Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

డాక్టర్ కె.జి. వేణు రచించిన 10) మినీ కవితల పై విశ్లేషణా వ్యాసాలు.
ప్రముఖ కవి,డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు మినీ కవిత‌. విశ్వాసం అంటే ఒక వ్యక్తిపై నమ్మకం కలిగి ఉండడం.ఆత్మవిశ్వాసం అంటే తనపై నమ్మకం.ఒక నిర్దిష్టమైన పని లేదా లక్ష్యాన్ని సాధించగలను అని తన సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం. గెలుపు అంటే విజయం.ఏదైనా పోటీలో విజయం సాధించడం గెలుపు.పోటీలో నెగ్గుట గెలుపు. ఓడిపోకుండా ఉండటం గెలుపు.విశ్వాసం,గెలుపు చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది.ఇది వ్యక్తిగత జీవితంలోను,వృత్తిపరమైన విజయాలలోను అన్ని రంగాల్లో కనిపిస్తుంది.విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది మనం ఎంచుకున్న మార్గంపై అవిశ్రాంతంగా నమ్మకంతో ముందుకు సాగడం.ఇది నమ్మకం మరియు పట్టుదలతో సాగాలి.ఎందుకు విశ్వాసం గెలిపిస్తుంది?ఏ పని చేసినా మధ్యలో ఆటంకాలు వస్తాయి.విశ్వాసం ఉంటే ఆ ఆటంకాలను అధిగమించి విజయాలు సొంతం అవుతాయి.సందేహాలు,భయాలు మన ప్రయాణాన్ని నిలిపివేస్తాయి.విశ్వాసం ఉంటే లక్ష్యం ఎప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతుంది.మనం ఏదైనా గొప్ప పని చేయాలంటే మన మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి.అదే గెలుపునకు మార్గం చూపుతుంది.జీవితంలో ఎన్నోసార్లు మనం విఫలమవుతాం.మనపై మనకు విశ్వాసం ఉంటే మళ్లీ లేచి ప్రయత్నిస్తాం.విజయం ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉంటుంది.చిత్తశుద్ధితో ప్రయత్నించే వారు మాత్రమే విజేతలు అవుతారు. మనం నమ్మిన ఆశయాల పట్ల విశ్వాసం ఉంటే ఖచ్చితంగా గెలుపు మనదే అవుతుంది.కవి డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి. ”మైదానంలో పరుగు పందెం/మనిషికి కుక్కకు మధ్య పోటీ/ఇది ఒక ఉత్కంఠ భరితమైన పోటీని సూచిస్తుంది.మైదానం అంటే ఇక్కడ ప్రపంచాన్ని లేదా మనుషుల జీవిత రాటాలను సూచించవచ్చు.మనిషికి కుక్కకు మధ్య పోటీ.ఇది ఒక సరళమైన కవితా పంక్తి.ఇందులో మనిషి మరియు శునకం నైజం మధ్య గల తేడాను సులభంగా గుర్తించవచ్చు. ”శునకం సునాయాసంగా గెలిచింది/శునకం పోటీలో సులభంగా గెలవడం,దాని సహజమైన నైపుణ్యాన్ని, శక్తిని,ఏకాగ్రతను తెలుపుతుంది. ”కారణాన్ని వెతికితే దొరికింది/కుక్క విశ్వాసం మనిషిని జయిస్తూ../ఇది మనలో జిజ్ఞాసను కలిగిస్తుంది.ఎందుకు శునకం గెలిచింది?కుక్క విశ్వాసం మనిషిని జయించింది.ఇది అసలు సందేశాన్ని వెల్లడిస్తుంది.మనిషి ధీమాగా ఉన్నాడు. మనిషి తనలోని స్వార్థంతో,అహంకారంతో తాను ఎలాగైనా గెలుస్తాను అనే ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు.కుక్క మాత్రం తన లక్ష్యంపై గురి పెట్టింది.స్వార్ధం ఎరుగని కుక్క విశ్వాసంతో పరుగు తీసింది.కుక్క నిబద్ధత,అంకితభావం,దృఢమైన విశ్వాసంతో గెలిచింది.ఈ కవితా పంక్తులు మనిషి జీవితానికి విలువైన సందేశాన్ని అందిస్తాయి. విజయం కోసం శక్తి,బుద్ధి మాత్రమే కాకుండా విశ్వాసం,అంకితభావం మరియు నిజాయితీ అవసరం అని సూచిస్తుంది.మనిషికి తనలో సందేహాలు,భయాలు ఉంటాయి.కానీ,కుక్క తన లక్ష్యాన్ని మాత్రమే చూస్తుంది.అదే దాన్ని విజేతగా నిలబెడుతుంది.కవి వేణు విశ్వాసం గెలుపు కవిత ద్వారా లోతైన భావాన్ని అందించారు.

డాక్టర్ కె‌.జి.వేణు రచించిన ఆకాశానికి నైవేద్యం (మినీ కవిత) పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“కోతికి బట్టలు తొడిగారు/చప్పట్లతో వీధిలో వినోదం/
అంటున్నారు.లోకంలోని మనుషుల తీరు గురించి చెబుతున్నారు.కోతికి బట్టలు వేయడం అవసరం లేదు.మనుషులమైన మనం బట్టలు వేసుకోవాలి. కోతికి బట్టలు వేసి వినోదంగా చూసే మనుషుల గురించి చెబుతున్నాడు.పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావం మన దేశంలోకి వ్యాపించింది.కోతికి బట్టలు తొడగడం,ఆడంబరాన్ని చాటుకోవడం,వ్యర్థ వినోదం అని సూచించవచ్చు.కోతికి బట్టలు వేసిన ఆనందంలో ప్రజలు చప్పట్లు కొడతారు.ఇది సమాజంలో ఉన్న విలాస వ్యామోహాన్ని తెలుపుతుంది.సమాజంలో నెలకొన్న అసలైన మౌలిక సమస్యలు పట్టించుకోకుండా కోతులకు బట్టలు వేసి ఆనందించే మానసిక స్థితిని తెలియజేస్తుంది.
“అక్కడ ఓ పిల్లాడు దీనంగా/ఒంటిమీద చొక్కా లేక ఏడాదిగా/వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/ అంటున్నారు.కోతికి బట్టలు వేసి ఆనందిస్తున్న తీరును కవి ప్రశ్నిస్తున్నాడు.ఇదే సమాజంలో నివసిస్తున్న ఒక నిరుపేద బాలుడు నిరాశగా ఒంటిమీద చొక్కా లేక ఏడాది కాలం గడిచింది. పేదరికంతో ఆ నిరుపేద బాలుడు వేసుకోవడానికి బట్టలు లేని స్థితి కొనసాగుతుంది.ఆ బాలుడు కనీస అవసరాలైన చొక్కా లేకుండా గడపడం బాధను కలిగిస్తుంది. ‌. ”వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/అంటున్నారు.ఈ దేశంలో వేసుకోవడానికి బట్టలు లేక ఆ బాలుడు తన శరీరాన్ని ఆకాశానికి నైవేద్యంగా అర్పించినట్లు తోస్తోంది.ఇది తీవ్రమైన పేదరికం,మనుషుల మధ్య వ్యత్యాసాన్ని హృదయ విదారకంగా చూపుతుంది. ఈ కవిత సమాజంలోని కొందరు పెద్ద మనుషుల విపరీత ప్రవర్తనను,ఆడంబరాన్ని ఘాటుగా విమర్శిస్తుంది.అలాగే నిరుపేదల దుస్థితి ఆవేదన కలిగిస్తుంది.ఒక వైపు కోతికి బట్టలు తొడిగేంత సంపద,వినోదం,మరోవైపు కనీస వస్త్రాలు లేని బాలుడు కనిపిస్తాడు.ఇది మన సామాజిక అసమానతలపై కవి పదునైన ప్రశ్నను సంధించారు. ఆకాశానికి నైవేద్యం అనే ఉపమానం లోతైన భావాన్ని వ్యక్తం చేస్తుంది.నైవేద్యం అంటే దేవుడికి సమర్పించే ప్రసాదం.ఒక వ్యక్తి బట్టలు లేక ఒంటి మీద ఏమీ లేకపోతే అతని శరీరం పూర్తిగా బయటికి కనిపిస్తుంది.ఆకాశానికి నైవేద్యం అనేది అతని బట్టలులేనితనాన్ని కవ్వించే విధంగా ఉపయోగించబడింది‌.ఒక వైపు ప్రజలు కోతికి బట్టలు వేస్తూ వినోదం చూస్తుంటే మరో వైపు ఆ బాలుడు తన దారిద్ర్యాన్ని అంగీకరించినట్లుగా, శరీరాన్ని ఆకాశానికి అర్పించినట్లుగా ఉంటాడు.ఇది సమాజంలో నెలకొన్న తీవ్రమైన అసమానతలను తెలియజేస్తుంది.మనిషికి భూమి,ఆకాశం,ప్రకృతి తప్ప మరో ఆశ్రయం లేకపోవడం,అతను వాటికి అర్పించబడి జీవించడం అనే భావన దాగి ఉంది. ఆకాశానికి నైవేద్యం అనేది పేదరికం,సమాజపు ద్వంద్వ ధోరణి,అసమానతలు,జీవన తాత్వికత ఇందులో అనేక కోణాలను కలిగి ఉంది.కవితలో ఇది ఒక వ్యంగ్య ప్రయోగంగా మనుషుల ఉదాసీనతపై ఒత్తిడి కలిగించే విధంగా ఉపయోగించబడింది.
డాక్టర్ కె.జి. వేణు రచించిన ఆ సంతకాలు ప్రమాదం మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“భూమి,ఆకాశాల మీద/సామాన్యుడి హక్కుకు/ శ్వేత పత్రం రాసే సిరా చుక్క “ప్రశ్న”/అంటున్నారు. ఈ కవితా పంక్తులలో ప్రశ్న యొక్క శక్తిని మరియు సామాన్యుడి హక్కులకు అది కలిగించే ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.శ్వేత పత్రం అనేది ఒక నివేదిక లేదా గైడ్.ఇది పాఠకులకు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి సమస్యను పరిష్కరించడానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడటానికి ఉద్దేశించబడింది.ఇక్కడ భూమి,ఆకాశం,సమాజంలో ఉన్న సామాన్యుడికి చెందిన హక్కులను సూచిస్తాయి.సామాన్యుడికి స్వేచ్ఛ,సమానత్వం,న్యాయంలాంటి హక్కులు ఉన్నాయి అని బల్లగుద్ది చెబుతున్నారు.శ్వేత పత్రం రాసే సిరా చుక్క ప్రశ్న.ఇక్కడ ప్రశ్న ఒక సిరా చుక్కగా సూచించబడింది. ప్రశ్నించడం ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయి.
“మేధావులు మాత్రం ప్రశ్నకు దూరంగా/చెదకు దగ్గరగా సంతకాలు చేస్తూ ../అంటున్నారు.సత్యాన్ని వెతకాల్సిన మేధావులు మాత్రం ప్రశ్నించకుండా మౌనం పాటిస్తున్నారు. చెదకు నాశనం చేసే గుణం ఉంటుంది.చెదను ఇక్కడ చెడిపోయే ప్రాతినిధ్యంగా ఉపయోగించారు.చెడుపై తిరుగుబాటు చేయాల్సిన మేధావులు అన్యాయాలు,అక్రమాలు,అవినీతికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేస్తున్నారు అని కవి సుతిమెత్తగా విమర్శించారు.సామాన్య ప్రజల హక్కులను రక్షించడంలో ప్రశ్నించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ప్రశ్నించే గుణం సామాన్యుడికి సత్యాన్ని తెలుసుకునే సాధనం.మేధావులు తమ బాధ్యతను వదిలేసి నిశ్శబ్దంగా అంగీకరిస్తున్నారని కవి వాపోతున్నారు. మేధావులు ప్రశ్నించకుంటే సమాజంలో అన్యాయం,అవినీతి, అక్రమాలు పెరిగిపోతాయి.ఆ సంతకాలు ప్రమాదం అనే కవితా శీర్షిక లోతైన అర్ధాన్ని కలిగి ఉంది.ఇది ముఖ్యంగా మేధావుల నిశ్శబ్ద అంగీకారాన్ని,వ్యతిరేకించాల్సిన దానికి మద్దతు ఇవ్వడాన్ని,తప్పు జరిగితే ప్రశ్నించకుండా ఉండటాన్ని సూచిస్తుంది.మేధావులు తమ ఆలోచనా శక్తిని ఉపయోగించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.అలాంటి మేధావులు ప్రశ్నించడం మానేసి తప్పును అంగీకరించే విధంగా సంతకాలు చేయడం ప్రమాదం.ఇది కేవలం సంతకానికే మాత్రం పరిమితం కాదు.కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చూడనట్లుగా ఉండడం,అన్యాయం జరిగిందని తెలిసినా స్పందించక పోవడం,దానికి మౌనంగా ఉండటం,ఒక రకమైన ప్రమాదం కల్గించే సంతకమే.మేధావుల మౌనం అంగీకారం కిందికి వస్తుంది.అది న్యాయ పోరాటాన్ని నిలిపివేస్తుంది.చెద అనేది నాశనం చేస్తుంది.మేధావులు సత్యం పక్కన పెట్టి అన్యాయపు వ్యవస్థకు మద్దతుగా సంతకాలు చేయడం సమాజాన్ని ప్రమాదంలో పడేస్తుంది. తప్పును ప్రశ్నించకుండా ఉండటం,దానిని అంగీకరించడం అత్యంత ప్రమాదకరం.ఇది సమాజంలో ఉన్న అన్యాయాలను మరింత బలపరిచే అవకాశం ఉంది. అందుకే ఆ సంతకాలు ప్రమాదం అని చెప్పిన తీరు బాగుంది. మేధావులు ప్రశ్నించడం,ధైర్యంగా నిలబడటం అవసరం అనే బలమైన సందేశాన్ని కవి అందిస్తున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన తెలిస్తే చెప్పండి మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
తెలిస్తే చెప్పండి (మినీ కవిత)
“ఆమె కోసం వెతుకుతున్నారు/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/ఎవరు తగులబెట్టారో తెలియదు/ కన్నీళ్లతో వేడుకుంటున్నాను/తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/ఈ కవిత భావోద్వేగభరితంగా హృదయాన్ని కదిలించేలా ఉంది.దీన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించవచ్చు.వ్యక్తిగత వేదన,సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఒక సామూహిక బాధ అని వ్యక్తం అవుతుంది.
“ఆమె కోసం వెతుకుతున్నాను/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/అంటున్నారు.వ్యక్తిగతంగా తాను ఆమె కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు.ఇది కోల్పోయిన ప్రియమైన వ్యక్తి కోసం వెతుకుతున్న వేదన కావచ్చు.సమాజంలో లేకుండా పోయిన ఒక విలువైన అంశాన్ని వెతుకుతున్నట్టుగా భావించ వచ్చు.ఇది ఒక వ్యక్తిగతమైన కోరికలా అనిపించి నప్పటికీ సమాజానికి సంబంధించిన సమస్య అని అర్థం అవుతుంది. చూస్తే దేశం నిండా ఆమె బూడిదే/ఇది చాలా శక్తివంతమైన భావ చిత్రం.ఇది గాఢమైన భావనను వ్యక్తం చేస్తుంది.ఇది నాశనాన్ని సూచిస్తుంది.దేశం నిండా అనే పద ప్రయోగం ఆమె మరణాల వ్యక్తిగత ఘటన మాత్రమే కాదు.ఇది సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటన.దహనం చేయబడిన శరీరం బూడిదగా మారుతుంది. కవి బూడిదను రూపకంగా మరియు శాంతి నశించడాన్ని సూచించేందుకు వాడి ఉండవచ్చు.నాకు దేశమంతటా ఆమె బూడిద మాత్రమే కనిపిస్తుంది. ఈ కవితా పంక్తిలో ఆమెను ఎవరో తగులబెట్టారు. కానీ,అది వ్యక్తిగత హింస మాత్రమే కాదు.దేశం మొత్తానికి చెందిన విషాదం.బూడిద అంటే విధ్వంసానికి సంకేతం.ఇది యుద్ధం,అల్లర్లు, సామూహిక విధ్వంసాన్ని సూచించవచ్చు.
“”ఎవరు తగులబెట్టారో తెలియదు/అంటున్నారు.ఇది అత్యంత బాధాకరమైన విషయం.ఈ విధ్వంసాన్ని సృష్టించింది ఎవరో తెలియదు?ఇందుకు బాధ్యత ఎవరిది?ఇది సమాజంలో నెలకొన్న అనిశ్చితిని తెలియజేస్తుంది. బాధ్యులు ఎవరో తెలియకపోవడం వంటి పరిస్థితిని సూచిస్తుంది.ఎవరు ఆమెను నాశనం చేశారో తెలియదు?ఎవరు శాంతిని భగ్నం చేశారో తెలియదు?ఇది యుద్ధం,హింస,అశాంతికి సంకేతం కావచ్చు. నేరం చేసిన నేరస్తులు ఎవరో తెలియక పోవడం సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.
“కన్నీళ్లతో వేడుకుంటున్నాను/అంటున్నారు.కవి బాధలో మునిగిపోయి సహాయం చేయమని కోరుతున్నారు.దీనిలో ఒక బాధితుని ఆవేదన మాత్రమే కాక న్యాయం కోసం చేసే విజ్ఞాపన కూడా ఉంది.ఇది ఒక అభ్యర్థన,ఒక అశాంతి నడుమ మానవత కోసం చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన.
తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/అంటున్నారు. చివరకు కవి ఆమె పేరు శాంతి అని వెల్లడిస్తున్నారు. ఇది కవితలో అసలు మర్మం.కవి మానవ సమాజంలో శాంతి కోసం వెతుకుతున్నారు. కానీ, దాని స్థానంలో బూడిద మాత్రమే కనిపిస్తోంది.ఇది వ్యక్తిగత కోణాన్ని మించి సమాజంలోని నాశనమైన శాంతికి ప్రతీకగా మారుతోంది.ఇందులో శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు.దేశంలో కనుమరుగైన ప్రశాంతతను,హింసకు బలైన సామాజిక స్థితిని సున్నితంగా వ్యక్తీకరించారు.ఈ కవిత వ్యక్తిగతంగా ప్రారంభమైనా అంతకు మించిన సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇందులో ఉన్న శాంతి అనే పేరు ద్వంద్వ అర్ధాన్ని కలిగి ఉంది. నిజంగా ఒక వ్యక్తి పేరు శాంతి అయి ఉండొచ్చు. ఇందులో శాంతిని ఒక రూపకంలా ఉపయోగించారు. ఇది యుద్ధం వల్ల జరిగిన విధ్వంసం,సమాజంలో శాంతి మాయం అవుతున్న దుస్థితిని సూచించే సామాజిక విమర్శగా కూడా భావించవచ్చు.కవి చివరి పంక్తిలో శాంతి పదాన్ని ఉపయోగించడం ద్వారా అందరికీ ఆలోచన కలిగించేలా చేశారు. ఇక్కడ శాంతి అనేది ఒక వ్యక్తి మాత్రమేనా?లేక ప్రపంచం కోల్పోయిన శాంతి అనే విలువా?ఈ కవిత పాఠకుల హృదయాన్ని కదిలించేలా ఆసక్తికరంగా సాగింది,ఇది వాస్తవిక సంఘటన,నష్టపోయిన శాంతి,హింస వలన కలిగిన బాధ, సమాజంలోని అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది.ప్రజల సామాజిక చైతన్యానికి అద్దంపడుతుంది.సమాజంలో ప్రశాంతతను పునరుద్ధరించాలి అని కోరడం ఒక ఆవేదనగా భావించవచ్చు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన వాయిదాలెందుకు?మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“ఆడతనం గడప దాటితే చాలు/వేధిస్తూ మానభంగం ఉరి త్రాళ్ళు/అంటున్నారు.మహిళ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడాన్ని గడప దాటడం అంటారు.సమాజంలో ఇప్పటికీ మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే పోకిరీలు వేధింపులకు, మానభంగానికి పాల్పడుతున్నారు.దుర్మార్గుల అఘాయిత్యాలకు గురి అయిన స్త్రీలు అవమానం భరించలేక అర్ధాంతరంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ కవితా పంక్తులు మహిళలపై జరుగుతున్న వేధింపులను,అత్యాచారాలను సూచిస్తున్నాయి.సమాజంలో మహిళలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా లైంగిక వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారింది.
“కామం ఈ దేశంలో నదులై ప్రవహిస్తోంది/ సమాజంలో అనైతికత హద్దులు మీరిపోయింది. మానవ సంబంధాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. దుర్మార్గులు కామదాహంతో మానవతా విలువలను మంటగల్పుతున్న పరిస్థితి ఈ దేశంలో నదిలా విస్తరించింది అని కవి ఆవేదనతో వాపోతున్నారు.
“అరాచకానికి అడుగడుగునా గొడుగులు/ అన్యాయానికి,అసాంఘిక చర్యలకు సహకరిస్తున్న పరిస్థితిని సూచిస్తుంది.దోషులను రక్షించే విధానాలు,న్యాయస్థానంలో శిక్షలు ఆలస్యం అవటంలాంటి సంఘటనలు అరాచకానికి బలాన్ని అందిస్తున్నాయి.
“దుష్ట సంహారానికి అన్ని వాయిదాలే/నేరస్తులకు తగిన శిక్ష పడకుండా న్యాయవ్యవస్థలో జాప్యం జరుగుతుండడం వల్ల దుష్టులను శిక్షించడం ఆలస్యం అవుతుంది.మన సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక వేధింపులకు చరమగీతం పాడాలి.అత్యాచారాలు చేస్తున్న నేరస్తులకు శిక్షలు ఆలస్యం కావడం బాధను కలిగిస్తుంది.దుర్మార్గుల విశృంఖల చేష్టలకు అడ్డుకట్ట వేయాలి.సమాజంలో మార్పు రావాలి.ఈ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలి.సత్వర న్యాయానికి పునాది వేయాలి.మహిళలను వేధించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి.అప్పుడే సమాజ ఉన్నతికి వీలు కలుగుతుంది.ఈ కవిత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన కొత్త గీతాలు పాడండి కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“అత్యాచారం అబలమీద కాదు/నేరుగా ఈ దేశానికే జరిగింది/అంటున్నారు.ఈ కవితా పంక్తి అత్యంత ప్రభావశీలమైనది.సాధారణంగా,లైంగిక దాడి బాధితురాలిని మాత్రమే ప్రభావితం చేస్తుంది అని భావిస్తారు.కానీ,కవిత ఇక్కడ విస్తృత భావనను ప్రతిపాదిస్తోంది.అత్యాచారానికి గురి అయిన బాధితురాలి వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు.ఇది దేశానికి జరిగిన అవమానం.ఒక మహిళపై జరిగిన దాడి అంటే సమాజం తన విలువలను కోల్పోయింది అని తెలిపే సంకేతంగా కనిపిస్తోంది.
“ప్రతి వొంటి మీద ఆ రక్తపు మరకలే/ఇది తీవ్రమైన వాస్తవాన్ని వెల్లడించే కవితా పంక్తి.అబల మీద జరిగిన లైంగిక హింసను సమాజం ఏకపక్షంగా చూసి బాధితురాలిని ఒంటరిగా విడిచిపెట్టడం సాధారణం. కానీ,కవి ప్రతి ఒక్కరి మీద ఈ నేరం తాలూకు మచ్చ ఉందని అంటున్నారు.ఇలాంటి లైంగిక దాడి సంఘటనలు జరగడానికి సమాజమే బాధ్యత వహించాలి.
“సారే జహాసే అచ్చా … అబద్ధమది/అంటున్నారు.
ఇది భారతదేశానికి సంబంధించిన దేశభక్తి గీతం.
కవి సారే జహాసే అచ్చాని వ్యంగ్యంగా ఉపయోగించారు.ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?ఇది ఎలాంటి న్యాయం?అనే ప్రశ్న లేవనెత్తుతుంది.ఈ దేశం గొప్పది అని చెప్పుకోవడమే కాదు.ఈ దేశంలోని మహిళలకు రక్షణ కల్పించగలిగితేనే అది నిజమైన గొప్పతనంగా భావించ వచ్చు.
“వనిత కన్నీళ్ళతో కొత్త గీతాలు పాడండి/ అంటున్నారు.కవి ఇది ప్రజలకు చేసిన విజ్ఞప్తిగా అనిపిస్తోంది.మహిళల బాధను అర్థం చేసుకొని,ఒక కొత్త సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని సూచిస్తుంది.ఈ కవిత కన్నీళ్లను కేవలం దుఃఖానికి ప్రతీకగా చూపించకుండా,చైతన్యానికి కొత్త మార్గాన్ని సూచించే ప్రక్రియగా అభివర్ణిస్తోంది.మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించే దుర్ఘటనలుగా అర్థం చేసుకోవాలి అని కవి స్పష్టం చేస్తున్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,దారుణ దురంతాలకు సమాజం బాధ్యత వహించాలి.అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని సాధించగలం అనే ధ్వని ఇందులో వినిపిస్తుంది.ఈ కవిత సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది.ఇది మహిళలపై జరిగే అత్యాచారాలను వ్యక్తిగత సమస్యగా కాకుండా సమాజానికి,దేశానికి జరిగిన అవమానంగా చూపిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన అంగట్లో ఊపిరాడక మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“బిగించిన సీసాల్లో ఊపిరాడక/నీరు రుచిని కోల్పోతుంది/అంటున్నారు.ఇక్కడ నీరు స్వభావసిద్ధమైన స్వేచ్ఛను సూచిస్తుంది.బిగించిన సీసాలో నీరు బంధనాన్ని సూచిస్తుంది.నీటిని ఒక బాటిల్ లో నిల్వ చేస్తే అది కాలక్రమేణా తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది.ఒక వ్యక్తిని లేదా సమాజాన్ని నియంత్రించినప్పుడు వారి స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతుంది.
“తాను సరుకై అంగట్లో చేరాక/మనిషి దాహం తీర్చే గుణాన్ని/ ధరల వురికి వ్రేలాడదీస్తూ../ అంటున్నారు.మనిషి దాహం తీర్చే నీరు ఒక వస్తువుగా మారి అంగడికి చేరిన తర్వాత దాని విలువను ధరతో కొలుస్తారు.ఇది మనుషుల జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది.స్వేచ్ఛగా జీవించే మనిషి సమాజపు ఆంక్షల వల్ల ఒక వస్తువుగా మారిపోతాడు.ఇక్కడ ఆ వ్యక్తిని విలువలు నిర్ణయిస్తాయి.కానీ,మనిషి తన అసలు స్వభావాన్ని పట్టించుకోడు.ఈ కవితలో స్వేచ్ఛా బంధనాలు,మార్కెట్ మరియు విలువల గురించి లోతైన సందేశాన్ని అందిస్తుంది.మనిషి స్వేచ్ఛను కోల్పోయి ఒక వస్తువుగా మారిపోయినప్పుడు అతని అసలు విలువ కేవలం ధనంతో మాత్రమే కొలువబడుతుంది.ఈ కవితా పంక్తులలో లోతైన
అంతరార్థం దాగి ఉంది.కవి సమాజంలోని వాస్తవికతను ఎత్తిచూపుతున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన మట్టిగా మారిపోతూ .. మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షంలో అతడు తడుస్తూ ../నేలకొరిగిన వృక్షాల గాయాలకు/ లేపనాలతో చికిత్స చేస్తున్నాడు/ అంటున్నారు.వర్షంలో తడవడం అనేది అతని జీవితంలోని కష్టాలను,అవాంతరాలను సూచిస్తుంది.వర్షంలో తడుస్తూ ఉండడం అనే పదం శారీరక,మానసిక బాధలను తెలియజేస్తుంది.ప్రకృతి విపత్తుల వల్ల నేల కూలిన వృక్షాల గాయాలకు చికిత్స చేస్తున్నాడు.అది ఒక metaphor రూపకంగా కనిపిస్తుంది.ఇది మానవతా విలువల పునరుద్ధరణ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
“రేపటి నీడకు అండగా తాను/భవిష్యత్తు తరాలకు తాను చెట్ల వలె ఆధారంగా ఉండాలి అనే భావాన్ని తెలుపుతుంది.చెట్లు నీడను ఇస్తాయి.పండ్లను ఇస్తాయి.అలాగే తాను కూడా భవిష్యత్తులో ప్రయోజనకరమైన పనులు చేయాలి అనే భావన వ్యక్తం అవుతుంది.
“మనిషిగా కాదు మట్టిగా మారిపోతూ../ అంటున్నారు.ఇది చాలా శక్తివంతమైన ఉపమానం. అతడు వ్యక్తిగతమైన లాభాలను ఆశించకుండా మట్టిగా మారిపోతాను అనే సందేశం ఉంది.నేల, భూమిని మట్టి అంటారు.భూమి పరిపూర్ణమైన త్యాగానికి ప్రతీక.ఈ కవితలో మనిషి త్యాగాన్ని ప్రకృతిలో అతడి మమేకతను భవిష్యత్తు తరాలకు సహాయపడే విధంగా జీవించాలి అనే గొప్ప భావం వ్యక్తం చేశారు.తాను ఒక వ్యక్తిగా కాకుండా భూమిగా ప్రకృతిగా మారి సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నాడు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన త్యాగాల మేఘాలు మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షం కురుస్తోంది సువాసనతో/వెంటనే బకెట్లో నింపుకున్నాను/అంటున్నారు.వర్షానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ముఖ్యంగా భూమిపై వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన మనసుకు హాయి గొల్పుతుంది.కవి ఈ వర్షాన్ని కేవలం ఒక సాధారణ ప్రకృతి సంఘటనగా కాకుండా ఆహ్లాదకరమైన అనుభూతిగా భావిస్తున్నారు. వెంటనే బకెట్లో నింపుకున్నాను అనే భావన కవి భౌతికంగా ఆ వర్ష జలాలను బకెట్లోకి సేకరించారు అని చెప్పవచ్చు.భావ ప్రపంచంతో చూస్తే కవి ఈ అనుభూతిని తమ హృదయంలో నింపుకున్నట్టుగా భావించవచ్చు.
“తొంగి చూస్తే ఆ నీటి నిండా/త్యాగాలతో మేఘాల శరీరాలు/ అంటున్నారు.వర్షపు నీటిని పరిశీలిస్తే,అది కేవలం నీరు మాత్రమే కాకుండా మరేదో లోతైన అర్థాన్ని సూచిస్తున్నట్లు కవి భావన దాగి ఉంది. త్యాగాల మేఘాల శరీరాలు అంటే మేఘాలు తమ శరీరాన్ని త్యాగం చేసి భూమికి జీవం పోస్తాయి.ఇది త్యాగ భావనకు ప్రతీకగా నిలుస్తుంది.ప్రకృతి త్యాగశీలి.అది తనలో ఉన్నదంతా పరోపకారం కోసం మాత్రమే వినియోగిస్తుంది.
“కృతజ్ఞతగా నేను హారతిస్తూ ../అంటున్నారు.
కవి తాను ప్రకృతి మాత సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా హారతి అందిస్తున్నట్లు భావిస్తున్నాడు.వర్షం వల్ల కలిగిన ఆనందానికి పులకించిపోయినాడు.అందుకు ప్రతిఫలంగా ప్రకృతి మహత్యానికి భక్తితో నమస్కారిస్తున్నాడు.తాను తన్మయత్వంతో ప్రకృతిని వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కవితా పంక్తులలో వర్షాన్ని కేవలం ఒక సహజ సిద్ధమైన ప్రకృతి సంఘటనగా కాకుండా తనలో కలిగిన అనుభూతిని,త్యాగానికి ప్రతీకగా మేఘాల గొప్పతనంగా భావిస్తున్నాడు.కవి ప్రకృతికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.ఇది ప్రకృతిని మరియు మానవ జీవన తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక అందమైన భావ వ్యక్తీకరణ.ఈ కవిత పాఠకులను ఆలోచింపజేస్తుంది.ఇందులోని ప్రతి పంక్తి లోతైన భావాన్ని కలిగి ఉంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన పచ్చదనం కోసం శ్వాస మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ఈ కవిత పచ్చదనం కోసం శ్వాస పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందిస్తుంది.ప్రకృతిలో భాగమైన చెట్లు అందించే ఆక్సిజన్ ద్వారానే మనం శ్వాస తీసుకోవడం,జీవించడం జరుగుతున్నది.చెట్లు మన మనుగడకు చాలా అవసరం అన్న భావనను తెలియజేస్తుంది.పచ్చదనం కోసం విరివిగా చెట్లు నాటాలి.అట్టి చెట్లను పరిరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకోవచ్చు.ప్రకృతి మన జీవనాధారం.మనం తీసుకునే ఆక్సిజన్ కు చెట్లే మూలాలు.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్ల పెంపకం ఎంతో అవసరం.నీటి కాలుష్యాన్ని నివారించాలి.మట్టి నాశనాన్ని తగ్గించాలి.రోజుకు కనీసం ఒక మొక్క నాటాలి,నీటి వృథాను తగ్గించాలి.పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను వినియోగించాలి.సామాజికంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.మన శ్వాస ప్రకృతి కోసం ప్రకృతి మన శ్వాస కోసం మాత్రమే అనేది ప్రగతిశీలతను చాటుతుంది.
“గతాన్ని తానెప్పుడు తవ్వుకోడు/ఆ సమాధుల నిండా కళేబరాలే/కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు/ మట్టి కణాల గర్భసంచుల్లోకి/తానే ఒక పచ్చదనంగా ప్రవేశిస్తూ../ అంటున్నారు.ఈ కవితా పంక్తులలో గతాన్ని తిరిగి చూడలేని వ్యక్తిగా చిత్రీకరించారు.ప్రతి పంక్తిలో కవి తాత్వికతను,ప్రకృతి తత్వాన్ని జీవితంపై తన దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
కవి ఇక్కడ మనిషి గతాన్ని ఎప్పుడు తిరిగి చూడకుండా ఆలోచించకుండా ముందుకు సాగాలి అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు.ఎప్పుడో గతంలో జరిగిన విషయాల గురించి చింతిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ సమాధులు అనే ప్రతీక ద్వారా మృతుల ప్రపంచాన్ని సూచిస్తున్నారు.సమాధుల్లో నిండి పోయిన కళేబరాలు అంటే మట్టిలో కలిసిన అస్తిపంజరాలు మాత్రమే కాదు.మనిషి జీవితంలోని గతకాలపు అనుభవాలు,దుఃఖాలు,బాధలు, మరణించిన వ్యక్తుల ఆశలు,ఆశయాలు అని అర్థం అవుతుంది.మనం గతంలో ఉండి,గతాన్ని గుర్తు చేసుకుంటే మన ఆశలు చనిపోయిన చోటే పాతి పెట్టబడి ఉన్నాయని అర్థం.
కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు అని చెప్పడం.ఇది ఒక సానుకూలభావాన్ని సూచిస్తుంది.కొత్త జీవితాన్ని స్వాగతించడానికి కొత్త అవకాశాల కోసం ఎదురు చూడటానికి కవి మానవుడిని ప్రేరేపిస్తున్నాడు. భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నాడు.కవి ఇక్కడ ప్రకృతితో జీవన సంబంధాన్ని చూపించారు.కొత్త జీవితానికి అవసరమైన విత్తనాలను చేర్చుకోవడం.ఇది పుడమి తత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ఇక్కడ కవి మనిషి తాను పచ్చదనంగా మారి పోవాలని చెబుతున్నాడు.పచ్చదనం అంటే కొత్త ఆశలు,కొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయడం. తన జీవితంలో అభివృద్ధి కొరకు ఒక వ్యక్తి గతాన్ని వదిలేసి భవిష్యత్తులోని ఆశతో ముందుకు సాగాలి అని సూచిస్తున్నారు.మనిషి జీవితంలోని సానుకూలమైన మార్పులకై,భవిష్యత్తుపై దృష్టిని సారించాలని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.మనిషి గతాన్ని తవ్వుకోవడం మాని భవిష్యత్తు కోసం కొత్త విత్తనాలు నాటాలి.మనిషి కొత్త ఆశలతో జీవించాలి అనే సందేశాన్ని ఈ కవితా పంక్తులు అందిస్తున్నాయి.
డాక్టర్ కె.జి. వేణు తేది 01 – 05 – 1954 రోజున ప్రొద్దుటూరు గ్రామం,కడప జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు కుళాయమ్మ,గంగన్న.వీరు 1 వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రొద్దుటూరు పట్టణంలో చదివారు.వీరు పి.జి. విద్యను ఎం.ఎస్సీ.(కెమిస్ట్రీ) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ,అనంతపూర్ లో చదివారు.వీరు ఎం.ఫిల్. మరియు Ph.D. డిగ్రీలను, ఆంధ్రా యూనివర్సిటీ,వైజాగ్ నుండి పొందారు.వీరు 17 జనవరి,1979 రోజున శ్రీకాకుళం,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం ఉపన్యాసకునిగా నియమించబడ్డారు.వీరు 2012 లో రిటైర్ అయ్యారు.వీరు 2012 నుండి 2016 వరకు ప్రొఫెసర్,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (బేసిక్ సైన్సెస్) సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో బాధ్యతలు నిర్వహించారు.వీరు కవి,వ్యాఖ్యాత, నటుడు,దర్శకుడు,న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.వీరు 2008 నుండి విశాఖ కళాభారతి నాటక పరిషత్ చీఫ్ కన్వీనర్ గా కొనసాగుతున్నారు.వీరు 35 కథలు,53 కవితలు,48 సాహిత్య వ్యాసాలు,12 విమర్శ వ్యాసాలు,320 మినీ కవితలు రాశారు.అవి వివిధ దిన,వార,మాస పత్రికలలో ప్రచురింపబడినవి.
కవి కె.జి. వేణు ప్రచురించిన పుస్తకాల వివరాలు :
1) ఈ తీర్పుకి బదులేది (నాటిక)
2) రక్తాభిషేకం (నాటిక)
3) మహా మంత్రుల పుష్పం ( నాటకం)
4) ఆనంద తాండవం (కథల సంపుటి).
వీరు రచించిన ఆనందతాండవం,గురుబ్రహ్మ నాటకాలకు కువైట్ వారి ఉత్తమ రచన బహుమతులను అందుకున్నారు.
వీరు రచించిన పుష్పవిలాపం నాటకానికి జాతీయస్థాయిలో ఉత్తమ రచన బహుమతి అందుకోవడం జరిగింది.వీరు రచించిన ఈ బిడ్డ నాకు కావాలి కథకు అమెరికా ఆటా వారి బహుమతి లభించింది.వీరు రచించిన 20 కవితలకు,18 కథలకు,10 వ్యాసాలకు బహుమతులు అందుకోవడం జరిగింది.వీరు ఉత్తమ నటుడిగా 24 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ దర్శకుడిగా 5 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ నాటక రచయితగా 12సార్లు బహుమతి అందుకున్నారు.వీరు వివిధ పత్రికలకు వ్యాసాలు,కథలు,కవితలు,సమీక్షలు, సాహిత్య విమర్శ వ్యాసాలు రాస్తున్నారు.
కవి కె.జి.వేణు స్వీకరించిన అవార్డుల వివరాలు :
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు.2) కళా తపస్వి అవార్డు,3) విశిష్ట మూర్తి అవార్డు,4) ఆంధ్ర రత్న అవార్డు,5) కువైట్ తెలుగు సంఘం అవార్డు,6) జీవిత సాఫల్య పురస్కారం, 7)రావూజీ అవార్డు,8) సురభి పనారస గోవిందరావు అవార్డు,9) విశాఖ రత్న అవార్డు,10)సి.పి. బ్రౌన్ బెంగుళూరు అవార్డు,11) నవ సాహితి ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్,చెన్నై వారిచే ఉత్తమ సాహిత్య విమర్శకుడు అవార్డు (2023),12)రాయపూర్ ఆంధ్రా అసోసియేషన్ వారిచే ‘సాహిత్య ప్రపూర్ణ’ పురస్కారాన్ని 18 – 08 – 2024 రోజున స్వీకరించారు.13)నవ సాహితీ ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నై వారిచే ఉత్తమ కవిత్వానికి గురజాడ అవార్డు (2024).14) ఆనందతాండవం కథా సంపుటికి 2025 గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందుకున్నారు.
కవి కె.జి.వేణు అందుకున్న సన్మానాలు :
వీరు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు మొదలైన మహామహుల చేత 178 సన్మానాలు అందుకోవడం జరిగింది.
కవి కె.జి.వేణు విదేశీ ప్రయాణాల వివరాలు :
1)వీరు PhD work కోసం 1997లో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన నౌక సాగర కన్యలో విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి మన దేశ శాస్త్రవేత్తల బృందంలో ఒకడిగా మూడు నెలల పాటు సింగపూర్,మలేషియా,శ్రీలంక,మాల్దీవులలో సముద్ర జలాల్లో పర్యటన చేశారు.
2) వీరు 2019లో 3 నెలల పాటు యూరప్ దేశాలు, జర్మనీ, బెల్జియం,నెదర్లాండ్స్,లగ్జమ్ బర్గ్, స్విట్జర్లాండ్,ఫ్రాన్స్ సందర్శన చేయడం జరిగింది.

You may also like

Leave a Comment