Home వ్యాసాలు హలో హల్లూ

హలో హల్లూ

by Vijaya Kandala

     ప్రపంచ భాషల వ్రాత లిపుల్లో మొదటి ఉత్తమ లిపి కొరియా  దేశానిది కాగా  , రెండవ ఉత్తమలిపి  తెలుగు కావడం మనకు గర్వకారణం .
కాలికి బలపం
        అవసరం ఉన్నందున దూరభారాలు లెక్కించకుండా తిరిగినప్పుడు కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అంటారు .    బలపం అనేది రాతిముక్క. పలకాబలపం అనే వి ఒకప్పుడు విడదీయలేని జంట పదాలు . ఒకప్పటి విద్య విధానానికి ఆనవాళ్ళు . ఒక్కసారి పలక  కొంటె ఒకరి తర్వాత మరొకరు వాడుకునే సౌకర్యం ఉన్న సాధనం . తిరగలేక బాధపడుతున్నట్లు ,తిరగక  తప్పదన్నట్లు చెప్పడమే దీనిలోని అసలు ఉద్దేశ్యం .
ఖండితం
                ఈ సంస్కృత పదానికి నరకబడినది అని నిఘంటు అర్థం . యుక్తులు చెప్పి ,ఒక వాదాన్ని నిరాకరించడం కూడా ఖండించడమే . ఈ రోజుల్లో ఏ రాజకీయ    నాయకుని ఏ విషయంలో అభిప్రాయం అడిగినా  యదుటివారు చెప్పింది ఖండిస్తున్నాను అనే అంటారు . దేన్ని ఖండిస్తున్నాడు ,ఎందుకూ ఖండిస్తున్నాడు అతనికే తెలియదు . అతనికే తెలీనప్పుడు మనకు తెలిసే అవకాశం లేనేలేదు . ఖండితంగా చెప్పడమంటే స్పష్టంగా ,దాపరికం లేకుండా అనే అర్థంలోనే నేడు వాడుతున్నాం
గుడ్డి గవ్వ
         కొన్ని ఏళ్ళ క్రితం గవ్వలు నాణాలుగా చెలా మణిలో ఉండేవి. అంటే గవ్వలిచ్చి ,కావలసిన సరుకులను కొనేవాళ్ళు . గవ్వ విరిగిన ,పగిలిన అది గుడ్డిగవ్వ . అది వ్యాపార వ్యవహారాలలో చెల్లుబాటయ్యేది కాదు . ఎందుకూ  పనికిరానిదని  అర్థం . బీదవారిని గుడ్డిగవ్వ పాటి ఖరీదు చేయడని  భావించేవారు .
ఘంటాపథం
         తెలుగులో ఈ పదానికి నొక్కి చెప్పుట , బల్ల గుద్ది  చెప్పుట అనే అర్థాలున్నవి . తాను నమ్మిన దాన్ని ఎదుటివారు సంశయించినప్పుడు వారికీ బోధ పడేలా నొక్కి చెప్పడం ఘంటాపథం .
చిరునామా
                        చి రునామా అనేది ఇ ప్పుడెక్కడా  వాడటం లేదు . ఆ స్థానం  లో Address వచ్చి , పీఠం వేసుకుని కూర్చున్నది .ఈ అడ్రసునే ఒకప్పుడు చిరునామా , విలాసం అనే వారు . ఇది హిందీ నుంచి వచ్చిన మాట అని సి. పి  బ్రౌన్ అభిప్రాయం . అన్యదేశ్యం అని మరికొందరి భావన . ఇ వన్నిటిని  పక్కకు నెట్టి అడ్రసు స్థిరపడింది . సులువుగా చెప్పాలంటే క్లుప్తంగా ఒక వ్యక్తి నామ , నివాసస్తలాల వివరం చిరునామా.
జరిగిన కథ
             నిజంగా సంఘటిల్లిన కథను జరిగిన కథ అంటారు . అయితే మనం ఇ ప్పుడీ అర్థంలో వాడటం లేదు . వార , మాస పత్రికలు పెద్ద కథలను ,ధారావా హికలను  ప్రోత్సహించడం ,ప్రచురించడం మొదలె ట్టాక  కథలోని కొద్ది భాగాన్ని ప్రచురించి ,మిగిలిన కథను తరువాతి సంచికలో చదవమని సూచించే అవసరం ఏర్పడింది . మిగిలిన భాగాన్ని ప్రచురించేటప్పుడు  అంతవరకూ  జరిగిందాన్ని క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్తితి  ఏర్పడింది . దానివల్ల సత్యమైన ,గడచిన అనే అర్థంలో జరిగిన కథ వాడటం తప్పనిసరైంది .
టిప్పణి
              ఒ  క  గ్రంధంలోని  విశేషాలను వివరిస్తే అది టీక అనీ ,కటిన పదా లకు అర్థాన్ని వివరిస్తే అది టిప్పణీ అని సామాన్యమైన అర్థం . పద్యాల్లోని పదాలను ,అర్థాలను వచన క్రమంలో  పెట్టడమే తాత్పర్యం . తెలుగులో టీ కా తాత్పర్యాలకే ప్రచారం ఎక్కువ . ఒకనాటి సాహితీ సంప్రదాయాలను పరిచయం చేసుకోవాలంటే ఇ లాంటి పదాల పరిచయం అవసరం .
TLAYINCHU
         ఇది హిందీ /ఉర్దూ నుంచి వచ్చిన పదం . తెలుగులో పని ఎగ్గొట్టు ,మోసగించు అనే అర్థాలున్నాయి . అయితే నేడు మనం తప్పించుక తిరుగు ,తప్పుదారి పట్టించు ,మోసగించు అనే అర్థాలతో బాటు కావాలని ఆలస్యం చేయు అనే అర్థంలోనూ వాడుతున్నాం .
డ బ్బాకొట్టు
           డబ్బా అనేది హిందీ మాట  దానికి తెలుగు నిఘంటువుల్లో తుపాకీ మందు ఉంచుకునే తోలుపెట్టే అని అర్థం ఉంది దీనికి కోతలు కోయు ,పొగడు అనే వ్యవహారిక ఆర్గాలు ఉన్నాయి. నేటి వాడుకలో చప్పుడు చేస్తూ పోవడం, పొగడుకోవడంతో పాటు అనవసరంగా పొగడు ,అతిగా పొగడు అనే అర్థాలు ఉన్నాయి నేడు.
అణాకాణీ
               రూపాయికి 100 పైసల విధానం వచ్చాక రకరకాల పాత  నాణా లు వాటి లెక్కలు మరుగున పడిపోయాయి  .పేర్లు కొన్ని వ్యవహారంలో నిలిచిపోయా యి . అలాంటి వాటిలో అణాకాణీ  40 , 50 ఏళ్ల క్రితం వరకు పలుకుబడిలో ఉండేది. ఒకప్పుడు రూపాయికి 16 అణాలు అంటే 96 పైసలు ఉండేవి . దాన్నిబట్టి పదహారణాల ఆంధ్రుడు అనే మాట ఎక్కువగా వినబడేది. అంటే మాట,లో కట్టుబొట్టులో తెలుగు లక్షణాలున్న వాడని అర్థం. రూపాయిలో 16వ వంతు అణా  దాంట్లో నాలుగవ వంతు కాణీ . అందువలన చిల్లర మనిషి అనే అర్థంలో అణాకాణీ  మాట వాడేవారు. ఇలా వాడే రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా పెళ్లి చేశాడు అనే మాటలు పుట్టాయి . అణా అనేది సత్తు నాణెం.
తాహతు
 తెలుగు సినిమాల్లో  తరచూ వినిపించే మాట ఇది .  హిందీలో తాకత్ అనే శబ్దం నుంచి పుట్టిన మాట.  హిందీలో ఈ మాటకు బలం , శక్తి , అధికారం అనే అర్థాలు ఉన్నాయి  తెలుగులో  అధికారంతోపాటు హోదా,స్థాయి  అనే అర్థాలు కూడా ఉన్నాయి  
        ఆయన  తాహతు  ఎక్కడ ?   మనది ఎక్కడ ? ఈ మాటలు మన సినిమాల వల్ల రాజకీయ నాయకుల వల్ల ప్రజల నోళ్లలో నానుతున్నాయి.
దుంప నాశనం
          తెలుగువారికి ప్రత్యేకమైనది  ఈ తిట్టు . మొక్కల పుట్టుకకు  ,పెరుగుదలకు మూల కారణమైంది దుంప . అది నశిస్తే , ప్రస్తుతమున్న మొక్క వంశమే నశించినట్లు లెక్క.  ఎదుటి వ్యక్తి గాక  అతని వంశమంతా నశించాలని   దీనికి అర్థం . ఇంగ్లీష్ తిట్లు  అలవాటయ్యాక  తెలుగు తిట్లు  మరిచిపోతున్నాము  అ.యినా  కొన్ని పదాల యొక్క  అసలు  అర్ధాన్ని  తెలుసుకోవాలి .
ధనియాల జాతి
      తిట్టి, కొట్టి బాధిస్తే ,గాని దారికి రాని, పని చేయని వ్యక్తులను గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు  . ధనియాలను  ఉన్నవి ఉన్నట్లు పాతేస్తే మొలకెత్తవు.   వాటిని  చెప్పు కింద నలిపి, నాటాలనేది విశ్వాసం  అలా  పీడించి, హింసించి, భాధిం చినప్పుడే గాని మర్యాదగా చెప్పితే, పనిచేయని వాళ్లని ధనియాల జాతి అంటారు.
నదీ నదాలు
 ఇది ద్వంద్వ సమాసం .  ఇందులోని నది, నదం రెండూ సంస్కృత పదాలే.   నదం అంటే తూర్పున పుట్టి, పడమటికీ ప్రవహించేది .  మనదేశంలో నర్మదా, తపతి నదాలు .  నది అంటే పడమట పుట్టి, తూర్పుకు ప్రవహించేది.   ఇంత  సూక్ష్మమైన  విషయాన్ని   గమనించి , ప్రత్యేకంగా  పేరు పెట్టిన  మన  పూర్వీకుల పరిశీలనా శక్తికి నమస్కారాలు .
పాలు
 పాలు అనగానే మనకు ఆవు , గేదె ,మేక ,గాడిద  గుర్తొస్తాయి కదా ! ఇవన్నీటిని మరిపింప చేసేది అమ్మ .ఆమె ప్రేమ . ఇవాళ పాలుకు ఉన్న ఎన్నో అర్థాలలో కొన్నింటిని చెప్పుకుందాం పాలతో కలిసి కోపాలు ,తాపాలు ,శాపాలు ,మురిపాలు ఇలా ఎన్నో రకాలు .
          కృష్ణుడు రాయబారంలో పాండవులకు సగపాలిమ్మని అడిగాడు.   ఇక్కడ పాలు అంటే భాగం . రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నప్పుడు  రాళ్ళల్లో కలిసిపోయాయని అర్థం . దేవా నా పాల రావా అంటే  నన్ను రక్షించడానికి రావా  అని భావం .   జిల్లేడు పాలు అంటే రసం అనే అర్థం .ఇలా పాలు అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి .
 ఫల సాయం
             ఫలసాయం   అన్న మాటకి పంట అనే అర్థం ఉంది .  వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయం ఫలాయం . కానీ నేడు పంట దిగుబడిని సూచించడానికి ఫలసాయం అనే మాటను  వాడుతున్నాము .
బాదరబందీ
                ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో  ఉద్యోగులు పొడుగాటి అంగీ ధ రించడం సంప్రదాయం . వాటికి ఇప్పట్లో లాగా గుండీలు ఉండేవి కావు .ఓవైపు తాళ్లు   ,మరోవైపు వాటిని దూర్చడానికి రంద్రాలు ఉండేవి . ఎదురెదురుగా వాటిలో నుంచి దూ ర్చిన తాళ్ళను ముడి వేసేవారు . ఇవి 12 ఉండేవి . ఈ పద్ధతిని బారాబంది , బారాబుంది అనేవారు .ఇది చాలా సమయం తీసుకుంటుంది .విసుగు పుట్టిస్తుంది .అలా ఈ బారాబంధి కాస్త బాదర  బందీగా మారిపోయింది . సరిగా కట్ట కుంటే నలుగురిలో నగుబాటు . ఇలా 12 ముళ్ళు వేయడం . విప్పటం చికాకు పుట్టించేది .ముళ్ళు సరిగా వేయకుంటే , విప్పడం మరి కష్టం . ఇలా విసుగు పుట్టించే వ్యవహారం ,అనవసర శ్రమ అనే అర్థంలో బాదరబందీ అనే పదాన్ని వాడతారు .
భత్యాలు
             పనిచేసినప్పుడు ఇచ్చేది జీతం .తర్వాత వచ్చేది పింఛన్ . బత్తా   అనే హిందీ లేదా ఉర్దూ మాటకు తెలుగు మాట భత్యం .ఇది తాత్కాలిక , ప్రత్యేక సేవలకు ప్రతిఫలంగా ఇచ్చేది . రాను రాను భత్య మనేది జీతానికి భిన్నంగా , అదనంగా ముట్ట చెప్పేది అనే అర్థం వచ్చింది .  అప్పటినుంచి  కరువు భత్యం ,దిన భత్యం ,ప్రయాణ భత్యం ,  అదనపు భత్యం ఇవన్నీ వచ్చి చేరాయి   .ఒకప్పుడు జీతభత్యాలు ధన రూపంలోనే గాక వస్తు రూపంలో కూడా ఉండేవి
మందలింపు
           తప్పుగా మాట్లాడిన వారిని , తప్పుడు పనులు చేసిన వారిని సుకుమారంగా హెచ్చరించడాన్ని  మందలింపు అంటారు . తెలంగాణ ప్రాంతంలో ఈ మాటకు పరామర్శ , ఓదార్పు అనే అర్ధాలు ఉన్నాయి . మిత్రులు , బం ధువులు ,ఆత్మీయుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పలకరించి , ఓదార్చి , కష్టసుఖాలు విచారించడాన్ని మందలించడం అని అంటారు ఈ ప్రాంతంలో .
యక్ష ప్రశ్నలు
            సమాధానం చెప్పడం సాధ్యం కానీ చిక్కు ప్రశ్నలు ఎవరైనా అదేపనిగా అడుగుతూ ఉంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నాడయ్యా అని అంటారు  . ఈ జాతీయానికి సంబంధించిన కథ మహాభారతంలో ఉన్నది . పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో , ఈ సంఘటన జరిగింది .ఒకసారి  పాండవులు అందరికీ అలసట , దాహం కలిగాయి . అప్పుడు చెరువులోని నీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి యక్షుడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పితే ,ఈ నీళ్లు తాగడానికి అనుమతి ఇస్తాను అని చెప్పాడు .  యక్షుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు అడిగాడు . అన్నిటికీ ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు .  తన తమ్ముళ్లందరినీ కూడా కాపాడుకున్నాడు.
రాజధాని
       రాజులు ఉండే ప్రధాన నగరం రాజధాని . ఇప్పుడు రాజులు  లేరు గాని , రాజభోగాలు ఉన్నాయి.   రాష్ట్రాలు ఉన్నాయి . వాటికి పరిపాలనా కేంద్రాలుగా ముఖ్య పట్టణాలు ఉన్నాయి .వాటిని కూడా రాజధానులనే పిలుస్తున్నాము . రాజు లేకున్నా పాత అలవాటు ప్రకారం ప్రధాన నగరాన్ని రాజధాని అంటున్నాము  .
లక్షణ
          మీరు సరిగానే చదివారు ఇది లక్ష్మణుడు కాదు . లక్షణ . శ్రీకృష్ణుని  అష్టభార్యలలో చివరిది లక్షణ . ఈమెను కృష్ణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ,వివాహం చేసుకున్నాడు . ఈ సంగతి అన్నమాచార్యుల వంశానికి చెందిన తాళ్లపాక తిరువేంగళ నాథుడు అష్టమహిషి  కళ్యాణం అ నే కావ్యంలో  చాలా చక్కగా వర్ణించాడు .మత్స్య యంత్రాన్ని కొట్టడం అనగానే అందరికీ అర్జునుడు మాత్రమే గుర్తొస్తాడు . ఈ లక్షణ స్వయంవరంలో భీముడు , కర్ణుడు కూడా ప్రయత్నించారు , కానీ సాధ్యం కాలేదు . చివరగా శ్రీకృష్ణుడు వెళ్లి మత్స్య యంత్రాన్ని ఛేదించి ,లక్షణను  వివాహం చేసుకున్నాడు
వారాలబ్బాయి
             ఇప్పటిలాగా వసతి గృహాలు , ఉచిత వేతనాలు లేని రోజుల్లో పేద విద్యార్థులు ఏ బడి పంచలోనో  తలదాచుకుని , సంపన్న గృహస్తులను ఆశ్రయించి , భోజన వసతి సంపాదించేవారు . ఏ ఒక్కరి మీదనో ఆధారపడక ,పూటకో ఇంట్లో తింటూ , బట్టల కోసం కొందరినీ ,పుస్తకాల కోసం మరికొందరిని , ఆశ్రయించి , చదువుకునేవాళ్లు . అలా దుర్భర జీవితం గడుపుతూ , చదువుకునే వారిని వారాలబ్బాయి అనేవారు .అమ్మాయిలు ఇలా చదివే పద్ధతి లేనట్టుంది . అందుకే వారాల అమ్మాయి అనే పదం పుట్టలేదు . ఇప్పుడు ఈ రకంగా చదివే వాళ్ళ సంఖ్య చాలా అరుదు .
శాఖాహారం
          చాలా భోజనశాలలను శాఖాహార భోజనశాల అని రాయడం , పలకటం మన అలవాటు . శాఖ అంటే కొమ్మ . శాకం అంటే కూర .మాంసాహారం దొరకదని కూరగాయల వంటలు ఉంటాయని సూచించడానికి  శాకాహారమనే మాట సరియైనది . అయితే  మనము శాఖహారం అంటే కొమ్మలనే ఆహారంగా తీసుకుంటాము అని  ఆ బోర్డు ద్వారా తెలియజేస్తున్నాం . అది సరైనది కాదనుకోండి కానీ , మనకు బాగా అలవాటైపోయింది . అయితే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి . ఏది శాకాహారం అనే విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి , ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి అలవాటులో ఉంది  .అది చాలా పెద్ద విషయం తర్వాత దాని గురించి చెప్పుకుందాం .
షికారు
                ఈ పదానికి వేట ,సంచారము అనే అర్థాలు ఉన్నాయి .  ఇది పార్శీ మాట .హిందీ ,ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చింది  మూల భాషలో భక్ష్యం, లక్ష్యం , వేట అని అర్థాలు ఉన్నాయి తెలుగులో వేట , స్వారీ ,వా హ్యాళి అనే అర్థాలు ఉన్నాయి . అడవులు తగ్గి ,క్రూర మృగాల సంఖ్య తగ్గిన తర్వాత ,వనభోజనాలకు , వినోద వ్యవహారాలకు పరిమితమైన సామాజిక జీవనంలో వేట అనే అర్థం కన్నా విహారం వాహ్యాలి అని అర్థాలకే ఎక్కువ ప్రసిద్ధి రూపంలో , అర్ధాల్లో మార్పు వచ్చిందని గుర్తుంచుకోవాలి .
సాము గరిడీలు
               సాము గరిడీ అనే రెండు మాటలు ఒకదానికొకటి పర్యాయపదాలు అనే అర్థం లో ఈ ద్వంద్వ సమాసాన్ని వాడుతుంటాము . సిగ్గు బిడియం , అందం చందం అటువంటిదే ఇది కూడా అనుకుంటాము . అయితే సాము అంటే వ్యాయామం . గరిడీ అంటే సాము నేర్చుకునే చోటు . కాబట్టి  సాము నేర్చే నేర్పే ప్రదేశాలని అర్థం.      తెలుగుదేశంలో ఒకప్పుడు తాలింఖానాలు ఉండేవి అక్కడ వ్యాయామ విద్యలు మాత్రమే నేర్పేవారు .  స్వాతంత్రం వచ్చాక ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి వీటిని గరిడీలు అని కూడా అంటారు కాబట్టి వ్యాయామశాలలు అని అర్థం .
హక్కు
               ఇది ఉర్దూ లేదా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మాట . . శబ్ద రత్నాకరం ప్రకారం దీనికి బాధ్యత అని అర్థం  నేటి రాజ్యాంగ ,రాజకీయ వ్యవహారాల్లో హక్కు అంటే అధికారమే గాని బాధ్యత కాదు . పదవి వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల సంక్రమించే స్వామ్యం అధికారం హక్కు . సదరు హక్కు పొందినందువల్ల కర్తవ్యం గా భావించి చేయవలసిన పనులు బాధ్యతలు .నేటి భాషలో ఈ రెండు వేరు వేరు . హక్కు వేరు బాధ్యత వేరు .
            అందరమూ భాషను మాట్లాడుతున్నాము కానీ దానిమీద పట్టును సంపాదించుకోలేకపోతున్నాము .  కారణం శ్రద్ధ తగ్గిపోవడమే .  సామెతలు ,నానుడులు , జాతీయాలు , పదబంధాలు ,  పొడుపు కథలు ఇలాంటివి తెలుసుకున్నప్పుడు  భాష మీద పట్టు దొరుకుతుంది . అలా దొరికినప్పుడు అభిమానము పెరుగుతుంది . అయితే ,కొన్ని పదాల వెనక ఉండే అంతరార్థం కూడా తెలుసుకోవడం అనేది మన భావాలను మరింత స్పష్టంగా వెలిబుచ్చడానికి సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతోటి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది .ఇది రెండు భాగాలుగా  రాయడం జరిగింది . ఈ రెండింటిని  చదవండి .చదివించండి .  అందమైన భాష మనది .దాన్ని మరింత అందంగా  మన భావాలను వెల్లడి చేయడానికి వాడుకుందాం .
విజయ కందాళ

You may also like

Leave a Comment