ఈ రాత్రి నాలుగు వైపులనుండీ అంటుకుంటున్నది
స్వప్నం కాలేకపోయిన యీ రాత్రి
పచ్చి పుండై సలుపు తున్నందుకు హాయిగానే ఉంది
నేనీ దిగులు రాత్రిని దు:ఖంలో ముంచకొని పానం చేస్తున్నాను
నేనీ కలత నిద్రల రాత్రిని మేఘ మల్హార రాగం లో గానం చేస్తున్నాను
తుఫానులను ఉచ్చ్వాసగా
అగ్ని జ్వాలలను నిశ్వాసగా
చేసుకున్న వాడికి
బతుకును చీకటి సముద్రపు
టలల్లోకి విసిరేయడం
గుండెల్ని పిండే విషాదం కాదు కదా
వలపు తీర విరహిణులతో ఐక్యం కాలేని
హృదయ నాదం
జీవం లేని శబ్దమై నీరసించి తుది శ్వాస విడిచింది
దారుల్ని పారేసు కున్న గాయం
ఎవరికోసమో ఉన్మత్తంగా అన్వేషిస్తున్నది
అయినా బొత్తిగా శూన్యం అలుముకోలేదు
జ్ఞాపకాల నుంచి ఒక్కొక్క నెత్తురు బొట్టూ
పచ్చిగా చిక్కగా రాలుతూనే ఉంది
నగరం నడిబొడ్డుకింద జారిన చీకటిలో
సామూహిక స్ఖలనాల్లో తడిసిన
బిచ్చగత్తే ఆర్తనాదం శూన్యం కాదు కదా
తుపాకి వనంలో విరిసిన బుల్లెట్ల పువ్వుల మధ్య
వీచిన మృత్యు పరిమళం శూన్య మెలా
అవుతుంది?
భళ్ళున మాతృత్వం పగిలి
చీకటి ముళ్ళ పొదల మధ్య
తెగిన పేగు బంధపు నెత్తురు గుడ్డును
శూన్యమని ఎవరంటారు?
గుండెల్ని చీలుస్తూ మొరుగుతున్న
కుక్క గొంతు శ్రుతిలోని జీర శూన్యానికి సంకేతాలేనా?
దేన్నీ పట్టించుకోకుండా కొండ చిలువలా కాలాన్ని ఆబగా మింగుతున్న గడియారం ముళ్ళు
చైతన్యానికి ప్రతీకలే కదా?
మెల్లగా ఏకాంతం; అలజడి ఉప్పెన అవుతూ నన్ను సుడివేస్తున్నది
అదే పనిగా మీటుతున్న గుండె ఏకతార లోంచి
రక్తం వెచ్చగా స్రవిస్తున్నది
ఇక యీ రాత్రి ఇంతే….
నా సుందర స్వప్నం,ఈ రాత్రి పిరమిడ్ కింద
క్లియోపాత్ర గా మారి మూల్గు తున్నది
ఈ రాత్రి శూన్య మెలా అవుతుంది**?
previous post