ఏ పొద్దు చూసినా ఒకటే రద్దీ
ఏ గల్లీకి పోయినా అంతా తొక్కిడే.
నగరానికొచ్చిన”పల్లె “బతుకింతే.
వృత్తి కళ్ళకు గంతలు కట్టి
ఊరి దారికి గోడ కట్టి
కాని పనులు ముందు చేతులు కట్టుకొని,
చెప్పిన మాటవినే పనిముట్టును వదిలి పట్నం వచ్చిమీట నొక్కితే
తిరిగే యంత్రంగామారి ,
కాసులుకొట్టుకొచ్చే గాలానికి గాలమేసే
పచ్చకాగితల పిచ్చిలో బతుకు గాలివాటానికి ఎగిరే ఓ చిత్తు కాగితంలా ఎక్కడికో కొట్టుకుపోతుంది.
చిటికలో గల్లుమనే చిల్లరకు
రుచి మరిగిన ప్రాణాలకు
గడప దాటితే దిగులుగుండంలో
పడి మాడిపోతామనే బతుకు భయం
ఒకనాడు కష్టాన్ని నమ్మిన దేహమే
కపటాన్ని మోహించి అక్కడే మగ్గుతుంది.
ముక్కులు పగలే కంపుతో కాపురం
కుక్కిన ప్రత్తి బూరంలా
కొంపలో సూరీడు ఎప్పొడిచ్చాడో తెలియని కుములుడుకు
నీడ దుప్పటి కప్పిన వాలు పంచలతో…
మాగుడాసన మూగిన మురికికూపంలో
ఈగలతో కలసి
దోమలతో సహజీవనమే జీవితం.
నల్ల మబ్బు కనిపిస్తే చాలు
సందు గుండె గుల్లె.
ముసురు ముప్పు పట్టి
చినుకు చిందేతే
చుట్టూ చీకటి తడే
వీధులన్నీ గర్భందాల్చిన ప్రాజెక్టులే.
ఇళ్లన్నీ నీళ్లలో తేలాడే పడవలే.
వానొస్తే తడవని కళ్ళు లేవు.
తడపని బాధ లేదు.
గుడ్డి పొడి వెలుగులో
పొట్టను ముడుచుకొని
చెమట ఆవిరి చాలక నడిచే
బిక్కుబిక్కు మంటూ బతుకు బండి ఆగి
అంతా ఇరుకుమయం.
వీధి ఇరుకు-ఇల్లు ఇరుకు
పడక ఇరుకు-నిద్ర ఇరుకు
జీతం ఇరుకు-జీవితం ఇరుకు.
దారి పొడుగునా అన్ని ఇరుకులే.
విశాలమైనది దరిద్రమొక్కటే.
విశాలంగా పారేది కన్నీరొకటే.
..చందలూరి నారాయణరావు
9704437247