మనిషంటే
కాల సముద్రాన్ని ఈది వచ్చిన గజ ఈతగాడు
భూకంపాలతో అగ్నిపర్వతాలతో
క్రూర మృగాలతో ఉల్కా పాతాలతో
ఈ భూమి సంకుల సమరంగా ఉన్నప్పుడు
ధైర్యమే ఆయుధంగా పోరాడి గెలిచిన విశ్వవిజేత
సంస్కృతి నాగరికతల చక్రాల మీద
పరిగెత్తిన చరిత్ర అంతా మనిషిదే
అతని కోసమే ఈ సజీవ సృష్టి
విప్పారిన పూలతో ఉత్సవం చేసుకుంటున్నది
అతడు చిందించిన చెమట చుక్కలోనే
హరివిల్లు తన అందం చూసుకుంటున్నది
జననం మనిషి జన్మ హక్కు
తనని ఎప్పుడూ మృత్యువుకు తాకట్టు పెట్టలేదు
కాని – ఇదేమిటి?
పక్షి రెక్కల టప టప
గుండెలోని దడ దడ
క్షణాలను లెక్కపెట్టే లోగా
మనిషిని లాక్కుపోతున్నది రోగం!
స్నేహాలు,ఆప్యాయతలు, అనుబంధాలు
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాయి
ప్రేమతో పేదరికం జయించినవాడు
కరచాలనంతో కష్టాలను ధిక్కరించినవాడు
పొగిలి పొగిలి ఏడ్చినా,విరగబడి నవ్వినా
చిమ్మిన కన్నీటి చుక్కలో ప్రతిబింబించినవాడు
భూమిలో లోతుల్లోకి ఇంకిపోతున్నాడు!
మానవ చరిత్రకు పునాదులు తీసినవాడు
మన ముందే మట్టిలోకా?
సాహసంతో కార్చిచ్చును చల్లార్చినవాడు
ఈరోజు చితిమంటల్లోనా?
శాస్త్ర శస్త్రంతో చావును చావు దెబ్బ తీయాలి
మరణించిన మనిషిని మళ్లీ బతికించాలి