వాసి జ్యోత్స్న రచించిన నువ్వూ – నేను కవిత
కవయిత్రి,వాసి జ్యోత్స్న కలం నుండి జాలువారిన నువ్వూ – నేను కవిత పై విశ్లేషణా వ్యాసం.ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు నువ్వు – నేను అనే మాటలు సంభాషణలో తరచుగా వాడుతారు. వ్యక్తిగతంగా తన గురించి చెప్పడానికి నేను అనే పదాన్ని ఉపయోగిస్తారు.నువ్వు మరియు నేను,ఇది సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది.అత్యంత ఆత్మీయులు కలిసినప్పుడు ఎలా పలకరిస్తారో చూడండి.నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను?నువ్వు చెప్పు నేను వినాలని ఉంది.ఇది ఒకరికొకరు పలకరించుకునే విధానాన్ని తెలుపుతుంది.కవయిత్రి జ్యోత్స్న రాసిన నువ్వూ – నేను కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“నీ దగ్గరున్నంతవరకే/ఏ విషయమైనా రహస్యం/అంటున్నారు.గుప్పిట దాచి ఉంచినది రహస్యం.ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిన విషయం రహస్యం.ఒకరి విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉండటం రహస్యం.ఎవరికీ తెలియని విషయం రహస్యం.నువ్వు – నేను ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది.ఒకరు చెప్పిన విషయం మరొకరు గోప్యంగా ఉంచితేనే అది రహస్యంగా ఉంటుంది.
“నీ పెదవి దాటి మరో/చెవిన చేరిన తక్షణం/ప్రతి పదం హాస్యమే../అంటున్నారు.ఈ కవితా పంక్తులలో
ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి. ఒకరి పెదవి దాటి మరొకరి చెవికి వెళ్లిన వెంటనే రహస్యం రట్టు అవుతుంది.అసలు రహస్యం యొక్క గౌరవం,విలువ తగ్గిపోతుంది.ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయం బయటపడితే అది హాస్యాస్పదంగా మారిపోతుంది అనే భావన కవితలో వ్యక్తం అవుతున్నది.రహస్యం విషయం యొక్క గోప్యతను నొక్కి చెబుతుంది.మనం ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి.అట్టి విషయం వారు ఇంకొకరికి చెబితే ఆ రహస్యానికి విలువ ఉండదు.మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన రహస్యం.దానిని ఇతరులు సాధారణ విషయంగా తీసుకుంటారు.ఈ కవిత రహస్యాన్ని ఇతరులకు తెలియకుండా కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది.
“నీ.. నా .. జీవితాలలో/ప్రతి క్షణం విలువైనది/ వలువల్లా చీల్చుకు తినే/బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/ అంటున్నారు.నీ జీవితం,నా జీవితం మరియు ఎవరి జీవితం అయినప్పటికీ ప్రతి క్షణం విలువైనది.మన జీవితాల్లో ప్రతి క్షణం అమూల్యమైనది.గడిచి పోయిన సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు.కాబట్టి సమయం విలువను గుర్తించాలి. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనుషులు ఉత్తమమైన విలువలను కోల్పోతున్నారు. ఆత్మీయత, నమ్మకం,నైతికత వంటి విలువలు తగ్గిపోయాయి.పైకి కనిపించే మాయాజాలం వల్ల మనుషులు వలపుల ఆకర్షణలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/మన గుండె భావోద్వేగాలకు స్పందించాలి.కానీ,ఇప్పుడు సున్నితంగా ఉండాల్సిన గుండె కఠినంగా బండరాయిలా మారిపోయింది. మనిషి తాను అనుభవించే బాధలు,గాయాలు తట్టుకోలేకపోతున్నాడు.జీవిత పోరాటాల వల్ల మనిషి మనసు కఠినంగా మారింది.ఇవ్వాళ మనిషి బ్రతుకు ఒక విధమైన భారంగా మారింది.మనిషి జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని కవిత ఎత్తి చూపుతుంది.విలువలు కోల్పోయిన సమాజంలో జీవిస్తున్నాం.మనుషులు బాహ్య ఆకర్షణల వలలో చిక్కినారు.మనుషులు నిజమైన అనుబంధాలను మర్చిపోయారు.సున్నితంగా ఉండాల్సిన మనిషి హృదయం బండరాయిలా మారిపోయింది.మనిషి లోపల తీవ్రమైన ఒత్తిడి,శూన్యతను ప్రతిబింబిస్తుంది.ఇందులోని భావం సమకాలీన జీవన శైలికి అద్దం పడుతుంది.మనిషి హృదయం బండబారిపోయినప్పటికీ తాను బ్రతకడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“నువ్వూ – నేను నవ్వుకుంటూ/నమ్మకంగా సాగిపోవాలే తప్ప/నువ్వెంతంటే నేనెంతని/నిత్యం ఘర్షణలతో ప్రాముఖ్యమైన/సమయాన్ని సామర్థ్యాన్ని/వృథా చేసుకోకూడదు/అంటున్నారు. నువ్వు నేను నవ్వుకుంటూ నమ్మకంగా సాగిపోవాలి. మన మధ్య స్నేహం,ప్రేమ,అనుబంధం కొనసాగాలి. మనం ఒకరి పట్ల ఒకరు నమ్మకంతోనే ఉండాలి. ఆత్మీయతతో మెలగాలి.ఆనందంగా ఉండాలి.మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి మన బంధాన్ని ప్రభావితం చేయకూడదు.మనం ఇద్దరం నువ్వెంతంటే నువ్వెంతని నిత్యం ఘర్షణలకు తావు ఇవ్వరాదు.గర్వం వల్ల వచ్చే సమస్యలను గురించి చెబుతుంది.అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.నువ్వు గొప్ప,నేను గొప్ప అనే భావనతో మెలగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితంలో సమయం అమూల్యమైనది.మన సామర్థ్యాన్ని,శక్తిని అనవసరమైన గొడవలకు వినియోగించ రాదు.అందు వల్ల మన విలువైన సమయం వృథా అవుతుంది.మనం ఇరువురం పరస్పరం అర్థం చేసుకుని కలిసి మెలిసి పురోగమించాలి.మనలో నెలకొన్న అనవసరమైన అహంభావాన్ని వదిలి పెట్టాలి.ఇరువురు నమ్మకంతో కలిసిమెలిసి అన్యోన్యతలతో జీవించాలని సూచిస్తుంది.మనలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పోటీ తత్వం వద్దు.మన ఇద్దరం గర్వాన్ని విడిచి పెట్టాలి.మన ఇద్దరం గర్వంతో ఉంటే కీడు సంభవిస్తుంది.గర్వం వల్ల మేలు జరగదు.మన జీవితంలో విలువైన సమయాన్ని అప్రయోజనమైన విభేదాలతో,వివాదాలతో వృథా చేసుకోకూడదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి మెలిసి ఉండాలి.మనం నవ్వుతూ ఆనందంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
“వికృత చేష్టలతో/ప్రకృతి ప్రకోపించేలా/ఆకృత్యాలకు పాల్పడుతూ/అనునిత్యం నలిగిపోతూ/ఆవేదనలతో కుంగిపోతూ/మానవత్వాన్ని మింగేయొద్దు/ అంటున్నారు.వికృత చేష్టలు అంటే మనిషి చేస్తున్న అనైతిక పనులు,హింస మరియు పర్యావరణాన్ని హానికరంగా మార్చే చర్యలు.మనుషుల తప్పిదాల వల్ల ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భూకంపాలు,వరదలు,వాతావరణ మార్పులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషులు చేస్తున్న ఆకృత్యాలకు అందరు అనునిత్యం నలిగిపోతున్నారు.మనుషులు దుష్టమైన పనులు చేసి ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మనుషులు తప్పు దోవలో నడిచి తోటి వారిని ఆవేదనలకు గురి చేస్తున్నారు.మనిషి మనస్సు నిరాశగా మారి పోయింది.మానవులు సృష్టించిన దుష్ప్రభావాల వల్ల చివరికి మనమే బాధపడుతున్నాం.ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మానవత్వాన్ని మర్చిపోవద్దు.ప్రేమ, సహాయము,నైతికత వంటి విలువలను కోల్పోకూడదు.మనలో మానవత్వం వెల్లి విరియాలి.స్వార్థపూరితుడై మనిషి మనిషిని మింగి వేయకూడదు.సమాజంలోని అనైతికతను, ప్రకృతి వినాశనాన్ని మరియు మానవ సంబంధాల్లో పెరుగుతున్న అసహనాన్ని,అశాంతిని కవిత ఎత్తిచూపుతుంది.మనలోని అహంకారం, స్వార్థపూరిత వికృత చర్యలు చివరికి మనకే నష్టం తెచ్చిపెడతాయి.కాబట్టి మానవత్వానికి పెద్ద పీట వేసి సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని కవయిత్రి జ్యోత్స్న ఈ కవితలో సందేశాన్ని అందిస్తున్నారు.కవయిత్రి జ్యోత్స్న మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.