Home ధారావాహిక నవల జీవన మాధుర్యం

జీవన మాధుర్యం

by Laxmi Madan

7 వ భాగం

తెల్లవారి జరిగే పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచనలోకి వెళ్ళిపోయారు….

పెళ్లికూతురు, పెళ్ళికొడుకు మధురమైన ఊహలలో తేలిపోయారు.
ఎప్పుడెప్పడు ఒకరిని ఒకరు చూసుకోవాలని ఆరాటం.

పెళ్లికూతురు తల్లిదండ్రులకి ఏ విఘ్నాలు లేకుండా పెళ్లి సజావుగా జరగాలని ఆలోచనలో వినాయకుడికి మ్రొక్కుతున్నారు.

పెళ్ళికొడుకు తరపు వాళ్ళు’పెళ్లి బాగా చేస్తారా ?మర్యాదలు బాగా జరుగుతాయా?వచ్చిన బంధువులలో తక్కువైపోము కదా !’ఇలాంటి ఊహలలో ఉన్నారు

వచ్చిన బంధువులు మాత్రం కలుసుకున్న బంధుమిత్రులతో ముచ్చటిస్తూ నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉన్నారు.

తెల్లవారి పెళ్లి ముహూర్తం సమయం కానే వచ్చింది. అందరూ చక్కగా ముస్తాబయ్యారు పెళ్లికూతురుని ముందుగా గౌరీ పూజ కోసం మంటపంలో కూర్చోబెట్టారు. మధు పర్కాలు కట్టుకొని, నుదుట పెళ్లి బొట్టు, బాసింగం కట్టుకొని ఎంతో ఒద్దికగా కూర్చుంది పెళ్ళికూతురు.

పురోహితులు చెప్పినట్లుగా గౌరీ పూజ చేస్తూ కూర్చుంది.

మధ్యలో కట్టిన తెర వెనుక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

ముందుగా పెళ్లి కొడుకుకు అత్తమామలు యజ్ఞోపవీత ధారణ చేయించి ఆ తర్వాత కన్యా దానంలో భాగంగా కాళ్లు కడిగారు.

సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం వధూవరులు పెట్టుకుని, ఆ సమయంలో ఒకరికొకరు చూపులు కలుపుకొని ఉండగా వచ్చిన బంధువులంతా వారిని ఆశీర్వదించారు.

పెళ్లిలో ముఖ్యమైనది సుముహూర్త ఘట్టం అది సెకండ్ లతో సహా పాటించాల్సిందే! మిగతా తంతు మెల్లిమెల్లిగా చేసుకున్నా పరవాలేదు.

ఇక ఆ సమయంలో అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు.

అపర్ణకు రైల్లో కలిసిన వసంత తాలూకు బంధువులు కన్పించారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

కాసేపు అయిన తర్వాత అక్కడికి సుధ ఇంట్లో కలిసిన తన మిత్రుడు శ్యామ్ కనిపించాడు.

చక్కని అలంకరణలో ఉన్న అపర్ణను చూసి..

” చాలా బాగున్నావు అపర్ణ. ఇది కాంప్లిమెంట్ మాత్రమే అపార్థం చేసుకోవద్దు” అన్నాడు శ్యామ్

చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది అపర్ణ.

” మీ భార్య రాలేదా”? అని అడిగింది అపర్ణ.

” వచ్చింది. ఒకసారి వసంత గారిని కలిసి వస్తానని వెళ్ళింది. నీకు పరిచయం చేస్తాను” అన్నాడు.

ఇంతలో దూరంగా ఒక మహిళ కనిపించింది.

ఆవిడ వీళ్ళ వైపే నడుచుకుంటూ వచ్చింది.

ఆమె దగ్గరికి రాగానే…

” ఈమె నా భార్య ఇందిర.

“ఇందిరా! ఈమె నా స్నేహితురాలు అపర్ణ” అని పరస్పర పరిచయం చేయించాడు.

అపర్ణ ఒక్కసారి షాక్ అయ్యింది.

“ఏంటి ఇతని భార్య ఇ లా ఉంది. వయసులో చూడటానికి పెద్దదిగా ఉంది. అతనికి ఏ మాత్రం సరిపోదు. అతను ఎంతో అందంగా ఉంటే ,ఈమె అతనికి సరిపోయేలా లేదు. అందం గురించి అలా అనుకోకూడదు కానీ ఎలా చేసుకున్నాడు?’ అని అనుకుంది..

ఈమె భావాలు పసిగట్టిన అతను..

” నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అపర్ణా “అని చెప్పాడు.

ఇప్పుడు మరీ ఆశ్చర్యపోయింది అపర్ణ.

కానీ ఏమీ అడగలేక ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అపర్ణని తేరిపారా చూస్తుంది. భర్తను కూడా ఒకరకంగా చూడ సాగింది. స్నేహాన్ని అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండదు.అనుమానం మనిషిలా అనిపించింది.

ఇంకా ఎక్కువ సమయం అక్కడ ఉండకూడదని అనుకున్న అపర్ణ..
“సరే శ్యామ్! వసంతకి ఏదైనా అవసరం ఉంటుందేమో నేను వెళ్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది.

మంగళ సూత్ర ధారణ మరియు తలంబ్రాల ఘట్టం అయ్యింది.తలంబ్రాలు పోసుకోవడం కూడా ఒక సుందర దృశ్యం.

అలేఖ్య కళ్ళలో సిగ్గుతో పాటు చిలిపి తనం కనిపించింది. పెళ్ళికొడుకు మనోహర్ కన్నా తొందరగా తలంబ్రాలు పోసేసింది. పెళ్ళి కొడుకువైపు వాళ్ళు “నువ్వు తొందరగా పోయారా “అని తొందర పెడుతున్నారు. ఇలా నవ్వులతో అద్భుతంగా సాగింది ఆ ఘట్టం…

పెళ్లి సంబరాలను చక్కగా ఆస్వాదిస్తున్న అపర్ణ కు దూరంగా వేణు వస్తూ కనిపించాడు.

మెల్లగా వేదిక పై నుండి కిందికి వచ్చి వేణు దగ్గరికి వెళ్ళింది అపర్ణ. అక్కడే శ్యామ్ కూడా ఉన్నాడు.

” ఏరా వేణు ఇంత ఆలస్యంగా వచ్చావ్” అని అడిగాడు శ్యామ్..

” నీకు తెలుసు కదరా! నాన్న పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఏవో పనులు నాకు ఉండనే ఉంటాయి. అందుకని కొంచెం ఆలస్యంగా వచ్చాను అదిగో అపర్ణ వస్తుంది” అన్నాడు వేణు అపర్ణ ను చూస్తూ.

అపర్ణ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం తప్పని తెలిసినా కూడా కళ్ళు తిప్పు కోలేకపోయాడు.

” అప్పటిలాగే ఎంతో అందంగా ఉంది. నిజంగా జీవితంలో నేను పోగొట్టుకున్న లావణ్య రాశి అపర్ణ” అని మనసులో అనుకున్నాడు వేణు

” హాయ్ వేణు ఇంత ఆలస్యంగా వచ్చావ్! ఏంటి ఇంకా మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాను” అన్నది అపర్ణ

“వచ్చారు వాళ్లంతా భోజనాల దగ్గర బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో అంతే కదా! రావడం కట్నం చదివించడం భోజనం చేయడం వెళ్లిపోవడం. తీరిగ్గా ఎవరు కూర్చుని చూస్తున్నారని” అన్నాడు శ్యామ్

” వేణూ! మీ శ్రీమతిని తీసుకొని రాలేదా మాకు చూపిస్తే అరిగి పోతుందా! కరిగిపోతుందా” అని నవ్వింది అపర్ణ.

వెంటనే శ్యామ్ అన్నాడు…

” వీడు వాడి భార్యను ఎక్కడికి తీసుకొని రాడు. నీకు ఒక విషయం తెలుసా అపర్ణా! వీడు అసలు పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని ఉన్నాడు. ఎందుకో చాలా రోజులు మూడీ గానే ఉన్నాడు. మేము అడిగినా ఏమి చెప్పలేదు. చాలా ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా వాళ్ళ ఇంట్లో అందరూ బలవంతంగా మేన మరదల్ని ఇచ్చి చేశారు”అన్నాడు శ్యామ్ వేణు వంక చూస్తూ.

” ఇదంతా ఇప్పుడు అవసరమా? ” అన్నాడు వేణు..

” అపర్ణ మన ఫ్రెండే కదా చెప్తే ఏముంది” అన్నాడు శ్యామ్.

” ఏంటి వేణు! నాకు తెలిస్తే ఏమవుతుంది? నేను కూడా మీ స్నేహితురాలినే కదా”! అన్నది. కానీ మనసంతా వేణు గురించే ఆలోచిస్తుంది.

‘అసలు వేణు పెళ్లి చేసుకోను అనడానికి కారణం తనేనా? తన మనసులో నన్ను పెట్టుకొని మూడీగా ఉన్నాడా? ఎందుకు పెళ్లి వద్దన్నాడు’ అని మనసులో అనుకుంటూ వేణు వైపు చూసింది..

తన వైపే చూస్తున్న వేణు కంగారుగా కళ్ళు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో భావం అర్థం అయిపోయింది అపర్ణకు.

ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉండడం భావ్యం అనిపించలేదు. వెంటనే వసంత దగ్గరికి వెళ్లిపోయింది.

పెళ్లి తంతు పూర్తిగా అయిపోయిన తర్వాత భోజనాల హాల్లోకి వెళ్లిపోయింది అపర్ణ. అక్కడ కొంతమంది తన చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంది. ఊళ్లో వాళ్ళు కూడా కొంతమంది అపర్ణను గుర్తుపట్టి పలకరించారు. ఇలా అందరితో మాట్లాడుతూ తాను కూడా భోజనం చేసింది.

స్థాలీ పాకం, నాగవెల్లి అన్ని పూర్తయిన తర్వాత అప్పగింతలు జరిగాయి. అప్పగింతల సమయంలో వసంత దుఃఖాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. అపర్ణకి కూడా చాలా ఏడుపు వచ్చింది.

ఇన్నేళ్లుగా ఆడపిల్లను పెంచుకొని, కొత్త వాళ్ళ ఇంటికి పంపించడం బాధనే కదా! నిజంగా ఎంత చదువుకున్నా పద్ధతులు ఆచారాలను పాటించ వలసిందే. కానీ ఇప్పటి రోజులు పాత రోజు లాగా లేవు. మగ పెళ్లి వాళ్ళు కూడా అర్థం చేసుకొని కోడలికి స్వేచ్ఛని ఇస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ కాపురాలను చక్కదిద్దుకుంటున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు.

రాత్రి భోజనాలు అయిన తర్వాత పెళ్లి వాళ్ళు వాళ్ళ ఊరికి బయలుదేరారు. అక్కడ సత్యనారాయణ వ్రతం ఉంటుంది కాబట్టి వసంత వాళ్ళు తెల్లవారి వెళ్లాలనుకున్నారు. అపర్ణను కూడా రమ్మని అడిగితే తాను అత్త దగ్గర ఉంటానని, స్కూల్లో అందర్నీ కలుసుకుంటానని చెప్పింది. వసంత వాళ్ళ ఇంట్లో చేసే వ్రతానికి వస్తానని మరీ మరీ చెప్పింది.

సుధ ఇంటికి ముందే వెళ్లిపోవడం వల్ల తాను మెల్లగా నడుచుకుంటూ వెళ్తానని అనుకుంది. ఇంతలో అక్కడికి వేణు వచ్చాడు.

” వేణూ? భోజనం చేసావా? నువ్వు వెళ్ళి పోయావు అనుకున్నాను” అన్నది అపర్ణ.

“భోజనం చేసి ఇంటికి వెళ్లి పోయాను. మళ్ళీ నిన్ను కలిసి వెళ్దామని వచ్చాను. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటావా? లేదా ఇంటికి వెళ్తావా? అన్నాడు వేణు.

” ఇప్పుడే వసంతకు చెప్పాను వ్రతానికి వస్తానని, సుధత్త దగ్గర ఈరోజు రేపు ఉంటాను. అలాగే ఊళ్లో అందర్నీ కలుసుకొని ఒక్కసారి ఊరంతా తిరుగుతాను. చిన్నప్పటి పరిసరాలను చూసుకోవాలనిపిస్తుంది. ముఖ్యమైనది మన ఊరి గుడి” అన్నది అపర్ణ.

” నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. అలాగే ఊరంతా కూడా తిప్పి చూపిస్తా. కాసేపు నీతో మాట్లాడటానికి సమయం ఇస్తావా”? అన్నాడు వేణు.

” ఇలా మనం మాట్లాడుకోవడం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వేణూ! ” అన్నది అపర్ణ.

” ఇంకా ఏ కాలంలో ఉన్నావు. ఒకరిని ఒకరు పట్టించుకునే రోజులు పోయాయి. వస్తావా? ఏ విషయం తొందరగా చెప్పు” అన్నాడు వేణు..

” అసలు నోట మాట రాని వేణూ యేనా నువ్వు” అన్నది అపర్ణ నవ్వుతూ..

” సరే, నేను వసంతకు చెప్పి నా బ్యాగ్ తీసుకొని వస్తాను. ఫంక్షన్ హాల్ బయట వెయిట్ చెయ్” అని చెప్పి వసంత దగ్గరికి వెళ్లి తనను కలిసి విషయం చెప్పి బ్యాగ్ తీసుకొని వచ్చింది అపర్ణ..

సంశయిస్తూనే వేణు కారెక్కింది…

” కంఫర్టబుల్గా కూర్చో అపర్ణ” అన్నాడు వేణు..

” సరే వేణు. కానీ ముందుగా మన గుడికి వెళ్దాం. కాసేపు కూర్చొని అప్పుడు ఇంటికి వెళ్దాం” అన్నది అపర్ణ..

ఒక్కసారిగా వేణు కళ్ళల్లో మెరుపు కనిపించింది

 వేణు కారును గుడి వైపు పోనిచ్చాడు. అప్పటి రోజులన్నీ ఇద్దరు గుర్తుకు చేసుకో సాగారు. దారిలో ఉన్న పెంకుటిళ్లన్నీ మాయమైపోయి. కాంక్రీట్ భవనాలు వచ్చాయి. కానీ, అప్పటి జ్ఞాపకాలకు గుర్తుగా కొన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి. అన్నిటిని చూసుకుంటూ గుడి ముందర కారు ఆపాడు వేణు..

చీకట్లు కమ్ముకున్నాయి. గుడి మొత్తం మారిపోయింది .అప్పటి గుడి స్థానంలో కొత్త గుడి వెలిసింది. కానీ ,కొన్ని జ్ఞాపకాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పటి ద్వారము, రథము మాత్రం అలాగే ఉన్నాయి.

సీతారాముల వారు కళ్యాణం చేసుకునే మంటపమును చూసుకుంటూ గుడిలోకి అడుగు పెట్టారు వేణ, అపర్ణ.

ముందుగా హరికథలు జరిగే చోటికి వెళ్లారు. అక్కడే ఇద్దరూ చూపులతో మాట్లాడుకున్న సంఘటన గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నారు.

గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్లోకి వచ్చారు. అప్పటి పూజారులు కూడా ఎవ్వరూ లేరు. అపర్ణను ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలేమీ లేవు. వేణు అక్కడే ఉంటాడు కాబట్టి అందరూ పలకరించారు. అపర్ణ ఎవరో వారికి పరిచయం చేశారు. అపర్ణా వాళ్ళ నాన్నగారు దక్షిణా మూర్తిగారు గుడిలో అందరికీ పరిచితులే. వారు కూడా గుడి సేవలో భాగం పంచుకునే వాళ్ళు. అందరూ అపర్ణతో ఆప్యాయంగా మాట్లాడారు.

కాసేపు గుళ్లో కూర్చున్న తర్వాత ఇద్దరు కలిసి ఆ రోజు కూర్చున్న ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరు చెరొక వైపుగా కూర్చున్నారు.

” వేణూ! ఇప్పుడు చెప్పు నీ గురించి. ఎందుకు పెళ్లి చేసుకోను అన్నావు? నీ భార్యని ఎందుకు ఎక్కడికి తీసుకుని రావు? నాకు వివరాలన్నీ కావాలి. ఏ రోజు నీతో నేను మాట్లాడింది లేదు. మొదటిసారిగా ఈ రోజే మనం మాట్లాడుకుంటున్నాము. కానీ ,మన మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉండి ఎంతో పరిచయం ఉన్న వాళ్ళలాగే ఉన్నాము. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకనే నీ గురించి వివరాలు నాకు కావాలి” అని అడిగింది అపర్ణ.

” ఏం చెప్పాలి నా గురించి? నేను చదువు కోసం హైదరాబాద్ కు వెళ్లానే కానీ సరిగా చదవలేదు. ఫ్రెండ్స్ తో తిరగడము ఇదే సరిపోయింది.అందులో నువ్వు బాగా గుర్తొచ్చేదానివి.

అందుకని పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాను. మా నాన్నగారు బాగా తిట్టారు. తర్వాత కొంచెం కష్టపడి చదివి పాస్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయ్యాను.
ఒకరోజు నేను హైదరాబాద్ వెళుతున్నాను. నాకు నువ్వు కనిపించావు” అని ఇంకా చెప్పబోతుంటే..

అపర్ణ అతన్ని ఆపింది..

” ఇప్పుడు నేను చెప్తాను విను.నేను కూడా వేరే ఊర్లో కాలేజీ చదువుతున్నాను. అప్పటికే నేను ఇంటర్ సెకండియర్ లో ఉన్నాను. సెలవులు అయిపోయాక నేను నా కాలేజ్ కోసం బయలుదేరాను. మన ఇద్దరి దారులు ఆపోజిట్ సైడ్ .అక్కడ నేను నిలబడ్డాను. నిన్ను చూసాను కానీ మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు కదా! ఊరికే నవ్వి నా లగేజ్ తో నేను అక్కడ చెట్టు కింద నిలబడ్డాను.

అప్పుడు నువ్వు నాకోసం వచ్చావు.వచ్చి పలకరించావు .నువ్వు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నావని’ చెప్పావు. అలాగే మరొక విషయం చెప్పావు. “నీకు నేను ఉత్తరం రాసాను అన్నావు.అది కూడా కాలేజ్ అడ్రస్ కి అప్పుడు నేను చెప్పాను, అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు ఉత్తరాలు తెచ్చి ఇవ్వరు. వాళ్లే చదివేసి చింపి పడేస్తారు.ఇకముందు రాయొద్దు అన్నాను. నువ్వు సరే అని చెప్పి వెళ్ళిపోయావు. అంతే కదా వేణు” అన్నది అపర్ణ..

” అవును అంతే !కానీ, తర్వాత మళ్లీ ఒకసారి నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నిన్ను చూశాను .అప్పుడు కూడా పలకరించాను, ఇదంతా జరిగిన తర్వాత మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది .అది నాకు బలంగా గుర్తుండిపోయింది” అన్నాడు వేణు బాధగా..

” ఏంటది” అన్నది అపర్ణ..

” నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అప్పటికి నీది ఇంటర్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయ్యావ్ అనుకుంటా! నేను మీ ఇంటికి బుక్స్ సాకుతో వచ్చాను. ఇంట్లోకి రాలేదు బయటనుంచి ఎవరినో పంపిస్తే నిన్ను పిలిచారు. నీ దగ్గర ఫిజిక్స్ బుక్ తీసుకొని వెళ్ళాను. అలా రెండు మూడు సార్లు బుక్స్ తీసుకొని వెళ్లాక, మూడవసారి అనుకుంటా నేను మళ్ళీ సైకిల్ పైన మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు……” అలా వేణు చెప్పబోతుంటే మళ్ళీ ఆపింది అపర్ణ.

” నేను చెప్పనా! నువ్వు నా బుక్కు తీసుకొని వచ్చావు. బుక్ చేతికి ఇచ్చి ఏం చెప్పావో తెలుసా! ఇందులో లెటర్ ఉంది. చదివి,రిప్లై ఇవ్వు .సాయంత్రం లైబ్రరీ దగ్గరికి వస్తావా అన్నావు..”

నేను మా ఇంటి ముందు ఉన్న అరుగు పై నిలబడ్డాను .నువ్వేమో సైకిల్ మీద వచ్చి అలాగే కాలు కింద పెట్టి సైకిల్ పైన ఎక్కి కూర్చున్నావు.

అప్పుడు నేను చెప్పాను..

” ఇలాంటివి వద్దు” అని చెప్పి పుస్తకాన్ని మాత్రం తీసుకున్నాను.

నీ ముఖం వైపు చూసే సాహసం నేను చేయలేదు. బాధపడే ఉంటావు అని అనుకున్నా…

ఇంట్లోకి వెళ్లిపోయాను. మనసంతా బాధగా ఉంది. కానీ, నేను నా కట్టుబాట్లకు లోబడి ఉన్నాను. నాఇంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాను. అందులో మా నాన్నగారు అచ్చమైన పౌరోహిత్యం లో ఉన్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ కూడా దీన్ని కొనసాగించారు. నేను ఏ మాత్రం తప్పటడుగు వేసినా అందరి గౌరవం పోతుంది .ఇంత విపులంగా ఆ రోజు నేను ఆలోచించకపోవచ్చు.. కానీ ఇది చేయకూడదు అని నా మనసుకు అనిపించింది.ఎన్నో విషయాలు అస్పష్టంగా మనసులో మెదిలాయి. అంతే తలుపులను నా మదిలో తలపులను మూసాను. ఇది అందరికీ మంచే జరిగింది వేణు. ఏ మాత్రం పొరపాటు నిర్ణయం తీసుకున్నా ఇరు కుటుంబాలు బాధపడేవి కదా !ఇప్పుడు నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావో”? అన్నది అపర్ణ.

” చాలా బాధపడ్డాను. కన్నీళ్లు వచ్చాయి. నువ్వు ఇంట్లోకి వెళ్లిపోయావు. నాకు గుర్తుంది. ఆ రోజు నువ్వు లంగా ఓణీ వేసుకున్నావు? తల స్నానం చేసావేమో జుట్టంతా వదిలేసావు. నా మనసులో ఆ రూపం ముద్రించుకొని పోయింది. అలా బాధతో ఇంటికి వెళ్ళిపోయాను”. అన్నాడు వేణు బాధగా.

వేణును చూసి బాధపడింది అపర్ణ.

“వేణూ! అప్పుడు మనము పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే వయసేనా? ఆ సమయంలో ప్రేమలేఖలు రాసుకొని చదువులు పాడు చేసుకుని ఏంచేస్తాం?. అయినా ఆ వయసులో జీవితం గురించి మనకు ఏమైనా అర్థమవుతుందా? నేను తల్లిదండ్రుల చాటు బిడ్డని. నా ఇంటి వాతావరణం ఎలాంటిదో తెలుసు. అప్పటివరకు ఇలాంటివి తెలియని నాకు నీవు ఉత్తరం అనగానే నాకు వణుకు వచ్చేసింది. అందుకే నాకు ఏమీ తోచలేదు.నేను నీకు ‘అలా చేయకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను’ ఆ అర్థంకాని వయసులో నాకు కూడా చాలా బాధ కలిగింది. ఎన్నో రోజులు నిన్ను తలచు కున్నాను. ఇప్పుడు చెప్పు తర్వాత ఏం జరిగింది?” అన్నది అపర్ణ.

“కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. పెద్దగా చదువు మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత మన ఊరికి వచ్చాను. నాన్న ఎలాగో పొలిటిషన్ కదా! తనకి ఏదో విధంగా సహాయం చేద్దామని వచ్చాను. నేను వ్యాపారం కూడా చేస్తున్నాను. ఇక నాకు 24 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి ఇంట్లో పెళ్లి చేసుకోమని అడగడం ఎక్కువైపోయింది. నాకు అసలు పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు. అలాగే చాలా రోజులు ఉండిపోయాను. ఇప్పుడు నాతోటి చదువుకున్న వాళ్ళ పిల్లలు పెళ్లిళ్లు కూడా అయి ఉంటాయి. అలాగే నీ పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయని తెలిసింది. నాకు మాత్రం ఇప్పుడు మూడేళ్లు మరియు ఐదేళ్లు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అది కూడా నాన్న బలవంతంతో పెళ్లి చేసుకున్నాను. నేను చేసుకున్న అమ్మాయి నాకు మేన మరదలే అవుతుంది. చిన్నప్పటినుండి అనుకున్న సంబంధమే. కానీ, నాకు ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయి పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. కానీ కొన్ని కారణాలవల్ల విడాకులు జరిగి మన ఊరికే వచ్చేసింది. పెద్దలందరి కోరిక మేరకు ఆఅమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పటికీ తనతో మనస్ఫూర్తిగా నేను ఉండలేకపోతున్నాను. కారణం నువ్వు అని నేను చెప్పలేను. కానీ , నాకెందుకొ ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందరూ అంటారు ఆమెని ఎక్కడికి తీసుకెళ్లనని .నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు” అన్నాడు వేణు కన్నీళ్ళతో.

“నువ్వెంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? తెలిసి తెలియని వయసులో మనం ఒకరినొకరం చూసుకున్నాం .అది ఇష్టమో? ప్రేమో? మనకే తెలియని వయస్సు. ఇన్నేళ్లు గడిచాయి ఇంకా అదే మనసులో పెట్టుకొని నువ్వు మరొకరి జీవితాన్ని బాధ పెట్టడం నాకు నచ్చలేదు. నాకే తెలియదు ఎందుకు ఇలా ఉంటున్నాను అని అంటున్నావు, దానికి కారణం నేనే అని నాకు తెలుసు. నువ్వు కప్పి పుచ్చాలని ఎంత ప్రయత్నం చేసినా నేను అర్థం చేసుకోగలను. కానీ నా పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలకు తల్లిని. వాళ్ల పెళ్లిళ్లు కూడా చేశాను. ఇంకా నువ్వు నీ జీవితాన్ని అలాగే వేదన పాలు చేస్తుంటే నేను బాధ పడాలో? కోపగించు కోవాలో? అర్థం కావడం లేదు. ఇది మాత్రం తప్పు. చిన్న వయసులో ఎన్నో ఊహించు కుంటాము. అవన్నీ నిజం కావాలనుకుంటే అవుతాయా? కళ్ళు చూసి ఇష్టపడితే కాళ్లు వెళ్లి ఆ వస్తువుని తీసుకొని రాలేవు. అలాగే మన విషయంలో నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. మనలాగా ఇలా ఇష్టపడి దూరమై వారి ఇష్టమైన పెళ్లిళ్లు చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతదాకా ఎందుకు నేను సంతోషంగా లేనా? అది చిన్న వయసులో జరిగిన చిన్న క్రష్ మాత్రమే. దాని గురించి ఇంకా ఆలోచించడం అవివేకం. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని నువ్వు అవమానిస్తున్నట్లే లెక్క. ఇకముందు నువ్వు ఇలా ప్రవర్తించవద్దు. నీ భార్యతో సంతోషంగా ఉండు. తనే నీ జీవితం. ఇది చెప్పడానికే ముందుగా గుడికి వెళదామని నేను నిన్ను అడిగాను. నువ్వు ఇంకేదో ఊహించు కోవద్దు. ఆడవాళ్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు?

వయసు పెరిగిన కొద్దీ ఆడవాళ్ళలో పరిణితి పెరుగుతుంది. నేను అంత చిన్న వయసులోనే నీకు నో చెప్పాను అంటే నేను ఆ వయసులోనే ఎంత ఆలోచించి ఉంటానో అర్థం చేసుకో. నిజంగా అలా చెప్పడం మన ఇరువురికి మంచిదే అయ్యింది. మన కుటుంబాల గౌరవాలను కాపాడాము. అయినా మనకు అంత వయసు కూడా లేదు. మనమేమీ కలిసి తిరగలేదు .ప్రేమను పంచుకోలేదు. ఓన్లీ చూపులతో మాట్లాడుకున్నాము .అది ఒక ఆకర్షణ. దాని నుండి బయటకు వచ్చి ఇకనుండి నీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించు” అని చెప్పింది అపర్ణ.

అపర్ణ మాటలను వింటున్న వేణుకు ఏదో అర్థమైనట్టుగానే అనిపించింది .ఎందుకో మనసులో ఉన్న భారం కూడా దిగినట్లు అనిపించింది.

“పద నిన్ను మీ అత్త వాళ్ళింట్లో దింపేస్తాను” అన్నాడు నవ్వుతూ.

“నీకు నవ్వు కూడా తెలుసా? వెరీగుడ్ నా మాటలు నీపై ప్రభావం చూపించాయని అర్థమవుతుందిm ఆల్ ద బెస్ట్ వేణు” అని అతని చేతులు తన చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కి వదిలిపెట్టింది.

“ఇలా ముట్టు కున్నానని దీనిని కూడా మర్చిపోలేను అని అనుకోవద్దు. నా ఈస్పర్శ నీకు ధైర్యం రావడానికి .నువ్వు సంతోషంగా ఉండటానికి, నువ్వు నాకు ఎప్పుడు స్నేహితుడివే సరేనా” అన్నది అపర్ణ.

కళ్ళతోనే అవునన్నట్లు తల ఊపి వేణు గుడి బయటకు వచ్చి, కారు స్టార్ట్ చేశాడు. అపర్ణ వచ్చి కారులో కూర్చుంది. వాళ్ల అత్త వాళ్ళ ఇంట్లో దింపేసి ఇంటికి వెళ్లిపోయాడు వేణు.

సశేషం

You may also like

6 comments

Leave a Comment