1927 వ సంవత్సరం జూన్ ఆరవ తేదీన వేటపాలెం గ్రామంలో అంగలకుదిటి వంశంలో జన్మించారు సుందరాచారి గారు. తల్లి దండ్రులు అంగలకుదిటి శేషమ్మ, అంగలకుదిటి మల్లిఖార్జునా చారి గార్లు. అన్నయ్య అంగలకుదిటి రామేశ్వరాచారి గారంటే సుందరాచారికి ఎంతో ప్రేమ. ఆయన అతి పిన్న వయసులోనే మరణించారు. శివుడంటే వల్లమాలిన ప్రేమ భక్తి ఆయనకు. ఎప్పుడూ అభిషేకాలూ, పూజలు అంటూ శివుడ్ని కోలిచే వారు అన్నయ్య. అన్నయ్య రామేశ్వరా చారి మరణం తర్వాత సుందరాచారి కట్టిన తొలి రైసుమిల్లుకు అన్నయ్య పేరుతో “శ్రీ రామేశ్వరా రైస్ మిల్ ‘ అని పేరు పెట్టుకొని తన భాతృ భక్తిని చాటుకున్నారు. తండ్రి మల్లిఖార్జునా చారి మంచి శిల్ప వైపుణ్యం కలవారు. కులవృత్తి అయిన బంగారు ఆభరణాల తయారీ చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఇద్దరు కోడుకులనూ బాగా చదివించాలనీ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని అనుకునేవారు.
తల్లి శేషమ్మ గాన కళా కోవిదురాలు. నిరంతరం పాటలు పాడుతూనే గడిపేది. ఆమె ఏ పని చేస్తున్నా నోరు మాత్రం పాటను పాడుతూనే ఉంటుంది పొద్దున్నే సూర్య నమస్కారాల దగ్గరుంచి అన్ని మడితో భక్తిగా చేసేది. ఆమెకు కూడా శివపార్వతులు అంటే చాలా ఇష్టం . ఉదయాన్నే బావి దగ్గర తలురా స్నానం చేసి, ఆ తడి బట్టలతోనే ఇంటి పనంతా చేసుకుంటుంది. ఆమె మడితో ఉవుప్పుడు ఎవరన్నా తాకారా ! అంతే సంగతులు! వాళ్ళని కోప్పడి మరల పోయి బావి దగ్గరే స్నానం చేసి వస్తుంది.
సుందరాచారి వేటపాలెం గ్రామంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ గ్రామంలో అప్పటికి ఏడవ తరగతి వరకు మాత్రమే చదుపుకోవటానికి వీలున్నది. ఆ తర్వాతి చదువు చదవాలంటే చీరాలకు వెళ్ళవలసి ఉంటుంది. వేటపాలెం చీరాల రెండూ జంట నగరాల్లా ఉంటాయి. ఆయన చదువుకునే సమయంలోనే ఊర్లో స్వాతంత్రోద్యమం ముమ్మురంగా కొనసాగుతుంది. సుందరాచారి కూడా ఆ ఉద్యమం పట్ల ఆకర్షితుడైనాడు. అప్పట్నుంచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం తద్వారా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం చేసేవారు. అప్పటి వరకు టెరి కాటన్ ప్యాంటు, షర్టులు వేసుకునే సుందరాచారి మొదటగా ఖద్దరు కట్టడం మొదలు పెట్టారు. అప్పుడు మొదలు పెట్టిన ఖద్దరు ఆయన 1992 డిశంబరు లో మరణించే దాకా ఆయనను వీడలేదు. ఖద్దరు పంచె, లాల్చీ ధరించేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యతoగా పనిచేసి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. ఇల్లు, చదువు వదిలేసి ఇలా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూ ఉండడంతో తల్లి దండ్రులు పెళ్ళిచేస్తే కుదుట పడతాడని పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు.
1945 వ సంవత్సరం జనవరి నెలలో చీరాలకు చెందిన సామంతపూడి బ్రమ్మయ్య గారి కుమార్తె అయిన గోవిందమ్మతో వివాము జరిగింది. పెళ్ళి తర్వాత భార్యను కూడా స్వాతంత్ర్య ఉద్యమం దిశగా ప్రోత్సహించాడు. పెళ్ళి సమయానికి భార్య గోవిందమ్మకు పది సంవత్సరాల వయసు అత్త నారింట కాలు మోపిన తరువాత నుంచీ ఆమెను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. ఇంటికి ట్యూషన్ పెట్టించి ఆమెను చదువు వైపు చూపు సారించేలా చేశారు. థర్డ్ ఫారమ్ వరకు చదివించారు. అంతే కాకుండా సంస్కృతం, హిందీ బాషల్లోని అనేక పరిక్షలు రాయించారు. గ్రామంలో ఉన్న లైబ్రరీ అయిన సారస్వత నికేతనంలో మహిళా విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో రకాల విద్యలు నేర్పించారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, విద్య వంటి అన్ని రకాల విద్యలనూ నేర్చుకోవటానికి ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే పెళ్ళైన తరువాత భార్యను చదువుకోమ్మని ప్రోత్సహించిన ఆదర్శమూర్తి సుందరాచారి.
స్వాతంత్ర్యం లభించిన తరువాత కొన్నాళ్ళు కమ్యూనిష్ట్ పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వేట పాలెం గ్రామానికి కొద్ది కాలం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఇష్టం చివరి రోజుల వరకూ కొనసాగింది. గాంధీగారు సారస్వత నికేతనాన్ని సందర్శించినపుడు ఆయన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులంతా నడుస్తూ వెళ్ళారట.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు, తామ్రపత్రం లభించాయి. ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలం కూడా లభించింది. . ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చిన స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ కు మాత్రం అంగీకరించలేదు. అప్పటికి ఆర్థికంగా మెరుగ్గా ఉన్నందున ఆ పెన్షనేను వద్దని చెప్పారు. ఆ విధంగా ఆయన గొప్పదనాన్ని చాటుకున్నారు. సమాజంలో స్వాతంత్ర్య సమర యోధులుగా పేరు ప్రఖ్యాతులు, గౌరదం సంపాదించారు.
ఆ తర్వాత రై సుమిల్లు వ్యాపారంలోకి వచ్చారు. వేట పాలెంలో తోలిసారిగా సొంతంగా రైసుమిల్లును నిర్మించుకోని దానికి తన కీర్తి శేషులైన అన్న గారి అవుగారి పేరును పెట్టుకున్నారు. ఏ ఇంజనీరు సహాయం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వయం ప్రతిభ లో రైసుమిల్లును నిర్మించడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. లోహ యంత్రాలు ఆయన చెప్పినట్లుగా వింటాయని అప్పటి కవులు ప్రశంసించారు . రైసుమిల్లు వ్యాపారంతో పాటుగా, సాహిత్య పిపాస కూడా మొదలయింది. అనేక రకాల సాహితీ పుస్తకాలు చదవడం, ప్రముఖ సాహితివేత్తల ఉప న్యాసాలు వినడం చేసేవారు . అప్పటి నుంచి సాహిత్యం పై విపరీతమైన అభిమానం, మమకారం కలిగి ఉన్నారు. అదే భవిష్యత్తులో కవులకు సత్కారాలు చేయటానికి ఛారిటీస్ సంస్థ నెలకొల్పేలా చేసింది.
1966 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన శ్రీ రామేశ్వర రైసుమిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేక మంది పండితుల్ని ఆహ్వానించారు. అప్పటికే వేద కవులకు సహాయం చేయడం మొదలు పెట్టారు .తోలి సారిగా ప్రారంభోత్సవ సమయంలో కవులను పిలిచి సత్కరించడంతో సుందరాచారి సాహితి పిపాస లోకానికి తెలిసింది. వచ్చిన కవులందరూ ఆయన నిర్మాణాన్ని దానగుణాన్ని కీర్తిసూ పద్యాలు చెప్పారు. వారందరికీ వచ్చిన బాధువులందరితో పాటుగా అతిథి మర్యాదలు చేసి ఘనంగా సత్కరించారు. అప్పటి వరకూ సంతానం లేని సుందరాచారి దంపతులను సంతాన ప్రాప్తిరస్తు’ అని కవి పండితలంతా దీవించారు.
పెళ్ళైన ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు లేక పోవడంతో బాధపడ్డారు. ఎన్నో నోములు ప్రతాలు నోచారు. ఎంతో మందికి అన్నదానాలు చేశారు. వారాలు చేసుకుని చదువు కునే వారికి అండగా నిలిచి అందరిలో పోటు ఏదో ఒక రోజు అన్నం పెట్టడమే కాకుండా వారికి సొంత ఖర్చులతో ఉపనయనాలు చేయించారు. పీటల మీద కూర్చునీ పెళ్ళిళ్ళు చేశారు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. సోముల వ్రత ఫలితమో, డాక్టర్ల చేలి చలవో గాని చివరకు సుందరాచారి భార్య గోవిందమ్మ గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషపడ్డారు.
చీరాలలో 1950-60 ప్రాంతాలలో కంచి కామాక్షి అమ్మవారి గుడిని కొంత మంది కట్టడానికి సంకల్పించారు . ఆ గుడి కట్టాక శాశ్వత పూజల కారకు బంధువులతో పాటుగా సుందరాచారి కూడా కొంత ధనమును ఇచ్చియున్నారు. దసరా నవరాత్రులలో ఆ గుడిలో పూజలు జరుగుతాయి. బంధుగణమంతా ఆ పూజల్లో పాల్గొంటారు.
సుందరా చార్యి భార్య గోవిందమ్మకు నెలలు నిండటంతో చీరాల లోని సాల్మన్ ఆసుపుత్రీ కి తీసుకెళ్ళారు. వారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని చెప్పారు. అవి దసరా రోజులు.అందువల్ల కంచి కామాక్షి అమ్మవారి పూజ చేయించి ఆపరేషన్ కు పంపారు. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయడం చాలా తక్కువ మందికి చేసేవారు. ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అలా దసరా నవరాత్రుల్లో “గోవిందమ్మ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మవారి దయవల్ల అంతా మంచే జరిగిందని ప్రతియేటా మూలా నక్షత్రం రోజే అమ్మకు పూజలు చేసేవారు. అలా అమ్మయి పుట్టిన రోజే శాశ్వత పూజ అమ్మవారికి సీ ఏర్పాటు చేశారు.
అమ్మాయి బారసులకు కవులను సత్కరంచే అవకాశం కలిగింది సుందరాచారికి. అప్పటికి యద్దనపూడి సులోచనారాణి నవలలు ఆంధ్ర దేశమంతా ప్రభంజనం సృష్టిస్తున్నాయి . సుందరాచారి కూడా ఆమె నవలలు చదివి అభిమాని అయ్యారు. అందుకే తన ఒక్కగానోక్క కూతురికి ‘సులోచనారాణి’ అని నామకరణం చేశాడు.
ఆ మహాత్సవానికి తన మిత్రులైన కవులందరినీ పిలిచాడు. వారు పద్యరత్యాలతో ఆశీర్వదించారు. ఆయన తన కూతురు యద్దనపూడి సులోచనారాణిలా పెద్ద రచయిత్రి కావాలని కోరుకున్నాడు. ఆనాడు వేట పాలెం, చీరాల “ప్రాంతాల లోని కవులందరూ హాజరయ్యారు. 1969 వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీ అమ్మాయి పుట్టిన తేది ఆ తరువాత చీరాలకు 20 కీ.మీల దూరంలోని ఇంకోల్లు అనే గ్రామంలో మంగి రైసుమిల్లును నిర్మించ దలిచారు. కుటుంబం అక్కడికి మారింది. అక్కడి రైసుమిల్లుకు ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర రైస్ మిల్లు’ అని పేరు పెట్టారు. దీని ప్రారంభోత్సవానికి చాలా ఎక్కువ మంది కవులను ఆహ్వసించారు. అదే సమయంలో కూతురి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కొండూరి రాఘవాచారి, పులివర్తి, శరభా చారి, మునుగంటి కృపాచారి, విశ్వనాధ సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద కవులు హాజరయ్యారు. ఆరోజు వంగవాలు ఆదిశేషశాస్త్రి గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆ మహా కవుల చేత”అమ్మాయికి అక్షరాలు దిద్దించారు. అప్పటి నుంచి అమ్మాయిని స్కూలుకు పంపకుండా టీచర్లను ఇంటికి పిలిపించి చదువు చెప్పించారు. ఒకే ఒక్క సంవత్సరంలో ఐదు తరగతులనూ పూర్తి చేయించి ఆరు సంవత్సరాల వయసులో హైస్కూలులో జేర్చారు. తక్కవ వయసులో డాక్టర్ చదివించి అమ్మయి పెళ్ళి వేయాలని సుందరాచారి ఆకాంక్ష.
అష్టావధాని వంగవోలు ఆదిశేష శాస్త్రి గారు ‘యశోధర’ అన్న కావ్యాన్ని రాశారు. దానికి ముందుమాట తొలి వెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఈ పుస్తకాన్ని సుందరాచారి ఆర్థిక సాయమందించి ప్రింటింగ్ చేయుంచారు. కావ్యదాత సుందరాచారి కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ దాతృత్వం గురించి నాలుగు పేజీల్లో పద్యాలు రాశారు రచయిత. రైసుమిల్లుల్లోని యంత్రాలు సుందరాంచారి చెప్పినట్లు పని చేస్తాయని కాబోలు “లోహజగల్ చాతుర్య” అని బిరుదునిచ్చారు. పూస పాటి నాగేశ్వర రావు అనే అష్టాదధాని రాసిన “శిల్ప సౌందర్యం” అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. అలాగే వేటపాలెం లోని కవి కడెం వెంకట సుబ్బారావు రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక పుస్తకాన్ని అచ్చు వేయించారు. మరొక వీరబ్రమ్మెంద్ర స్వామి కాలజ్ఞాన తత్వములు అనే పుస్తకానికి ఆర్థిక సహాయాన్నాందించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కవుల వెందరివో పుస్తకాలు సుందరాచారి దాతృత్వం వలన వెలుగు చూశాయి. కళాప్రపూర్ణ కొ౦డూరు రాఘవాచారి, దురిశేటి రామాచారి, చిఱ్ఱావూరి నాగభూషణ శర్మ, నాగశ్రీ, వివియల్ నరసింహారావు, ఎర్రోజు మాధవాచారి, మందరపు సత్యా చార్యులు, రావూరి భరద్వాజ వంటి ఎంతో మంది కవులు సుందరాచారి కూతురి అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. కవులందరి పద్యాల ఆశీస్సులు తీసుకొని వారిని ఘనంగా సత్కరించి పంపారు సుందరాచారి.
1974 లో సుందరాచారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆతర్వాత చీరాలలో మరో రైసుమిల్లు నిర్మించటానికి తలపెట్టారు. కుటుంబం చీరాలకు మారింది. ఆ రైసుమిల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి కుమారుడ్ని బడిలో వేయాలనుకున్నారు. రైసుమిల్లు ప్రారంభోత్సవం తో పాటు కుమారుడి
అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారు. ఈ మహోత్సవానికి వంద మంది కవి పండితులను అహ్వానించి బ్రహ్మాండంగా జరిపించారు. ఈ కవి పండిత సభలో కుమార్తె చేత తెనాలి రామలింగడు మొల్లల మధ్య సంభాషణా పద్యాలున్న కథను చెప్పించారు. కూతురు రాణి చదివిన జట పద్యాలను విన్న కవులు “అమ్మాయికి వేదాలు చెప్పించండి అచారి గారూ” అన్నారు. రాణి ని మంచి రచయిత్రి కావాలని ఆశీర్వదించారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ కార్య క్రమంలో కవి పండిత సభ సుందరాచారికి “వదాన్య శేకర”, “అభినవ సమాజ భోజ” అని బిరుదల నిచ్చి సత్కరించింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పూసపాటి నాగేశ్వర రావు గారితో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఫణి భూషణా చారి తో లలిత సంగీతం పాడించారు. ఇది 1978 ఫిబ్రవరి నెలలో జరిగింది. మార్కాపురం నుంచి కన్నెగంటి రాజమల్లా చారి రావూరి భరద్వాజ, ఉటుకూరి లక్ష్మి కాంతమ్మ, వాసిలి వెంకటలక్ష్మీ
నరసింహారావు వంటి మహా కవులంతా వచ్చారు సుందరాచారి కి చిత్ర లేఖనం పై కూడా ఆసక్తి ఎక్కువ. తన రైసుమిల్లుల్లో మద్రాసు నగర సౌందర్యం, ఫ్లోరల్ డిజైన్, కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటాలను ప్రముఖ చిత్ర కారులతో వేయించారు. ఆయన స్వయంగా ఎన్నో చిత్రాలు వేశారు.
కుటుంబ శుభకార్యాలలో ఇలా కవులను ఆహ్వానించి “సత్కరించడం కాకుండా ప్రతి ఏటా సత్కరించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా ఒక ఛారిటిస్ ను ప్రారంభించారు. “శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్” అనే సంస్థను స్థాపించి తద్వారా ప్రతి సంవత్సరం నలుగురు కవులు కళాకారులను సత్కరించాలని సంకల్పించారు. అంతే కాకుండా పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు అందజేయాలని తలపెట్టారు. ఆ విధంగా 1974 నుండి 1992 లో సుందరాచారి మరణించే దాకా విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కవులందరూ “సుంధరాచారి పురస్కారాన్ని పొందిన వారే. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు చాలా మంది స్కాలర్ షిప్పులను పొందిన వారు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ప్రభుత్వ సేవలందిస్తున్నారు. 1992 లో వారు మరణించిన దగ్గర నుండీ చారిటీస్ సంస్థలు నిలిచిపోయాయి.
మరొక కార్యక్రమం 1988 లో తన కుమార్తె వివాహా సందర్భంగా ఏర్పాటు చేశారు. వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి వారి చేత ఆశీస్సులను అక్షరాల రూపంలో అందజేయడం అంత వరకూ ఎక్కడా జరగలేదు. వివాహ ఆహ్వాన పత్రికలో కవి పండితుల అక్షరాక్షతలు అని ముద్రించారు. వివాహానికి ముందుగానే ప్రముఖ కవులందరికీ ఆహ్వానాలు పంపి వారి ఆశీర్వాద పంచరత్నాలను తెప్పించారు. వాటినన్నింటినీ ఒక పుస్తక రూపంగా ముద్రించారు.
సుందరాచారి తన కుమార్తె వివాహ సమయంలో కవి పండిత గోష్ఠి నిర్వహించారు. దీని కోసం ‘వివాహ ముహూర్తాన్ని ఉదయం పూట వచ్చేలా చూసుకున్నారు. మధ్యాహ్య సమయం నుంచి పండిత గోష్ఠి నిర్వహించాలని తలచారు. ఈ పండిత గోష్ఠి అంతా బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా మాటల రచయిత, కవి నాగభైరవ కోటేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. వివాహ మంత్రాల వైశిష్ట్యం గురించి లక్ష్మీ పార్వతి గారు రెండు గంటల సేపు ప్రసంగించారు. సుమారు ఐదారు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కవితా గోష్ఠి కార్య క్రమంలో ప్రాచీన పుస్తక భాండాగార అధ్యక్షులుగా పనిచేసిన డా॥ వి.వి.ఎల్ నరసింహారావు, కళాప్రపూర్ణ కొండూరు రాఘవాచార్యులు, ఉటుకూరు లక్ష్మి కాంతమ్మ, డాll చేబోలు చిన్మయకవి, సంస్కలత పండితులు మునుగంటి కృపాచారి, అష్టావధానికి వంగవోలు ఆదిశేష శాస్త్రి ఈమని దయానంద, దీవి రంగాచార్యులు, చోడా చంద్రశేఖరరావు, షేక్ అలీ, మాగుతారి రామకోటేశ్వర రావు, నాగశ్రీ, మల్లవరపు జాన్, పూసపాటి నాగేశ్వరరావు, అడుగుల రామయ్య బీరం సుందర్రావు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభ్రుతులు పాల్గొన్నారు. వచ్చిన కవులoతా ఇలా వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి సత్కరించడం ఎక్కడా వినలెదనీ కనలేదనీ కొనియాడారు.
వివాహ సందర్భంగా ముద్రించిన పుస్తకానికి ‘కల్యాణ కౌముది’ అన్న పెరు పెట్టారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రముఖ కవులందరూఆశీ: పంచరత్నాలను అందించారు. ఈ పుస్తకాలను మూడు వేల కాపీలు ముద్రించారు. వివాహానికి వచ్చిన వెయ్యి మందికి ఈ పుస్తకాలను పంచారు. గత ముప్పై సంవత్సరాలుగా అందరికీ ఆ ప్రతులు అందిస్తూనే ఉన్నారు.
ఇదీ సుందరాచారి గారు బతికి ఉండగా చేసిన సాహితీ సేవ. వారి భార్య అంగలకుదిటి గోవిందమ్మ గత సంవత్సరం 2018 లో భక్తిపాటలను ‘పుష్పాంజలి’ పేరుతో ప్రచురించారు. ఆవిడ ఆ భగవతీ గానాలను చక్కగా పాడుతుంది. 2019 వ సంవత్సరంలో ‘టిక్ టాంబుర్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. పూర్వకాలం లోని జానపద కథలన్నింటిని తన కుమార్తె చేత రాయించి వాటన్నింటినీ బాలల కోసం ప్రచురిస్తున్నారు. వాళ్ళ కాలంలో చెప్పుకునే, పిల్లల కోసం చెప్పే కథలన్నీ చెప్పి కుమార్తె రాణీప్రసాద్ చేత రాయించి ప్రచురించారు. ఈ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం వారు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్నందించారు. గోవిందమ్మ గారు కూడా సుందరాచారి సహచర్యంలో సాహితీ పిపాసి గా మారారు. వారిల్లు నిత్యం కవుల కవితా గానాలతో, వచ్చి పోయే కవులతో విలసిల్లటం వల్ల ఆవిడకూ సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది.
సుందరాచారి గారు మరణిoచాక వారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వారి కుమార్తె, కందేపి రాణీప్రసాద్, అల్లుడు గారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా|| కందేపి ప్రసాదరావు గార్లు రెండు లక్షల రూపాయలు తెలుగు విశ్వ విద్యాలయానికి డొనేషన్ ఇచ్చారు. 2011 సంవత్సరం నుంచీ శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్వ పురస్కారాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు రెండు తెలుగు రాష్ట్రాల లోని బాలసాహితీ వేత్తలకు అందిస్తున్నారు. వేదాంత సూరి, పైడిమర్రి రామకృష్ణ, డోకల సుజాతాదేవి, వి.ఆర్, శర్మ, పుష్పాల కృష్ణ మూర్తి, బెలగాం భీమేశ్వర్రావు మొదలగు బాల సాహితీ వేత్తలు ఈ కీర్తీ పురస్కారాన్ని అందుకున్నారు.
కుమార్తె కందేపి రాణీప్రసాద్ ప్రతిభ కలిగిన కవులకు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ అంగలకుదిటి సుందరాచారి ఛారిటీస్ తరుపున పురస్కారాలు, సర్టిఫికెట్లు అందిస్తున్నారు. వారిలో ప్రేముఖులు చాగంటి కృష్ణకుమారి, పత్తిపాక మోహన్, షేక్ అబ్దుల్ హకీం జానీ, చిల్లర భవానీ దేవి, వడలి రాధాకృష్ణ వంటి కవులు, రచయితలు ఉన్నారు. సిరిసిల్ల ప్రాతంలోని డాక్టర్ సీట్లు సంపాదించిన విద్యార్థులకూ సర్టిఫికెట్ల సత్కారాలు అందిస్తున్నారు. 2007 రాష్ట్రం లో ఎమ్ సెట్ లో మొదటి ర్యాంకు సాధించిన సాయిష్ రెడ్డిని సత్కరించారు.