మంగారి రాజేందర్ జింబో కవిత్వం సామాజిక సమస్యలకు అద్దం పడుతుంది. మంగారి రాజేందర్ జింబో అనగనగా … కవిత
ప్రముఖ కవి,రిటైర్డ్ జిల్లా జడ్జి,ప్రస్తుతం తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మంగారి రాజేందర్ జింబో కలం నుండి జాలువారిన చూస్తుండగానే … కవితా సంపుటిలోని అనగనగా…కవిత పై విశ్లేషణా వ్యాసం.అనగనగా కథ ఒకప్పుడుతో మొదలవుతుంది.అనగనగా అనే తెలుగు పదానికి నిర్దిష్టమైన,ప్రత్యక్షమైన అర్థం లేదు.అనగనగా సమాజంలో జరిగిన సంఘటనల సరళిలో ప్రారంభమయ్యే కథలను కవిత రూపంలో వ్యక్తం చేయడం కొత్తగా వింతగా ఉంది.అనగనగా ఇది కచ్చితంగా అని కాకుండా భావాన్ని లేదా భావోద్వేగాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడుతుంది.అనగనగా సాధారణంగా తెలుగులో ఒక నిర్దిష్ట అర్థాన్ని తెలియజేయడానికి కాకుండా లయను సృష్టించడానికి ఉపయోగిస్తారు. అనగనగా అని కథను ప్రారంభించడానికి మొదట ఉపయోగిస్తారు.కథను ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా తరతరాలుగా సమాజంలో వ్యాప్తిలో ఉన్నాయి.అనగనగా ఎప్పుడో ఒక కాలంలో జరిగాయి.అవి జనంలో వాడుకలో ఉన్నాయి.చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్ద వాళ్ళు అనగనగా ఒక రాజు ఉండే వాడు అని కథ చెప్పి పిల్లవాడిని నిద్రపుచ్చడం లోకం ఎరిగినదే.ఇప్పుడు మనం నివసిస్తున్న వర్తమాన సమాజంలో లోకంలో జరుగుతున్న రీతి రివాజులను బట్టబయలు చేస్తూ కవి జింబో పిల్లలకు కథ చెప్పినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.సమాజంలో ఏం జరుగుతుంది? సమాజంలోని జనాలను జాగృత పరచడం కోసం అనగనగా కవిత రాసినట్లుగా తోస్తుంది.జింబో రాసిన అనగనగా కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అపారమైన అనుభూతిని సొంతం చేసుకుందాం.
“అనగనగా …
“ఓ వాగుండేది
“ఏ నగరం దాని మీద దాడి చేసిందో
“ఏమో –
“నీళ్ళే కాదు
“ఇసుక కూడా లేకుండా పోయింది.
వాగు అంటే కొండల మీది నుండి ప్రవహించే చిన్న నీటి ప్రవాహం.ఇది మంచి నీటి సెలయేరు.నగరం విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం.నగరం జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. నగరాలు చారిత్రక ప్రాధాన్యత,ప్రత్యేక అధికారం కలిగి స్వయం పరిపాలన అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.నగరాలు వసతులు కల్పించడంలోను,మురుగునీటి కాలువల నిర్వహణ,విస్తృతంగా రవాణా సౌకర్యాలు,నివాస గృహ సముదాయాలు కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస పట్టణాలు నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులు ఉద్యోగాలు లభించడం వలన పరిశ్రమలు పరస్పరం లబ్ధి పొందుతూ ఉండటం వలన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి.ప్రజలు అధికంగా ఉండటం, వ్యాపార అభివృద్ధికి,కళా,వినోదం,పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి.ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలు,విద్యను అభ్యసించడానికి విద్యాసంస్థలు,ఇలా ఒక దాని కొకటి అనుబంధంగా వృద్ధి చెందాయి.ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి.నీళ్ళు ఘన రూపం,మంచు గడ్డల రూపంలో మరియు ద్రవ రూపంలో సముద్రాలు,నదులు,తటాకములు ఉన్నాయి.భూతలంపై ఆవిరితో వాయు రూపంలో మేఘాలు ఉన్నాయి.మహా సముద్రాలు,నదులు, తటాకాలు ఉపరితల జలాలతో నిండి ఉంటాయి. ఇసుక అనేది విచ్ఛిన్నమైన రాతి ఖనిజ కణాలతో ఏర్పడిన మిశ్రమం.ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థం.ఇది పరిమాణం ద్వారా నిర్వచింపబడింది. కంకర కంటే చిన్నదిగా,మెరుగ్గా,ఓండ్రు మట్టి కంటే గరుకుగా ఉంటుంది.కాంక్రీట్ తయారీకి అనువైన ఇసుకకు అధిక డిమాండ్ ఉంది.నదులలో వాగులలో ఇసుక ఎక్కువగా ఉంటుంది.సిమెంటు, నీటిలో కలిపి తడపటం వలన అది గట్టి బండలాగా తయారవుతుంది.నిర్మాణ రంగంలో ఇసుకను ఎక్కువగా వాడుతారు.పునాదులలో మొదటగా ఇసుకను ఒక పొరగా వేసి కూరుతారు.దీని వల్ల నిర్మాణాలలో పగుళ్లు రాకుండా ఉంటాయి. చిన్న వాగులు,వంకలు మొదలుకొని నదుల్లోని పెద్ద రీచ్ ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతుంది.అక్రమార్కులు రాత్రి,పగలు తేడా లేకుండా వేల కొద్ది లారీల్లో,ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికి అని అనుమతులు తీసుకోవడం,లారీలు,ట్రాక్టర్లతో పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవడం పరిపాటి అయింది.ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఇసుక మాఫియా చెలరేగుతుంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి.డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాధికారులు చూసి చూడనట్టు వదిలి వేయడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతున్నది. ఇసుక దందా అంతా రాజకీయ నాయకుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.కవి జింబో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్లుగా అనగనగా ఒక వాగు ఉండేది.అలాంటి వాగుపై ఏ నగరం దాడి చేసింది ఏమో అని అంటున్నాడు.నగరం విస్తరణలో భాగంగా వాగులోని నీళ్లు అన్ని తోడేశారు.వాగులోని ఇసుకను కూడా తరలించారు అని కవి జింబో తీవ్రమైన ఆవేదనకు గురి అయినట్లుగా తోస్తుంది. వాగు కింద వేల ఎకరాల పొలాలకు నీళ్లు పారేవి. అట్టి వాగు ఎన్నో గ్రామాలకు త్రాగు నీరుగా ఉపయోగపడేది.వాగు ఇసుకతో ఎంతో మంది గ్రామాల జనాలు ఇల్లు కట్టుకున్నారు.అక్కడి జనాల బాగోగుల కొరకు తాగు నీరు మరియు సాగు నీరు కోసం ఉన్న వాగును నగరం వాళ్ళు వచ్చి నీళ్లను, ఇసుకను దోపిడీ చేయడం వల్ల వాగులో నీళ్లు లేవు. వాగులోని ఇసుకను తరలించి వాగు లేకుండా చేసిన స్థితిని,దుర్మార్గాన్ని,దోపిడిని ఎండగడుతూ కవి జింబో వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.
“అనగనగా
“ఓ చెరువుండేది
“ఎవరి కాంక్షకి బలయ్యిందో
“ఏమో –
“దాన్నిండా సర్కారు తుమ్మల్లా
“ఇండ్లు మొలిచాయి.
చెరువు అనేది నిశ్చలమైన మంచి నీటితో కూడిన చిన్న ప్రాంతం.ఇది ఒక నది లేదా ప్రవాహానికి భిన్నంగా ఉంటుంది.చెరువు సంస్కృతికి అనుకూలం.ప్రతి ఊరిలో చెరువులు ఉన్నాయి. చెరువు వద్ద బతుకమ్మ ఆటను ఆడుతారు.ఆట పూర్తి కాగానే ఊరి జనాలు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.చెరువులో వినాయకులను నిమజ్జనం చేస్తారు.పల్లెటూరి కల్పవల్లి చెరువు. పల్లెలో చెరువు మీదుగా పక్షులు ఒక వరుసలో ఆకాశంలోకి ఎగురుతాయి.చెరువును జలాశయం అని అంటారు.చెరువు మంచి నీరు నిలువ చేయు ప్రదేశం.చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరి కొన్ని చెరువులు అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి.చాలా గ్రామములలో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు.కొన్ని పెద్ద చెరువులు పంట పొలాలకు నీరు అందిస్తున్నాయి.పూర్వ కాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి చెరువులు త్రవ్వించారు.ఊర చెరువులు పశువులు కడిగేందుకు చాకలి వాళ్లు బట్టలను ఉతికేందుకు వినియోగిస్తారు.చెరువులు చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం,సూక్ష్మ ఇతర పోషక పదార్థాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.చెరువు మట్టి ఎర్ర చల్క,దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి,నేలల్లో సమపాళ్లలో గాలి,నీరు ఉండేట్లు చేస్తుంది.చెరువులు అనేక రకాల జీవులను సంరక్షిస్తాయి.చెరువుల వల్ల వ్యవసాయానికి నీరు దొరుకుతుంది.కొన్ని గ్రామాలకు చెరువు నీరే మంచి నీరు.చెరువు నీరును ఊరి జనాలు త్రాగుతారు. కొన్ని చెరువులలో ఊరి ప్రజలందరు స్నానం చేస్తారు.చెరువులోని నీరు పక్షులకు,పశువులకు తాగడానికి స్నానం చేయడానికి,శరీరం చల్లబడడానికి ఉపయోగపడతాయి.వేసవికాలంలో పిల్లలు చెరువులో ఈత నేర్చుకుంటారు.చెరువుల దగ్గర భూమి సారవంతంగా ఉంటుంది.అనగనగా ప్రతి గ్రామంలో ఓ చెరువు ఉండేది.అన్ని గ్రామాల్లో చెరువులు మాయమై పోయినాయి.చెరువు మీద చెరువు కట్ట చక్కగా చూపరులకు కనువిందు చేసేలా ట్యాంక్ బండ్ లాగా అగుపిస్తుంది.చెరువు నిండా నీటితో పక్షులతో కళకళలాడుతుండేది.చెరువు నీరు రైతులు తమ పొలాలకు పారించి అద్భుతమైన పంటలు పండించే వారు.ప్రతి గ్రామంలో చెరువు ఉండేది.వర్షాలు లేక కరువు కాటకాలతో గ్రామాల్లో చెరువులు ఎండి పోయాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన చెరువు కింద భూములు బీడుపోయాయి.పశువులు మేత లేక కబేళాకి వెళ్ళి పోయాయి.చెరువు ఎండిపోవడం వలన కొందరు కబ్జాదారులు చెరువు కింద ఉన్న గ్రామస్తుల భూమిని స్వార్థంతో కబ్జా చేసి ప్లాట్లు చేసి ఇళ్ల స్థలాలకు అమ్మేశారు.కబ్జాదారులకు స్వార్థపర రాజకీయ నాయకులు మరియు అధికారుల అండదండలు ఉన్నాయి.కబ్జాదారులు పెట్రేగి పోయి చెరువు స్థలాలను స్వాధీనం చేసుకొని అక్రమంగా అమ్మడం వల్ల చెరువు స్థలంలో ఇండ్లు ఏర్పడ్డాయి. చెరువు ఎండి పోతే ఏం జరుగుతుంది?చెరువు స్థలంలో సర్కారు తుమ్మలు మొలవడం ఆనవాయితిగా జరుగుతుంది.కాని ఇప్పుడు కబ్జాదారుల కాంక్ష వల్ల చెరువులు బలి అయిపోవడం జరిగింది.చెరువులో ఉండాల్సిన సర్కారు తుమ్మల స్థానంలో ఇల్లు మొలిచాయి. సమాజంలో కబ్జాదారుల కుట్రలకు అనుగుణంగా వారికి గల రాజకీయ నాయకుల,రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో చెరువులు మాయమై పోవడం వింతైన విషయం ఏమీ కాదు.ఈనాటి సమాజంలో గ్రామస్తుల జీవన ఆధారమైన చెరువు మాయమైపోవడం చూసి ఆవేదనతో కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా
“ఓ ఇల్లుండేది
“ఎందరి స్పేస్ ప్రాబ్లమో
“ఏమో –
“దాని గుండె బరువుకు మించి
“ప్లాట్లు కట్టారు.
ఒక ఇల్లు మానవుల నివాసానికి ఉపయోగించే నిర్మాణం.ఇల్లుని గృహం అని కూడా అంటారు.ఇల్లు మనం నివసించే ప్రదేశం.ఇల్లు అనేది ప్రజలు నివసించే భవనం.ఒకే కుటుంబమునకు చెందిన వ్యక్తులు కాపురము ఉండిన దానిని ఇల్లు అని అంటారు.ఇల్లు గాలి,వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది.కవి అనగనగా అని చెబుతూ ఓ ఇల్లు ఉండేది.రోజులు గడుస్తున్నాయి.కుటుంబం పెరిగింది.ఆ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులకు నివాసం ఉండటానికి ఆ ఇల్లు ఇరుకుగా ఉండి సరిపోవటం లేదు.ఆ ఇంటిలోని వ్యక్తులు ఆ జాగలో అపార్ట్మెంట్ కట్టి అగ్గిపెట్టెలాగా ఒక దాని మీద ఒకటి బహుళ అంతస్తుల నిర్మాణం చేసి ప్లాట్లు కట్టారు.ఎప్పుడో కట్టిన ఆ పాత ఇంటికి కూడా గుండె ఉంటుంది అని ఆ ఇల్లుకు గుండెకు బరువు మించిన ప్లాట్లు కట్టారని ఆ ఇల్లు తన స్వగతం చెప్పినట్లుగా కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ వూరుండేది
“ఎవరి కండ్లు పడ్డాయో
“ఏమో –
“ఊరు మాయమైపోయింది.
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది,పట్టణం కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం.కవి జింబో అనగనగా అని చెబుతూ ఓ ఊరు ఉండేది అని అంటున్నాడు.మరి ఆ ఊరి సంగతులు కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.ఇవ్వాళ పట్టణాల్లో నివసించే వాళ్లంతా ఏదో ఒక ఊరికి చెందిన వారే.పాడి పంటలతో కళకళలాడుతున్న ఊరు కరువు బారిన పడింది.ఆరుగాలం కష్టం చేసి పంట పండించిన రైతులు సంవత్సరాల తరబడి కరువు రాజ్యం ఏలుతుంటే బతుకు గడవక ఊరిని విడిచి వలస బాట పట్టారు.ఊరి జనాలు తిండి లేక పస్తులతో ప్రాణాలు తీసుకోరు కదా! ఊరి జనాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడో ఒక చోట బతుకు సాగుతుందనే ఉద్దేశంతో వలసలకు పాల్పడ్డారు.అన్నమో రామచంద్ర అని జనాలు కడుపు చేత పట్టుకొని ఊరు విడిచి వలస బాట పట్టినారు.కరువు కాటకాలు ఒక వైపు,స్వార్థపూరిత రాజకీయ నాయకుల అనైతిక చర్యల వల్ల ఊరిలో ఉండాల్సిన జనం ఊరు విడిచి వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.కవి జింబో అనగనగా ఓ ఊరు ఉండేది అని చెప్పిన భావంతో కవితకు ప్రాణం పోశారు.ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల మరియు ప్రకృతి ప్రకోపం వల్ల మానవాళికి శాపంగా మారి ఊరి జనాలు గ్రామం విడిచి వెళ్లారు.పాడువడిన ఊరు దుస్థితిని తలుచుకుంటే కళ్ళనుండి కన్నీరు ఊబికి వస్తుంది. ఎవరి కన్నులు పడ్డాయో ఏమో ఊరు మాయమైపోయింది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ కోడి వుండేది
“అది ఉదయాన్నే నిద్ర లేపడం
“ఎవరికి నచ్చలేదో
“ఏమో –
“దాని గొంతు నొక్కేశారు.
కోడి ఒక పెంపుడు పక్షి.కోడిని ఆహారం కోసం ఇళ్లలో పెంచుకుంటారు.కోడి గుడ్లు,కోడి మాంసం ఆహారంగా తీసుకుంటారు.మగ కోడిని కోడిపుంజు అని ఆడ కోడిని కోడిపెట్ట అని అంటారు.కోడి ఉదయాన్నే లేచి తన గూటి నుండి కొక్కరోకో అని కూస్తుంది.కోడి కూయగానే ఊరిలోని జనాలు తెల్లవారుతుందని నిద్ర నుండి లేస్తారు.పట్టణాల్లో అయితే కోడి ఇళ్లలో ఉండదు.కోడి కూత విన రాదు.చదువుకునే పిల్లలు మరియు ఉద్యోగానికి వెళ్లే పెద్దలు అలారం పెట్టుకుంటారు.అలారం మోగ గానే నిద్ర నుండి లేస్తారు.ఊరిలో కూడా పట్టణ సంస్కృతి వచ్చింది. బాయిలర్ కోళ్ల పెంపకం పెరిగింది.చికెన్ సెంటర్ కి వెళ్లి చికెన్ కొంటున్నారు.పూర్వకాలంలో అలారం వలె పని చేసి ఉదయాన్నే నిద్ర లేపే కోడిని ఎవరికి ఇష్టం లేదో ఏమో దాని గొంతు కూడా నొక్కేశారు అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజం చెబితే నిష్ఠురంగా ఉంది అంటారు.కోడి కూతతో నిద్ర లేచి రైతులు తమ వ్యవసాయ పనులకు వెళుతారు. రైతులు పొలానికి మరియు పెరట్లో చేనుకు నీళ్లు పారిస్తారు.పొద్దున నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కోడి కూస్తే నిద్ర చెదిరిపోతుందని కోడిని లేకుండా చేసే దుర్మార్గపు సంస్కృతి మనకు ఎల్లెడలా కనిపిస్తుంది.కోడి గొంతు నొక్కేశారు అని కవి జింబో కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ సంస్కృతి వుండేది
“ఏ పడమటి గాలి కాటేసిందో
“ఏమో –
“అది శిల్పారామంలో అవశేషమై పోయింది.
ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు సంస్కృతిలోకి వస్తాయి.ఈ సంస్కృతికి హద్దులు లేవు.అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానం అన్ని కలిపి సంస్కృతి అంటారు. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు,వస్త్రధారణ,ఆటలు,విశ్వాసాలు, కళలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి.గతించిన కాలం గురించి,భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి.ఒక సమాజం చేసిన,వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు,వారి సంగీతం,కళ,జీవన విధానం,ఆహారం,శిల్పం,చిత్రం,నాటకం,నాట్యం, సినిమా ఇవన్ని ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం,సంపన్నత,జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావించబడతాయి. తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న వినాయక చవితి, ఉగాది,ఏరువాక,అట్లతద్ది,భోగి, సంక్రాంతి,కనుమ, బోనాలు,బతుకమ్మ,దీపావళి,గ్రామదేవతల పూజలు.తెలంగాణ భాషలోని యాస సొగసులు, కట్టు బొట్టులలో సంస్కృతి విలువలు ఉన్నాయి. ఊరి వారి పిలుపులో బంధుత్వాలు,అనుబంధాలు ఉన్నాయి.ఇక్కడి రైతులు,వృత్తి కార్మికులు చాలా ప్రతిభావంతులు.మానవతా విలువలకు దర్పణాలు. తెలంగాణ పల్లెలు సంస్కృతికి పట్టుకొమ్మలు.ఇక్కడ నివసించే ప్రజలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఊరి కింద చెరువులో నీళ్ళు ఊరి వాగులో నీళ్లు తాగి జీవించే వారు.కుమ్మరి కుండలు తయారు చేస్తాడు.కమ్మరి ఇనుప వస్తువులు తయారు చేస్తాడు.వడ్రంగి కర్ర పని చేస్తాడు.బతుకమ్మ పండుగలో ఆట పాట ఉంది.ఊరి వారంతా చెరువు దగ్గరకు చేరి బతుకమ్మ ఆడుకునే వారు.కుండను దేవుడుగా పూజించే సంస్కారంతో కూరాడును ఇంటిలో నిలుపుకుంటారు.గిర్నీలు లేని కాలంలో వడ్లను దంచి బియ్యం తీసేవారు.రోట్లో వడ్లను పోసి కుందెన పెట్టి రోకలితో దంచే వారు.రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజును సాగువాటు అంటారు. రైతులు జీవితంలో భాగంగా నాగలి కట్టి మొక్కుకుంటారు.ఎద్దుల్ని బాగా కడిగి కొమ్ములకు నూనె రాస్తారు.దేవుడిని మొక్కుకుంటారు. సాగువాటును రైతులు శుభకార్యంగా చేసే వారు. చెరువు పంటలకు నీరు అందించేది.ఊరిలోని బర్రెలు ఒకసారి చెరువులో మునిగేవి.ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి.మంచి చెడ్డలు పంచుకునే సంస్కృతి అంతరించి పోతుంది.ఊరి జనాలు రాత్రంతా మెలకువగా ఉండి నాటకాలు చూసే వారు. రాత్రంతా ఆడే ఆటలతో పాటలతో విలసిల్లిన పల్లె సంస్కృతి మాయమైపోతుంది.కుటుంబ సభ్యులు ఎవరికి వారే విడిపోతున్నారు.శిల్పారామం హైదరాబాదులోని మాదాపూర్ గ్రామంలో తెలంగాణలో ఉంది.సాంప్రదాయ భారతీయ చేతి పనుల పరిరక్షణకు వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో ఈ గ్రామాన్ని రూపొందించారు.ఏడాది పొడవునా రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్ హబ్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సంప్రదాయం సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది.భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయబడింది.అనగనగా అని చెబుతూ ఓ సంస్కృతి ఉండేది.ఆ సంస్కృతి ఏమైంది? ఇప్పుడు ఆ సంస్కృతికి సంబంధించిన వాతావరణం మరియు రూపురేఖలు ఎక్కడ కనబడడం లేదు.అట్టి ఘనమైన సంస్కృతి ఎక్కడినుండో తుఫాను వలె దూసుకు వచ్చిన పడమటి గాలి కాటుకు గురై పోయింది ఏమో అని అంటున్నాడు.మన ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయం యొక్క వారసత్వం శిల్పారామం లోకి చేరిపోయింది అని ఆవేదనతో కవి జింబో వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.
“అనగనగా …
“ఓ మనిషి ఉండేవాడు
“అతని మీద అతనికే కోపమొచ్చి
“తలని తీసి మానిటర్ ని
“తగిలించుకున్నాడు.
క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం.మన మనసుకి నచ్చక పోయినా లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారి పై మనకు కలిగే వ్యతిరేకతానుభూతిని,ఉద్రేకం లేదా కోపం అనవచ్చు.కోపం పర్యవసానంగా ఎదుటి వారిపై దాడి చేయటం,ఎదుటివారిని దూషించటం వంటి వికారాలు కలుగుతాయి.కోపం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపరచుకోవడం ఎంతైనా అవసరం.కోపం ప్రకృతి పరమైన సహజ ఉద్వేగం.ఇది జీవుల శరీర భౌతిక ధర్మం.నేల మీద మనుగడ సాగించే ప్రతి జీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చకునే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం.కోపం వచ్చినప్పుడు మనుషులు అరవటం,తిట్టడం,అవమానపర్చటం, చేయి చేసుకోవటం,దాడి చేయడం, పగులగొట్టటంతో పాటు మౌన పోరాటం,నిరాహార దీక్ష, అలగటం,సహాయ నిరాకరణ అలాంటి రూపాలతో కోపాన్ని చూపుతారు.కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమిష్టి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు బందులు,దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు,మానవహారాలు కూడా ఉంటాయి. అనగనగా అని చెబుతూ ఓ మనిషి ఉండే వాడు.మనిషి అంటే ఎవరు?మనిషి అంటే ఒక వ్యక్తి.ఎందుకో తెలియదు? కొన్ని సమయాల్లో మనిషికి తన మీద తనకే కోపం వస్తుంది.అలాంటి కోపంలో మనిషి తన తలను తీసి కంప్యూటర్లో గల మానిటర్ కు తగిలించుకున్నాడు.అప్పటి నుండి మనిషి మెదడు ఉన్నప్పటికీ ఆలోచించడం లేదు. మనిషి తయారు చేసిన కంప్యూటర్ లోని మానిటర్ చెప్పినట్టల్లా పని చేస్తున్నాడు.మానిటర్ అనగా కంప్యూటర్ స్క్రీన్ లేదా పదాలను చిత్రాలను చూపగలిగే పరికరం.అనంతమైన జ్ఞానం ఉన్నప్పటికీ మనిషి తన మెదడుతో ఆలోచించడం మానేశాడు. కంప్యూటర్లోని మానిటర్ కు తన తలను తగిలించుకున్నాడు అని కవి జింబో కవితలో వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ ఓ కల వుండేది
“ఏ పీడ కల దాన్ని కాటేసిందో
“ఏమో –
“కంప్యూటరే కలగంటుంది నేడు.
చాలా కలలు దృశ్యమానంగా ఉంటాయి.అంటే వాసన లేదా స్పర్శ వంటి ఇతర ఇంద్రియాలు, చిత్రాలు కలలలో ముందంజలో ఉంటాయి.నిద్రకు చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు అంటారు. కలలు యొక్క అంతరార్థం ఏమిటో వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాదు.కల నిజం కావాలని కోరుకుంటాం.కాని ఆ కల జరిగే అవకాశం ఎక్కువ లేదు.మనలో చాలా మంది కునుకు తీయడం ప్రారంభమైన కొద్ది సేపటికే ఏవేవో కలలు వస్తుంటాయి.ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు,వింతలు,విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కలలు కనడం రాత్రంతా జరుగుతుంది.మనం నిద్ర పోయే ముందు ఏమి ఆలోచిస్తామో లేదా మేల్కొన్న సమయంలో మనం చేసిన పనుల ద్వారా కల ప్రభావితం అవుతాయి.మరి కొందరికి పీడ కలలు వస్తుంటాయి.పీడ కల రాగానే నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు.పీడ కలలు భయానకంగా లేదా కలవర పెట్టే కలలు.దాదాపు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సారి పీడ కలను కని ఉంటారు.పీడ కలలు రావడానికి కారణం అంటూ ఉండదు.భయానకంగా ఏదో చూడటం లేదా చదవడం,నిద్రలేమి,అనారోగ్యంతో ఉండటం, మరణం,శారీరక హింస,వెంబడించడం,వేటాడటం వంటి కారణాలు ఈ పీడకలలకు మూలం.కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలోని భాగం ఈ కలలు సాధారణంగా నిద్రపై ఎటు వంటి ప్రతికూల ప్రభావాలను చూపవు.అనగనగా అని చెబుతూ ఓ కల ఉండేది అని అంటున్నాడు.మనిషి నిద్రలో కల కనడం సహజమే.మనిషి నిద్రలో ఉండగా కలను ఏ పీడ కల వచ్చి కాటేసిందో ఏమో అని అంటున్నాడు. కలపై పీడ కల దాడి చేయడం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.రోజులు మారాయి.కాని మనిషి ఇప్పుడు కల కనడం మానేశాడు.మనిషి ఎందుకు కల కనడం మానేశాడు అనే ప్రశ్నలు మనకు తలెత్తవచ్చు.ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి తయారు చేసిన కంప్యూటర్ కల గంటుంది.కంప్యూటరే మనిషిలా పని చేస్తుంది. మనిషి మాత్రం కంప్యూటర్ వచ్చినంక కలలు కనడం మానేశాడు అనే వాస్తవాన్ని లోకంలో జరుగుతున్న తీరును తెలియజేయడం అద్భుతంగా ఉంది.నేటి ఆధునిక కాలంలో కంప్యూటరే కల గంటుంది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ కథ వుంది
“వినే నాథుడే లేడు.
కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ.కథ అనగా కల్పిత గద్య గ్రంధం.మన రాష్ట్రంలో చిన్న పిల్లలు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్న కథలు చెప్పడం బాగా అలవాటు.కథ ప్రకృతి అయితే కత వికృతి.జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతిలో నింపి పదే పదే వినాలనిపించేది, చదవాలనిపించేది గొప్ప కథ.ఎవరైనా లేనిది కల్పించి మాట్లాడితే కతలు చెప్పకు అంటాం.కల్పిత వృత్తాంతం కలిగినది కథ.అనగనగా అని చెబుతూ ఓ కథ ఉంది అని అంటున్నాడు.మనిషి జీవితంలో వేగం పెరిగింది.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైనాయి.వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి. ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.ఎవరి సెల్ ఫోన్ వారిదే.ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత కుటుంబాల్లో పెద్ద వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు గా ఉంటున్నారు. వాళ్లు తమ పిల్లలతో గడిపే సమయం తక్కువ. తక్కువ సమయంలో కథలు చెప్పే ఓపిక వాళ్లకు లేదు.కథలు చదివే వాళ్ళు కూడా తగ్గిపోయారు.ఒక రచయిత ఇంకో రచయిత రాసిన కథలు చదవడం లేదు.ఎవరి కథలు వారే రాసుకుంటున్నారు.కథ చెబితే వినే నాథుడే లేడు.కుటుంబంలో కూడా ఒకరి మాట ఒకరు వినడం లేదు.ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వారు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటారు.ఒకరి గదిలోకి ఇంకొకరు వెళ్ళరు.ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం అరుదు.సెల్ ఫోన్ తో జీవితాలు గడుపుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్ లో గేములు ఆడుతున్నారు. పెద్దలు సెల్ ఫోన్ ద్వారా కాలక్షేపం చేస్తున్నారు బంధువులు,ఇరుగు పొరుగు వారితో కలవడం కూడా తగ్గిపోయింది.అనగనగా ఒక కథ ఉంది.కథ వినే నాథుడే లేడు అని కవి జింబో కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.కవి జింబో మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.