవి చదవకుండా మీరు పద్యం రాయొద్దని అన్యాపదేశంగా చెప్పడం. దీనికి నన్నయ్య, తిక్కన మొదలైన కవుల దాదాపు 20 పద్యాలను మోడల్ గా చూపించిన. అంటే ఒకరకంగా సిలబస్ లో చదివే పద్దతిలో ఇచ్చిన. రెండవది పద్యాలు రాయడం. పద్యాలయం ముఖ్యోద్దేశ్యమే అది. కానీ దీన్నుండి పుట్టిన ఆలోచన దీన్ని పుస్తకంగా తేవాలన్నది. పద్యం చదవడం, పద్యం రాయడం కాకుండా పద్యం గురించి విమర్శ కూడా రాయాలి కదా! అందువల్ల పద్యం గురించి రాయడం అని పెట్టుకున్న. వీటికి పేర్లు ప్రాచీన, ఆధునిక పద్యాలలో ఏవైనా పెట్టొచ్చు. కానీ అలా కాకుండా లలితా అమ్మవారి మీద ఉన్న ప్రేమ పూర్వక భక్తి వల్ల వెతికాను.
ప్రాచీన కవిత్వానికి సహస్ర నామాల్లోని “సంప్రదాయేశ్వరీ” అని అన్నాను. రెండవది రాజకీయ అంశాలు తప్ప ఏ అంశాలైనా, ఏ భావమైనా రాయమని వాళ్లకు నియమం పెట్టాను. దీనికి అమ్మవారి నామాల్లో “వివిధ వర్ణోప శోభితా” అనేది సరిగ్గా ఒప్పింది. మూడవది విమర్శ కదా! దానికి “విమర్శ రూపిణీ” అనే నామం సరిపోయింది. ఇక సంపాదకత్వం రాయాలి. ఈ మూడు విభాగాలు వచ్చే విధంగా “వదన త్రయ సంయుతా” అనే నామాన్ని పెట్టుకున్నాను. ఇలా సరిగ్గా భావానికి తగినట్లు నామాలు దొరకడం అదృష్టం కదా! రెండేళ్లలో (2018-19) ఈ నాలుగు సంపుటాలు పుస్తక రూపంలో వచ్చాయి.
పద్యాలయం వాట్సాప్ కు, ఈ సంపుటాలకు సంబంధం లేదు. అంటే అందులో వచ్చినవైనా నేను అడిగినప్పుడు నియమాలను అనుసరించి రాసినవే తీసుకుంటాను. దాన్నుండి పుట్టిన ఆలోచనే అయినా అందులో నుండి తీసుకున్నప్పుడు “అచ్చు కాని పద్యాలు” అని కండిషన్ పెట్టాను. అందువల్ల “పద్యాలయం” నాకిష్టమైన పద్ధతిలో నా సంపాదకత్వంలో వెలువడిన సంపుటాలు.

22. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.

23. విమర్శ, పద్య, గేయ కావ్యాలే కాకుండా అనువాదాలు ఏమైనా చేశారా?
జ: చేశాను. సంసృతం నుండి తెలుగులోకి నాలుగు పుస్తకాలను అనువాదం చేశాను. అందులో రెండు యధాతథానువాదాలు, రెండు స్వేచ్ఛానువాదాలు. “అష్టావక్రగీత” ఇది అద్వైత గ్రంథం. దీంట్లో 298 శ్లోకాలు ఉన్నాయి. వీటిని తేటగీతి ఛందస్సులో యధాతథంగా అనువదించాను. అలాగే శంకరాచార్యుల వారి “అపరోక్షానుభూతి” ని మాత్రా ఛందస్సులో గేయాలుగా రాశాను. ఇదీ యధాతథానువాదమే.
ఇక సౌందర్య లహరిలోని అన్ని శ్లోకాలకు కాకుండా 54 శ్లోకాలను గేయాలుగా స్వేచ్ఛానువాదం చేశాను. గణపతి సచ్చిదానంద స్వామి వారి “నీతిమాల సూక్తి మంజరి” లోని శ్లోక రూపంలో ఉన్న సూక్తులను తేటగీతి ఛందస్సులో శతకంగా స్వేచ్ఛానువాదం చేశాను. దీనికి మకుటంగా “దత్త గురుదత్త జయగురు దత్త దత్త” అని పెట్టాను.

24. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.

26. మీ గురించి వెలువడిన ఇతర గ్రంథాలేవి? వాటిని వివరించండి.
జ: నా “వేయినదుల వెలుగు” మొదలైన అయిదు పద్య కావ్యాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 50 వ్యాసాల సంపుటి “అంతర్వీక్షణ సార్వభౌమం” అనే పేరుతో వెలువడింది. దీనికి ఆచార్య చేకూరి రామారావు గారు, బేతవోలు రామబ్రహ్మం గారు సంపాదకత్వం వహించారు.
నా విమర్శ గ్రంథాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 76 వ్యాసాల సంపుటి “విమర్శ విద్యా సార్వభౌమం” ఆచార్య నాయని కృష్ణకుమారి గారి సంపాదకత్వంలో వెలువడింది.
“ఆలాపన” సంస్థవారు 2012 లో నాకు సన్మానం చేసి “అభినందన సంచిక” ను అచ్చు వేశారు. ఇందులో నా సాహిత్యం, వ్యక్తిత్వం గురించి 108 మంది ప్రముఖులు రాసిన అభిప్రాయాలున్నాయి.
“ఆచార్య అనుమాండ్ల భూమయ్య సప్తతి ప్రత్యేక సంచిక” వెల్చాల కొండలరావు గారి సంపాదకత్వంలో వెలువడింది. దీంట్లో నా సాహిత్యం గురించి కవి పండితులు రాసిన పలు వ్యాసాలు, అభినందనలు 76 ఉన్నాయి. కొండలరావు గారు “విశ్వనాథ జయంతి” అనే “విద్య, సాహిత్య- సాంస్కృతిక త్రైమాసిక పత్రిక ప్రత్యేక సంచికగా దీన్ని వెలువరించారు.
“అజో, విభొ,కందాళం” సంస్థ అధినేత ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణ రావు గారు ప్రతీ సంవత్సరం ఇచ్చే “విశిష్ట సాహితీ మూర్తి” జీవన సాఫల్య పురస్కారాన్ని 2021 వ సంవత్సరానికి గాను నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో “సమ్మానోత్సవ విశేష సంచిక” ను వెలువరించారు. ఇందులో నా సాహిత్యం గురించి ప్రముఖులు రాసిన వ్యాసాలున్నాయి.
నాలో ఉన్న ముఖ్యమైన ముఖాలు మూడు. ఒకటి బోధన, రెండవది
కవిత్వం, మూడవది విమర్శ. ఇక నా పాఠ్య బోధనను గురించి 54 మంది విద్యార్థులు రాసిన అభిప్రాయాల సంపుటి “ప్రతిభా త్రయి”గా
వెలువడింది. ఇందులో నా కవిత్వం, విమర్శ గురించి కవి, పండితులు రాసిన వ్యాసాల సంక్షిప్త రూపాలున్నాయి. దీనికి సంపాదకులు నా పర్యవేక్షణలో పి హెచ్ డి చేసిన ముగ్గురు విద్యార్థినులు. వారు డా. కె. ప్రియదర్శిని, నల్ల ప్రభావతి, డా.ఎస్.రాధిక.
నేను రాసిన “శాంతి గర్భ” అనే గేయ కావ్యం గురించి నా డా.కె. జ్యోత్స్న “శాంతి ధృత” అనే విమర్శ గ్రంథం రాశారు.

27. మీ రచనల్లో పద్యం నడక సాగే విధానంతో పాటు మీ కావ్య గానం రస హృదయాలను ఆకట్టుకుంటుంది. మీకు సంగీత కళలో ప్రవేశం ఏమైనా ఉందా?
జ: ప్రవేశం ఏమీ లేదు. నేర్చుకోవాలని అనుకోనూ లేదు. ఈ విషయంగా చెప్పాలంటే ఇద్దరి పేర్లు చెప్పాలి. పద్యం మీద ప్రేమ హైస్కూలులో భూమారెడ్డి సార్ పద్యం చదివే పద్ధతిని బట్టి కలిగింది. అలా చదవాలి అనుకునేవాడిని. ఎమ్ ఏ లో ఉన్నప్పుడు దివాకర్ల వేంకటావధాని గారు రాగయుక్తంగా పద్యం చదివే వారు. పద్యం పాడడానికి వీళ్లిద్దరూ ప్రేరణ. నేను క్లాసులో ఉన్నప్పుడు తన్మయత్వం చెందుతూ రకరకాలుగా పాడుతుండడం వల్ల తెలియకుండానే నాదొక
పద్ధతి ఏర్పడింది అంతే..

28. మీ సాహితీ ప్రస్థానంలో మిమ్ములను ప్రభావితులను చేసిన మీ గురువులను గురించి చెప్పండి.
జ: నన్ను ప్రభావితం చేసిన వాళ్ళల్లో మొదటి గురువు కోవెల సంపత్కుమారాచార్య గారు. బీఎస్సీలో పాఠాలు చెప్పిన తర్వాత తెలుగు పట్ల ఆసక్తి కలిగితే నిలబెట్టిన వారాయన. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంలో క్లాసులు సరిగా నడవక పోయేవి. అప్పుడు మా గురువు గారి ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాను. అక్కడ ఆయన చదవమని పుస్తకాలు ఇచ్చేవారు. ఏ పుస్తకాలు చదవాలో చెప్పేవారు. ఏదైనా పద్యమో, గేయమో రాసేవాడిని. ఎలా రాయాలో వివరించేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకు అభిమాన కవి. అందుకే విశ్వనాథ వారి “వేయిపడగలు” నవల గూర్చి నేను రాసిన “వేయి పడగలు- ఆధునిక ఇతిహాసం” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను. హైస్కూలులో పద్యం పాడడం మీద ఆసక్తి కలిగించిన భూమారెడ్డి సారుకు ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా “వ్యాసభూమి” వ్యాస సంకలనాన్ని అంకితం ఇచ్చాను. దివాకర్ల వేంకటావధాని గారికి మకరహృదయం అంకితమిచ్చాను. డా. సి. నారాయణరెడ్డి గారికి “అగ్ని వృక్షం”, ఆయన జన్మదిన సందర్భంగా “కర్పూరవసంతరాయలు కళా ఝంకృతులు” అంకితం ఇచ్చాను. డా.పాటిబండ మాధవశర్మ గారి ఇంటికి కూడా ఎమ్ ఏ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను పి హెచ్ డి చేస్తున్నప్పుడే ఆయన మరణించారు. ఆయన పేరిట అవార్డు ఇచ్చాను. కోవెల సుప్రసన్నాచార్యులు గారు నాకు గైడుగా ఉన్నారు. చాలా సన్నిహితంగా ఉండేవారు. “అమృతసేతువు” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను.

ధన్యవాదాలు సార్..సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం, మీ సాహితీసేవ గురించి నేను అడిగిన అన్ని ప్రశ్నలకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఇంత విపులంగా, ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు ….

ఇటీవలే భూమయ్య గారు రచించిన సమగ్ర సాహిత్యమంతా కలిపి పద్య కావ్య సంపుటి, గేయ కావ్య సంపుటి, భౌమమార్గ విమర్శ సంపుటి వెలువడ్డాయి. సాహితీ విమర్శ మరొక సంపుటి అచ్చులో ఉంది. మహా పండితులైన గరికపాటి నరసింహారావు గారిచే ” ఇది అమ్మవారి మార్గం. అదే అనుమాండ్ల భూమయ్య మార్గం. ఈ మార్గంలో ఆయన చతుశ్శ్రుతి శిఖరారోహణం చేశారు. ఆ క్రమంలో ఋగ్వేద దిగ్వీణా గానమే “వేయి నదుల వెలుగు”. యజుర్వేద యజ్ఞ నిర్వహణమే “వెలుగు నగల హంస” సామవేద సోమపానమే “అగ్నివృక్షం”. అధర్వణ రూపమైన అవభృథ స్నానమే “చలువ పందిరి” అని ప్రశంసించబడ్డారు. అంతటి అసామాన్యులు వీరు… సెలవు.

You may also like

Leave a Comment