Home పుస్త‌క స‌మీక్ష‌ మౌనం అపురూపమైన కళ

మౌనం అపురూపమైన కళ

by Narendra Sandineni

వారాల ఆనంద్ మౌనంగానే కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనువాదకుడు, సినీవిమర్శకుడు, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, విశ్రాంత లైబ్రేరియన్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, వారాల ఆనంద్ కలం నుండి జాలువారిన మౌనంగానే కవిత పై విశ్లేషణా వ్యాసం .మౌనంగానే కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. మౌనం అనగా మాట్లాడకుండా ఉండటం. ఇదొక అపురూపమైన కళ,తపస్సు. మాటలను వృధాగా వినియోగించకుండా ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండే క్రియ.
” ఎవరయినా ఒక మనిషి చనిపోతే
” కళ్ళు చెమ్మగిల్లుతాయి
” మౌనం గానే
నిజమే. ఎవరైనా ఒక మనిషి చనిపోతే కళ్ళు చెమ్మగిల్లుతాయి.అతడు ఎవరు అన్న విషయంతో సంబంధం లేదు.ఇప్పటిదాకా జీవించి ఉన్న వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోయాడు అంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి అనే విషయం నిజం అని చెప్పవచ్చు.మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏదో ఒకనాడు అందరి వద్ద సెలవు తీసుకుని భువి నుండి దివిలోకి వెళ్ళడానికే.చనిపోయిన వ్యక్తిని చూసి అతడు చనిపోయాడు అంటాం.మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడిపోతాం అనే సంగతి మనకు తెలుసు.ఆ విషయం గురించి తెలవనట్లే నటిస్తాం.మానవ జీవితం ఒక మాయగా తోస్తుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం అని ఒప్పుకొని తీరాల్సిందే.ఒక మనిషి చనిపోతే దుఃఖంతో కళ్ళల్లోకి నీళ్లు ఎగసి వస్తాయి.ఆ వ్యక్తి మనకు ఇక కనిపించడు.ఆ వ్యక్తి ఇక రాడు అనే దిగులు మనకు కలుగుతుంది.మనలో లోలోపల కలిగే దుఃఖం తాలూకు భారాన్ని మౌనంగానే మోస్తూ మన మనస్సు పొరల్లో కప్పివేస్తాం అని కవి ఆనంద్ వ్యక్తం చేసిన భావాల తీరు చక్కగా ఉంది.

” ఆ మనిషి తెలిసిన వాడో
” దగ్గరి వాడో అయితే
” కళ్ళతో పాటు గుండెలూ
” ద్రవిస్తాయి గోడుగోడుమంటాయి
” మౌనంగానే
ఆ మనిషి మనకు తెలిసిన వాడు మరియు దగ్గర వాడు రక్తసంబంధీకుడైతే కళ్ళు ఒక్కసారిగా చెమర్చుతాయి,దుఃఖ సాగరంలో మునిగిపోతాం. రక్తసంబంధీకుల కొరకు మన హృదయాలు బాధతో ద్రవిస్తాయి.మనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని గోడుగోడున దుఃఖిస్తాం.చనిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు,వాళ్ళు చూపించిన ఆప్యాయత,అనురాగం,మన కళ్ళలో మన హృదయాల్లో ప్రతిఫలిస్తాయి.మరపురాని వాళ్ళని గుర్తు చేసుకోవడం తప్ప మరేమీ చేయలేని అశక్తత మౌనంగానే మనల్ని వెంటాడుతుంది అని చెప్పిన కవి ఆనంద్ భావన వాస్తవంగా ఉంది.
” పోయినవాడు మనుషులతో తిరిగినవాడయితే
” అక్కున చేర్చుకున్న వాడయితే
” కదిలించిన వాడయితే
” కళ్ళు గుండెలే కాదు
” దేహంలోని అణువణువు
” గుండెల్లోంచి ఎగిసే ప్రతి రక్తం చుక్క
” బోరు బోరున ఏడుస్తాయి
” మౌనంగానే
చనిపోయిన వ్యక్తి సమాజ వికాసం కొరకు పాటుపడిన వ్యక్తి కావచ్చు.సమాజంలో వ్యక్తుల శ్రేయస్సు కొరకు కృషి చేసిన వ్యక్తి అయితే అందరు అతని కొరకు దుఃఖించడం సహజం అని చెప్పవచ్చు.చనిపోయిన వ్యక్తి మనలను కష్ట సమయంలో కనిపించే దేవుడిలా ఆదుకొని మన కన్నీళ్లు తుడిచి మనలను ప్రాణానికి ప్రాణంగా చూసుకొని తన చెంతకు చేర్చుకున్న వాడైతే అనంతశోకంలో మునిగిపోతాం.చనిపోయిన వ్యక్తి తన పాటలతో ఆటలతో కదిలించిన స్ఫూర్తి ప్రదాతలాంటి వ్యక్తి అయితే మన కళ్ళు వర్షిస్తాయి. మన గుండెలు బాధతో విలవిలలాడుతాయి. చనిపోయిన దిగ్గజంలాంటి వ్యక్తి కొరకు మన శరీరంలోని సమస్త నాడులు మరియు మన గుండెల్లో ప్రవహించే ప్రతి రక్తం చుక్క ఆ వ్యక్తిని మరియు అసమాన తేజో మూర్తిని తలుచుకుని బోరు బోరున విలపిస్తాము. మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అతని గళ మాధుర్యం,అనుభవాలను,వ్యక్తిత్వం తలుచుకొని మౌనంగానే మన మనసు పొరల్లో దాగిన విషాదాశ్రువులు మనకు తెలియకుండానే టపటపా రాలుతాయి.
” చీకట్లో ఒంటరిగా కూర్చుని
” దుఃఖాన్ని జ్ఞాపకాల్నీ
” ఎప్పటికో గానీ బయటపడలేదు
” మౌనంగానే
చిక్కటి చీకటి కమ్ముకున్న నిశి రాత్రి వేళ ఒంటరిగా ఒక్కడే కూర్చుని చనిపోయిన వ్యక్తి తాలూకు స్మృతుల పరంపరలను తలచుకుంటూ బావురుమని దుఃఖించాడు.వెంటాడుతున్న జ్ఞాపకాల అనుభూతులను తలుచుకుంటూ రాత్రి భారంగా గడిచింది.అది ఒడిసిపోయే దుఃఖం కాదు. కాబట్టి తొందరగా దుఃఖం నుంచి బయటపడలేదు. లోలోపల అతన్ని తలుచుకుంటూ మౌనంగానే ఆ రోజు దీర్ఘ రాత్రి కాలరాత్రిగా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి.
” ఊపిరి కోల్పోయి ఆచేతనుడయిన
” వాడి దేహానికి ఎవడు పాడె కడితే ఏంది
” ఎవడు మోస్తే ఏముంది
” గాల్లో పేలిన తుపాకులు
” ఎవరిని సముదాయిస్తాయి
” పాత ఫోటోలు… కవితలు
” పాటలు…ప్రకటనలు
” బతికున్నవాడి ఉనికినే చాటుతాయి
” పోయినోడు ఎట్లాగూ వెళ్ళిపోయాడు
” మౌనంగానే
దైనందిన జీవితంలో మనిషి శ్వాస క్రియలు ఆగి ఒక్కసారిగా ఊపిరి కోల్పోతాడు.ఊపిరి లేని వ్యక్తి చేతనత్వం కోల్పోయి అచేతనుడు అవడం సహజమే. చనిపోయిన వ్యక్తి దేహానికి ఎవరో ఒకడు పాడె కడతాడు. ఎవడు పాడె కడితే ఏంది? చనిపోయిన వ్యక్తి ఇతను పాడె కట్టాడు అని వచ్చి చూస్తాడా? చూడడు అని చెప్పవచ్చు.చనిపోయిన వ్యక్తి పాడెను ఎవరో మోస్తారు.పాడెను ఎవరు మోసింది? అతను చూడడు కదా.అయినప్పటికీ చనిపోయిన వ్యక్తి యొక్క దేహాన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడానికి స్మశానానికి తరలిస్తారు. చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవంతో పోలీసులు గాల్లో పేల్చిన తుపాకులు అతనిని తీసుకువస్తాయా? చనిపోయిన వ్యక్తిని తీసుకురావు అని మనకు తెలుసు .చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఎవరినైనా సముదాయిస్తాయా అనేది ప్రశ్నగా తోస్తోంది.చనిపోయిన వ్యక్తి తాలూకు పాత ఫోటోలు,కవితలు పత్రికల్లో కనబడతాయి. అతని తాలూకు కవితలు,పాటలు, ప్రకటనలు బతికున్న రోజుల్లో చేసిన కార్యక్రమాల ఉనికిని వెల్లడిస్తాయి. అతను ఈ లోకం నుండి సెలవు తీసుకొని ఎలాగూ వెళ్ళిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి జరిగిన కపట ప్రేమలు,అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, చనిపోయిన వ్యక్తి తాలూకు పాత ఫోటోలు, కవితలు,పాటల ప్రదర్శనలు ఇవన్నీ స్వార్థపూరిత చర్యలు అని మౌనంగానే లోలోపల బాధను దుఃఖాన్ని అనుభవించాడు అని కవి ఆనంద్ వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది.
” దుఃఖం మనిషి అంతర్యాతన
” రోదన ఓ బహిరంగ ప్రదర్శన.
మనిషి లోపల జరిగే మనసు యొక్క వేదన నుండి దుఃఖం ఉబికి వస్తుంది.అందరికీ తెలిసేటట్లుగా రోదించడం,నటన,కపట ప్రేమకు నిదర్శనం అని చెప్పవచ్చు.ఇవ్వాళ బతికున్నప్పుడు ఎలాంటి శ్రద్ధ చూపని వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చి రోధించడం,ఏడ్చిన ఏడ్పులు,పెడబొబ్బలు ఇవన్నీ బహిరంగ ప్రదర్శనలు అని చెప్పవచ్చు.కవి ఆనంద్ మౌనంగానే అనే పేరిట సమాజంలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయాలు వ్యక్తుల చావుల పట్ల ప్రదర్శిస్తున్న కపట ప్రేమలను బహిర్గతం చేశారు. సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ పెడధోరణుల పట్ల వివేకంతో మెలగాలి అనే సందేశంతో కూడిన మౌనంగానే అనే కవిత అద్భుతంగా ఉంది.కవి ఆనంద్ ను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని
వారాల ఆనంద్ తేది 21 – 08 – 1958 రోజున కరీంనగర్ లో జన్మించారు.తల్లిదండ్రులు తల్లి రాధ,తండ్రి అంజయ్య.తండ్రి అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆనంద్ 5 వ తరగతి వరకు ఇంట్లోనే చదువుకున్నారు.హైస్కూల్ విద్యను కార్కానగడ్డ హైస్కూల్,గంజ్ హై స్కూల్ లో చదువుకున్నారు. ఆనంద్ ఇంటర్మీడియెట్ విద్యను సైన్స్ జూనియర్ కళాశాల,కరీంనగర్ లో చదివారు.ఆనంద్ ఎస్.ఆర్.అర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ లో డిగ్రీ చదువుకున్నారు.ఆనంద్ లైబ్రరీ సైన్స్ విద్యను
ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ లో అభ్యసించారు.ఆనంద్ ఎం.ఏ. ఫిలాసఫీ విద్యను ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో అభ్యసించారు.ఆనంద్ ఎం.ఏ. తెలుగు,
విద్యను ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో అభ్యసించారు. ఆనంద్ ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్నప్పుడే సాహిత్య సృజన ఆరంభించారు.నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పనిచేసారు.పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ గా ఉన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా పని చేశారు.ఆనంద్ తేది18 -01 – 1980,రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంథనిలో లైబ్రేరియన్ గా ఉద్యోగం లో నియమించ బడ్డారు.ఆనంద్ తేది 31 – 08 – 2016 రోజున ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ నుండి లైబ్రేరియన్ గా రిటైర్ అయ్యారు.ఆనంద్ వివాహము ఇందిరా రాణి తో 10 డిసెంబర్,1986 రోజున వరంగల్ లో జరిగింది.
ఆనంద్,ఇందిరా రాణి దంపతులకు ఇద్దరు సంతానం.
1) ప్రథమ సంతానం:రేల భర్త వేణుమాధవ్.రేల వేణు మాధవ్ దంపతులకు ఒక్కరే సంతానం. ప్రద్యుమ్న
2) ద్వితీయ సంతానం: అన్వేష్.
ఆనంద్ ముద్రించిన రచనల వివరాలు.
1)లయ కవితా సంపుటి,1981.లయ కవితా సంపుటిలో ఆనంద్ తో పాటు నలుగురు సహ రచయితలుగా ఉన్నారు.1)అలిశెట్టి ప్రభాకర్2)జింబో 3)వజ్జల శివకుమార్ 4)పి.ఎస్. రవీంద్ర.
2)మానేరు గలగల, సాహిత్య విమర్శ,2014. 3) మనిషి లోపల కవితా సంపుటి,2014.
4) మెరుపు సాహిత్యకారుల ఇంటర్వ్యూలు, 2016.
5) అక్షరాల చెలిమె కవితా సంపుటి, 2017.
6) ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం),2018.
7) ముక్తకాలు చిన్న కవితలు,2019.
8) సొంత వూరు కవితా సంపుటి
8)ఇరుగుపొరుగు (30 భారతీయ భాషల్లోంచి అనువాద కవిత్వం).,2023.
అర్థవంతమైన సినిమాలపై పుస్తకాలు
9)నవ్య చిత్ర వైతాళికులు,1999.
10) బాలల చిత్రాలు
11) సినీ సుమాలు,2002.
12) 24 ఫ్రేమ్స్,2004.
13) బంగారు తెలంగాణలో చలనచిత్రం,2014.
14)తెలంగాణ సినిమా దశా దిశ, 2017.
15)Signature of love (poetry),2016.
16)Children’s cinema,1999
17) పైడి జైరాజ్ ,మిద్దె రాములు,2017.
18)అన్ బిన్ కై చంద్ ,2018.
Directed documentary films
తెలంగాణ సాహితీమూర్తులు
1) ముద్దసాని రాంరెడ్డి
2) యాది సదాశివ
3) శివపార్వతులు
Long Battle with short messages
A Ray of Hope,KAFISO a saga of film lovers
ఆనంద్ అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా అందుకున్న పురస్కారాల వివరాలు.
1) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2022..
2) తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, 2022.
3) తెలంగాణ సాహిత్య పరిషత్ వరిష్ట పురస్కారం, 2023.
4) గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారం, 2017.
5) అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం, జగిత్యాల, 2018.
6) రుద్ర రవి స్మారక పురస్కారం, సిరిసిల్ల,2022.
7) ఉత్తమ ఫిల్మ్ సొసైటీ నిర్వాహకుడిగా ఐ.ఎస్.కె. దేవరాయలు పురస్కారం, విజయవాడ.
8) లాంగ్ బాటిల్ విత్ షార్ట్ మెసేజెస్ డాక్యుమెంటరీకి అంతర్జాతీయ పురస్కారం, 2012.

You may also like

Leave a Comment