Home వ్యాసాలు నవీన్ అంపశయ్య నవలపై సమీక్షా వ్యాసం

నవీన్ అంపశయ్య నవలపై సమీక్షా వ్యాసం

by Parimi Venkata Satyamurty

ఉపోద్ఘాతం

ప్రముఖ రచయిత నవీన్ గారి ఇంటిపేరుగా  స్థిరపడ్డ అంపశయ్య నవల మొదటి ముద్రణ 1969 లో జరిగింది.  2007 లో 8వ ముద్రణ జరిగిన  నవీన్ గారి ఈ  నవల లో యువతీ యువకులదే ప్రధాన పాత్ర. వారి మానసిక సామాజిక జీవితాలను చాలా చక్కగా చిత్రీకరించారు.

పల్లెటూరు నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ లో  M.A., చదువుతున్న ఒక పేద, వెనకబడ్డ సామాజిక వర్గానికి చెందిన రవి అనే  కుర్రాడి కథ ఇది.
20 ఏళ్ల వయసులో ఉండి లైంగిక  వాంఛలతో ఉడికిపోతూ 
వాటిని తీర్చుకునే ధైర్యం లేక  సతమతమవుతూ ఉంటాడు.ఊహాలోకం లో జీవిస్తూ ఉంటాడు.

 డా.అమ్మంగి వేణుగోపాల్ గారు తన ముందు మాటలో  ఈ కథా నాయకుడు బాత్ రూమ్ లోని బూతు బొమ్మలు,బూతు మాటలు పదే పదేగుర్తు
చేసుకోవడం ద్వారా ఒక యువకుని ఆరంభ యవ్వన అంతరంగాన్ని
సెన్సార్ చేయకుండా
ప్రదర్శించినట్లు 
ఆ యువకుని బలం- బలహీనత తెలిపినట్లు అయిందని భావించారు.

నవలా సమీక్ష

నవీన్ గారి  1969 నాటి ఈ అంపశయ్య నవల అప్పటి రాజకీయ,కాల,మాన  పరిస్థితులకు  అద్దం పడుతుంది. యూనివర్సిటీ హాస్టల్ లో  ఉండి చదువుకుంటున్న  యౌవనారంభ దశలోని
యువకుల ప్రవర్తన  నాయకుడు రవి యొక్క దీనమైన ఆర్ధిక పరిస్థితి  అతని మనసు లోని అంతః సంఘర్షణను రచయిత బాగా చిత్రీకరించారు.
ఈ సంఘర్షణ వర్ణన
ద్వారా ఇది మనో వైజ్ఞానిక నవలగా రూఢి అవుతుంది. ఈ నవలలో రవి స్నేహితులు వేణు, మధు, ప్రకాష్, నిధి, ఎదురు రూమ్ లో ఆచారి. తర్వాత గోపాలరావు  కూడా రవి స్నేహితుడు 
అయిపోతాడు.

రవి తల్లితండ్రులు ఆర్ధికంగా సామాజికంగా వెనకబడిన ఒక చితికిపోయిన రైతు కుటుంబం. చాలీ చాలని ఆదాయంతో
కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడని, కలెక్టర్ అవుతాడని కలలు కంటూ  కొడుకును కష్టపడి 
హైదరాబాద్ లో చదివిస్తున్నారు. 
కొడుకు చదువు కోసం ఇంట్లో ఉన్న నగా  నట్రా కూడా అమ్మేస్తారు. ఒక దశలో తమకు ఎంతో ఇష్టమైన  దూడని కూడా గత్యంతరం లేక అమ్మి  కొడుకు చేతిలో  పోస్తే పట్నం రాగానే కొడుకు రవి  వాటిని హారతి కర్పూరంలా ఖర్చు చేసేసి తెల్లారి మళ్ళీ డబ్బులు కోసం 
ఆవురావురు
మంటాడు.

కథానాయకుడు రవి
మూడు నెలల మెస్ బిల్లు బాకీ ఉన్నందుకు
మెస్ లో భోజనం దొరకక ఒకరోజు తిండి లేక నక నక లాడిన తీరును  బాగా వర్ణించారు రచయిత.

రవి జీవితం లో తారసపడిన ఇద్దరు యువతులు కిరణ్మయి, రత్తి. కిరణ్మయి ఆధునిక భావాలు సంతరించుకున్న అపురూప అందాల రాశి. బెంగాలీ అమ్మాయి.ఒకసారి నాగార్జున సాగర్ విహారయాత్రకు వెళ్ళినప్పుడు తన జూనియర్ అయిన కిరణ్మయి తో ప్రేమలో పడతాడు. ఒక టన్నెల్ లో వారు ఉన్నప్పుడు
కరంట్ పోతే కిరణ్మయి భయంతో రవిని కౌగిలించుకుంటుంది. ఆ సంఘటనను   ఒక తీయని స్వప్నంగా రవి తన గుండెలో దాచుకుంటాడు.

ఒకరోజు కిరణ్మయి యూనివర్సిటీ లైబ్రరీ కి వెళ్తుంటే తానూ ఆమె వెనక పరుగెడతాడు.
ఆమెతో మాటలు కలుపుతాడు. అబిడ్స్ లో ఒక సినిమా హాల్ లో కాగజ్ కీ పూల్  సినిమా బాగుందనీ చూడమని చెప్తాడు. ఆమె తన స్నేహ బృందంతో వెంటనే బయలుదేరి రవిని కూడా  ఆ థియేటర్ కు రమ్మని చెపుతుంది. అక్కడికి వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఒక ఐదు రూపాయల కోసం అతను పడ్డ బాధ వర్ణనాతీతం.సినిమా టైం అవుతుతోంది కానీ అప్పు పుట్టదు. బస్ స్టాప్ కి వచ్చి నిలబడతాడు ఎవరన్నా దొరుకుతారేమో అప్పు  దొరికితే సినిమాకు వెళ్లాలని  ఆశ. ఆఖరికి తాను అసహ్యించుకునే గుర్నాధం అనే హోమో సెక్సువల్ మిత్రుడి వద్ద గతిలేక 5 రూపాయలు తీసుకుని పరుగెత్తి వేగంగా కదిలిన బస్ లోకి ఎక్కేస్తాడు.
కోటి కెళ్లి ఇంకో రిక్షా పట్టుకుని కోటి నుండి దగ్గరలోనే ఉన్న అబిడ్స్ కు వెళ్లి బలవంతంగా రూపాయి వసూలు చేసిన  రిక్షా వాడిని తిట్టుకుంటూ హాల్ చేరుతాడు. సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుంది. కిరణ్మయి కనిపిస్తుంది. కానీ తన కలకత్తా స్నేహితుడు సతీష్ కార్ లో వచ్చి 
కిరణ్మయిని అకస్మాత్తుగా కార్ లో ఎగరేసుకు పోతాడు. రవి దిగాలు పడతాడు.
ఇక సినిమా వదిలేసి రోడ్డున పడతాడు.పొద్దుట నించి తిండి లేదు కడుపులో పేగులు గోల చేస్తున్నాయి. తన వద్ద ఉన్న నాలుగు రూపాయలతో 3.50 పెట్టి  మార్లిన్ మన్రో జీవిత కథ పుస్తకం కొంటాడు. ఇంకా చేతిలో 50 పైసలు  మాత్రమే ఉంటుంది. ఆకలి దంచేస్తుంటే తోచక అనవసరంగా పుస్తకం కొన్నందుకు బాధపడుతూ తిరిగి  పాత పుస్తకాల షాపు లో అమ్మబోతే షాప్ వాడు బారాణా కి అడుగుతాడు.కానీ అమ్మటానికి మనసు ఒప్పదు. ఒక దశలో ఆకలికి తాళలేక మనిషి ఎవరూ కనిపించని ఒక  యాపిల్ బండి దగ్గర ఒక పండు కొట్టేద్దామని అనుకుంటాడు. కానీ పండ్ల యజమాని వచ్చేసరికి ఆగిపోతాడు. అలా నడుస్తూ  దారిలో హోటల్ లో రెండు సార్లు కడుపు నింపుకోవటానికి నీళ్లు తాగుతూ, దారిలో తన డిగ్రీ గురువు ఇంటికి వెళ్ళితే కాఫీ ఇస్తే ఆవురావురుమని తాగుతాడు. చివరికి మళ్ళీ కోటి చేరి 3వ నంబర్ బస్ లో కిక్కిరిసిన  రష్ లో హాస్టల్ చేరుతాడు. ఎవరో స్నేహితుడు  ఒక ఐదు రూపాయలు అప్పిస్తే రాత్రి మెస్ కు వెళ్లి ఒక రూపాయి ఇచ్చి కడుపునిండా  తిని ఆకలి చల్లార్చుకుంటాడు.

రవి జీవితం లోకి వచ్చిన అందాల భరిణ కిరణ్మయి తనకు దక్కలేదు.తన ఊరిలో తాను ఎంతగానో ప్రేమించిన రత్తి ఊరి పెద్దల కంటబడి తన శీలాన్ని  పోగుట్టుకుని 
వెలయాలుగా మారి
ఒక దశలో ఒక మాదిగ యువకునితో గడుపుతూ ఊరి వారి ఆగ్రహానికి  గురై కొట్టబడి చివరికి  బావిలో శవమై తేలుతుంది. రత్తిని ఆమె వెలయాలుగా మారాక  రవి తానూ అనుభవిస్తాడు.ఇలా
అటు కిరణ్మయికి ఇటు రత్తికి దూరం అవుతాడు రవి.

యూనివర్సిటీ లో గ్రూపు రాజకీయాలు, విద్యార్ధుల మనఃప్రవృత్తి  తోటి విద్యార్థినుల పట్ల  వారి విపరీత ప్రవర్తన, చదువు పట్ల నిర్లక్ష్యభావం,ఒకవేళ ఒకరు బాగా చదువుదామని ప్రయత్నించినా వేరొకరు వచ్చి చెడగొట్టడం  ఆ విద్యార్థులలోనే  కొందరు ధనిక యువకులు డబ్బు గర్వంతో,  అహంకారంతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం,  ఆనాటి కాలం లోని వివిధ దేశాల రాజకీయాలు, విద్యార్థి లోకాన్ని, వారి దినసరి కార్యకలాపాలను,వారి మనస్తత్వాలను చాలా చక్కగా చిత్రీకరించారు రచయిత.

1969 నాటి నవల కాబట్టి అప్పుడు 5 రూపాయలకు ఎంత విలువుందో  ఇప్పటి ధరలతో పోలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

1969 లో కిలో కందిపప్పు రూపాయి  ఉన్నట్లు నాకు జ్ఞాపకం.
అలాగే
మేము చిన్నతనం లో  నల్లగొండ లో  నివసించేవాళ్ళం.
అక్కడ  ప్రేమ్  టాకీస్  అని ఉండేది.  ఆ థియేటర్
లో నేల టికెట్ 35 పైసలు, బెంచి 60 పైసలు ఉండేది. మేము 
రిషి కపూర్ బాబీ సినిమా నేల మీద కూచుని  చూశాము.
ఆ  35పైసలు సంపాదించటమే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. 

1969 కాలంలో
ఈ కథలోని  నాయకుడు రవి  5 రూపాయలతో 
బస్ లో వెళ్లి సినిమా చూసి ఏమన్నా తిని మళ్ళీ బస్ ఎక్కి తిరుగు ప్రయాణం  చేసినా ఆ 5 రూపాయలు సరి పోతాయని అర్ధం అవుతోంది.

తండ్రి చమటోడ్చి సంపాదించిన  డబ్బును రవి మంచినీళ్ళలా ఖర్చు చేసి,డబ్బుల్లేక,  తిండి లేక ఎలా అల్లల్లాడాడో
రచయిత ఈ నవలలో
చాలా హృద్యంగా  వర్ణించాడు.

ఈ  నవల స్థూలంగా చూస్తే ఒక 24  గంటలలో జరిగిన  సంఘటనల సమాహారం.
నవల క్లైమాక్స్ లో  ప్రతి నాయకులు శ్రీశైలం,రెడ్డి, భజగోవిందంల  మీద రవి
గ్యాంగ్ కాంటీన్ లో ఎలా పై చెయ్యి అయ్యిందో  బాగా చెప్పారు.
చివరిగా రవి ఆ రాత్రి  కాంటీన్ లో కడుపు నిండా తిని పడుకున్నా
నిద్రపట్టక పోవడం, అతని పరుపు మంచం
ముళ్ళ మంచంలా, అంపశయ్య లా అనిపించడం  నవల మొదటి నుండి చివరివరకు జరిగిన సంఘటనలు అన్ని అతని మనసులో   గిర్రున తిరుగుతున్నట్లుగా 
మళ్ళీ అమ్మ, కిరణ్మయి,రత్తి మిగతా పాత్రలన్నీ మనసులో
అల్లకల్లోలంగా అల్లుకుపోవడం చాలా బాగా వర్ణించారు నవీన్.

  :ఉపసంహారం:

 ఈ నవలలో యూనివర్సిటీ హాస్టల్స్ లో విద్యార్థుల మధ్య  జరిగే గొడవలు, క్యాంపస్ వాతావరణం,  విద్యార్థులు తోటి విద్యార్థినుల పట్ల  చేసే ఆకతాయి చేష్టలు  అన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు రచయిత.

అయితే  విద్యార్థులు కాంటీన్ లో గొడవ పడుతూ  ఒక మతాన్ని
పట్టుకుని మాట్లాడే బూతులు, కాలేజీ అమ్మాయిల మీద బాత్ రూమ్ గోడలపై రాసిన
బూతు  మాటలను
యథాతధంగా నవలలో రాయడం   కొంచం ఎబ్బెట్టుగా ఉన్నా  ఆ కాలానికే చెల్లిందేమో అనిపిస్తుంది. 

 మొత్తానికి ఈ నవల చదివితే మనం క్యాంపస్ లో చదువుకున్న రోజులు, ఆ తీయని జ్ఞాపకాలు, ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్, పక్కనే  లైబ్రరీ అప్పటి ప్రొఫెసర్లు అందరూ మన ఆలోచనలలో
సినిమా రీలులా గిర్రున తిరుగుతూ గుర్తు కు  రాక  మానవు.  
ఇంతటి ఒక చక్కటి నవల సమీక్ష కోసం ఎన్నుకున్న  దృశ్యకవి చక్రవర్తి శ్రీ అమరకుల గారు అభినందనీయులు.


You may also like

Leave a Comment