ఒక ప్రబంధమైనా, ఒక పురాణమైనా, ఒక గేయమైనా, ఏ రచనలోనైనా, అందులో రవ్వంత హాస్యరసము మిళితమై ఉన్నాగాని పఠితులు ఆ కావ్యరసానందాన్ని పొందలేరు.
మనిషి జీవితంలోని విషాదాలను, కష్టాలను మరిచిపోవాలంటే మనసారా నవ్వుకుంటే గాని వాటిని కొద్దిసేపైనా మరచిపోయి తన జీవనయాత్రను కొనసాగించగలడు. ”సంతోషమే సగం బలం” అన్న సామెత ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకారి
భీభత్సాద్భుత శాంతాశ్చ రసారి పూర్వైరుదాహృతః
అని మన లాక్షణికులు మొదలు శృంగారానికి ఆ తర్వాత హాస్యానికే ప్రాధాన్యతనిచ్చారు.
శృంగారము కేవలము యౌవనుల మనములను మాత్రమే రంజింపజేయును. కానీ హాస్యము సర్వవేళ సర్వావస్థలయందు ఆబాలగోపాలము నానందింపచేయును.
హాస్యము అనగా నవ్వు పుట్టించే సంఘటన, మాటలు, చేష్టలు, ఆకారాదులు.
”వికృతి దర్శనాది జన్యో మనోవికారః హాసః” స్వభావ విరుద్ధములగు వేషభూషాదుల వల్ల కూడా హాస్యము లేక నవ్వు గల్గును.
హాస్యరసమునకు స్థాయీభావము హాసము. ఇది 6 విధములుగా విభజింపబడింది.
1) స్మితము
2) హసితము
3) విహసితము
4) అవహసితము
5) అపహసితము
6) అతి హసితము
1. స్మితము : కొద్దిగా చెక్కిళ్ళు వికసింపజేసి, కనుబొమ్మలు కదిలించుచు, పండ్లు కనిపించకుండా మధురముగా నవ్వుట.
2. హసితము : ఎక్కువగా ముఖము, కన్నులు, చెక్కిళ్ళు వికసింపజేసి కొద్దిగా పండ్లు కనిపించునట్లు నవ్వుట.
3. విహసితము : లోలోపలనే మధురస్వరము కలుగగా, ముఖముపై రాగము జూపుచు, నోరగంట తిలకించుచు మంద్రముగా నవ్వుట.
4. అవహసితము : భుజాలు, తల అదులునట్లు ఓరచూపుతో ముక్కుపుటాలు లెస్సగా వికసింపజేసి నవ్వుట.
5. అపహసితము : తగిన కారణం లేకుండా కన్నీరు కారుస్తూ, భుజాలు, వెంట్రుకలు అదురునట్లు నవ్వుట.
6. అతిహసితము : కన్నులనుండి నీరు కారునట్లు చేతులు, కడుపు, పార్శ్వములదురునట్లు, కఠోరధ్వనితో కర్ణకటువుగా నవ్వుట.
ఇట్లు ఇన్ని రకాల నవ్వులు మన లాక్షణికులు నిర్వచించారు. మరియు ఇందులో
ఉత్తములు – స్మిత హసితులు గా,
మధ్యములు – అవహసిత, విహసితులుగా
అథములు – అపహసితాతి హసితులుగాను పేర్కొనబడ్డారు.
ఈ హాస్యము పుట్టుటకు నిర్ణీతమైన కాలముకాని, వస్తువుకాని, దేశముకాని, పదజాలముకాని లేదు. మానవుని చిత్తవృత్తిపై, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ఎంత నవ్వించినను నవ్వరు. నవ్వేవారిని చూసి సహించరు. అందరినీ నవ్వించి, తాను నవ్వుతూ బాధలను మరిపింప చేసేవారు చాలా తక్కువ. ఇది దైవదత్తమగు ప్రతిభ.
”నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా” అన్న పాట ఇందుకు నిదర్శనం.
వెఱ్ఱి వెంగళాయిలు, బొజ్జ బాపలు, గుజ్జు మనుషులు, నత్తి చెవిటి కుంటి గుడ్డి మొదలగు అంకవైకల్యపు వారి చేతలు, ముదుసలి మొగడు పడుచు పెండ్లాము జంట, బావామరుదుల సంభాషణ, వదినె మరదళ్ళ విసుర్లు, ఛాందసుల ప్రవర్తన, బుడ్డరుఖాను, బఫూను, పిసినారి మొదలగువారి చేష్టా విశేషాలు నవ్వు కల్గించును.
కాని ప్రకృతి వల్ల వచ్చిన స్థితిని చూసి నవ్వరాదు.
సామాన్యముగా నవ్వు ఆకస్మిక సంభవాలకు, పరధ్యానంగా ఉండేవారికి, వంకరటింకర మాటలకు, తిట్లకు, కొత్తపాత ఫ్యాషన్లకి, అలంకారాలు విపరీతమైన, పిరికితనానికి, భయానికి, వ్యర్థ కోపానికి, మిశ్రమ భాషా చేష్టాదులకు కల్గుతుంది.
తప్పర్థాలు, విశేషార్థాలు, అపార్థాలు, వికృతార్థాల వల్ల నవ్వు కల్గును.
ఖ.జు. డిగ్రీని మేకప్ ఆర్టిస్టు అనీ, ఔ.ఐబీ. డిగ్రీని బాటా షూ కంపెనీ అనీ, షికారును ఐనీలి ష ్పుబిజీ అనీ, మనిషిని ఖళిదీలిగి ష ఐనీలి అనీ అంటే నవ్వనివారికి కూడా నవ్వు వస్తుంది.
మాటలు మాట్లాడుటలో కూడా కొందరికి నవ్వు కల్గించును. మాలతి అనే అమ్మాయి వద్దకు వెళ్ళి మీరు మాలా? అనుటకు బదులుగా మీరు…. (అని కొంచెం ఆగి).. మాలా? అంటే అపార్థము కల్గి నవ్వు వచ్చును.
అదీగాక ఒకడు కాలుజారి పడ్డాడని నవ్వితే ఎంతో బాధ కల్గుతుంది. అన్ని సందర్భాలలో నవ్వు అంత మంచిది కాదు.
‘నవ్వంగ రాదు పలుమరు
నవ్విన చిఱునవ్వెగాని నగరాదెపుడున్’ అన్నట్లు, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా నవ్వితే అంత మంచిది కాదు. అనేకులు అనేక అర్థాలు తీసుకుంటారు.
నవ్వకు మీ సభలోపల
నవ్వకు మీ తల్లిదండ్రుల నాథుల తోడన్
నవ్వకు మీ పరసతితో
నవ్వకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
అని సుమతీ శతకకారుడు బద్దెన కూడా అన్నాడు.
పెళ్ళిళ్లలో వియ్యాలవారి విందులు, వేళాకోళాలు నవ్వు పుట్టిస్తాయి.
బూతాడక నవ్వు పుట్టదన్నాడు గువ్వల చెన్నడు. కానీ బూతు ఉత్తమ హాస్యము కాదు.
నేటి మన సినిమాలల్లో వచ్చే హాస్యము వల్ల నవ్వుగాదు కానీ వెగటు కల్గిస్తుంది.
ఇద్దరాడవాళ్ళ సంభాషణలో ఒకావిడ ”మావారు కలెక్టరు” అంటే మరొకావిడ ”మావారూ బిల్ కలెక్టరు” అంటుంది .ఇది విన్నవారికెంతో నవ్వు వస్తుంది.
”నా భర్త డాక్టరు” అని ఒకావిడంటే, ”నా భర్త కండక్టరు” అని మరొక ఆవిడ అంటే నవ్వు రాక మానదు.
అసభ్యంగా వ్యక్తుల స్థాయిని గమనించక, దేశకాల పాత్రముల నెంచక, సంగతి సందర్భములు లెక్కించక, మోతాదు మించిక, శ్రుతి తప్పక, స్థాయి చెడక, మర్యాద విడవక, ఔచిత్యంగా, స్వారస్యంగా, సవ్యంగా, నవ్యంగా, భవ్యంగా జనింపచేసే నవ్వే నవ్వు. తేలికగా సమయస్ఫూర్తిగా నవ్వింపజేసేదే నవ్వు.
మన తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారి ప్రహసనములు, గణపతి, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం, అడవి బాపిరాజు గారి కొంటె కోణంగి, గురజాడవారి కన్యాశుల్కం, పానుగంటి వారి సాక్షి, మునిమాణిక్యం వారి కాంతం కథలు, విశ్వనాథ వారి ‘హాహాహూహూ” శ్రీశ్రీ వారి వారం-వారం మొదలగునవి ఉత్తమ హాస్యరచనలుగా పేర్కొనబడ్డాయి.
అంతేగాక వైద్యపరంగా కూడా మానవునికి హాస్యము ఒక టానిక్ లాంటిది. నవ్వు శ్వాసకోశాన్ని క్షాళనం చేయటము, శిరస్సుకు రక్తాన్ని తోడటము, మానసికశ్రమకు ఆటవిడుపుగా ఉండటం మొదలైనవి కల్గిస్తుంది.
ప్రస్తుతం వచ్చే దిన, వార, పక్ష, మాస పత్రికల్లో నవ్వు పుట్టించే జోకులు, కార్టూనులు తప్పక ఉంటాయి. కొన్ని హాస్యపత్రికలు కూడా వెలువడుతున్నాయి.
ప్రాచీన కవులలో కూడా హాస్యరసం పండించినవారు ఉన్నారు.
ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో అర్జునుడు ద్రుపదుని పట్టితేగా ”వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులె ! అని ద్రోణాచార్యులచే మేలమాడించుట ఉత్తమ హాస్యానికి మచ్చుతునక.
అలాగే తిక్కన ఉత్తరుని ప్రగల్భములు, బృహన్నల హావభావ చేష్టలలో హాస్యరసమును గుప్పించాడు.
పోతన కూడా భక్తి శృంగారములతో పాటు యశోదమ్మతో, గొల్లపడుచులు ఫిర్యాదు చేయుట, చిలిపి చిన్ని కృష్ణుని అల్లరి చేష్టలలో హాస్యరసమును మేళవించాడు.
ఇక శృంగార కవియైన శ్రీనాథుడు తన చాటుపద్యాలలో ”జొన్నకలి జొన్న అంబలి” అంటూ, రాయలసీమలో నీటి కరువేర్పడినపుడు
‘సిరిగలవానికి చెల్లును
తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్” అంటూ హాస్యపూరితములగు పద్యములను నుడివారు.
ఇక అష్టదిగ్గజముల వరకు పోతే తెనాలి రామకృష్ణుల వారి చేష్టలు, రాయల ఆస్థానమునకు విచ్చేసిన భట్రాజులను, పండితులను ఓడించుటలో హాస్యము కన్పించును. ఇతనికి ‘వికటకవి’ అని బిరుదుకూడా ఉన్నది. అతనికి హాస్యచమత్కృతికి మచ్చుతునకలు కొన్ని.
ఒకనాడు పింగళి సూరనగారు సభలో అష్టదిగ్గజములతో కొలువుతీరి ఉండగా ”తెనాలి రామలింగడు తిన్నాడు తట్టెడంత” అని అంటుండగానే వెంటనే సూరనగారిని పూర్తి చేయనివ్వకుండా రామకృష్ణుడు లేచి ”బెల్లం బెన్నగ మన పింగళి సూరన్నకు నోరంత పేడయై పోయెనుగా” అని చమత్కరించగా అందరూ నవ్వారు.
ఒకరోజు ఒక భట్రాజును ఓడించాలని
”మేకతోకకు మేకతోక మేకకుతోక
మేకతోకా మేక తోక మేక” అని మేకల మందను వర్ణింపగా అతడు అందులోని అర్థమును గ్రహించక ఓడిపోయి వెళ్ళాడు. ఇలా చెప్తూపోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
అలా తన హాస్య చమత్కృతితో వచ్చిన ఉద్ధండ పండితులనందర్నీ ఓడించి పరాభవం గావించాడు.
ఈ విధంగా హాస్యము మనస్సుకు హాయిని కల్పించేదిగా ఉండాలి గాని, అది అపహాస్యమును కల్పించునదిగా ఉండరాదు.
”అన్నమయితే నేమిరా? మరి సున్నమయితే నేమిరా?” అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా! అంటే ఎంతో నవ్వురాక మానదు.
అట్లే సంభాషణలో చమత్కృతి కలిగినా నవ్వురాక మానదు. ఒకరిని అవమానపరుచబోయి, తానే నవ్వుల పాలవుట ఇందులోని అర్థం.
ఒక రెడ్డిగారు ఒక కవితో ”ఓహో! మీరు కపీశ్వరులా?” అని హేళన చేయగా, ఆతడు ”వే” పట్టినట్లు నీ నోట ”వీ” పట్టదేమి” అనగా ఆరెడ్డి అవనత వదనుడయ్యాడు. ఇట్లే ఒకరిని అనబోయి తానే తిరిగి అదే మాటను పొందుట వినేవారికి నవ్వు వచ్చును.
అలాగే మిశ్రమ భాషలో మాట్లాడినా, ఆంగ్లము-తెలుగు, సంస్కృతం-తెలుగు ఇలా మిళిత భాష విన్నా హాస్యం కలుగుతుంది.
‘ప్రథమం ఆవులించంత
ద్వితీయం కాళ్ళు చాపటం
తృతీయం త్రుళ్ళిపడటం
చతుర్థం లేచిపోవటం”
అన్న ఎవరికైనా నవ్వు వస్తుంది.
ది స్కై యీజ్ మబ్బీ
ది రోడ్ యీజ్ దుమ్మీ
ది మనీ యీజ్ కమ్మీ
ది ఫూల్ యీజ్ బ్యూటీ
అని వచ్చీరాని ఆంగ్లం తెలుగు మిళితం చేసి మాట్లాడినా హాస్యం కలుగక మానదు.
ఉచ్ఛారణా దోషం వల్లను, ఒక మాటకు రెండర్థాలున్నను నవ్వు వస్తుంది.
”కాఫీ తేరా” అంటే నోటుబుక్ (కాఫీ) తెచ్చిన నవ్వు వస్తుంది.
కావ్యానికి ప్రతిభ ఎంత అవసరమో, హాస్యసృష్టికి అంతే ప్రతిభ అవసరం.
నవ్వు జీవిత వికాసానికి ఊతకఱ్ఱ వంటిది. మనసారా నవ్వలేని వానికి ఆనందం కించిత్తైనా ఉండదు. జీవితం నిస్సారంగా ఉంటుంది. దుర్భరమవుతుంది. లేనిపోని అంతఃరోగములు వచ్చును. మంచిగా నవ్వు నేర్చినవారు, దుర్భరదురిత దుఃఖములను కూడా ఆనందమయములుగా చేసుకొంటారు. సంస్కృత తెలుగు మిళితమైన ఈ పద్యభావం
కక్షుధాతురాణాం న ఉడికిర్న ఉడకః
అర్ధాతురాణాం న చెల్లిర్న చెల్లః
నిద్రాతురాణాం న మెట్టర్న పల్లః
కామాతురాణాం న ముసలిర్న పిల్లః
అన్నచో నవ్వు పుట్టక మానదు.
మానవులెంత నవ్వగలిగితే అంత శరీరారోగ్యము కలుగుతుంది. నవరసాల్లో హాస్యరసము మాత్రమే మానవునికి ఆనందదాయకమును కల్గుజేయుననుటలో సందేహము లేదు. కడుపార తాను నవ్వి ఇతరులను నవ్వులలో ముంచెత్తేవాడే రసహృదయం కలవాడు.
విషాదంలోంచే హాస్యము జనించిందనే వింతవాదం కలదు. మానవునికెంత కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకడమనేది ఒక గొప్పవరం, కళ. అది సామాన్యంగా అందరికీ అలవడదు. అందరూ ఏడుస్తూ కూర్చుంటే, నవ్వించే వాడొకడుంటే, అందరూ తమ తమ బాధల్ని విస్మరించి, జీవితాన్ని ఆనందమయం చేసుకోగల్గుతారు.
అందువల్లే పూర్వం రాజుగారి కొలువుల్లో విదూషకులుండేవారు. శ్రీకృష్ణదేవరాయల వారి తెనాలి రామకృష్నుడు, అక్బర్ పాదుషా వద్ద బీర్బల్ అందుకు దాహృతులు. నాటి కాళిదాస, భాస, భారవి లాంటి మహాకవుల కావ్యాలలో విదూషకుని పాత్ర తప్పక ఉండేది.
”అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు అతిగా నవ్వినా ప్రమాదమే.
ఎంత అందంగా ఉన్నా ముఖంలో రవ్వంత చిరునవ్వు కన్పించకపోతే వారితో ఎవ్వరూ స్నేహం చేయలేదు. మనుషులు ఒకరికొకరు పరిచయం కానపుడు, మొదట ‘నవ్వే’ వారిని పలుకరించి స్నేహాన్ని కలుపుతుంది. ఒక చిరునవ్వే వేయివరహాలంత విలువ చేస్తుంది.
మనస్సలను రాగరంజితము చేసే హాస్యరసము ప్రతి గ్రంథరచనలో ఉండటానికి ప్రోత్సహించాలి. హాస్యరచన పోటీలు పెట్టి ఉత్తమ హాస్యమును ప్రచారం చేయాలి.
విషాదాంతమైన కొందరి మానవ జీవితాల్లో వెలుగులు నింపే హాస్యరచనలు ఎక్కువగా రావాలి. అందరి హృదయాలు ఆనందమయం కావాలి.
అరాచకత్వం, అన్యాయం, అశ్లీలం, అధికారత్వం చెలరేగుతున్న ఈ రోజుల్లో ఆధునిక యువ కవులు ముందుకువచ్చి, ప్రజలలోని అవినీతి, కుళ్ళు, కుతంత్రం పారద్రోలి జాతీయ సమైక్యతను నెలకొల్పేటటువంటి సున్నితమైన హాస్యరచనలు చేసి మానవ ప్రజావళిలో మార్పులను, చైతన్యాన్ని తీసుకొని రావాలి.
శ్రీశ్రీ గారు వ్రాసిన ”మహాప్రస్థానం”లా హాస్యభరితమైన అందరికీ అర్థమై, అలరించే విధంగా హాస్యరచనలు పెక్కులు, మిక్కిలిగా రాసి, జనంలో చైతన్యాన్ని తీసుకొని రావాలి. ప్రాచీన కాలంలో మన పూర్వ కవులు వ్రాసిన ఉత్తమ హాస్యరచనలకై కృషిని చేయాలి.
అన్ని రసాల్లో కన్న
హాస్య రసమే మిన్న
అది లేని జీవితం ఓరన్నా !
నిస్సారమేరా ఓ కన్నా !