“వొదినే! ఓ ఒదినే! ఏం సగ వెడ్తున్నవ్! అన్న డూటీకి వొయ్యి శాన సేపాయే! ఇంకేం పనమ్మా!” అనుకుంటూ వచ్చింది మాధవి.
” యే! పనయ్యింది వొదినే! పొద్దు గాల్ల చాయ్ ఉడుకు జేస్తుంటే గిన్నె మాడింది.. గీపీసు వెట్టి రుద్దుతున్న, ఏమో గిట్లోచ్చినవ్ పొద్దు గాల్ల..అన్న ముచ్చట జెప్పనీకా” అన్నది వసంత నవ్వుకుంటూ.
” నీకు ఊకే గాముచ్చటనే! గట్ల గాదు గనీ, ఆషాఢ మాసం గదా, మస్త్ ఆఫర్ లు నడుస్తున్నయి, పోదామా! బట్టల దుకాణంకి ” అన్నది మాధవి.
“అమ్మో! మీయన్న తిడ్తడు, అయినా పైసలు యాడియి”? అన్నది వసంత.
” గట్ల మాట్లాడ్తవ్ వోదినే, నేను లేనా? నిన్ననే శిట్టి ఎత్తిన. ఇస్తపా” అన్నది మాధవి.
” జల్దీ చీర కట్కోని వొస్త.. కూసో. గా కోపుల శాయ్ వట్టు ఉన్నది ఉడుకు జేస్కొని తాగు”అని లోపలికి పోయింది వసంత.
” సరే దబ్బున రా” అంటూ వంటింట్లోకి పోయి చాయ్ వేడి చేసుకుని కుర్చీలో కూర్చొని తాగుతుంది మాధవి.
ఇద్దరు తొందరగా బయటకు వచ్చి షేర్ ఆటో మాట్లాడుకుని వందన బ్రదర్స్ కి వెళ్లారు..
షాప్ నిండా రకరకాల ఆఫర్స్ రెండు కొంటే ఒక చీర ఉచితం, నాలుగు కొంటే మిక్సీ ఉచితం, ఇలా రకరకాల ఉచితాల ప్రదర్శన జరుగుతుంది.
మాధవి మరియు వసంతలకు కళ్ళు తిరిగిపోయాయి. ఇక చీరలు వెతకడం మొదలుపెట్టారు.
వేటి మీద అయితే ఉచితాలు ఉన్నాయో వాటిని వెతికి వెతికి బాగుల నిండా నింపుకున్నారు…
” మంచి గున్నయి కదా వొదినే!” అన్నది మాధవి.
“మంచిగనే ఉన్నాయ్ గాని ఈ చీరలన్ని చూసి మీయన్న ఏమంటడో?” అన్నది వసంత.
“ఏమనడు తీ, ఊకె బుగులు వట్టకు, జెర్ర గట్టిగుండాలే” అన్నది మాధవి.
బ్యాగుల నిండా కొన్ని చీరలు, ఉచితాలుగా వచ్చిన కొన్ని చీరలు, ఆఫర్లుగా వచ్చిన మిక్సీలు, గోడ గడియారాలు అన్నిటిని బ్యాగుల నిండా నింపుకొని చాంతాడంత ఉన్న కౌంటర్లో నిలబడ్డారు.
ఓరెండు గంటల తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరు బయటపడ్డారు..
“వొదినే! పోల్లగాండ్లు వచ్చేవరకు మస్త్ టైముంది. కొమురెల్లి దాకా పొయ్యోత్తాం. మీ పిల్లలు మా పిల్లలు పెద్దోల్లే, ఆల్షం అయిన ఏంగాదు” అన్నది వసంత.
“అబ్బో! నువ్వేనా? గట్లనేది. పోదాం పా. గీ సంచులు గీడ మా దొస్తింట్ల వెట్టి పోదాం” అన్నది మాధవి.
ఇద్దరూ ఆ సంచులను మాధవి స్నేహితురాలు ఇంట్లో పెట్టి బస్ స్టాప్ లో నిలబడ్డారు.
“బస్సు కిరాయ ఎక్వనా?” అన్నది వసంత.
“బస్సు ఫ్రీ నే కదా యాది మర్షినవా”? అన్నది మాధవి.
“అవుగదా! నేను ఈ నడుమ ఏ ఊరికి వోలే. గందికే మర్షి పోయిన” అన్నది వసంత.
ఇద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. అందరూ ఆడవాళ్లు ఉచిత బస్సు కాబట్టి పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉన్నారు.
ఒక్క సీటులో ఐదు, ఆరు మంది కుక్కుకొని కూర్చుంటున్నారు. నిలబడ్డ వాళ్ళు లెక్కకేలేరు..
పక్కకు చిన్న అమ్మాయిని పలకరించింది మాధవి.
“ఏడికి వోతున్నవ్ శెల్లే” అన్నది మాధవి.
“ఏడికి లేదు అక్క ఇంట్లో కరెంట్ పోయింది. రిపేర్ చేసేదానికి రెండు రోజులు పడతదట. టీవీ వస్తలేదు పొద్దు పోతలేదు.. ఊకెనే గా ప్రజ్ఞాపురం కాడ మక్క బుట్టలు కొనుక్కొని వేరే బస్సు ఎక్కొస్త” అన్నది ఆ అమ్మాయి.
“మనకన్నా జరంత ఎక్కువనే ఉన్నది” అన్నది మాధవి పక్కన ఉన్న వసంతతో.
అటుపక్కన మరో మహిళను పలకరించింది వసంత.
“నువ్వు ఏడికీ వోతున్నవ్ అక్కా” అన్నది వసంత.
“గీడు నామన్మడు. ఇంట్ల ఉంటే గాయి గాయి జేస్తున్నడు. అన్నం దింటలేడు. గాశామీర్ పేట కాడి దాకా వొయ్యే వరకు బుక్కెడు దింటడు. ఆడ దిగి మా శెల్లే ఇంటికాడ గింత శావట్టు దాగి మల్ల బస్సెక్కుత. గింతట్ల నా బిడ్డ కొలువు నించి వొస్తది” అన్నది ఆ మహిళ.
ఇదంతా వింటున్న కండక్టర్ కి బుర్ర తిరిగి పోయింది. “ఉచితాలు జెయ్యంగ మాకు తల్కాయ నొప్పి. పనున్నోడు, లేనొడు బస్సుల ఉర్కుడే. గిప్పుడే దేవుడు, సుట్టాలు యాదికొస్తరు” అనుకుంటూ ముందుకు వెళ్లాడు.
ఇంటికి వచ్చిన మాధవికి హాల్లో 10 కిలోల గోధుమపిండి కనిపించింది.
“ఏందయ్యా! గిది. గింత పిండి ఏడిది” అన్నది మాధవి.
“ఐదు కిలలు కొంటే ఐదు ఫ్రీ. అట గందికే తెచ్చిన” అన్నాడు మాధవి భర్త సుందర్.
“నీఅగడు పాడు గాను. ఫ్రీ వచ్చిందని గింత కొంటవా?” అన్నది మాధవి కోపంగా.
“నువ్వు ఫ్రీ వస్తున్నది అని గన్ని చీరలు కొన్నావ్ నేను గిద్దేస్తే గట్ల అంటవు” అన్నాడు సుందర్..
కుయ్యమనకుండా లోపలికి వెళ్ళిపోయింది మాధవి.
తెల్లవారి ఉదయమే పిండి సంచులు తెరిచి చూసింది. అంతా పురుగే ఉంది. భర్తను ఏమైనా అందామంటే తాను అలాంటి పనే చేసింది కదా!
చీరలు బ్యాగు మిక్సీ రెండు తెరిచి ముందుగా చీరలను విప్పి చూసింది… చూడడానికి బాగానే ఉన్నాయని ఒక చీర కట్టుకుంది .తర్వాత ఆరోజు ఇడ్లీ కోసం నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసుకుంది. మిక్సీ ఏమాత్రం నాణ్యత లేకుండా కనిపించింది…
“గిట్ల ఫ్రీ వస్తుందని కొంటే గిట్లే ఉంటది .ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం” అని అనుకొని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధవి.
“వొదినే! మోసం జరిగింది మన మిక్సీ మంచిగ పనే చేస్తలేదు” అన్నది వసంతతో.
“సప్పుడు జెయ్యకు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే ఇవి కొన్న అని తిడతా ఉన్నాడు. నా చీరలు నీళ్లలో పెట్టిన పొద్దుగాల. మొత్తం రంగు ఎలిసిపోయింది” అన్నది మెల్లగా వసంత.
“ఓయమ్మనే! మొత్తం మునిగినమే. ఈసారి గిట్ల చేయద్దు, అంత నాదే తప్పు .అన్న లేనప్పుడు వస్తతీ వొదినే” అన్నది మాధవి.
“యే, జర్ర నిలవడు. గా పెరంట్ల దిక్కువా”. అనుకుంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది వసంత మాధవిని.
“గిట్ల ఫ్రీ అని తీసుకుంటే గిట్లాయే” వొదినే అన్నది వసంత.
“గిప్పుడు సమజాయే, ఆల్లు మన కోసం గా ఉచితం పెడ్తరా? ఆల్ల లాభాలు జూసు కుంట
రు” అన్నది మాధవి.
“మీ యన్న వొద్దు అంటడు గిసొంటివి. మనమే సోచాయించి పోయ్యేది ఉండే. అయితేవాయే తీ, ఈపారీ గిట్ల చెయ్యొద్దు. ఇగ వోత వొదినే, పని గాలే” అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది మాధవి.
ఇద్దరు జరిగిన పొరపాటున గుర్తించుకుని, మళ్ళీ ఈసారి అలాంటివి చేయొద్దు అనుకున్నారు.