Home కథలు సముద్రమే నా కడకు వచ్చింది

సముద్రమే నా కడకు వచ్చింది

by Padmavathi Neelam Raju

చాలా సంవత్సరాల తరువాత మా వూరు వెళ్ళాను. అక్కడకి వేళ్ళ గానే  రెండు రోజులకే నాకు  దగ్గరగా ఉన్న కొత్తపట్నం   సముద్రానికి వెళ్లాలనిపించింది. ఆ మర్నాడే ఒక ఆటో తీసుకొని కొత్తపట్నం బయలుదేరాను. వూరు చాల మారిపోయింది. బస్టాండ్ దగ్గర కనకాంబరాలు తమలపా కులు అమ్మే అమ్మాయిలు చాల తక్కువ కనిపించారు . కొత్తపట్నం ఎప్పుడు వెళ్లిన ఇదివేరుకు బస్సు  కిటికీ నుంచే కనకాంబరాలు , మల్లెపూలు తమలపాకులు కొన్ను క్కునే వాళ్ళం. చాల తాజాగా ఉండేవి. బస్సు దిగిన తరువాత ఒక 5 కిలోమీటర్లు దూరం కాలినడకన సముద్రం వడ్డుకు నడవాల్సి వచ్ఛేది. ఒక  బస్సు  మాత్రమే వడ్డు వరుకు వెళ్ళేది . ఇప్పుడు ఆటో లు కూడా వెళుతున్నాయి. దారిలో చాలా అప్పార్ట్మెంట్స్ కనిపించాయి. కొత్తపట్నం వూరు దాటి సముంద్రం వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే కూర్చుని అట్లువేస్తున్న ఒకామెను చూసి, ఆటో ఆపమని అన్నాను. ఇలా రోడ్ పక్కన అట్లుఅమ్మేవాళ్లు మధ్యలో ఎక్కడ కనిపించలేదు. 

ఆటో అబ్బాయి నన్ను చూసి,  “ఇక్కడ వద్దులెండి మేడం! అట్లు అంత బాగుండవు. పంతులు మెస్ దగ్గరలోనే ఉన్నది . అక్కడ ఆపుతా, అక్కడ తినండి. అన్ని వేడి వేడిగా బాగుంటాయి ”అని చెప్పాడు. 

నేనేమి మాట్లాడలేదు. ఎందుకంటే నేనెప్పుడో నా  చిన్ననాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. మా అమ్మ , ఆమ్మా , మాస్టారు గారి భార్య , ఆవిడా ఆడపడుచు రాఘవమ్మ గారు , ఇలా చాల మంది మా ఊరినుండి  కలిసి ఆ, కా , మా , వై ( ఆషాఢం , కార్తీకం, మాఘం , వైశాఖం ) సముద్ర స్నానాల కు కొత్తపట్నం వెళుతుండేవారు. నేనెప్పుడూ వాళ్ళ మధ్యలో బుడంకాయ్య్లలే వెంటబడి వెళ్లేదాన్ని. వద్దంటే నానా గొడవ చేసేదాన్ని. ఆ గొడవ కంటే నన్ను వాళ్ళతో తీసుకెళ్లడమే మంచిదని మా ఆమ్మ అనుకోనేది . 

 కార్తీక పౌర్ణమి నాడు సముద్రస్నానాలకి వెళ్ళినప్పుడు, ఉదయాన్నే అయిదు, ఆరు గంటలకే   సముద్రం చేరుకొని తొమ్మిది గంటల దాక సముద్రస్నానాలు చేస్తూ, ఇసుకలో ఆడుకొంటూ అలలవెంటే  పరిగెడుతూ, గవ్వలు , నక్షత్ర చేపలను ఏరుకుంటూ గడిపేసేదాన్ని . పెద్దవాళ్ళ పూజలు అయ్యాక, వెనక్కి  బయలుదేరేవాళ్ళం. నేను చిన్నదాన్నని మా ఆమ్మ నాకు ఇలాగె రోడ్డు పక్కనే అట్లు పొసే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అట్లు పెట్టించేది. ఎందుకో మరి నాకు ఆ  అట్లు మా అమ్మ చేసిన అట్లకంటే కూడా చాలా రుచిగా అనిపించేవి. 

అదే మాట మా అమ్మతో అనే దాన్ని. “అమ్మ ! పుల్లమ్మత్త  అట్లు చాల బాగుంటాయి! నువ్వు కూడా ఆలా చేయరాదు! “అని. మా అమ్మ , అన్నయ్య పెద్దగా నవ్వేసేవారు. “ఆకలివేస్తే గడ్డయినా రుచిగానే ఉంటుంది” అని అన్నయ్య మొట్టికాయవేసేవాడు. 

పంతులు మెస్ వచ్చింది   . “మేడం! టిఫిన్ చేస్తారా!”అన్న పిలుపుతో ఈ లోకాం లోకి వచ్చిపడ్డాను మళ్ళీ.

 “అలాగే అట్లు నువ్వు కూడా తిను”  అని అన్నాను వాడితో.

 వాడు “ఒక ప్లేటు పూరి  కూర, ఒకప్లేటు అట్లు అంటూ నాకూడ  ఆర్దర్రిచ్ఛేసాడు. 

మళ్ళి  సముద్రం వైపుకి  ఆటో నడిచింది. నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపటిదాకా వెయిటింగ్ ఛార్జ్ ఇస్తానని వాడికి చెప్పాను సముద్రం తో కాసేపు అలా  గడపాలనే . వాడు ఆనందంగా తలూపాడు.

కొత్తపట్నం సముద్రం వద్దకి చేరుకున్నాను. ఆటో అబ్బాయి అవసరమైనప్పుడు తన మొబైల్ కి కాల్ చేయమని చెప్పి , తుఫాన్ షెల్టర్ దగ్గరగా  ఆటోని ఆపు కొని కూర్చున్నాడు. 

 *********   *******   ****** ********

సముద్రం అలాగే ఉంది . నా చిన్నప్పటి లా గే. అదే చెలియలికట్ట , అదే దూకుడు, అదే ఘోష , కాలంతో పని లేనట్లు ఎగసిపడే అలలు , తామే కాలమని చెబుతున్నట్లనిపిస్తుంది . అలల ను తాకుతూ తీరం వెంబడే నడవటం మొదలు పెట్టాను. ప్రతి అలా  నన్ను  సృసిస్తూ నన్నుపలకరిస్తున్నట్లున్నది.ఇంకొంచం లోపలకు వెళ్ళాను పెద్ద అల ఒకటి నన్ను బలంగా తాకింది. నా కాలికింద మట్టిని లాగేస్తూ నన్ను ఆలింగనం చేసుకోవాలని  చేతులు చాచినట్లనిపించింది. నేను అలల ఊపుకి పడిపోయాను. మళ్ళి  లేచి నిలబడ్డాను. ఈసారి అలల తాకిడికి నిలదొక్కుకొని మళ్ళీ  నిలబడ్డాను… అలలు పడుతున్నాయి , తిరిగిలేస్తున్నాయి  అనంత కాలంలో అలుపెరుగని బాటసారిలా.ఇదే ఒక జీవన సత్యమనిపించింది

 నాలో నేనే నవ్వు  కున్నాను. అప్పటికే సగం తడిశాను.  కాసిని నీళ్లు తలమీద చల్లుకొని తీరంవైపుకి నడిచాను. సముద్రం వడ్డున అంత సందడి లేదు. అది పుష్య మాసం. సముద్రస్నాలకు జనాలు అంతగా రారు.  అక్కడక్కడా కొందరు జాలరి పిల్లలు ఆడుకొంటున్నారు. 

నేను వాళ్ళ వైపుకి నడిచాను. “పిల్లలు! ఈ రోజు బడికి వెళ్ళలేద? “అని అడిగాను.

 “లేదండి!”ఆ పిలుపులో ఎదో కొత్త నాగరికత కనిపించింది. 

“మా టీచరు సెలవు పెట్టింది . ఈ రోజు మాకు పాటా లు జరగవు” .

“ఎందుకని?” 

“మా జాలరి పల్లె కు  రెండు కిలోమీర్ల దూరంలో ఒక బడి ఉంది. అక్కడ మాకు ఒకే టీచర్ ఉంటుంది. మేమంతా అక్కడికే వెళతాము.”

 “అలాగ, మరి ఈ రోజంతా ఎం చేస్తారు”. సన్నగా పొడవుగా ఉన్న ఒక పిల్లా డు “మేమంతా సముద్రం పైకి పోతాము. ఇయాల అటు-పోతూ వస్తది. సముద్రం ముందుకి వెన్నకి జరుగుద్ది.” నాకు వివరం ఇచ్చాడు.

“ సముద్రం జరుగుద్ది”.  ఈ మాటలు నేను ఎప్పుడో విన్నట్లనిపించింది.  సముద్రపు హోరు నాకేదో గుర్తుచేస్తున్నట్లనిపించింది. కొద్దీ దూరం లో ఆ ఇసుకలో కూర్చుండిపోయాను. ఎన్నోవిషయాలు మనం గుర్తుంచుకోము. కొన్ని విషయాలు  జ్ఞాపకాలుగా మన మనసులో ఎక్కడో  నిక్షిప్తమై పోతాయి . అవి మనకు సంతోషం కలిగించవచ్చు…. కొన్ని బాధను మిగల్చవచ్చు.

అటుగా వేళ్ళు తున్న ఒక చిన్న పిల్లాడిని పిలిచాను ,”ఒరేయ్ ! బుడ్డోడా ! ఇట్రా !”

వాడు లగెత్తుకుంటూ వచ్చాడు. “నా పేరు బుడ్డోడు కాదండీ! నా పేరు రాగులండి!”

“రాగుల !”ఎక్కడో విన్నట్లున్నది. 

“అవునండి . అది మాతాత పేరండి ! మా అయ్య నాకు ఆ పేరు పెట్టాడండి!” వాడేదో చెపుతున్నాడు. రాగులు నాకు గుర్తు కొచ్చాడు. 

  ************                    *************                             *************          

తెడ్డు తిప్పి తిప్పి బలంగా తయారైన భుజాలు , పిక్కల పైదాకా వేసుకున్న ఆకుపచ్చ ని క్కరు, ఎర్ర రంగు నెట్ బనీనువేసుకొని పోతపోసిన నల్లటి శిలా విగ్రహంలా ఉండే ఆటు పోటు  తెలిసిన జాలరి రాగులు. సముద్రానికి వచ్చే వాళ్ళదగ్గర  డబ్బులు తీసుకొని ఆలా కాసేపు సముద్రం పైదాకా తన పడవలో తిప్పుకొస్తుంటాడు. నేను కాలేజీ చదువుకొచ్చ్చినప్పటి నుంచి ఆలా సముద్రానికి  పిక్నిక్ కు వెళ్లడం బాగా అలవాటు. అంతే కాదు ఎన్  ఎస్ ఎస్  ఆక్టివిటీస్ లో భాగంగా మేము జాలరి పల్లెలకు వెళ్లి వాళ్లకు విటమిన్ బిళ్ళలు , చిన్న పిల్లలకు  వాక్సిన్లు    ఇస్తూండేవాళ్ళం. అప్పుడు సరదాగా ఎవరైనా జాలరి కి డబ్బులిచ్చి పడవలో సముద్రం పైన అలలు పుట్టేదాకా వెళ్లి వెన్నక్కి వచ్చే వాళ్ళం. 

కానీ రాగులు ఆలా కాదు. వాడికి ధైర్యమెక్కువ. వాడు చాల దూరం సముద్రం లోపలిదాకా తీసుకెళతాడు. ఆరోజు నేను ఒక్క దాన్నే పడవ ఎక్కాను. నాకు చాలా  చాలా  దూరం సముద్రం లోకి వేళ్ళలనిపిచింది. “రాగులు! నాకు ఇంకా పైదాకా సముద్రంలోకి వేళ్ళా లని ఉంది. 

తీసుకెళతావా”. అని అడిగాను. 

“ అమ్మాయ్ గారు  ! నడిమింట సూరీడు నెత్తిమీదున్నప్పుడు సముద్రం శానా ఊపుమీదుంటాది. ముందుకి వెన్నకి జరుగుతాఉంటాది . శానా  జాగరతగా కూకోవాలా పడవలో. లేదంటే, నేను నిన్ను మోసుకు రావాల్సి వస్తది.”

“ఏం   పరవాలేదు. వెళ్దాం పద” అన్నాను .  రాగులు పడవను నీళ్లలోకి తోసి నన్ను కూర్చోమన్నాడు. తరువాత నడుస్తూనే పడవను నడుములు పైదాకా అలలు వచ్చే  వరకు తోసుకెళ్లి , ఒక్క ఉదుటున పడవలోకి  ఏగిరి కూర్చొని , అతి వేగంగా తెడ్డు తిప్పడం మొదలు పెట్టాడు . వాడు పడవను నడుస్తూ తోసి నప్పుడు నాకు భయమనిపించలేదు. తెడ్డు వేస్తున్నప్పుడు పడవ  అలలతో పోటీపడుతున్నట్లనిపించింది.  చాల మెలుకువగా రాగులు పడవ ని తిప్పుతున్నాడు. అంతే వేగంగా పడవని తోస్తు పడవ మీదే సవారీ అన్నట్లు పెద్ద పెద్ద అలలు మీద మీద కు వస్తున్నట్లనిపించింది.   నాలో భయం మొదలయింది. గట్టిగ కళ్ళు మూసుకున్నాను.

“ఏంటి   భయమేస్తుందా  ?” అని రాగులు విశాలంగా నవ్వాడు. “లేదు” అని బింకంగా అన్నానే గాని, వెన్నులో ఎక్కడో జలదరింపు వస్తున్నది. రాగులు పడవ మధ్యలో నిలబడి తెడ్డు వేస్తున్నాడు. 

“నేను నీ వైపుకి వచ్చి కూర్చొన ” అని అడిగాను. 

 వాడు చాల తేలికగా “రామ్మా!” అని అన్నాడు. 

నాకు భయం పోగట్టడానికి రాగులు కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు.  

 “అమ్మాయి గోరు! ఈ సముద్రం ఉండాదే , మహా గొప్పది. మడిసికి ఎప్పుడు పరిచ్ఛలు పెడతా ఉంటది. ఇలా మొదట్లోనే భయపెడతాది! ముందుకి వేళ్ళా మను కో  అన్ని వింతలే. ఒక కొత్త పెపంచకము . అక్కడ అంత జలమే, ఇంకేమి అగుపడదు.  అప్పుడనిపిస్తది ఈ సముద్రం మద్దెలో నువోక్కదానివే  అని, భయమాడకు. ఈ తల్లేమీ చేయదు. అది గో ఆడ  సూడు దూరంగా నీలాకాశం భూమి ని తాకుతున్నట్లనిపించటం లేదు. ఇదిగిదిదో ఇటు చూడు, దూరంగా, సముద్రపు కొంగల గుంపు  ఎగురుతున్నాది  . ఇవే మాకు అప్పుడప్పుడు దా రి చూపెడుతుంటాయి. నీటిలోకి సూడు. నీకేమి కనబడదులే! కానీ అప్పుడప్పుడు సొర మీను లు ఎగసి పడతా ఉంటాయి. సముద్రానికి మన పైన పెమ . అప్పుడు మన దగ్గరకి జరుగుద్ది  పున్నమి నాడు, అమావాసనాడు సముద్రం పోటేట్టు త్తాది.   నాతో కలిసి పడవలో వస్తుంటది.   నాకట్ట  శాన సార్లు అనిపించింది. మన మనసు తోటి సూడా ల ఈ సముద్రాన్ని”.  

వాడి మాటలు నాకు ధైర్యానిచ్చాయి . 

సముద్రాన్నే చూస్తున్నాను. అంతా  నీరే. అంతటా నీరే . విశాలంగా ఉన్న సముద్రం. ఎన్నో రహస్యాలను తన అనంత మైన  లోతులలో దాచి . మనషి యొక్క అస్థిత్వాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. మనిషేంత చిన్నవాడు. అణువులో అణువంత కూడా కాదనిపించింది. ఈ సముద్రానికి కోపమొస్తే , “ఆమ్మో! ఇంకేమైనా ఉన్నదా! మనిషేక్కడ మిగులుతాడు!”

“ఈ అనంతమైన జలాలలో నేను మాత్రమే కాదు, రాగులు కూడా ఉన్నాడు. 

 కానీ వాడు ఈ సముద్రం బిడ్డ.  సముద్రం తో ఒక అవినాభావ సంభందం వాడికి ఉన్నట్లనిపించింది ”. 

“అమ్మాయి గారు ! అట్టా  సూడండి! సముద్రం రంగులు మారుస్తది . పొద్దున్నే నీలంగా స్వచంగా  బాల సూరీడుతో ఆడుకుంటున్నట్లుంటది. మధ్యలో తెల్లగా మెరిసిపోతుంటాది.  సూరీడ్ని సూస్తా . మిట్టమద్యాన్నం వేళా  ఎన్నో  రంగులు , నెమలి లాగా కనిపిస్తాది . అలలు ఎగసిపడుతూ ఉంటాయి ఆ సూరీడి కోసం నర్తిస్తాది. సాయం సంధ్య వేళ ఎర్రగామారుద్దీ కోపంగా, సూరీడ్నికోపంగా చూస్తున్నట్లుంటది. రాత్రి వేళ తారలన్నీ  ఈ సముద్రం తో  కబుర్లు సెప్పాలంటూ నేలమీదకు వచ్చినట్లుంటది. సెందురుడే మో అలిగి దాక్కున్నట్లుంటది అమవాస దినాన”. 

చాల భావుకతతో రాగులు మాట్లాడుతున్నాడు. 

“ఈ ప్రకృతిసౌందర్యాన్ని ఆస్వాదించడంలో కారెవరు అనర్హులు. భావుకత ఏ ఒక్కరి సొత్తు” కాదనిపించింది

అప్పటికే చాలా దూరం వచ్చేసాము. నిర్మలంగా ఏ  కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రం మధ్యలో ఉన్నాను. ” వెన్నకి వెళదామా “ అన్నాను . 

“అట్టాగే” అంటూ రాగులు పడవను వెన్నక్కి తిప్పాడు. ప్రశాంతగా ఉన్న సముద్రం, అలల మధ్యకొచ్చేసరికి తన నైజం చూపిస్తున్నట్లనిపించింది. అప్పటికే మధ్యాన్నం దాటిపోయింది. సముద్రానికి పోటు  పెరిగింది. పెద్ధ పెద్ద అలలు పడవను ఊపేస్తున్నాయి. ఒక పెద్ద అల వచ్చి పడవమీద పడింది. పడవ కిందకు జారిపోయింది. రాగులి చేయ్యి  కండరాలు బిగుసుకున్నాయి. అతి బలంగా తెడ్డు వేయడం మొదలు పెట్టాడు. అలలు నన్ను, పడవను పూర్తిగా  తడిపేశాయి. “భయపడమా కమ్మాయి! ఇది మాకు అలవాటే. నీకు కొత్త కదా. కూసంత భయమేస్తది”.  అంటూ చాకచక్యంగా పడవను తీరానికి చేర్చాడు . 

రాగులికి కొచం ఎక్కువ డబ్బులే ఇచ్చాను. దానికే వాడెంతో తృప్తిగా  “ఎప్పుడైనా సముద్రం కాడ కొస్తే నన్ను తలుచుకోండి అమ్మాయి గారు. వచ్చేస్తా. మీమ్మల్ని  సముద్రమంత తిప్పుకొచ్చేస్తా”. అంటూ చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు. 

          **************                 ***********                    **********                       ***************

“మేడం మీకు గవ్వలు కావాలా?”అంటూ రాగులు అడగడం వినిపించింది . 

 “మీరె క్కడ ఉంటారు”, అడిగాను ఆ చిన్న రాగుల్ని. వాడు దూరంగా ఉన్న వెదురు తోటల ఆవల ఉన్న కొన్ని పాకలు చూపించాడు. 

“నేను నీతో వస్తాను మీ తాతను చూపిస్తావా?” అన్నాను. వాడు కాస్త అయిష్టంగా తలూపాడు .

“మరి గవ్వలు కొనుకుంటావా , నా కాడ  శాన ఉన్నాయి గుడిసెలో”.  

“ అలాగే పద “ అంటూ వాడి గుడిసెల వైపు నడిచాను. దారిలో పక్కాగా తమలపాకు తోటలు కనిపించాయి. పాకల దగ్గరికి చేరే కొద్దీ ఎండు చేపల వాసనా కూడా ఘాటుగా రావడం మొదలెట్టింది. నాకు కొంచం తల తిరిగినట్లనిపించింది . 

ఒక పాక బయట బాగా పాత  బడిన పడవ ఒకటి పెట్ట్టున్నది. అందులో బాగా ముసలివాడల్లే కనిపిస్తున్న ఒక వ్యక్తి కూర్చొని చుట్ట తాగున్నాడు. 

 “ఎరా రాగులు, అప్పుడే వచ్చావేంటి , గవ్వలు ఏరుకోడం అయిపో యినాదా  లేదా ?”  మల్లి పోతావ” అంటూ అడుగుతున్నాడు. 

“ఈ మేడం  గారెవరో మన పాక సూడాలంటేను తీసు కొచ్చ” అంటూ, ఆగ కుండా పాక లోకి లగెత్తాడు. 

“మన పాకల్లో ఏముంటాయి “ అనుకొంటూ “ఎవరు?” అంటూ కాస్త కష్టంగా తల తిప్పి  నా  వేపు చూసాడు. వయసు మీద పడి , పడవ ను నడిపే శక్తీ లేక అలాగే ఆ పడవ లో కూర్చొని సముద్రానికి కబుర్లు చెబుతున్నట్లున్నాడు రాగులు.  నేను గుర్తుపట్టినట్లు “మీరు రాగులే కదూ?”      అన్నాను. 

“అవును . నువెవ్వరు? ?

“చాల ఏళ్లనాటి మాట, మీతో సముద్రం మధ్యలోకి వచ్చానునేను”.  

రాగులు తడబడి పోయాడు, తబ్బిబైనాడు. 

 “గుర్తు కోచ్ఛినాది నువ్వు కాలేజీ అమ్మాయివి కదూ. చాల పెద్దదానివయి పోయావు.”  

 “అవును రాగులు. నువ్వు కూడా తాతవైపోయావు” 

“అమ్మాయి గారు సముద్రం తోనే ఉండే వాళ్ళం , మా వయస్సు, మా ఆయుస్సు అంతా సముద్రం లాగేసుకొని, సముద్రమైతే అలాగే ఉండి  పోతది. మేము ఈ సముద్రం కాడే  ఇలాగె రాలి పోతాము. “

చిన్న రాగులు కొన్ని గవ్వలు నా ఒళ్లోపోసి, పరిగెత్తుకుంటూ పోయాడు, పోతు అరిచి చెప్పాడు

”పది రూపాయలు మా తాతకు  ఇవ్వండి”.

కొద్దీ సేపు అలాగే ఆ పడవ లో రాగులు పక్కనే కూర్చొని రాగుల్నే చూస్తూ  అనుకున్నాను“భావుకత ఉన్న రాగులు వయసుతోపాటూ సముద్రం ఇచ్చిన అనుభవంతో పాటు “వేదాంతిలాగా మారాడని”  

 వేళ్ళు తున్న నన్నుచూసి రాగులు మనసారా నవ్వుకొంటూ “ ఇయ్యాల సముద్రమే  నా కాడ  కొచ్చింది” అన్నాడు. నేను వెన్నక్కి చూసాను చిరునవ్వుతో.    

You may also like

Leave a Comment