Home కథలు అపార్ధం

అపార్ధం

by Devulapalli Vijayalaxmi

అసహనంగా ఫోనులో వాట్సప్ ఓపెన్ చేసాడు రాజశేఖర్.
స్మార్ట్ ఫోను వచ్చినప్పటినించీ వాట్సాప్ ఓపెన్చేయ మెసెజెస్ డిలీట్ చేయా! దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది. పొరపాటున రెండు రోజులు చూడలేదంటే వార్నింగ్ ఇంటర్నల్ స్పేస్ నిండిపోయిందని. వద్దుమొర్రో అంటే అమ్మాయి రాజశేఖరానికి ,అబ్బాయి వాళ్ళమ్మకి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు.
“తెల్లారిందా! పిల్లలకంటే ఎక్కువైంది పొద్దూకులూ ఆ ఫోన్ పట్టుకుని.నాతోకాస్త మంచీచెడు మాట్లడదామనిలేదు. టిఫిన్ , భోజనం
ఆ ఫోన్ పట్టుకొని ఏం తింటున్నారో కూడా తెలియకుండా, ముగించేయడం. ఏమిటో బాబు మీ ధోరణి. కాస్త ఏ.గుడికో గోపురానికో అలా.నడుచుకొని వెళ్దామంటే.మోకాళ్ళ నొప్పులు మోక్షానికి అడ్డు..మీతో మాట్లాడుదామంటే మీకు ఆ వెధవ ఫోన్ తో సరిపోతుంది.” స‌రోజ సణుగుడు వాట్సప్ మెసేజెస్ కి మించి ఉంది.
నిజమే మరి రిటైర్ అయ్యేవరకు తన ఆలనా పాలనా చూసింది.పిల్లల్నిప్రయోజకుల్నిచేసింది.తను తన ఉద్యోగం సంపాదన,తప్పించి వేరే విషయాలు పట్టించుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సంసారాన్ని దిద్దింది.యాంత్రికంగా బాధ్యతలతో జీవితం ఎలా గడిచిందో ఊహకి అందటంలేదు.స్వగతంగా అనుకున్నాడు రాజశేఖర్.
“సరూ! నీ సణుగుడు ఆపు. ఫోన్ చస్తున్నానని మొరపెట్టుఘకుంటోంది. డిలీట్ చేయలేదనుకో, వాట్సిప్ ఎగిరి పొయ్యిందంటే పిల్లలతో వీడియో. కాల్ మాట్లాడలేము”.
“సరే బాబు ఒక అరగంటలో ఆ పని కానీండి నేను ఈ లోగా వంటింట్లో పని పూర్తి చేసి వస్తా! యోగా మేట్స్ వేయండి.” అంటూ నిష్క్రమించింది.
పొద్దున్నే ఇద్దరూ కలసి శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు. రిటైర్ అయ్యిన తరువాత ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు.అందులో భాగమే ఈ వ్యాయామాలు.
★★★
రాజశేఖర్ రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంకా రావలసిన డబ్బు చేతికి అందలేదు. వాట్సాప్ లో “రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫ్రెండ్స్” గ్రూప్ లో చేరాడు. ఊరికొకడు గా చెల్లా చెదరవుతున్న సహచరులతో అనుబంధం ఉండాలని విషయాలు తెలుస్తాయని.
అందులో అతిఛాందసులు రోజూ ఏదో సూక్తి లేక దేముడి బొమ్మతో శుభోదయాలు, పండగల్లో శుభాకాంక్షలు పెడ్తూ ఉంటారు. కొందరైతే మరీ వాళ్ళ పిల్లలవి మనవలవి ఫోటోలు పెడ్తారు.ఎవరి గోల వారిదన్నట్లు ఉంటుంది గ్రూప్.
“అందరూ బాధ్యత గలిగిన ఉద్యాగాలు చేసి రిటైర్ అయ్యారు ఏంలాభం గ్రూప్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు.” స్వగతంగా అనుకోబోయి కొంచెం గట్టిగానే అన్నాడు.
“ఏమిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?” చేయిచెంగుకి తుడుచుకుంటూ అడిగింది సరోజ.
“ఆ‍ఁ ! ఏముంది లేవంగానే నీకు ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకోవడం అన్నా అవుతుంది కాని ,నాకు దీన్ని శుభ్రం చేయటం కావటంలేదు.” అంటూ ఫోను చూపాడు.
“చక్రపాణి అయితే మరీను. వీడు గ్రూప్ లో చాలనట్లు పర్శనల్ గా శుభోదయం ,శుభాకాంక్షలు పంపుతాడు. ఎన్నోసార్లు చెప్పాను ఎక్కడో ఒకచోట పెట్ట రా! రెండుచోట్ల ఎందుకురా ?’అని.
దానికి వాడు, “ఒరేయ్ శేఖర్! అది మాస్ గ్రీటింగ్స్. ఇది నాప్రాణ స్నేహితుడికి పంపే స్పెషల్ కోట్స్. నీకో విషయం తెలుసా! నీకు పంపాలంటే గూగుల్ లో ఎంత సెర్చ్చేస్తానో !” అని.
ఏమిటో వాడి అభిమానానికి నవ్వాలో ఏడవాలోతెలియదు. అంటూ స్నేహితు జ్ఞాపకాల్లో హఠాత్తుగా వెన్ను చరచి నట్లయింది.
అవును దగ్గర దగ్గర నెల రోజుల్నించీ సరిగ్గా మెసేజెస్ డిలీట్ చేయడంగాని తిరుగు మెసేజ్ పెట్టటం చేయలేదు.తమ కంపెనీ రిటైర్మెంట్ గ్రూప్ వాళ్ళ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చిందో చూడనేలేదు . దక్షిణ భారతదేశం తీర్ధయాత్రలకి వెళ్ళటం వచ్చాక కాస్త ప్రయాణం బడలికతో వళ్ళు వెచ్చపడటంతో .
మన గురువుగారివే చాలా ఉంటాయి అనుకుంటూ వాట్సప్ గ్రూప్ తెరిచాడు.
ఏ వేవో చవకబారు జోక్స్,ఫొటోలు తప్పించి శుభోదయం, శుభాకాంక్షలు లేవు.అలా అలా వెనక్కి వెళ్ళి చూస్తున్న నా మతిపోయింది. గత రెండు నెలలుగా చక్రపాణినించీ ఒక్క మెసేజ్ పంపలేదు.వాడి పర్సనల్ ఎక్కౌంటు చూసాను. రెండు నెలల క్రితం అంటే ఆగస్టు పదిహేనున ” స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు”అంటూ చక్రి మెసేజ్ .
దాని క్రింద తనతిట్లు.”ఒ‌రేయ్ చక్రీ!ఒక్కసారి ఫోన్ చేయవచ్చు కదరా! నువ్వు చెయ్యవు,నేను చేస్తే ఎత్తవు”అని. దాని కింద వాడి వైపునించీ ఒక స్మైలీ.
మా చదువు ఉద్యోగం ఒకే చోటవడంతో మా ఇద్దరికీ చాలా అవినావభావ సంబంధం. రిటైర్మెంట్ కి రెండు సంవత్సరాల ముందే వాడి భార్య కేన్సర్ వ్యాధితో పోవడంతో ఆ రెండేళ్ళు ఒంటరిగా అతి కష్టం మీద వంటరిగా సమర్ధించుకున్నాడు.పెద్ద కొడుకు ఢిల్లీలో డిఫెన్స్ లో చేస్తున్నాడు. చిన్నవాడుఅమెరికాలో.తనే సలహా ఇచ్చాడు “పిల్లలు వాళ్ళ దగ్గిరకితీసికెళ్తానంటే వాళ్ళదగ్గరకి వెళ్ళిపోరా!రెండు సంవత్సరాలనించీ చేయికాల్చుకుని అవస్తపడుతున్నావు.” అని.
“ఒరేయ్! ఢిల్లీ వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదురా!కొడుకు కోడలు వారి ఉద్యోగాలలో వాళ్ళు బిజీ. మనవలు చదువులు.అందులో వాడికూతురు ఐ.ఏఎస్ కి ఎప్పియర్ అవుతోంది.తాత తాత అంటూ అదేకాస్త నాదగ్గరకి ఎక్కువ వచ్చేది” అన్నాడు.
“ఏది ఏమైనా నువ్విక్కడ వంటరిగా ఉండద్దు.
ఫోన్లో మాట్లాడుకుందాం!ఇండియా లోనే కదరా!నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు.” అని కష్టం మీద ఫ్రెండ్సందరం కలిసి ఒప్పించారు.
గత రెండు నెలలుగా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు.అలా అని ఫోన్ డెడ్ ఏమో అనుకోవటానికి యధావిధిగా శుభోదయాలు, శుభాకాంక్షలు వస్తున్నాయి. మెసేజెస్ కి ఎమోజీ లు.
ఏది ఏమైనా ఇవాళ వాడితో మాట్లడాలని నిర్ణయించుకున్నా. అదేమాట సరోజతో చెప్పాడు రాజశేఖర్.
“అలాగా అండీ! జ్రోత్స్న పోయినప్పటినించీ అన్నయ్యగారు చాలా వంటరి వారయ్యారు సుమా!”
“అవును సరోజా!జంటలో ఏ ఒక్కళ్ళు వంటరిగా మిగిలినా వారి బ్రతుకు దుర్భరం.సరే ఇవాళ వాడితో ఎలాఅయినా మాట్లాడాలి. వాడు కాంటాక్టు లోకి వస్తే నిన్ను పిలుస్తా పలకరిద్దుగాని అంటూ వాడికి అదేపనిగా కాల్ చేస్తునే ఉన్నాడు. అటునించీ స్పందన లేదు. రాజశేఖరానికి పట్టుదల ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలైంది. రాజశేఖర్ మొహం వివర్ణమైంది. దుఃఖం తన్నుకు వస్తోంది. “ఏమైంది వాడికి?” అదేమాట సరోజతో అన్నాడు.
“ఫోన్ పారేసుకున్నారేమో! లేదా కొత్తఫోన్లో కాంటాక్ట్స్ లోడ్చేసుకోలేదేమో ! లేదా కొత్త నంబరు తీసు కున్నారేమో! “
సరోజ ఇన్ని కారణాలు చెప్పినా రాజశేఖర్ మనసు రాజీ పడలేదు. అతని మీద అతనికే కోపం వచ్చింది.
ఇండియాలోనే గా అన్నాడు కానీ వాడి ఢిల్లీ ఎడ్రస్స్ గానీ వాడి కొడుకు ఫోన్ నంబరు కానీ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు తనకి పిచ్చి వాడిలా?
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో!స్వంత పిల్లల దగ్గరనుండి క్షేమసమాచారం తెలియక పోతే అల్లల్లాడినట్లు అల్లల్లాడిపోయింది మనసు.
“శేఖర్!కోవిడ్ తగ్గాక హైదరాబాద్ వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా!ఎవరైనా ఉంటే చూడు.” అన్న వాడి మెసేజ్ గురించి ఆతృతగా వెదికా!
మెసేజ్ కనబడింది .ఆఁ ! ఆ మెసేజ్ ఆఖరి మెసేజ్ వాడు టైప్ చేసింది. తరువాత అన్నీ ఎమోజీలు స్మైలీ లు.
నా ఆలోచనలకి అంతరాయంకలిగిస్తూ ఫోన్ మ్రోగింది.చక్రపాణి దగ్గరనించీ.ఒక్కక్షణం సంతో్షం వెంటనే విపరీతమైన కోపం వచ్చింది.ఫోన్ ఎత్తుతూనే ఛడామడా తిట్లవర్షం మొదలుపెట్టా!”ఇడియట్! నన్నింత టెన్షన్ పెట్తావా” అంటూ.
“అంకుల్! నేను రాకేష్ ని.చక్రపాణిగారి పెద్దబ్బాయిని”
“అవునా బాబూ రాకేష్!బాగున్నావా!వాడికివ్వు ఫోన్.”
“అంకుల్ ! నాన్నగారు లేరండీ!”
“అమెరికా వెళ్ళాడా ఫోన్ మరచిపోయి‌‌‌‌‌.వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ బాబూ.”
“లేదండీ !నాన్నగారు పరమపదించి నెలైంది.
ఇవాళ మాసికం ఇక్కడ దగ్గర సంస్థ లో పెట్టివచ్చాం. నాన్నగారి ఫోన్ చాలా రోజులుగా కనపడలేదు. బాయ్ ఎక్కడోపెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారి గది శుభ్రం చేస్తుంటే కనపడింది. చార్జ్ లేకపోవటం తో చార్జికి పెట్టి ఇప్పుడే నాన్నగారి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్దామనుకుంటుంటే మీ మిస్డ్ కాల్స్ చూసా!
ఫారెన్ ఎంబసీస్ ని రిసీవ్ చేసుకోవటం వారి సెక్యూరిటీ ఎరేంజ్మైంట్స్ తో నాన్నగారు పోయాక కంటినిండా ఏడవలేదు అంకుల్ .”
రాకేష్ !గద్గద స్వరం విని రాజశేఖర్ తల తిరిగి పోయింది.
బలవంతంగా తెప్పరిల్లి ,”ఎలా జరిగింది బాబూ రాకేష్ ” .
“నాన్నగారికి మూడునెలల క్రితం పరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది.ఒకచేయి.కాలు పడిపోయాయి. అప్పటినించీ మంచంలోనే ఉన్నారు. ఫిజియోథె‌రపీకి మెడిసిన్స్ కి రెస్పాండ్ కాలేదు.” ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం బ్రయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు.అంతా క్షణాలమీద అయిపోయింది దుఃఖాన్ని అదిమి పెట్టుకొని వివరాలు అందించాడు రాకేష్.
“మరి ఆ మెసేజెస్……” రాజశేఖర్ మాట పూర్తి కాకుండానే….,.
“నాన్న గారికి ఒక బాయ్ ని కుదిర్చాము. ఆయన అవసరాలు తీర్చటానికి.వాడి కి ఫోన్ యూసేజ్ బాగా తెలుసు.ప్రతిరోజు ఆయన కాలకృత్యాలు తీర్చిన తరువాత ఆయన చూపెట్టిన వాళ్ళకి గుడ్ మాణింగ్ మెసేజెస్ పంపమనేవారు.మెసేజెస్ చదివి ఎమోజీలు పంపమనే వారు.పండగలకి నేనే గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసే వాడిని.అవి పంపేవారు. ఆయన ఫ్రెండ్స్ మెసేజెస్ చదువుతుంటే కళ్ళలో ఒక స్పార్క్ చూసేవాడిని. నాబిజీ లైఫ్ లో ఆయన పరిస్థితి మెసేజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు . కాకపోయినా ఆయనకి సింపతీ ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంకుల్ అందుకని.
అంకుల్ మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడుతుంటే నాన్నతో మాట్లాడినట్లుంది.గుండె బరువు తగ్గినట్లుంది అంకుల్. వచ్చేనెలలో నేను హైదరాబాద్ వస్తాను. మీ ఇంట్లోనే దిగుదామనుకుంటున్నా! మీకు ఇన్కన్వీనియన్స్ అయితే తెలపండి అంకుల్. మాఇంటి గురించి డెసిషన్ తీసుకోవాలని దానికి మీ సలహా కోరుతున్నా!”
“అలాగేబాబూ!నాకెటువంటి ఇబ్బంది లేదు.చక్రపాణే వచ్చాడనుకుంటా. అమ్మాయిని పిల్లల్ని కూడా” తీసుకునిరా!మీపినతండ్రి పెదతండ్రి ఇల్లనుకో! నా! ఎడ్రస్ వాట్సప్ లో పెట్తా ఉంటా బాబూ రాకేష్!”
రాజశేఖర్ మెదడు మొద్దుబారిపోయింది వాడి సిన్సియారిటీకి.అంత సుస్తీలో కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి దగ్గర నుండి శుభోదయం రాని రోజు లేదు.తను పెట్టిన మెసేజెస్ కి వాడెందుకు జవాబివ్వకుండా ఎమోజీలు పెట్టెవాడో తెలిసాక రాజశేఖర్ గుండె పగిలిపోయింది.
“ఒరేయ్!చక్రీ “నువ్వు చాలా ‘గ్రేట్’ రా!నీలాంటి స్నేహితుడు ఒక్కడు చాలురా జీవితానికి. నీచిరునవ్వు నీ స్మైలీ లో ఉందిరా! ఒరేయ్!ఎంత అన్యాయంరా!నీవు పోయి రెండు నెలలు, నీవు మంచంలో పడి ఆరునెలలు, వెరసి ఎనమిది నెలలు.
నిన్ను నాలో ఎప్పటిలాగే ఊహించుకునేటట్టు చేసావు. స్నేహానికి నిర్వచనం నువ్వేరా!నీదగ్గిరనించీ మెసేజెస్ రాకపోతే ఎందుకా అని కూడా ఆలోచించని దౌర్భాగ్యుడిని.నువ్వు పోయా వని తెలియక నీ శుభోదయాలు,శుభాకాంక్షలు డిలీట్ చేయాలని తిట్టుకున్నా! తనలో తను ఉన్మాదిలా గుండె పగిలే లాగా ఏడుస్తూ అనుకున్నాడు.
★★★
తెల్లవారింది. ఎప్పటిలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్..యాంత్రికంగా గ్రూప్ ఓపెన్ చేసాడు.
అందులో మెసేజెస్,గ్రీటింగ్స్ అన్నీ చాలా అమూల్యమైనవిగా ఉన్నాయి.గబగబా అందరికీ శుభోదయాలు,శుభాకాంక్షలు, టైప్ చేసాడు! రెగ్యులర్ గా మెసెజ్ పెట్టే వాళ్ళ దగ్గిర నించీ మెసేజ్ లేకపోతే ఫోన్ చేసి వాళ్ళెలా ఉన్నారో కనుక్కున్నాడు! చాలా తృప్తిగా ఉంది నాకిప్పుడు. అనుకుంటూ వాలుకుర్చీలో వాలుతూ, ‘చక్రీ !నాకు మంచి గుణపాఠం చెప్పావురా! ‘అంటూ చమ్మగిల్లిన కళ్ళని పంచె అంచుతో తుడుచుకున్నాడు రాజశేఖ‌ర్.

You may also like

Leave a Comment