ముకుంద రామారావు . వలస పోయిన మందహాసం కవిత ప్రముఖ కవి,అనువాదకుడు,ముకుంద రామారావు కలం నుండి జాలువారిన వలస పోయిన మందహాసం కవితా సంపుటిలోని వలస పోయిన మందహాసం కవిత పై విశ్లేషణా వ్యాసం.వలస పోయిన మందహాసం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.కవిత శీర్షిక పేరు వలస పోయిన మందహాసం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది.మందహాసం వలస పోతుందా? మనం ఎన్నడు కని విని ఎరుగం.అంతా ఏదో కొత్త కొత్తగా వింత వింతగా అనిపించింది.విలక్షణమైన భావాలు హృదయానికి తాకేలా ఉన్నాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు.కరువు కాటకాలకు నిలయాలుగా మారినాయి.కరువు తాకిడికి పల్లెలు విలవిలలాడుతున్నాయి.పల్లెలో జనాలకు ఉపాధి కరువై పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి.కొందరు జనాలు పల్లెలో ఉపాధి లేక విదేశాలకు వలస వెళుతున్నారు.మన దేశంలో విద్యార్థులు చదువుకున్న చదువుకు సరైన ప్రోత్సాహం లేక ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తూ బతుకు గడుపుతున్నారు. అడవుల్లో స్వేచ్ఛగా జీవించే పశువులు,పక్షులు, జంతువులు అడవుల నరికివేత వల్ల వాటి మనుగడ కరువై జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.ముకుంద రామారావు కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన సందర్భంగా అతనిలో కలిగిన భావాలు ప్రేరణగా నిలిచాయి. గుండె లోతుల్లో నుండి పొంగి పొరలే భావాలతో కవిత అక్షర రూపం దాల్చింది.ఇది కూతురు వివాహం చేసి అల్లునితో వియ్యంకుని ఇంటికి సాగనంపుతు కలిగిన దుఃఖము,వేదన నుండి జాలువారిన కవిత.వేదన నుండే కవిత్వం పుడుతుంది అంటారు.కవి ముకుంద రామారావు అనుభవించిన తీయని వేదనగా తోస్తోంది. కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసి భర్తతో పంపించడం తల్లిదండ్రుల బాధ్యత.తండ్రిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినాడు.మనుషులు వలస పోవడం తెలుసు.పక్షులు,జంతువులు వలస పోవడం తెలుసు.మందహాసం వలస పోవడం ఏమిటి? అని మనలో సందేహాలు రేకెత్తవచ్చు.వలస పోయిన మందహాసం కవితా సంపుటిలో సుప్రసిద్ధ విమర్శికుడు చేకూరి రామారావు చేరా గారి ముందు మాటలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో అచ్చయిన వలస పోయిన మందహాసం అనే కవిత ఖండిక ద్వారా తెలుగు కవితాభిమానుల దృష్టిని ఆకర్షించిన వై. ముకుంద రామారావు గారు ఈ దశాబ్దంలో గొంతు విప్పిన కొత్త కవి.తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం.ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు.సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు.భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది.పారదర్శకత్వం ఉండదు.పదౌచిత్యం ఉంటుంది.పదాడంబరం ఉండదు.భావ గాంభీర్యం ఉంటుంది.భాషా క్లిష్టత ఉండదు.పురోగమన శీలత ఉంటుంది.
సిద్ధాంత వలయం ఉండదు.అనుభవం వైయుక్తికమే. దృక్పథం విశ్వజనీనం.ఇది ఈయన తొలి కవిత సంకలనమే కాని తొలి నాటి కవితల సంకలనం కాదు అని చక్కటి ముందుమాట రాశారు.వలస పోయిన మందహాసం కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే కవి ముకుంద రామారావు వలస పోయిన మందహాసం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి/నాకే వీడ్కోలిస్తున్నప్పుడు/ ఇన్నాళ్లు/గుండె గదిలో వొదిగి వొదిగి/కళ్ళకేదో మంచు తెర కప్పి/చూస్తూ చూస్తూనే/గువ్వలా ఎగిరిపోయినట్టుంది/అంటున్నారు.వీడ్కోలు మరియు సంతోషకరమైన సమయాల్లో మనం మళ్ళీ కలుద్దాము అని విడిపోతున్నప్పుడు చెప్పుకుంటాం. విడిపోతున్నప్పుడు శుభాకాంక్షల వ్యక్తీకరణ వీడ్కోలు.ఇది అభిమాన పూర్వకంగా ఉంటుంది. వీడ్కోలు అంటే ఎవరైనా బయలుదేరడం.సుదీర్ఘ ప్రయాణం,పదవీ విరమణ సందర్భంలో వీడ్కోలు చెప్పబడుతుంది.అతడు ఆమె ఆనందాల కలయికకు ప్రతిరూపంగా చైతన్యం వెల్లి విరిసి అద్భుతమైన ఒక పాప రూపం దాల్చింది.అతని భార్య నవ మాసాలు మోసి ఓ సుందర చైతన్య రూపం గల పాపకు జన్మనిచ్చింది.అతని కూతురు పెరిగి పెద్దయి వివాహం జరిగిన సందర్భంగా తండ్రి అయిన తనకు వీడ్కోలు చెబుతూ భర్త వెంట బయలుదేరడం చూసి తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.చిన్నారి పాపాయి ఇన్నాళ్లు ఈ ఇంట్లో బుడిబుడి నడకలతో మెదిలి తన హృదయపు గదిలో ఒదిగి ఒదిగి ఉన్నది.ఆ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.పెళ్లి సందడితో భాజా భజంత్రీలతో రంగు రంగుల తోరణాలతో ఆ ఇల్లు ఆనందంతో బంధు,మిత్రుల సందడి సమాగమంతో ఒక రకమైన హడావుడి కొనసాగుతుంది.ఒక పక్క సంతోషం మరొక పక్క ముప్పిరిగొన్న బాధ ఆ తండ్రిలో కనబడుతుంది. రేపటి నుండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి కనిపించదు. తన కళ్ళకేదో మాయ కమ్మినట్లు మంచు తెర కప్పినట్లుంది.చూస్తూ చూస్తూ ఉండగానే తన ముందు నుండి గువ్వలా రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుంది.తన కళ్ళను తాను నమ్మలేక పోతున్నాడు.అమ్మాయి గువ్వవలె ఎగిరిపోయినట్లుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.“తెలిసి తెలిసి/సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది/సందడిని సంబరాన్ని మూట కట్టుకు పోయిందేమో!/అంటున్నారు.వలసను ఆంగ్లంలో Migration అంటారు.అనగా రుతుక్రమంగా,జంతువులు పక్షులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం చూస్తుంటాము.గుడ్లు పెట్టే స్థలాల కోసం,ఆహార సేకరణ కోసం వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పక్షుల వలసలు జరుగుతాయి.చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైన మార్గాలలో వలస పోతాయి.వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలస పోయి గుడ్లను పెట్టి పొదిగి పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగి వస్తాయి.సైబీరియన్ పక్షులు,పొడవాటి ముక్కు, భారీ రెక్కలు,అందంగా,ఆకర్షణీయంగా కనిపించే ఈ కొంగలు వచ్చి చెట్లపై విడిది చేస్తాయి.5000 వేల కిలోమీటర్ల దూరం నుండి జనవరి మాసంలో వచ్చి జూన్ చివరి నాటికి వెళ్లిపోతాయి.ఈ సైబీరియన్ పక్షులు ఒంటరిగా వచ్చి గుడ్లు పెట్టి పిల్లలతో పాటే తిరిగి సైబీరియాకు వెళ్లిపోతాయి.ఇది అందరికీ తెలిసిన సంగతి.వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతో వెళ్లడం కొత్తది ఏమీ కాదు.ఆ విధంగానే అమ్మాయి వివాహం చేసుకొని అత్త వారింటికి వెళ్లడం,సుదూర ప్రాంతాలకు సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది.తమ ఇంట్లో మెదులుతూ తన మాటలతో ఆటలతో పాటలతో మందహాసంతో అలరించిన అమ్మాయి సందడిని సంబరాన్ని మూటగట్టుకొని వెంట తీసుకొని పోయింది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.“ఇంతలోనే మేము మనుష్యుల మధ్యే లేనట్టుంది/ అనుభవానికొస్తేగాని/ఏ వేదనైనా అర్థం కాకుండా ఉంది/అంటున్నారు.వేదన అనగా తీవ్రమైన మానసిక బాధ.ఆవేదన అనగా తీవ్రమైన బాధ.పెళ్లి కాగానే అమ్మాయి అత్త వారింటికి వెళ్ళింది. అమ్మాయి ఇంట్లో లేక పోవడం వల్ల మేము మనుషుల మధ్య లేనట్లుగా తోస్తుంది.అమ్మాయి లేని వెలితి మా ఇంటిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.వివాహ బంధం వల్ల అతనితో అమ్మాయి వెళ్లిపోవడం చేత తీవ్రమైన మానసిక బాధ ఏర్పడింది.అమ్మాయి ఇంట్లో కనిపించక పోవడం వల్ల తీవ్రమైన బాధ కలిగింది.ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి లేని లోటు అనుభవం ద్వారా తెలిసింది.పెళ్లిలో అప్పగింతల కార్యక్రమం చేసి అమ్మాయిని పంపించిన తర్వాత అనుభవం ఏర్పడింది.తీవ్రమైన మానసిక బాధ,అనుభవం ద్వారా తనకు తెలిసింది. ఇది అంతా అయోమయంగా అర్థం కాకుండా ఉంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.”చెంగు చెంగున గెంతులు/చిన్నప్పటి గుజ్జెన గూళ్ళు/చిలిపి చేష్టలు/ఇళ్ళంతా నింపిన అలంకరణలై/ఇంటందరికీ గుర్తు చేస్తూనే ఉంది/అంటున్నారు.గుజ్జన గూళ్ళు దీనిని బువ్వలాట అని కూడా అంటారు. బువ్వలాటను పూర్వము ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు కలిసి ఆడుకునే వారు.పిల్లలు ఇంటిలో తమ పెద్ద వాళ్లను అడిగి బియ్యము,పప్పులు,బెల్లం, చక్కెర తెచ్చుకొని వాటిని పొయ్యి మీద పెట్టినట్లు నటిస్తూ వంట తయారు కాగానే పొయ్యి మీద నుంచి దించినట్లు నటిస్తూ కొంత సేపటికి అందరు కలిసి తింటారు.గుజ్జన గూళ్ళు ఆటను ఆడినప్పుడు బొమ్మల పెళ్లి చేసి రెండు జట్లుగా ఏర్పడి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు.బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దాని గుజ్జును గుల్ల చెడకుండా పూర్తిగా తీసివేసి ఆ గుల్లలో బియ్యం పోసి దానిని మండుచున్న పొయ్యిలోకి కుమ్ముతోనే పెట్టి ఉడికిన తర్వాత పిల్లలు గుజ్జన గూళ్ళు అని వేడుకగా తింటారు.పిల్లలు ఇల్లంతా తిరుగుతూ చెంగు చెంగున గెంతుతారు.తోటి పిల్లలతో కలిసి గుజ్జన గూళ్ళు బొమ్మల ఆటలు ఆడతారు.పిల్లల చిలిపి చేష్టలతో కోతుల వలె ఇల్లంతా గెంతుతూ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ అలరిస్తారు.
అమ్మాయి ఆడిన బొమ్మలు ఇంటిలో అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.అమ్మాయి నడయాడిన ఇల్లు ఆడిన బొమ్మలతో ఆ నేల అంతా ఒక రకమైన పరిమళంతో నిండి ఉంది.అమ్మాయి ఇంటి వారందరికీ అనుబంధాలను గుర్తు చేస్తూనే ఉంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. “ఎగిరిపోయిన ఛాయా లెక్కడా లేవు/కనిపించక కలవరం తప్ప/లేకుండా ఉండలేని నిర్లిప్తత తప్ప/ నువ్వైనా నేనైనా/మొలకెత్తిన చోటే మొక్కలన్నింటిని ఉండనీయం/పూచిన పూలనీ,పండ్లనీ,చెట్టుకే వదిలేయం/ఎంత లేదన్నా కాదన్నా/విడిచిపోలేని బాధ/విడదీస్తున్న చేతులకంటదు/అంటున్నారు. అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా జీవితం గడపడానికి అత్త వారింటికి వెళ్లిపోయింది.
అమ్మాయి గువ్వవలె ఆకాశంలోకి ఎగిరిపోయిన ఛాయలు ఎక్కడ కనిపించడం లేదు.అమ్మాయి పెళ్లి చేసుకుని కన్న వారిని వదిలి అత్తవారింటికి వెళ్ళిపోయింది.ఇక కన్న వారి ఇంటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి జాడ కనిపించదు.కాబట్టి తండ్రికి ఆ కుటుంబంలో అమ్మాయి లేదనే కలవరం ఏర్పడింది.అమ్మాయి కన్నవారి ఇంటిలో లేదు. అమ్మాయి లేకుండా ఉండలేని ఒక రకమైన నిర్లిప్తత ఇంటిల్లిపాదికి ఏర్పడింది.నువ్వు,నేను,ఎవరు అయినప్పటికీ మన ఇంటి పెరట్లో మొలకెత్తిన మొక్కలు అన్నింటిని ఒక్కచోట ఉండనీయం. మొక్కలను మన ఇంటి పెరట్లో అనువైన చోట నాటుతాం.మన ఇంటి పెరట్లో కాసిన కాయలను పక్వం రాగానే పండ్లను తెంపుతాం.చెట్టుమీద కాచిన పండ్లను చెట్టుకే వదిలి వేయడం జరగదు.ఎంత లేదు కాదు అని చెప్పినప్పటికీ అమ్మాయిని విడిచి ఉండలేని ఒక రకమైన బాధ ఆ ఇంటిలో కొనసాగుతుంది.అమ్మాయిని అత్త వారింటికి పంపించిన బాధ కన్నవాళ్ళ చేతులకు అంటదు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.లేదంటే చూడు/ పోగొట్టుకున్న వాడి ముందు/గెల్చుకున్న వాడి గర్వంలా/ఆ చేతిలో చేయి అభయ హస్త మవునో కాదో/మందహాసమై మెరుస్తోంది/సరిగ్గా ఒకప్పటి నాలాగే/అంటున్నారు.నవ్వు,మందహసం,దరహాసం ఒక విధమైన ముఖ కవళిక.నవ్వుతో ముఖంలోని వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండేవి సంకోచిస్తాయి.మానవులలో నవ్వు, సంతోషం,ఆనందానికి బాహ్య సంకేతం. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో,ఉత్తేజాన్ని కలిగిస్తుంది నవ్వు. ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది నవ్వు. అనేక రోగాలను దూరం చేసే టానిక్ నవ్వు.
నవ్వు శారీరకంగాను,మానసికంగాను,ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.నవ్వు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నవ్వడం వల్ల బాధను మరిచిపోతాం.నవ్వు శారీరక మానసిక రుగ్మతులను దూరం చేసి ప్రశాంతతను పోషిస్తుంది.చిరునవ్వు,మందహాసం అనగా పళ్ళు కనిపించకుండా పెదవులు విరిసి విరవకుండా నవ్వడం.అతనితో పెళ్లి చేసి పంపించి అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రిలో వేదన కనబడుతుంది. అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రి ముందు వివాహం చేసుకొని అమ్మాయిని గెలుచుకున్న అతనిలో ఒక రకమైన గర్వం కనబడుతుంది. అమ్మాయికి అతను చేతిలో చెయ్యి వేయడం చూసినాడు.అమ్మాయికి అతను రక్షణగా ఉంటాడో లేదో అనే సందేహం కలిగింది.పెళ్లి చేసుకుని అమ్మాయిని వెంట తీసుకొని పోతున్న అతని ముఖంలో చిరునవ్వు వలె మెరుస్తోంది.అమ్మాయి తండ్రి కూడా వివాహం చేసుకొని తన భార్యను తన వెంట తీసుకు వచ్చాడు.అమ్మాయి తండ్రి తన వివాహం రోజు నాటి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉన్నాడు.ఒకప్పటి తనలాగే అమ్మాయి వివాహం జరిగింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వలస పోయిన మందహాసం అనే చక్కటి కవిత రాసిన ముకుంద రామారావును అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
యల్లపు ముకుంద రామారావు తేది 09 – 11 – 1944 రోజున పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్ లో జన్మించాడు.తల్లి ఎరుకలమ్మ,తండ్రి యెల్లయ్య. తండ్రి రైల్వే ఉద్యోగి.ముకుంద రామారావు ఎమ్మెస్సీ మ్యాథ్స్, డి.ఐ.ఐ.టి., పి.జి.డి.సి ఎస్. ఖరగ్పూర్ లో చదివారు.వీరు రైల్వే శాఖ లో కంప్యూటర్ రంగంలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి భార్య పేరు సుభాషిణి.ముకుంద రామారావు, సుభాషిణి దంపతులకు ముగ్గురు సంతానం;1) లావణ్య 2)చైతన్య, 3)కళ్యాణ చక్రవర్తి.
వీరు రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభించి కవిగా స్థిరపడ్డారు.వీరు అనువాదకుడిగా రాణించారు.
ముకుంద రామారావు వెలువరించిన గ్రంథాలు స్వీయ కవిత్వం.
1) వలస పోయిన మందహాసం – 1995/2) మరో మజిలీకి ముందు – 2000./3) ఎవరున్నా లేకున్నా – 2004/4) నాకు తెలియని నేనెవరో – 2008/5) నిశ్శబ్దం నీడల్లో – 2009/6) విడని ముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – 2013./7) ఆకాశయానం – 2014/.8) రాత్రి నదిలో ఒంటరిగా – 2017/9) నిశ్శబ్దంలో శబ్దం – 2024.
ముకుంద రామారావు వెలువరించిన స్వీయ అనువాద రచనలు :1) అదే ఆకాశం – 52 మంది కవుల పరిచయం,70 కవితలతో 23 దేశాల అనువాద కవిత్వం.తొలి ప్రచురణ – 2010.మలి ప్రచురణ – 2023/ 2)అదే గాలి (2000 మంది కవుల పరిచయం,500 కవితలు,560 పేజీలు, వందకు పైగా ప్రపంచ దేశాల కవిత్వం – నేపథ్యం) – 2016/3)అదే నేల (3000 మంది కవుల పరిచయం, 700 కవితలు,900 పేజీలు,నలబైకి పైగా భారతీయ భాషల కవిత్వం – నేపథ్యం)2019/ 4)అదే కాంతి (210 మంది కవుల పరిచయం,1200 కవితలు,750 పేజీలు,మధ్యయుగంలో భక్తి కవిత్వం సామాజిక నేపథ్యం) – 2022/ 5) అదే నీరు – వంద మంది కవుల 700 కవితల జాతీయ అంతర్జాతీయ కవుల కవిత్వం,పరిచయం విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురితం) – 2023.
6)శతాబ్దాల సూఫీ కవిత్వం – 52 మంది కవుల 121 కవితలు -2011./7)1901 నుండి నోబెల్ కవిత్వం (37 మంది కవుల 171 కవితలు, 320 పేజీలు, నోబెల్ కవుల కవిత్వ – జీవితవిశేషాలు) – 2013/ 8)1901 నుండి సాహిత్యంలో 13 మంది నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015)/ 9) భరత వర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం – (2017)/ 10) చర్యా పదాలు – 23 మంది కవుల 50 కవితలు (అనేక భాషల ప్రథమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) -2019/ 11) మిణుగురులు ( టాగూర్ Fireflies కు తెలుగు అనువాదం) కినిగె ఈ – బుక్ – (2022)/ 12)ఇసుక నురగ (ఖలీల్ జిబ్రాన్ Sand and Foam కు తెలుగు అనువాదం) – కినిగె ఈ బుక్ – (2022./13) మియా కవిత్వం – అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం (2022)./
14)బెంగాలీ బౌల్ కవిత్వం – 80 మంది బౌల్ కవుల 170 బౌల్ కవితలు – (2023)/వీరి కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదాలు :1)వలస హోద మందహాస – మొదటి రెండు కవిత్వ సంకలనాల్లోని కవితల కన్నడ అనువాదం (2005)/2)The Smile That Migrated And Other Poems – మొదటి మూడు కవిత్వ సంకాలనాల్లోని కవితల ఆంగ్ల అనువాదం – (2011/).వీరు రచించిన కథలు/ ఇతరాలు : (విశాలాంధ్ర/ నవచేతన ప్రచురణలు) :1) దేశ దేశాల కప్పల కథలు – (2010)./2) నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015)/3) వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) -(2018)/4) అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019).
వీరు రాసిన పుస్తకాలు ప్రచురణలో ఉన్నవి/ 1) నిశ్శబ్దంలో శబ్దం – స్వీయ కవిత్వ సంకలనం./2) నా ఇల్లెక్కడ? – కథల సంకలనం./3) ఆసక్తి – వ్యాస సంకలనం./ 4) విశ్లేషణ – సమీక్షలు సమాలోచనలు./5) అనామక ప్రతిబింబాల ప్రవాహం (టాగూర్ చిత్రాల కవిత్వం కు తెలుగు అనువాదం)
వీరు పొందిన పురస్కారాలు :1) వలస పోయిన మందహాసం కవితా సంకలనానికి శ్రీ రమణా సుమన శ్రీ పురస్కారం – (2000)./2) వచన కవిత్వానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం – (2009)/.3)C.P. బ్రౌన్ పండిత పురస్కారం (హ్యూస్టన్ USA లో) – (2015)./4) అదే గాలి ఉత్తమ సాహిత్య గ్రంధానికి గంగిశెట్టి స్మారక మహాంద్రభారతి పురస్కారం (2017)./ 5) నోబెల్ కవిత్వ గ్రంథానికి అనువాద ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – (2017)6) అదే నేల (భారతీయ కవిత్వం – నేపథ్యం) గ్రంథానికి తాపీ ధర్మారావు పురస్కారం – (2020)./ 7) కవి సంధ్య ప్రతిభ పురస్కారం (అనువాదానికి) – 2021/.8) అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం,సామాజిక నేపథ్యం) గ్రంథానికి పెమ్మరాజు లక్ష్మీపతి గారి స్మారక పురస్కారం – 2022/.9) మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కారం – 2022/.10) కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ వేములపల్లి కేశవరావు, శ్రీమతి విశాల గార్ల అనువాద ప్రతిభా పురస్కారం – 2022/.11)అజో- విభో -కందాళం ఫౌండేషన్ వారి 2024 ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం/12) విజయనగరం విజయ భావన 2024 ఉగాది పురస్కారం/.వీరు రాసిన ఇతరాలు :
1) ఆంగ్లం పోలిష్,హిందీ,ఉర్దూ,బెంగాలీ,కన్నడం, తమిళం,మలయాళం,ఒడియా,సంతాలీ, మరాఠీల్లో కి ఎన్నో కవితల అనువాదాలు./2) వివిధ సంకనాల్లో,కవిత వార్షికల్లో,కవితా దశాబ్ది సంచికల్లో,/అనేక వెబ్సైట్లలో కవితలు/ 3) ప్రతిష్టాత్మక the little magazine సంకలనం India in Verse – Contemporary poetry from 20 Indian Languages and 167 Poets సంకలనంలో అనువదించబడ్డ కవిత ప్రచురితం./4) మధురై నుండి ప్రచురితమయిన Kavya Bharathi 2008 -Study Centre for Indian Literature in English and Translation,American College సంకలనంలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం. 5) ఈ క్రింది సంకలనాలలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం./ I)Pride of Place – An anthology of Telugu Poetry. 1981 -2000 with 117 Poets – K.Damodhar Rao/.ii)Voices on the Wing – Telugu Free Verse – 1985 – 95 – V.V.B.Ramarao/iii)VIRTUOO -A refereed Transnational Bi -Annual Journal of Language and Literature in English /iv)San Diego Poetry Annual 2011 – 12,2015 -16 (The Best Poems from every corner of the Region)/v)Wakes on the Horizon – A Selection of Poems translated from Telugu – N.S.Murthy./6) వలస పోయిన మందహాసం కవితా సంకలనం మీద వార్త దినపత్రికలో సంపాదకీయం./7) కేంద్ర సాహిత్యఅకాడమీ,తెలుగు విశ్వవిద్యాలయం/,Hyderabad Literary Festival లాంటి సంస్థల్లో పత్ర సమర్పణ, కవిత్వ పఠనం. 8) ఆకాశవాణి రేడియో కేంద్రాలలో, టీవీలలో,కవితల ప్రసారం, పరిచయ ప్రసంగాలు/9) కేరళ తుంజన్ 2013 కవితోత్సవాలకు తెలుగు కవిగా ప్రత్యేకాహ్వానం./10)”రాత్రి నదిలో ఒంటరిగా” కవిత్వ సంకలనం మీద మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్. పట్టా ప్రదానం – 2018./వివిధ గ్రంథాలలో వీరు రాసిన పరిచయ వ్యాసాలు :/1)Modern Poetry in Telugu – వడలి మందేశ్వర రావు./2) సాహిత్య మహిళావరణం, కవిత్వానుభవం – చేరా/.3) సాహిత్యకీయాలు – ఏ.బి.కె/.4) అభివ్యక్తి – గుడిపాటి/.5)సాలోచన – గోపి./6) గుండెతడి – జింబో/.7) ఈ కాలం కవులు – సౌభాగ్య./8) సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు – మునిపల్లె రాజు./9) తెలుగులో ఆధునిక నవల – ఇతర వ్యాసాలు – అంపశయ్య నవీన్.