నా బాల్యం గల్లంతైంది
డా|| సరోజన బండ
‘బొమ్మరిల్లు’లో బొమ్మలాటలు
బొమ్మలాటలో కమ్మని వంటలు
పప్పు బెల్లం నువ్వులు చక్కెర
ఏకుడు పేలాలు వేరుశనక్కాయలు
మక్కజొన్న పేలాలు, పాలకంకుల
‘పిసికిల్లు’
పుట్నాలు, అటుకులు, చిట్టిలువలు
కుడుకలు, బత్తిసపేర్లు, చక్కెర గోళీలు
అప్పుడప్పుడు అమ్మ చేసిపెట్టే
చెగోడీలు, సకినాలు, గరిజెలు
అరిసెలు, గారెలు, సత్తుపిండి, సర్వపిండి
పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి
‘బెల్లం పాశం’
ఒక్కోసారి మా మల్లయ్య పిసికి యిచ్చిన
‘గసిపిండి ముద్దలు’
బుడ్డగిన్నెల్లో భద్రంగా తీసుకుపోయి
వెన్నలాంటి మనసుతో నా చిన్ని చెలికాండ్రకు
పేదరికం లేని నా పెద్దబుద్ధితో
పెళ్ళిభోజనమంటూ ‘మోదుగాకు’లల్లో
ప్రసాదంగా పంచి పరమానందం చెందేదాన్ని
పనికిరాని పాతరాతెండి తలె మాకు
‘పెళ్ళిడప్పు’
చొప్పకర్రలే ‘డప్పుకోలలు’
పీకెలే సన్నాయిలు బాజా భజంత్రీలు
చొప్పకోలలు, పుల్లలు, బెండ్లతో చేసిన ‘బండ్లు’
పల్లకీలో పిల్ల, పిల్లగాని ఊరేగింపు
మేరెసాంబయ్య పారేసిన తుక్కులోని
రంగురంగుల బట్ట పీలికలతో కుట్టిన
చిట్టి బొమ్మల సింగారంతో ‘పెళ్ళితంతు’
ఇవన్నీ మాకు ఆచరణయోగ్యాలు
అనుకరణ సాధ్యాలు ఆటపాటల సంరంభాల
ఆనందానుభూతులు
అగ్గిపెట్టెల టెలిఫోన్లు, తాటికమ్మల గాలిమోటార్లు
కుమ్మరి నర్సయ్య తాత గురుగులు
కమ్మరి రామయ్య తాత కడాయి, జల్లిగంటె
వడ్ల వెంకటయ్య మామ తెడ్లు
బుడ్డ సర్వలు బొడ్డు చెంబులు
గద్దె గిన్నెలు తపేలా పావులు
ఎరుకల ఎల్లమ్మ మొంటె- బిచ్చపు సాలమ్మ ‘సదిరె’
పూసల మల్లయ్య పూసపేర్లు, తరగని అందాల తాటాకు బుట్టలు
అన్నీ అపురూపమైన ఆటవస్తువులు నాకు
చెబ్బీసాబ్ గాజుల మలారంలో
పర్రెవట్టిన ఎర్రగాజులు
పచ్చగాజులు పూలగాజులు
సుతిలితో అల్లిన తుమ్మకాయల గజ్జెలు
సన్నటి సిబ్బి తీగలకు సుతారంగా గుచ్చిన
తుమ్మిపువ్వు ముక్కుపోగులు
నత్తులు, చెవికమ్మలు
మాకు అపూర్వ ఆభరణాలు
మా చేనులో ఏరుకొచ్చిన జిట్టరేగు పండ్లు
మా పెరట్లో కాసిన జామపండ్లు, దానిమ్మపండ్లు
సీతాఫలాలు వనచింతకాయలు, మామిడికాయలు
కాకెంగిలి అంటూ అంగీలోవెట్టి కొరికి
అన్నిటిని అందరం పంచుకొని తినేవాళ్లం
అన్నీకూడా ‘ఇందుల్లో’ మాకు విందుభోజనాలే
అమోఘ ఫలరుచులే!
గిల్లికయ్యాలు పెట్టుకున్నా ‘సోపతి గాల్లందరం’
తెల్లారి మళ్లీ కలిసేవాల్లం
లద్దునూరి తోవలు మావి మద్దూరిబాటలు మావి
కొడవటూరి గుట్ట, కొమిరెల్లి మల్లన్న జాతర
బెక్కల్లు రామలింగేశ్వరస్వామి ఆలయదర్శనం
ముచ్చటగా మూడురోజుల జాతర
ఆషాఢమాసం వనభోజనాలు
అన్నీ మాకు ఆనందస్మృతులే!
చేన్లు చెలకలు మావి – చెట్లు గట్లు మావి
ఎర్రమన్ను పుట్టలు మావి ఒర్రెలు వాగులు మావి
ఇసుకతెప్పలు మావి పిట్టగూళ్లు మావి
చింతచెట్లు మావి మామిడి తోపులు మావి
ఎనుగులు మావి గునుగులు మావి
‘తూరుపు తోట’ మాది తురకోని బావిమాది
జమ్మికుంట మాది
ఎల్లంబావి మాది ఎల్లమ్మ చెరువు మాది
హనుమాండ్ల గుడి మాది చెన్నకేశవ ఆలయం మాది
పాత కచ్చేరిమాది పాడువడ్డ బురుజుమాది
దొరవారి ఇంటి దొడ్డి కన్నాలు మావి
బంజరు దొడ్డిమాది బడి ‘శిథిలాల ఆవరణ’ మాది
నొగలు విరిగిన బండ్లు మావి పొణకలు, బోరాలు మావి
‘ఖాజా’ మామయ్య కాలిపోయిన ఇల్లు మాది
కూలిపోయిన గోడలు మావి
ఇల్లిల్లు మాది ఇంట్లోని ముంతగూళ్లు మావి
ఊరంతా మాది ఊల్లోని వాళ్ళంతా నావాళ్ళే
వరుసలతో పిలిచేవాల్లు మురిపెంగా చూసుకునే వాల్లు
కులాల కుటిలత్వంలేని స్నేహ బంధాలు మావి
ఉన్నోల్లు లేనోల్లు అనే తేడాలేని ఉనికి మాది
ప్రేమాప్యాయతలతో పెనవేసుకున్న
ప్రేమబంధం మాది
మమతానురాగాల మరుల విరులు పూయించిన
మనసు పూదోట మాది
తరాలు మారిన నా ఊరు తనరూపం మార్చుకుంది
అరువదేండ్ల కాలంలో అంతా తారుమారయింది
మహోన్నతమైన మానవ సంబంధాలు
మటుమాయమయ్యాయి
అధునాతన పోకడల్లో ఆధునికీకరణంలో
నా బాల్యం గల్లంతైంది
అలముకొంటున్న సంధ్యారాగంలో
అరుణ కిరణాల నా బాల్యాన్ని
జ్ఞాపకాల తెరల మరుగుల్లో
మళ్లీ వెతుక్కుంటున్నాను