కాలమే అనుకూలిస్తే….
దూరమైన బంధాలు అనుబంధాలు చేరువవుతాయి
లక్ష్యం చేరేందుకు దారులన్నీ సిద్ధంగా ఉంటాయి
ఆశలూ ఆశయాలు నెరవేరి జీవితమే
నందనవనమై పరిమళిస్తుంది
‘మార్పు’ ఏదైనా మంచిఫలితాన్నే ఇస్తుంది
ఎండమావులలోనూ నీరు ఊటలా ఉబికి వస్తుంది
బీడువారిన నేలలోనూ ఫలవంతమైన సస్యములే పండుతాయి
బలహీనుడనుకున్నవాడే
బరిలో గెలవవచ్చును
గరికపోచయైనా బ్రహ్మాస్త్రమే గావచ్చును
కుందేటిపిల్లయైన
కౄరసింహముపైకి లంఘించవచ్చును
కాలమే కలిసొస్తే…
ఒట్టిపోయిన బావులలో జలధార ఉబికి వస్తుంది
వ్యర్థమని తలచినదే అక్కరకొస్తుంది
దైవమే అనుకూలించి
తలచినదే జరుగుతుంది
అదృష్టమే తలుపు తట్టి విజయమే ముంగిటకు తెస్తుంది
కాలమే అనుకూలిస్తే ..
శిశిరంలోనైనా మోడులన్నీ చివురాకుల చిరునవ్వులు చిందిస్తాయి
మండువేసవైనా
పిల్లసమీరాల చల్లదనమే ఇస్తుంది
కాలమే కనికరిస్తే
అగ్నికీలలబడినా
పూలపానుపుబడిన రీతి
ప్రాణాలు నిలువవచ్చ
యమపాశమైనా
పూలహారమై హాయినీయవచ్చు
బండ్లన్నీ ఓడలై
ఘనమైన సంపదలతో తులతూగే చరితలే చూడవచ్చు
పామరుడే పండితుడై మహాకవి గావచ్చును
కుచేలుడే కుబేరుడై జగతిలో వెలుగొందవచ్ఛు