Home వ్యాసాలు చేనేత పరిశ్రమ

చేనేత పరిశ్రమ

by Padmasri Chennojwala

మలినాలను తొలగించిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం సహాయంతో దారాన్ని బయటకు తీసి ఈ దారానికి గంచిని పెట్టి గట్టిదనం వచ్చేలా చేసి ఆ తర్వాత మగ్గంపై వస్త్రాన్ని నేస్తారు. నిలువు వరస దారాలను ‘పడుగు ‘ (వార్పు) అనీ, అడ్డు వరస దారాలను ‘పేక ‘(ఫిల్లింగ్ త్త్రెడ్) అనీ అంటారు.

భారతదేశంలో అతి ప్రాచీన కుటీర పరిశ్రమ ఆయన ఈ చేనేత వృత్తి కారణంగా దేశానికి పేరు ప్రఖ్యాతలు , ఆర్థిక బలాన్ని చేకూర్చింది . దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వనరైన చేనేత 100 ఏళ్ల క్రితం నుంచి విదేశీ మరకద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత కలిగినది. శాతవాహనుల కాలంలో మన వస్త్రాలు యూరప్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి

ఆరడుగుల చీరను అగ్గిపెట్టెలో దూర్చి ప్రపంచాన్ని అబ్బురపరచిన ఘనత మన చేనేత రంగానిది. మహాత్మా గాంధీ రాట్నంపై నూలు వడికి దేశ ప్రజలకు స్వదేశీ వస్త్రాలని ధరించాలని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఊతమిచ్చింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి ఉత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు . ‘బానిసత్వం వద్దు ఆత్మగౌరవం ముద్దు’ అని సాగిన స్వాతంత్రోద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా మారింది. ఆ విధంగా స్వాతంత్ర ఉద్యమానికి , చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ అభిరుచులకనుగుణంగా మన చేనేతకారులు తమ కళను, నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి వస్త్రాలు అమెరికా , స్విట్జర్లాండ్ , సింగపూర్ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి . సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్ దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది . రాజాపేట మండలంలోని రఘునాధపురం లో తయారవుతున్న లుంగీలు ముంబై , సూరత్ ల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి .భూదాన్ పోచంపల్లి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం , సంస్థాన్ నారాయణపురం , పుట్టపాక , సిరిపురం , వెల్లంకి ,ఆలేరు ,గుండాల ,నాగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉండడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. ఇక ఇందులోని లోతుపాతులను తరచి చూస్తే….

ఏ బుర్రలో ఏ ఆలోచన పురుడు పోసుకుంటుందో అది ఏ సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుందో చెప్పలేం . తల మీద పాలకుండ , చేతిలో పెరుగు గురిగి పట్టుకొని , కొప్పున పూలదండను ముడిచి , చేతి గాజులు గలగలలు, కాలి గజ్జల ఘల్లు ఘల్లుల సందడింపులతో తన ఇంటి ముందు నుంచి నడిచి వెళుతున్న గొల్లకాంత నీడను చూసిన నేతన్న మదిలో మెరిసిన ఆలోచన ఏడు పదుల ప్రస్థానాన్ని కొనసాగించి , 2012లో ‘జాగ్రఫీకల్ ఇండికేషన్ ట్యాగ్ ‘ ను సొంతం చేసుకుని ‘జీ 20 శిఖరాగ్ర సదస్సు’ లో స్థానం సంపాదించి యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కళాత్మక వస్త్ర సోయగం సిద్దిపేట గొల్లభామ చీరల అద్భుత ఆవిష్కరణ.

సిద్దిపేటకు చెందిన వీరబత్తిని సోమయ్య, రచ్చ రాం నరసయ్య అనే ఇద్దరు నేత కార్మికులు చాలా శ్రమించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు .

చీర అంచులు , పైట చెంగుల్లో వయ్యారంగా హోయలొ లికించే రంగురంగుల గుల్లభామలు సిద్ధిపేట నేతన్నల కళా నైపుణ్యాన్ని ‘ఔరా !’ అనిపించి ఎల్లలు దాటించాయి.

యావత్ భారత దేశంలో తమకు మాత్రమే స సొంతమైన ‘ దరీస్ ‘ను నేసి 2017లో జాగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొంది , లండన్ మ్యూజియంలో ప్రదర్శనా ర్హతను సాధించి , రంగురంగుల తివాచీలను పరిచి ప్రపంచ చేనేత ప్రియులను స్వాగతించిన వరంగల్ జిల్లా కొత్తవాడ నేతన్నల కళాత్మక నైపుణ్యానికి దేశం గర్వపడింది.

తొలిసారిగా జీన్స్ క్లాత్ తయారు చేయడమే కాకుండా ఒకనాటి రాజ కుటుంబాల స్త్రీలు ధరించే హిమ్రు పట్టు చీరలను మగ్గంపైనే వేసి యునెస్కో విశిష్ట సాంప్రదాయ వస్త్రాలలో చోటు దక్కించుకున్న వరంగల్ జిల్లా కమలాపూర్ నీ తన్నుల కళా నైపుణ్యానికి ప్రపంచం అచ్చె రువొందింది.

పట్టుపురుగుల నుంచి దారం తీసి వస్త్రాన్ని నేయడమే కాకుండా అటవీ ప్రాంతాలలో లభించే సహజ సిద్ధమైన వివిధ రంగులతో వాటిని ఆకర్షణీయంగా రూపుదిద్ది మహాదేవపూర్ నేతన్నలు దసలీ పట్టు నేతలోని మెళకువలతో ప్రపంచ చేనేత పటంపై తమ సత్తా చాటుకున్నారు.

సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించడమే కాక వెండి కొంగుతో అరటి , తామర నారుతో పట్టుచీరలు తయారుచేసి అందరిని అబ్బురపరిచి ప్రభుత్వ అవార్డు సైతం అందుకున్నారు.
వందల ఏళ్ల క్రితమే అగ్గిపెట్టలో దూరే చీరలను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఘన చరిత్ర మన చేనేత రంగానిది.

మనదైన ఈ కళను బ్రతికించుకోవడం మనందరి బాధ్యత అని నేననుకుంటాను. ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ మార్పు అనేది మూలం నుంచి వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని నా భావన.
అతి సామాన్యులమైన మనవల్ల ఏమవుతుందని అనుకోకుండా ‘బిందువు బిందువు కలిస్తే సింధువు’ అవుతుందని , అందుకు మన వంతు సహకారం అందించాలని, శుభకార్యాలు , ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు ఈ వస్త్రాలను కొనుగోలు చేయడం తమ విధిగా భావిస్తే , చేనేత కుటుంబాల్లోని యువకులు ఎన్ని కార్పోరేట్ చదువులు చదివినప్పటికీ వారసత్వ సంపద అయిన ఈ నేత పనిని న్యూనతగా భావించకుండా దాన్ని వారి వారసత్వ హక్కుగా గర్వంగా స్వీకరించగలిగితే మన అద్భుతమైన ఈ కళా నైపుణ్యం కనుమరుగవకుండా కొత్తపుంతలు తొక్కుగలదని అనుకుంటాను.

సంపన్న వర్గాల్లోని ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీలు చాలామంది వస్త్రాలు కొనుగోలు చేసి పేదవారికి వితరణ గావించడం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. ఆ సహృదయతకు ఇంకో అడుగును కూడా జోడించి ఈ వస్త్రాలను కొనుగోలు చేసి వితరణ గావిస్తే దానంతో పాటు కళను కూడా బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం.

‘సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడవోయ్ ‘ అన్న గురజాడ అప్పారావు గారి హితాన్ని అనుసరించి మనం కొనుగోలు చేసే వస్త్రాలలో ఇప్పటినుండి చేనేత వస్త్రాలను కూడా జోడించి మనదైన ఈ అద్భుత కళను బ్రతికించి ముందు తరాలకు ఘనమైన కానుకగా అందిద్దాం.

You may also like

Leave a Comment