Home అనువాద సాహిత్యం ప్రదీప్ బిస్వాల్ వి రెండు కవితలు

మాటలు

మాటల గురించి మాట్లాడకపోవడమే మంచిది

అనాథ పిల్లల్లాగా అవి శవాల వెనుక

శ్మశానం వైపు పరుగెత్తుతాయి

చుట్టూ పడిపోయిన చిల్లర నాణేలను ఏరుకుంటాయి

వాటిని ఆపేవాళ్లెవరూ లేరు

చీకటి నిండిన రాత్రిలో

నక్షత్రాల మసక వెలుతురులో

దుమ్ము నిండిన ఊరితోవ మీద

కలల ముక్కల్ని వెతుకుతూ సాగుతాయి అవి

ఎవరు చెప్పగలరు వాటికి, అది నిరర్థకం అని?

వేకువ వేళ కొండకొమ్ము మీద

కొన్ని పచ్చని ఆకులు సూర్యకాంతితో మెరుస్తాయి

అక్కడ చారెడు కాంతిని చేజిక్కించుకునేందుకు

                                         సాహసిస్తాయి

వద్దనేందుకు నేనెవర్ని?

ఇక్కడ నా భార్య

నన్ను వాటికి దూరంగా ఉండమంటోంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ఎక్కడున్నావిప్పుడు?

భరత్! నువ్వెక్కడున్నావు?

దినపత్రికల్లో గానీ

వార, మాస పత్రికల్లో గానీ

ఎన్నో రోజులనుండి నువ్వు కనిపించలేదు

రాజధానిలో నల్లజెండాలతో

ప్రదర్శనలు జరిపినవారిలో నువ్వు లేవు

పాత బస్ స్టాండ్ లో ఎవరో

నీ ప్రసక్తిని తీసుకొచ్చారు

నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చినట్టు

నీ ఫోన్ నంబరును మారుస్తుంటావు

అంతేనా భరత్?

ఇప్పుడెక్కడున్నావు నువ్వు?

బొలంగీర్ లోనా, భువనేశ్వర్ లోనా?

కలహండికి వెళ్లావా నువ్వు?

అక్కడ ఒక ముసలి తండ్రి

పొలాల్లో కాయకష్టం చేస్తుంటాడు

ఇప్పుడు పిఛనుదార్ల వెంట

ఎందుకు పడుతున్నావు నువ్వు?

రైతులు ప్రభుత్వోద్యోగులు కారు

మాలో చాలా మంది లాగే

నువ్వు కూడా ఉన్నదాంతో తృప్తిగా ఉండు

భరత్!

రా ఒకసారి

మనం ఎన్నో చర్చించుకోవాల్సి ఉంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ప్రదీప్ బిస్వాల్ పరిచయం:

ప్రదీప్ బిస్వాల్ రెండు భాషలలో రచనా నైపుణ్యం ఉన్న ప్రసిద్ధ కవి. సుమారు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఒడియా భాషలో ఆరు కవితా సంపుటులను, ఆంగ్లంలో రెండింటిని వెలువరించారు. వీరి రెండు కవితా సంపుటులు హిందీలోకి అనువదింపబడినాయి.కొన్ని కవితలు హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర ప్రధాన భారతీయ భాషలలోకి తర్జుమా చేయబడినాయి. వీరు ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నేషనల్ బుక్ ట్రస్ట్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.సరళమైన భాషలో హృద్యమైన కవిత్వం రాస్తారు.ఈయన పేరెన్నిక గన్న సంపాదకులు, అనువాదకులు. ఇప్పుడు kabitalive(kabitalive.com)అనే వెబ్ మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.IAS క్యాడర్ కు చెందిన ఈయన ఒడిశా రాష్ట్రప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత,ప్రభుత్వం చేత మళ్లీ ఒడిశా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)మెంబర్ గా నియమితులైనారు. ప్రస్తుతం వీరు భువనేశ్వర్ లో నివసిస్తున్నారు.

***

You may also like

Leave a Comment