సోమవారం నిశికాంత ఆగమనంతో మా సోమవార కుటుంబ సభ్యులందరూ అంతర్జాల సాహితీ ప్రాంగణంలోకి ఒక్కొక్కరుగా ఆసీనులవడం మొదలెడతారు. అన్ని వయసుల కలబోత మా లోగిలి, భేషజాలు ఉండవు, మాట్లాడుకోవడం కూడా అరుదే! నమస్కారంతో మొదలై చిన్న సమీక్షో, కవిత్వమో , పుస్తకావిష్కరణతోనో మాటలు మొదలౌతాయి.
మూల స్తంభాలు పెద్దలు ,శ్రీ కందుకూరి శ్రీ రాములు బాబాయ్ గారు గాని ,సోదరులు శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు గాని ప్రయోక్తలుగా ,చక్కని భాషణం చేస్తూ కవుల రచనలను విశ్లేషిస్తూ, చిన్నచిన్న సవరణలు చేస్తూ, ప్రశంసిస్తూ సాగుతుందీకవనగోష్ఠి అంతా ‘నేనే’, అంటూ’ శ్రీ నిజాల్ని’ వెల్లడిస్తూ శ్రీరాములు గారు ప్రోత్సహించే తీరు బాగుంటుంది. ‘పట్నం విస్తరిస్తుందంటూ,’ దేశం ఒక అబద్ధపు పాలన ,వంచనలో ఉందని ‘దేశాన్ని బతికించుకుందాం ‘అంటూ ఉత్తేజితుల్ని చేస్తూ సోదరులు సంపత్ గారు తమ కవితలతో అలరిస్తారు. మరియు వీరి విశ్లేషణాపటిమ అమోఘం.
మా కవన కురువృద్ధులైన శ్రీ కందాళై రాఘవాచారి బాబాయ్ గారు ఓసారి’ మట్టి పిల్ల’ శ్రమ సౌందర్యాన్ని చూపిస్తూ , మరోసారి ఇంట్లో మామిడి చెట్టు ఉంటేనే కచేరి చేస్తానంటుంది నా కలంలోని కోయిల అంటూ చెప్తారు. సోదరులు బక్కారెడ్డి గారు స్పృశించని అంశమే ఉండదు. అరవై ఆకుల కాలచక్రం అంటూ కాలాన్ని రాట్నంతో పోలుస్తూనే, ‘కాలానికి పుట్టినరోజు’ కూడా చేస్తారు. మరో సోదరులు శ్రీ దాసరి మోహన్ గారు ‘కల’ను కళతో పోలుస్తూ, కలగంటే హిమాలయాన్ని తలగడగా చేస్తానంటారు. ‘జైలు వారికి విడిది ‘అంటూ నాయకుల పై ఛలోక్తులు విసురుతారు. ఇంకో సోదరులు శ్రీ నల్లగొండ రమేష్ గారు ‘అంగూరు గుత్తుల్ని ‘ చూపించి పండ్ల తీయదానాన్ని వర్ణిస్తూనే , అంగట్లోని ఉల్లిగడ్డల తాత దగ్గరి చిన్నారి చిరుతిండికై చేసే మారాంలోని ఆర్తిని హృద్యంగా వర్ణించి కంటతడి పెట్టిస్తారు. పెద్దలు గజేందర్ రెడ్డి గారు సమీక్షలతో ‘సరోజ’ హృదయాన్ని ఆవిష్కరించినా, ‘తరాజు’లో వ్యాసాల్ని బేరీజు వేసినా వారికే చెల్లుతుంది. మరో పెద్ద శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్ గారు తమ గంభీర వచనాలతో ‘ఉగాదికై నిరీక్షణ ‘అంటూ జ్ఞాపకాల తెరతీసి అందమైన కవిత చెప్పినా’ ఇరుసు’ లోబందీయైన స్త్రీ మానసిక సంఘర్షణను అనువదించినా ఎంతో అర్థవంతంగా ఉంటుంది . మరో కురువృద్ధులు శ్రీ నారాయణ రావు గారు తమ చమత్కారపు ధోరణిలో పిల్లలు ‘ ఆట బొమ్మలతో ‘కాకుండా ‘కనుబొమ్మలతో ‘ఆడుతున్నారని, భారతీయ సంస్కృతికి శిలాఘాతం తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. సోదరులు జగ్గయ్య గారు చక్కని కవిత్వం రాస్తారు. రాజకీయాలపై చమక్కులు విసిరినా, ‘రైతును రాజు’తో పోల్చినా చక్కని సమన్వయం కనిపిస్తుంది. జాగ్రత్త సుమండీ! ‘బెత్తంతో శిక్షించమంటూ’ దేవునికి విన్నపాలు కూడా చేస్తారు.
శ్రీ గాజోజు శ్రీనివాస్ గారు ‘అణచివేత పై స్వేచ్ఛా గీతా’న్నైనా ‘రాయకూడని పద్యా ‘ న్నైనా చక్కగా సమీక్షించి’ జెండాపై కపిరాజు’ను చూపిస్తారు.
శ్రీమతి రంగరాజు పద్మజ గారిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే, వారు ఎందరికో స్ఫూర్తిదాయకం. 60 ఏండ్లకోసారి వచ్చే సంవత్సరం నామాన్ని ఉగాదినాడు ఆహ్వానించి,షడ్రసోపేతమై విందారగించమంటూనే ,మంచి చేస్తే సత్కారం చేస్తానంటారు. ‘తెలంగాణ కన్నయ్య’ కష్టాల్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తారు. .ఎరుకల యాదయ్య గారు అడపాదడపా కనిపిస్తూ నేనున్నానంటారు.
సోదరి శ్రీమతి కొండపల్లి నిహారిణి గారు స్త్రీ చైతన్య పై తమదైన తెలంగాణ యాస, భాషలో చక్కని కవితలు రాస్తూనే ,సృష్టికి మూలమైన స్త్రీని ‘ఎనిమిదో అడుగు వేయమంటూ ప్రోత్సహిస్తూనే, ‘విజయకేతనం నీదే’ నా అంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.
గాయత్రి అమాయకంగా కనిపిస్తూనే నానీలతో ,పద్యాలతో అలరిస్తుంది. సోదరి అరుణ తను కవిత్వంలో మునిగి తేలుతూ ‘మంచాన పడ్డ తల్లుల దీనస్థితి’ని తెలుపుతూ, నవవసంతాన్ని స్వాగతిస్తూ, జ్ఞాపకాల తెరతీస్తూ కలానికి పదును పెడుతూ ఉంటుంది.
కనకయ్య మల్లముల గారు సీస మాలికతో ‘ఉగాది’ని సత్కరిస్తారు. అందరివాడు అంటూ ‘అంబేద్కర్’ ని చక్కని పొగడ్తలతో ముంచేస్తుంటారు. ష్ … మనలో మాట! మా యువకవి నరేష్ చారిని మాత్రం అస్సలు కదిలించకండి , కొంచెం భూమి కావాలంటూ వెంటపడతాడు. పాపం స్వలాభం కోసం కాదండీ ! సాగుబడిలోని రైతుల కష్టనష్టాల్ని ముందు తరాలకు చూపించాలని మాత్రమే. అక్షర సేద్యాన్ని చక్కగా చేస్తాడు ,జ్ఞాపకాలను అనుభవించమంటూ మరీ గుర్తు చేస్తాడు.
మధ్య మధ్యలో కవులకు ఎన్నో సందేశాల్ని, సమాచారాన్ని అందిస్తూ ఒద్దిరాజు ప్రవీణ్ గారు జాగృతం చేస్తూనే ఉంటారు.
శ్రీమాన్ గజవెల్లి దశరథ రామయ్య బాబాయి గారు ఎక్కడ సంఘర్షణ ఉంటుందో, ఎక్కడ శ్రమదోపిడీ ఉంటుందో అక్కడ తమ కలం కళ్ళతో పహారా కాస్తూ ,తమ చక్కని గళంతో కవితాలాపన చేస్తూ అలరిస్తారు. సోదరులు శ్రీ ఖాసిం గారు ‘అన్నయ్యకు కవితాంజలి’ ఘటించినా ,పండుగలపై కవితలల్లినా వారి తెలుగు తేనెలొలుకుతుంది . వేణుశ్రీ బాబాయ్ గారు వచనంలో సెటైర్లు గుప్పించినా, పద్యంతో దైవాల్ని స్తుతించినా, సమాజాన్ని వేలెత్తి చూపినా సందర్భోచితమై అలరారుతుంది. పెద్దలు శ్రీ జల్ పల్లి బ్రహ్మం గారు అద్భుతమైన తమ పద్య కవితలతో అలరిస్తారు. రామదాసు గారు మధ్యమధ్యలో సాహితీ సభలపై పోస్టులు పెడుతూ అందరినీ చైతన్య పరుస్తుంటారు. భానుజ ‘జీవితం ఒంటరిదైపోయిందంటూ ‘ నిస్పృహకు లోనౌతూ, అప్పులు మాత్రం చేయకండి ‘అని హెచ్చరిస్తూ అప్పుడప్పుడు వందన సమర్పణ చేస్తూ ఉంటుంది. సోదరి సులోచన నానీలతో అంతరంగాన్ని ఆవిష్కరిస్తూనే చేదబావిలోని ‘ ‘బొక్కెన’ ‘జీవన చిత్రాన్ని, మనుషులతో మమేకమైన తీరును చక్కగా తెలిపి అందమైన కవితలల్లుతుంది. మరోయువకవి వంశీధర్ నేనున్నానంటూ అప్పుడప్పుడు తొంగి చూస్తూ నానీలు వినిపిస్తూ, టెక్నాలజీని కలిపి చక్కని కవిత్వం చెప్తాడు. నక్కా హరికృష్ణ వృత్తి ధర్మమో, పని భారమో తెలియదు గానీ పాపం, కాదేది కవనాస్వాదనకనర్హం అంటూ రోడ్డునే వేదికగా చేసుకొని అడపాదడపా హాజరౌతూ, కవనాన్ని వినిపిస్తుంటాడు . గుండెల్లి ఇస్తారి రోడ్డు పైకొస్తున్నాడంటేనే నాయకులు చాలా బెంబేలు పడిపోవాల్సిందే! కటౌట్లలోని వారిని ప్రశ్నల శర పరంపరతో అదరగొట్టేస్తాడు. సహోదరి పద్మశ్రీ చెన్నోజ్వల సంగీత, సారస్వతాలకు సమన్వయం పొసుగుతుందో? లేదో? అనే మీమాంసలో సతమతమౌతూనే చక్కని కవన ఝరులను ఒలికిస్తుంది. రాధికా సూరి అనే నేను అందరి కవితల్ని వింటూ, వ్యక్తిత్వ వికాస అంశాలు ఉన్నాయోలేవోనని దుర్భిణితో వెతుకులాడే ప్రయత్నంలో ఉంటాను. అప్పుడప్పుడు సాహితీస్రష్ఠలతో గోష్ఠులు నిర్వహిస్తూ, అందరిలో ఉత్సాహం నింపుతూ ముందుకు నడిపిస్తారు మా ప్రయోక్త లు.
కొత్తపల్లి నరసింహ ,శ్రీరంగం శ్రీశైలం, రెడ్డిపల్లి వెంకటేశం, లక్ష్మీనారాయణ గార్లు మెసేజెస్ పెడుతూ కనిపిస్తుంటారు. వి.వి .చారి గారు ‘సార్వత్రిక సమర శంఖం ‘ ఊది జ్ఞాపకాల’ డైరీ’ పుటలు తిరిగేసి మధురానుభూతులను గుర్తు చేస్తారు. డాక్టర్ నాగరాజు గారు కవులను సరస్వతీపుత్రులుగా అభివర్ణిస్తారు. సూత్రధారీ ,పాత్రధారీయైన సోదరులు వేణు నక్షత్రం గారు టెక్నాలజీని అందిస్తూ, నచ్చిన కవితల్ని చదువుతూ, ‘చెప్పలేదంటనకపోయేరు’ అంటూ మా అందరినీ తమ పిలుపు టీవీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ మధ్యనే మాతో జట్టు కట్టిన మరో యువకవి ఇక్బాల్ ఉగాదిపై తేటతెనుగులో చక్కని కవిత చదివి సమాజాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. చివరగా శ్రీమాన్ గోపాల్ రెడ్డి గారు అందరి కవితలపై తమ అభిప్రాయాల్ని సున్నితంగా ఎవరినీనొప్పించకుండా చక్కగా విశ్లేషిస్తారు. వందన సమర్పణతో మా సోమవారం కవి సమ్మేళనం వారందాకా విరామం తీసుకుని, మరోవారానికై కొత్త ఊపిరిని నింపుకుంటూ ఎదురుచూస్తూఉంటుంది.
(పొరపాటున ఎవరిపేరైనా మర్చిపోతే క్షంతవ్యురాలను)