Home కథలు జోగుళయ్య కథలో పలాయన తత్వం

జోగుళయ్య కథలో పలాయన తత్వం

by Tirunagari Devaki Devi

             మహంతయ్య మఠంల గంజాయి నిషాలో  ఉన్న నాగప్పకు వచ్చిన కొత్తమనిషితో సంభాషణలో ”  జన్మ రోత ఆలి ఎవతె ? చూలు ఎవరు? ” అనే విషయం బాగా నచ్చింది. దాంతో అతను లేడికి లేచిందే పరుగు అన్నట్లు స్నేహితులతో కలిసి ఇల్లు సంసారం వదిలి మఠాల చుట్టూ తిరగడం లో మునిగి పోయిండు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ  రచయిత్రి .  ” ఆ మఠంలో తీరొక్క కులపోళ్ళున్నరు. తీరొక్క గుణపోళ్లున్నరు . పొట్టకు గడవక సన్నాసోడైనోడున్నడు. రోగంతోన ఏగలేక  జోలె కట్టినోళ్ళున్నరు. అప్పుల దాడికి మొకం దిస్పిచ్చినోళ్ళున్నరు. జైల్ల కెల్లి పరారై వచ్చినోళ్ళు న్నరు. కూనీలు చేసినోళ్ళున్నరు. సోరోళ్ళున్నరు. ముసలోళ్ళున్నరు. షావుకారున్నడు. చదువుకున్నోడున్నడు. సాకలోడున్నడు. సాగినోడున్నాడు. జారిపడ్డోడున్నడు…… ఆ మఠంల అందరికీ సోటుంది” అంటుంది.కాని  రచయిత్రి చెప్పిన వ్యక్తుల్లో నాగప్ప ఏ కోవలోనికి  చెందినవాడు కాదు.  అది రచయిత్రికి మఠాలపట్ల ఉన్న అవగాహన. ఈ కథలో నాగప్ప  మఠాల వెంట తిరిగింది మత్తునిషాలో , కొత్తమనిషి ద్వారా విన్న వేదాంతం వల్ల. నాగప్పకు తన దగ్గరున్న  పైస ఖర్చైన తర్వాత ఇల్లు జ్ఞాపకం రాలేదనీ కాదు. వచ్చింది. కాని క్షణికావేశంలో ఆలెవరు? చూలెవరుఅని ఇల్లొదిలిన మనిషికి  తిరిగి  ఇంటికి పోవడానికి  మొహం చెల్లలేదు. ఇక చేతిలో చిల్లి గవ్వలేని స్థితి జోలెతో భిక్క్షాటనను  ఆశ్రయించేటట్లు చేసింది.  కట్టుబట్ట తప్ప మారుబట్ట లేకపోవడంతో కట్టుకున్న బట్టలు కావిరంగులోకి మారినై. ఈ రెండూ నాగప్పకు  కొత్త జీవితాన్ని తెచ్చిపెట్టినై. వాటికి తోడు కావలసినంత సమయం గుళ్ళు గోపురాలు మఠాలు తిరిగే అవకాశాన్ని ఇచ్చినై. మఠాధిపతుల సాంగత్యమూ దొరికింది. జీవితం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. సన్యాసి జీవితానికి ఆ జీవితం ఆకర్షితమైంది. అందుకు చాలా తాపత్రయపడింది కూడా. 

                సన్యసించడమంటె కుటుంబ బంధాలకు దూరమై రాగద్వేషాలు లేకుండా జగమంత కుటుంబం నాది అనే ధోరణిలో జీవిస్తరు. జీవించాలి కూడా. కాని అసమర్థులైన చాలామంది కుటుంబాన్ని వదిలి  దానికి సన్యాసి పూతను తగిలించుకొని  దేశ దిమ్మరులౌతుంటరు. నాగప్ప విషయంలో కొంత ప్రత్యేకత ఉన్నది. కుటుంబాన్ని వదిలినా దేశదిమ్మరైనా స్త్రీ లోలుడు కాదు. కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయంలో లెక్క పత్రాలు పకడ్బందీగ ఉండేవి. అంటే  అతనిలో కొంత నిబధ్ధత  ఉంది. ఆ నిబద్ధత మఠాధిపతులను సేవించడంలోనూ కనబడుతుంది.  బలహీనతల్లా గంజాయి సేవించడం. సాహచర్యంలో వేదాంతధోరణి. వేదాంతం కూడా చాలా విచిత్రమైన పదం. నిజానికి వేదాలలో ఉండేది వేదాంతం. కాని బంధాలను పరిత్యజించడం కూడా వేదాంత ధోరణి అనే అర్థం స్థిరపడింది. ఈ కథలోని నాగప్ప ఆ కోవకు చెందినవాడే. మఠాల్లో  చేరిన వాళ్లలో తేడా ఉన్నట్లే, మఠాల్లో ఆ మఠాధిపతు ల్లో కూడా తేడా ఉంటుంది. మఠాధిపతులు కొందరు తమ శిష్యపుంగవులకు వాత్సల్యంతో సద్బోధనలు చేస్తే మరి కొన్ని ఆశ్రమరూపంలోని మఠాల్లో ఆయా మఠాధిపతులు అక్రమాల పుట్టగా ప్రజలను పెడమార్గం పట్టిస్తూ  డబ్బు చేసుకుంటారు. నాగప్ప చేరిన మఠం మొదటి కోవకు చెందింది.ట్రాన్స్ లో ఉన్న నాగప్ప మఠంలోని పెద్దయోగిని సన్యాసం ఇప్పించమని అడిగినప్పుడు అతను నాగప్ప మఠం వరకు రావడానికి గల కారణం క్షణికావేశమని పసిగట్టి కుటుంబం అనుమతి తీసుకొని రమ్మని సలహా ఇచ్చిండు. ఆ సలహాలో నాగప్ప స్థిరత్వాన్ని నిగ్గు తేల్చాలనుకున్నడు. అనుకున్నది సాధించిండు కూడా.         

            ” పిలగాడు ఏమంటున్నడు?”. మఠం నుండి సొంతూరుకు ఆ తర్వాత  స్వంత ఇంటికి బిచాణ మార్చిన రెండు రోజుల తర్వాత  భార్యను అడిగిండు బసప్ప ఇంటికి చేరిన కొడుకుని ఉద్దేశించి

             “ఏమంటడు? ఎద్దోలె తిని మొద్దోలె పండుతుండడు.” అన్నది భార్య సమాధానం.

ఈ సమాధానంలో నిద్రాహారవిషయంలో నాగప్ప సాధారణజనం లక్షణమే తప్ప ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు కన్పించలేదు. అంటే నాగప్ప దేశదిమ్మరిగా గుళ్ళూ గోపురాలు తిరిగిండు . యోగులతో కలిసి కాలం గడిపి సన్యాసి అనే ఊహాలోకంలో బతికిండే తప్ప సన్యసించిన మనిషికి ఉండాల్సిన స్థిరమైన అభిప్రాయాలు లేవని అనుకోవచ్చు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించినందుకే కోడలుకు కొడుకుకు ఏకాంతం కల్పిస్తే కొడుకు అంతరంగం ఆవిష్కృతమౌతదని ఆలోచించిన్రు. వాళ్ళ ఆలోచన నూటికి నూరుపాళ్ళునిజమైంది.  తల్లిదండ్రులు తిరిగొచ్చేవరకు ఆహారంలోనే కాదు ఆహార్యంలోనూ పూర్వపు నాగప్ప ఐండు. తప్పు చేసినవానోలె నెత్తి కిందికేసుకొని వాళ్ళకు దండం పెట్టిండు. ఈ తప్పు అనే భావన ఎందుకొచ్చిందని ప్రశ్న వేస్తే అది ఇంటినుండి జాడపత్తా లేకుండ దేశంమీద పడి తిరుగుడు, తను సన్యాసుల బ్రమలో బ్రతుకడం అనేది  క్షణికావేశంలో జరిగిందని గుర్తించడం. . 

                 ఈ కథలో అంతర్లీనంగా నాగప్ప భార్య శివమ్మ ఆత్మస్థైర్యాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు.

మఠం నుండి ఇల్లు చేరుకున్న నాగప్పను భార్య శివమ్మ దేబురించి   వేడుకోమని అడగలేదు కానీ “పనీపాటయినంక వచ్చి తలుపు పట్టుకొని నిలబడి నాగప్పను చూసి పోతది . అంతే కానీ ఏడ్వలేదు నగలేదు ఏగిర్త పడలేదు. వొణ్కలేదు. 

పొద్దు మూకి మట్కు  ముద్దుగ నెత్తి దువ్వుకొని మల్లెపూలు శికెల ముడ్సుకొని దోస పల్కు బొట్టు పెట్టుకుంటది. నాగప్ప కూసున్న అరుగు ఎదురుగా ఉన్న రెండో అర్గును అలికి శుద్ధిచేసి ముగ్గేసి అరిటాకు పర్సి రాగి చెంబుల నీళ్లు పెట్టి దానిమీద స్తాళి బోర్లించి పోతది. బంకుల కింద కాళ్లు చేతులు కడుక్కొనికే నీళ్ల కొప్పెర పెట్టి పోతుండె  “

అనే రచయిత్రి మాటల్లో ఆమె స్థిరత్వం ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఆమె అలంకరణలో జాణతనం నడతలో   తనను వదిలి పోలేడనే దృఢ నిశ్చయం కనబడుతుంది. 

        ఓ అర్ధరాత్రి దాహంతో తలుపు కొట్టి”మంచి తీర్థం ఇప్పిస్తారా”అని అడగడం, విచ్చుకున్న   మల్లె మొగ్గల సిగతోని శివమ్మ కనబడటంతో సన్యాసి నాగప్ప కు బంగు తాగినట్లైంది. కానీ నాగప్ప తనకు కలిగిన వాంఛని సంభాళించు కొని మంచినీళ్ల విషయాన్నే చెప్పినా పరిస్థితిని అర్థం చేసుకున్న శివమ్మ భర్తను గుర్తుపట్టనట్టే 

            “ఏయ్ బైరాగోడ ! మా అత్త మామ ఇంట్ల లేంది జూసి మంచి తీర్థం గించితీర్థం అనుకుంటా ఇంట్ల జొరవడ చూస్తుండవా?”అంటూ దబాయించి అతను అడిగినట్లు చెంబులో నీళ్లతో నిలబడగానే తన మనోవాంఛ మతలబును వెల్లడిస్తూ

             “శివ నీవు అదృష్టవంతురాలు నిన్ను అనుగ్రహించాలని కోరిక కలుగుతున్నది” అని నాగప్ప అనగానే 

             “ఏమో శివ్వ గివ్వ అనబడుతివి. నీకు నన్ను అనుగ్రహించాలని కోరిక పుడితే బాగానే పుట్టింది. గని మరి నిన్ను నేను అనుగ్రహించొద్దా?” అని శివమ్మ ప్రశ్నించడంలో ఆమె ఆత్మ గౌరవం

 చాలా స్పష్టం . 

              అంతేకాదు స్వాములను అనుగ్రహించాలి వాళ్ల కోర్కెను కాదనకూడదు అన్న నాగప్ప మాటలకు”గా ఇంత దానికి సన్నాసి గిన్నాసి అని దొంగేశం ఎందుకు కట్టాలె.”అని నిలదీసి అతని బుర్రకాయను  పగలగొట్టించి, మెడలో లింగంకాయ వేసి, జన్మలో సన్యాసులజాడ పట్టకుండ ఒట్టు వేయించుకొని  అతన్ని అనుగ్రహించింది. 

              మొత్తంగా రచయిత్రి యశోద రెడ్డి గారు ఈ కథలో క్షణికావేశ  పలాయన వాదులను గృహిణుల ఆత్మగౌరవ, విశ్వాసాలను దృఢ చిత్తాన్ని నిగ్గు తేల్చి చూపించారు.

               ఇక ఈ కథ పేరు విషయానికి వస్తే కథలో ముఖ్యమైన పాత్రగా నాగప్ప కనపడుతుండగా పేరేమో జోగుళయ్య అని ఉన్నది. నాగప్ప జోగిగా (యోగిగా) మారిన ముఖ్యాంశాన్ని జోగుళయ్యగా పెట్టినట్టు కనబడుతున్నది.

కథను గమనిస్తే నాగప్ప కుటుంబం లింగాయతులది అని తెలుస్తుంది. కానీ ఎందుచేతనో రచయిత్రి కథ ముగింపులో మంచి తీర్థం వంటి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పదాన్ని వాడినారు ఆలోచించవలసిన విషయం అది. 

కథలో తెలంగాణ మాండలికాలు             

లిడ్తి వడి        =.      నష్టం 

పిస పిసలు.   =.      గుసగుసలు 

ఎదలల్ల.        =.       మనసుల్లో 

సోరోళ్ళు.       =.       యుక్త వయస్కులు

ఆడ్తి.             =.       చిన్న చిన్న రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి వ్యాపారం చేసే దుకాణం 

కీసల.             =.       జేబుల 

తాల్మివట్టు.     =.       ఓపిక పట్టు 

పొట్కు.          =.        ఒత్తిడి 

సందే.             =.        సంధ్యాకాలం 

సస్కాలు.        =.       పైసలు 

ఈ త్యాప.        =.      ఈ తడవ, ఈ సారీ 

పోవడి.            =.       పోలిక 

పావురం.          =.       ప్రేమ 

ఇర్గవడ్తుండరు.  =.      విరుచుక పడుతున్నారు 

పడ్సు.               =.      పడుచు, వయసు

గేరొచ్చి.              =.      మూర్చ వచ్చి 

సుట్క.              =.       సుట్టుక, తల తిరిగి 

సోమ్మసిల్లి.          =.      కళ్ళు తిరిగి 

ఏగిర్త.                 =.       తొందర 

స్తాళి                   =.       మూత 

తనబ్బీ.              =.       సామాను పెట్టుకునే పెద్ద

                                    గూడు 

దూప.                 =.       దాహం                                                                         

మిళ్ళి.                 =.       చెంబు 

ఏశం.                  =.       వేషం 

యీబూతి.          =.       విభూతి 

మాణిక్యాలు.       =.       మన్సాల, మగసాల, మగవాళ్లు కూర్చునే మొదటి పెద్ద గది 

బంకులు.            =.        గ్రామ జనం కూర్చోవడానికి అనుకూలంగా మొదటి పెద్ద ద్వారం నుండి ప్రవేశించగానే ఇరువైపులా ఉండే అరుగులు

నూగువిండికారం=నువ్వుల పొడితో కారం

పై తెలంగాణ మండలికాలే కాక 

నిండా మునిగినంక సలేంది

దారం గుంజినట్లల్ల బొమ్మాడినట్లు(తోలుబొమ్మలాట వలె) 

అనే సామెతలు కూడా ఉన్నాయి.

You may also like

Leave a Comment