వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషం గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం
అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే
వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడమే
ఆవశ్యమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.