నా ఇంట ఆమనిలా విమల
నా కంటిపాప లా విమల
ముత్యాల పలువరస
ముసిముసి నవ్వులు
కొంటెతనం కోమలి
జతగ మూడు పదుల
ముత్తైదువు తనం
నలబై ఐదేండ్ల ప్రాయం
కాలమా ఏల ఈ హేయం .?
విమలా మనూరి ముచ్చట్లు అచ్చట్లు
అది తొంభై ఐదు సంవత్సరం
తొలినాళ్ల బెజ్జికల్లు వరినాట్లు ..
కల్పు తీతలు పంట కోతలు
చాలీచాలని జీతం నేను సతమతం
చంపాపేట హైద్రబాద్ మకాం..
ఆరునెలల కాపురం
అత్తమామల అండతో
రామోజీ ఫిల్మ్ సిటిల అడ్డ
స్టూడియో నిర్మాణం లో పార్కులు
నీసెమట గంధాలకు సొబగులద్దుకునె గదా
నీ చేతుల చలువరాయి వన్నెలద్దుకునే గదా
1997 జనవరి మాసం
అగ్గది లెక్క కొలువు తీరిన
నేను పంతులు నౌకరి ల
నువ్వు పంతులమ్మ గా
నాంపల్లి ల మన టికాన
సరికొత్త కాపురం
ఎన్ని ఆశలు పెంచుకున్నాము
ఎన్ని వుసులు పంచుకున్నాము
వోనమాలు వంట పట్టించుకోని
వి మ ల .. అని నీవు పలకపై రాసి
పరవశించిన మురిపం ఎట్లా మరిచేది..
మన ఇంటికి ఎవరు వచ్చినా
ఉరుకురికులాడి వంట వార్చిన అమ్మతనం
ఉప్పిడో సప్పిడో కలిగిన దాంట్లో వండిన కూర
కమ్మదనం మన ఇంటికి అన్నపూర్ణ నీవే కదూ..
అరమరికలు లేని దాన
అమాయక నా విమల
సుఖాలకు పొంగలే
కష్టాలకు కుంగలే
నీవో నవనీతం
నవన్మోహిత పారిజాతం
సారంతో సాగుతున్న సంసారం
ఆశలు ఊసులకు శ్వాసతో
పురుడు పోసుకున్న పిల్లలు
ఒక రేనక ఒకరు చాలనుకున్న ఇద్దరు
నలుగురు పిల్లల తల్లి నా విమల
ముగ్గురు పిల్లల ఆటలు పాటలు
అల్లరితోనే చదువులు
చండూరు మరియానికేతన్ ఒక జ్ఞాపకం
మెరుగైన చదువులకంటూ
నల్లగొండ పిల్లలు పెద్దలై గ్రాడ్యుయేట్స్
రెక్కలొచ్చిన పిట్టలయ్యారు
కాలంతుర్రుమంటూ
తీతువుపిట్టల సాగుతూనే ఉంది
జీవితం బరువుగా భారంగా
నిట్టూర్పు నెగళ్లకు సెగలుగకుతూనే ఉంది
కాని కాలం కరోనా విలయం
తట్టుకున్న దేహాలు మనవి
పిల్లల ప్రేమలకు పట్టాభిషేకాలు
దగ్గరుండి ప్రేమను గెలిపించాం
ఇప్పుడేమిటి ఇలా
నన్ను ఒంటరి చేశావు
ఎందుకిలా నాకు వినియోగం
జీవిత వైరాగ్యం
అంతా నీవు చెప్పినట్టే చేశాను కదా
నీవు చెప్పినట్టే పిల్లల జీవితాలు సరిదిద్దాను కదా
నాకెలా ఈ ఎడబాటు నా విమల
మనం మధ్యలో కలిసిన
చివరి కంట జంట తోడంటూ
అర్ధాంతరంగా ఏమిటి
నీ పాత్రకు వీడ్కోలు
నాకేలా వీడుకోలు
చివరి రోజునాడు
ఓయ్ నన్ను గురించి రాయవా
ఎవలెవలి గురించో కథలు రాస్తావ్
నా గురించి ఒకసారి రాయి అన్నావు
రాయలేక సతమతం
ఏమిటో అంతు చిక్కని నీ అభిమతం
మేడిపండు లోకముకదా
రీతులెండు కాలము కదా
కలికాలం వెతలురేపేనా
కల్లోలం చితులు రేగేనా
ఇంటిదీపం ఆరింది
కంటివెలుగు జారింది
కష్టాలు తరుముతుండెనా
కన్నీళ్ల మునుగుతున్నది
మింట తార చేరింది
గగనవీధి వాలిందా
చితిపై పెనుమంటలెంతరేగిన
గాయపడినగుండెల చింతలుతీరునా
సతిని చుట్టుముట్టిన జ్వాలలకు
ఎదపొంగె నీకన్నీళ్ల తడి ఆరునా
ఏమిటి గోరం ఎవరిది నేరం
ఎవరికి శిక్ష కాలానికేల ఈ కక్ష