ప్రమిదను వత్తి వలె
వెలుగు నన్ను ఆధారం చేసుకొని వచ్చింది.
ఊరూ, వాడా నన్ను చేరదీశాయి.
ఎండా, వానా, చెట్టూ, గుట్టా స్నేహితులయినాయి.
భూమి తల్లియై
అన్నం పెట్టింది.
సుందర ప్రకృతి
కంటికి మెఱపు నిచ్చింది.
నాదం
నా శ్రుతిలో కొలువు తీరింది.
బడి గురువై
బ్రతుకు దారి చూపింది.
అన్నీ నేర్పుతున్నాయి
ఎన్నో ఎన్నెన్నో.
ఏమరుపాటున
ఎప్పుడు ఎక్కడ
ఏ పొరపాటు జరిగిందో
“ఆరుగురు”
ఒక్కొక్క దొంగ దెబ్బ కొట్టారు.
లోపలి వెలుగు ఆరింది.
నేను చీకటిగా మిగిలాను.