నవీన్ పగటి నిద్ర తీస్తున్నాడు. స్నేహితుడు లేపటంవల్ల నిద్రాభంగమైంది.
”ఈ సమయాన వచ్చా వెందుకు”
”ఏమీ తోచడం లేదు”
”నీకు తోచకుంటే నా నిద్ర చెడగొడతావా”
”కోపానికి రాకురా, నీ దయను”
”ఎందుకంత బాధగా ఉన్నావు”
”బాధ కనిపిస్తుందా”
”అవును నీకేం తక్కువ. వాస్తవంగా నీ బాధ్యతలన్నీ తీరాయి. లోకం బాధ నీకెందుకు. ఎవరెక్కడ పోతేంది. మందిని బాగుచేయడం నీ శక్తికి మించిన పని. ప్రపంచంలో అందరూ సమర్థులే. ఒకరు చెబితే విని బాగుపడే స్థితిలో ఎవరూ లేరు. అందరికి అన్నీ తెలుసు. అందరికంటే నాకే తక్కువ తెలుసు అనుకోవాలి. అప్పుడే బి.పి., షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవు. ఆరోగ్యం, తృప్తి సమకూరుతాయి.”
”అనేక మార్పులు అనివార్యాలై పరాయితనం వైపు మనుషుల్ని తీసుకెళ్తుంటే ఎట్లా ఆలోచించకుండా ఉండగలం!”
”ఉదాహరణకు ఏదో ఒకటి చెప్పు చూద్దాం!”
నా చిన్నప్పుడు మా గురువు గారికి రెండు చేతులా దండం పెట్టేవాణ్ణి. నడుస్తున్నవాడల్లా ఆగి మంచీ చెడు మాట్లాడేవాడు. నేను టీచర్‌ను అయ్యాక బడికి సైకిల్ పై వెళ్ళాను. మా విద్యార్థులు దండం పెడితే ఒక చేత సైకిల్ హ్యాండిల్ పట్టుకొని, మరోచేత్తో నమస్కారం పెట్టి, ఆగి పలకరించేవాణ్ణి. మా అబ్బాయి టీచర్ అయ్యాడు. బైక్ పై బడికి వెళ్తున్నాడు. వాడి విద్యార్థులు సైకిల్‌పై వస్తున్నారు. విద్యార్థులు ఒక చేత ”హాయ్ సార్” అంటే మా వాడు బైక్ వదిలే వీలు లేక తల పంకించి ”హాయ్” అంటున్నాడు. పలకరించడం ఆగిపోయింది. నా మనమడు విద్యాశాఖాధికారి. కార్లో నుండే ఇతరులకు చేయి ఊపుతూ వెళతాడు. అలవాట్లలో మార్పు వచ్చిందా, లేదా? నమస్కారం లోని మానవీయత ఉందా? ఊడిందా?
”ఊడింది వాస్తవమే. ప్రగతి కూడా వాస్తవమే.
”మానవీయత లేని అభివృద్దే మిగిలిందని బాధ”
”అభివృద్దిలోని ఆనందాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. నీకు, మాత్రం ప్రతిదాంట్లో ఏదో ఒక తప్పు కనపడుతుంది. పాజిటివ్‌గా ఆలోచించు.”
”ప్రగతితో పాటు ప్రశాంతత ఉంటే సుఖమయ జీవితం సాధ్యం. మనుషుల మధ్య మానవీయత అవసరం. అది పోతుందనే బాధ. ఆత్మగల ఆలోచన, అవసరం మేరకు ఆలోచన, ఈ రెంటి మధ్యగల తేడా నీకు అర్థం కావడం లేదు.”
”నాకు, నీవు ఎప్పుడూ అర్థం కావు”.
పవన్‌కు ఊపిరాడడం లేదు. నవీన్ లాంటి వాడికి మానవీయతలోని మాధుర్యం ఎట్లా రుచి చూపించాలో పాలుపోవడం లేదు. జాలి, కరుణతో కూడిన సంస్కారం ఎలా ఉంటుందో అర్థం చేయించాలి. అందుకు ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచించాడు. కళ్ళుమూసుకొని అరగంట సేపు నిశ్చలంగా ఉన్నాడు. సెల్ మోగింది. దాని గొంతు పిసికాడు. మెసేజ్‌లతో పాటు ఆడియో మెసేజ్‌లు డిలిట్ అయ్యాయి. ఆ క్షణంలో తళుక్కున మెరిసిందో ఆలోచన. ఆడియో రికార్డర్ ద్వారా కథ చదివి నవీన్‌కు పంపిస్తే బాగుంటుందనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. మౌత్ మైక్ పెట్టు కొని ఆడియో రికార్డర్ ఆన్ చేసాడు. చదవడం మొదలు పెట్టాడు.
* * *
అప్పుడే పుట్టిందో జింకపిల్ల. అది చూసి చెట్టు ఫక్కున నవ్వింది. పూలు, పండ్లు రాలాయి. కళ్ళు తెరిచింది పిల్ల. నన్నెవరు తెచ్చారీ భూమిపైకి. వెతికింది. వెతుకుతూ, వెతుకుతూ ముందుకు సాగింది. పచ్చిక, గాలి ఎంత చల్లగున్నాయో, అనుకుంది. అమ్మకోసం ఆరాటపడింది. అప్పుడే భూమి పైకి వచ్చిన పిల్లను చూసి సమస్త సృష్టి పరవశించింది. భానుడు భగభగమనడం తగ్గించాడు. జింకపిల్ల అడుగులకు మడుగులొత్తింది పృథ్వి. గాలి వాయులీనం వినిపించింది. అమ్మ ప్రేమకోసం జింకపిల్ల తహతహలాడింది. అది తెలిసిన ఆకాశం ఆనందనాట్యం చేసింది. అమ్మకోసం వెతుకుతూ మరింత ముందుకు నడిచింది. నీరు దారిచ్చింది. నిప్పు చెమ్మగిల్లింది.
బయటకు వెళ్ళిన తల్లి తిరిగివచ్చింది. పిల్ల కనపడలేదు. ఇంత తొందరగా ఎటు వెళ్ళింది దుఃఖపడింది. వాడేడి! వాడికి పట్టింపులేదు. ఎటు వెళ్ళినట్లు ? ”నేను సైతం మేతకు వెళ్ళిన” అంటాడు. ”చెప్పిపోవాలి కదా.” ”నేను మాత్రం చెప్పివెళ్ళానా”, ”పడుకొని ఉంటే ఎలా లేపడం” అలా అంతర్మథనం సాగింది.
పంచభూతాలకు పాలుపోవడం లేదు. తల్లి, పిల్ల వేరు వేరయినవని కలవరపడ్డాయి. ఆకాశం తెల్లబోయింది. వాయువు హోరుమంది. నీరు సుళ్ళు తిరిగింది. అగ్నిని నివురు అలుముకొంది. భూమి పట్టన పగిలింది. పిల్ల-తల్లి పయనం సాగుతుంది. రెంటి దిక్కులు వేరయ్యాయి. తిరిగివచ్చిన తండ్రి జింక ఒళ్ళు విరిచింది. ఇల్లంతా కలియదిరిగింది. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరయింది. స్త్రీ పురుష ఫలం అందకుండా పోయిందనే బెంగ పట్టుకుంది. రాత్రంతా మెలకువగా ఉండడం వల్ల బిడ్డను చూసాను. దాహం తీర్చుకుని వచ్చేసరికి బిడ్డ మాయమైంది. బాధ్యత నాదా? చింత పడింది.
* * *
తప్పటడుగులు వేస్తూ ఆలోచిస్తుంది పిల్ల. ఇంతకూ అమ్మ ఎలా ఉంటుంది? కళ్ళు తెరవక ముందే ఎటో వెళ్ళింది. అమ్మ తిరిగి వచ్చేదే నా వద్దకు. నేనే తొందరపడి బయల్దేరాను. అమ్మ నాకు ఎదురుగా వస్తది. అమ్మ ఎలా ఉంటుంది ? అమ్మ ప్రేమకు మారు రూపం నేనే కదా! అమ్మ నాలాగే ఉంటుంది. నేనెలా ఉంటాను ? సందేహాలకు లోనౌతూ అడుగులు వేస్తుంది. నాలుగడుగులు వేసిందో లేదో. ‘అమ్మా ఆకలి అంది” నీరసంతో కూలబడింది. కళ్ళు తిరిగినవి. ప్రపంచం మసక బారింది. ఆ స్థితిలో కాస్తంత దూరంలో అమ్మలాగా కనిపించింది. లేని ఓపిక తెచ్చుకుంది. మెల్లమెల్లగా అటువైపు అడుగులేసింది.
* * *
అమ్మ పిచ్చిదైంది. పిల్లకోసం పిచ్చిగా తిరిగింది. ఎత్తుపల్లాలు, శిఖరాలు – లోయలు గాలించింది. చిన్నప్పుడు నేను అమ్మ చెప్పినట్లు వినేది. ఈ కాలపు పిల్లలు పుట్టుకతోనే స్వతంత్రులవుతున్నారు. స్వేచ్ఛ మంచిదే. ఉరిబిగించేదిగా ఉంటే ఎట్లా? ఈ కడుపు కోత దేనికి? అది వెళ్ళినందుకా? ప్రసవ ఫలితమా? బొడ్డుతాడు బంధమా? తల్లి ప్రేమ అంటే ఇదేనా? ఏమో తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. వాడి పరిస్థితి ఏమిటి? వాడి మొహం వాడికింత పట్టింపా? ఏమో? తనలో తానే నవ్వుకుంది. యాతన పడింది. వెతుకుతుంది. ఎక్కడని వెతకాలి. వెతకకుండా ఉండగలనా? పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి.
* * *
వెతకాలి… వెతకాలి…. ఎక్కడికని పోవాలి? ఎటువైపని వెళ్ళాలి? కూచుంటే ఇక్కడికే వస్తుందా? రాదుగాక రాదు. అది దారి తప్పిన పిల్ల. వెతకాలి… పట్టుకోవాలి…. ఈవిడ ఇంకా రాలేదు. అడుగు ముందుకేసాడు. భార్యాబిడ్డలు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. పరిపరి విధాల మనసుపోతుంది. పిల్లది తప్పే. ఉన్నచోట ఉండక ఎందుకు బయల్దేరినట్లు? ప్రేమ ఒక చోట ఉండనిస్తదా! ఎన్ని దివారాత్రాలు తిరిగిన. దీని తల్లిని ఒప్పించటానికి. మనసు, తనువుల ప్రతిఫలనం నా బిడ్డ. ఎక్కడుందో. మృగారణ్యం మొగారణ్యం అంతా అడవి, భయంపాకింది. ఈ పిల్లకు ఓపిక లేదు. ఈ తరమే అంత. ఒప్పుకోళ్ళ స్థానంలో బలవంతాలు వచ్చి చేరినయి. ఆలోచనలన్నీ పుకార్లలా విహరిస్తున్నవి. కళ్ళు-కాళ్ళు వెతుకుతున్నవి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది పరిస్థితి.
* * *
తల్లి, పిల్ల, తండ్రి, అడవిన పడ్డారు. తల్లి ప్రేమకోసం పిల్ల తహతహలాడింది. దగ్గరలో ఉన్న జంతువు తల్లే అనుకొని మరింత చేరువైంది. దాని మెడవరకు వెళ్ళింది. పిల్ల ఒళ్ళు పులకరించింది. తల్లిని ముద్దాడింది. ”భూమిపైకి నన్ను తెచ్చింది. నీవేకదా” అడిగింది. పిల్ల ప్రవర్తన వల్ల ఎదుటి జంతువులోని మాతృహృదయం పాలుగారింది. పిల్లను అక్కున చేర్చుకుంది. దాని విశాలమైన ఉదరం పిల్ల ఆటస్థలమైంది. బండలాంటి దాని తల నీడలో విశ్రమించింది. కళ్ళు విప్పార్చి తదేకంగా తల్లిని చూస్తూ పాలకోసం ప్రయత్నించింది.
* * *
తల్లిజింక, కొండా-కోన గాలించింది. డస్సింది. గుట్ట-గుండె తడిమింది. దహించుక పోయింది. అడుగులు తడబడ్డాయి. నీటి కోసం అలమటించి కూలబడింది. చావు వచ్చేలా ఉంది. ఆకాశం వైపు మెడసాచింది. కన్నీరుకార్చింది. లేని ఓపిక తెచ్చుకుంది. నీటి జాడకు బయల్దేరింది. సుడిగాలి పయనం చేసింది తండ్రి జింక. ”ఎక్కడున్నవు బిడ్డా” అని నోరారా అరిచింది. అడవంతా ప్రతిధ్వనించింది. నీరై దుమికింది. రాయి-రప్ప ఒరుసుకపోయింది. సుడిగాలై గాలించింది. కాయ-కంప గీరుకపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అడవిని అడిగింది. నిశ్ళబ్దం కనిపించింది. నీరసం కమ్మింది. నాలుక పిడచకట్టింది. లేని ఓపిక తెచ్చుకొని నీటికోసం బయల్దేరింది.
* * *
ఆకసాన్నంటినట్లున్న పొడవైన చెట్లు. వాటి ఆకులు రాలుతున్నవి. విశాలమైన నది ఒడ్డుకు ఇరువైపులా చెట్లు. అవి నదికి గొడుగు పడుతున్నట్లున్నవి. నది శబ్దిస్తుంది. ఆ శబ్దం దాహార్తులను పిలుస్తున్నట్లున్నది. తీరం పొడవునా జంతుజాలం సేదతీరుతుంది. రాలిన ఆకు, నీటితో తడిసి మెత్తటి పరుపులా విస్తరించింది. దానిపై సేదతీరిన జంతువు కదిలినా, నిద్రాభంగం కాకూడదని ఆకు శబ్దించడం లేదు. ప్రకృతి ఒడి మెత్తన. నిద్రించిన ప్రాణికి సాంత్వన. మెలకువ కలిగిన మెదడుకు ఆలంబన.
* * *
నదీ తీరంలో చెట్లతో పాటు దట్టమైన పొదలున్నవి. పొదల మాటున దాక్కుని జంతువులు ఉన్నాయి. వేటగాళ్ళు ఉన్నారు. దాడి చేయాలనుకున్నవారు మాటు వేయడం పరిపాటి. ఆ రోజు వేటకోసం భార్యతో సహా వచ్చాడు వేటగాడు. మాటు వేసాడు. అక్కడ ఆదమరిచి పడిపోయిన తల్లి జింక పై భార్యభర్తల చూపు పడింది. పడి ఉన్న దాని వైనం చూసి దంపతులు సంబరపడ్డారు. బాణం ఎక్కుపెట్టి నారి సారించాడు. వదలడమే ఆలస్యం. భార్య వారించింది.
”ఎందుకు అడ్డుకున్నావు” అన్నాడు
”నిద్రపోతున్న దాన్ని చంపడం పాపం”
”ఆకలిని చంపడం కూడా పాపమే”
”బాలింతలా ఉంది పాపం”
”నా ధర్మాన్ని విస్మరించడం పాపం”
”మనిషి పుటుక పుట్టినపుడు నెనరు ఉండాలె”
”అందుకే నిన్ను, నాతో రావద్దంట”
”అటు చూడు” అంది
మొహం వేళ్ళాడేసుకొని, తడబడుతున్న కాళ్ళతో వచ్చింది తండ్రి జింక. కడుపునిండా నీళ్ళు తాగింది. తాగిన చోటే సాగిలపడింది. కళ్ళు మూసింది. గతం కదలాడింది. కళ్ళు తెరిచింది. భారంగా నిశ్వసించింది. మళ్ళీ కళ్ళు మూసింది. దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళు తెరిచింది. ఓపిక లేకున్నా లేచి నిలబడింది. ఎదురుగా దగ్గర్లోనే పడి ఉన్న తల్లి జింక కనిపించింది. ఉత్సాహంగా ముందుకురికింది. అచేతనంగా పడి ఉన్నదాన్ని చూసి కంటనీరు పెట్టింది. నాలుకతో నిమిరింది. తలతో తట్టింది. భయంతో దిగ్గున లేచింది తల్లి జింక. ఎదురుగా తండ్రి జింక. భయం స్థానంలో కోపం చేరింది.
”ఎక్కడ తిరగబోయినవురా” కోపగించింది.
…………………………………………
”బిడ్డను పోగొట్టుకున్న రా” నిస్సహాయంగా అరిచింది.
…………………………………………
”ఇదంత నీ వల్లనే జరిగింది. నాశనమయిపోతవు” శపించింది.
”జరిగిందానికి ఇద్దరం బాధ్యులమే” నిశ్చలంగా అంది తండ్రి జింక
ఆ మాటతో కూలబడింది. సోయి తప్పింది. దాని పక్కనే కూర్చొని సపర్యలు చేసింది తండ్రి జింక. ఇదే అదనుగా మరోసారి దాడికి సిద్దమయ్యాడు వేటగాడు. మళ్ళీవారించింది భార్య.
”నా పాలిటి దరిద్రదేవతవు నీవు” అన్నాడు
”బిడ్డను పోగొట్టుకొని ఉన్నారు వాళ్ళు”
”అయితే నాకేంటి?”
”వన్య ప్రాణులను చంపితే జైల్ల పెడుతారట”
”నీతులు చెప్పకు. ఇవ్వాళ పూటగడవడం ఎట్ల?”
”ఒక్కరోజు ఉపాసం ఉందాం”
”రేపటికి ఎట్ల?”
”రేపటి సంగతి దేవుడెరుగు”
వేటగాడు విల్లు కింద పెట్టాడు. సపర్యల తరువాత తల్లిజింక తెలివికొచ్చింది. రెండు జింకలు కలిసి కనిపించిన దారిలో పయనించాయి. వాటిని వేటదంపతులు వెంబడించారు.
* * *
జింక పిల్ల పాలకోసం ప్రయత్నించింది. తనది కాని వాసనేదో వేసింది. వెగటు పుట్టింది. ముద్దాడిన మూతికి రక్త రుచి తెలిసింది. తొందరలోనే అది తన తల్లి కాదని గ్రహించింది. జింక పిల్ల రక్తంలో భయం చొరబడింది. అక్కడి నుండి పరుగెత్తింది. పరుగును చూడగానే జంతువులో వేటాడే లక్షణం మేల్కొంది. వెంటాడింది. క్షణంలో పంజా విప్పింది. విసిరింది. జింకపిల్ల తప్పించుకుంది. జంతువు గాండ్రించింది. ముందుకు దూకింది. మెడ పట్టింది. కొరికింది. పులినోట్లో పడి జింకపిల్ల చచ్చింది. కాసేపు స్థంబించిన ప్రకృతి మరల యధావిధిగా మారింది.
* * *
రెండు జంటలు ఒక దాని వెనుక ఒకటి పరుగునడక పెడుతున్నవి. అలా వెళుతున్న వాటికి చావు వాసన సోకింది. తల్లి జింక ఠక్కున ఆగింది. వాసన వైపు మళ్ళింది. తండ్రి జింక వెంబడించింది. అవి దారి మళ్ళడం చూసి వేటదంపతులు ఆశ్చర్యపోయారు. వాటి వెనకే వెళ్ళారు. ఆ దారి జింకపిల్ల చచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళింది. పిల్ల అవశేషాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్న బిడ్డను తలచుకుంటూ జింక జంట దుఃఖిస్తున్నది.
”అయ్యో బిడ్డా ఎంత పనైపాయె” అంది వేటకత్తె
”చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత” అన్నాడు వేటగాడు.
”ఈ మాత్రం దానికే ఎంత తతంగం. దేవునింట్ల మన్నువడ. చోద్యం చేస్తడు”
”జింకను పంపినోడే, పులిని పంపిండు”
”అంటే!! నీ ఉద్దేశం ఏంది”
”పులికి ఆహారంగా జింకను పంపిండు”
”చంపి తినుడేనా పులి పని”
”పిల్లను చంపలేకపోతే, పులి పరువేం కావాలె”
”బలవంతుడు, బలహీనుణ్ణి చంపుడేనా! కనీస పాపభీతి ఉండక్కర్లేదా?”
”నా బంగారం కదూ! ఇంటికి పోదాం పదా”
”ఏమోనయ్యా! అంత ఎటమటం అనిపిస్తుంది”
”జింకపిల్ల, నువ్వు ఇద్దరూ అమాయక ప్రాణులే”
”మనం ఆకలికి ఓర్చుకోగలం. బిడ్డ ఆకలి తీర్చడం ఎలా?
”జింకను చంపుతానంటే అడ్డుపడ్డావు. ఆకలి తీరే మార్గం నీవే చెప్పాలి.”
”పులి చంపిన జింక పిల్లను తీసికెళ్దాం”
”సరే పదా!
* * *
నవీన్, కథ విన్నావు కదా వేటగత్తె మానవీయ ఆలోచనల వల్ల పెద్ద జింకలు బతికి బయట పడ్డాయి. వేటాడే మనస్తత్వంవల్ల పిల్ల జింక చచ్చిఊర్కొంది. వేటాడే మనస్తత్వం మనుషుల్లో పెరగడంవల్ల పిల్ల జింకల్లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా!
బి.వి.ఎన్.స్వామి
బి.వి.ఎన్.స్వామి
కథారచన,కథా పరిశోధన, కథా విమర్శ, కథా సంపాదకత్వం పరిధిలో కథ సేవ చేస్తున్న ప్రముఖ రచయిత డా॥ బి.వి.వి.ఎన్.స్వామి. “ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం- పరిశీలన (1970-2000) “ అనే అంశం పై సిద్ధాంత వ్యాసం సమర్పించారు.నెల పొడుపు,రాత్రి -పగలు-ఒక మెలకువ(కథా సంపుటులు),అందుబాటు,కరీంనగర్ సాహిత్య చరిత్ర (పరిశోధన),పటువ (విమర్శ),వివరం(కథా విమర్శ),కశప(కథా శతక పద్యం),తెలంగాణ చౌక్ (కథలు-సంపాదకత్వం) మొదలైన అనేక పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల , కార్ఖానా గడ్డ ,ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఫిక్షన్ అంటే కల్పన. ఊహ ఆధారంగా కల్పన జరుగుతుంది. వాస్తవాధీన కల్పన కావచ్చు వాస్తవ దూర కల్పన కావచ్చు మరింకే విధమైన కాల్పనిక సాహిత్యమైన కావచ్చు అదంతా ఫిక్షన్ అనబడుతుంది. ప్రయోగపూర్వకంగా నిరూపితమైనదే (Tested and proved) సైన్స్. ఇందులో కల్పనకు తావులేదు. ప్రయోగం ద్వారా నిరూపించబడి, ఫలితం కనపడడం సైన్స్‌కు ప్రమాణం. ఖచ్చితము, నిర్దిష్టము అయిన సూత్రాల సమాహారం సైన్స్. శాస్త్రవిజ్ఞానము, ప్రయోగశాస్త్రము పేర్లేమైనా కాని సైన్స్‌కు ఆధారం ప్రయోగం. ప్రయోగ క్రమం కూడా ముఖ్యమే. వీటన్నిటి సమ్మేళనంగా శాస్త్రవిజ్ఞాన సూత్రాల ఆవిర్భావం జరుగుతుంది. తద్భిన్నంగా ఊహాజనితమైన కల్పన కనపడుతుంది. కల్పనా సాహిత్యాన్ని ఫిక్షన్ అంటారు. సైన్స్‌కు ఫిక్షన్‌కు పొంతన కుదరదు. పొంతన కుదిర్చే, రెంటిని మేళవించే సాహిత్యాన్ని సైన్స్ ఫిక్షన్ అంటారు. దీన్ని వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అని కూడా అనవచ్చు. ముచ్చటగా ముద్దుగా ”సైఫీ సాహిత్యం” అని పిలుచుకోవచ్చు.
ఖగోళ, పాతాళ రహస్యాల్ని ఛేదించపూనుకున్న మనిషికి సైన్స్ చేయూతనిస్తుంది. సుఖవంతమైన, అభివృద్దికరమైన జీవితానికి బాటలు పరుస్తుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో పరుగులతో పురోగమిస్తున్న మానవుడు ప్రతిసృష్టి చేస్తున్నాడు. రోబోలకు జన్మనిచ్చాడు. కృత్రిమ మేధను సృష్టిస్తున్నాడు. ఇవన్ని కూడా మనిషి భౌతిక, నైతిక దృష్టిలో అపూర్వమైన మార్పును తెచ్చాయి. ఆ మార్పు తెచ్చిన ఫలితాన్ని, మానవ జీవితాలపై దాని ప్రభావాన్ని సైన్స్‌ఫిక్షన్ చిత్రిస్తుంది. విజ్ఞాన శాస్త్రం అందించిన జ్ఞానం, వెర్రితలలు వేయకుండా ఎలా కాపాడుకోవాలో చెపుతుంది. సైంటిఫిక్ దృక్ఫథాన్ని ఎలా అలవరుచుకోవాలో, దాన్ని జీవితానికి ఎలా వర్తింప చేయాలో నేర్పుతుంది. టెక్నాలజీ ఆధారంగా భవిష్యత్తులో జరిగే మార్పుల్ని, అది సమస్త విశ్వంపై అనగా జీవ, నిర్జీవాలపై చూపే ప్రభావాల్ని, మార్పుల్ని సహేతుకంగా విడమరుస్తుంది. అంతరిక్షయానం, గ్రహాంతర జీవులు గ్రహాంతర యుద్ధాలు సమాంతర విశ్వం, గతంలోకి, భవిష్యత్‌లోకి కాలప్రయాణం కంప్యూటర్లు, ఖగోళవింతలు, పాతాళరహస్యాలు, భూగోళమర్మాలు ఇవన్ని ఈ సాహిత్యపు ముడిసరుకులు. సైన్స్ ఆధారంగా భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించి కూడా సైన్స్ ఫిక్షన్ చెబుతుంది. ‘ఒక వేళ అలా జరిగితే’, ‘అలా ఎందుకు జరిగింది’ అనే అనుమాన ప్రమాణాలు సైన్స్ ఫిక్షన్‌కు ఆధారభూతాలు.
సైన్స్ ఫిక్షన్ 21వ శతాబ్దానికి ఆనవాలుగా నిలుస్తుంది. ఇది కొత్త ప్రపంచాన్ని కొత్త విలువలను ఆవిష్కరిస్తుంది. సైన్స్ ఛురకత్తి లాంటిది. స్వార్థానికి వాడుకుంటే నాశనం, ప్రగతికి వాడుకుంటే కళ్యాణం. సైన్స్ ప్రయోగాలు తప్పుదారి పడితే భయంకర పరిణామాలు, పర్యావరణ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. సైన్స్‌ను ఊతంగా చేసుకొని అనైతిక చర్యలు, అసంబద్ధ పనులు జరుగుతున్నాయి. వీటివల్ల మానవ సంబంధాల్లో వస్తున్న మార్పును, భవిష్యత్‌లో జరుగబోయే పరిణామాలను సైన్స్ ఫిక్షన్ చెబుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు సమాజాన్ని సిద్దం చేస్తుంది. సైన్స్ ప్రళయాన్ని ప్రశాంతతను సృష్టిస్తుంది. ఈ స్థితి గతుల పట్ల సమాజానికి జాగరూకత నేర్పుతుంది. భవిష్యత్‌లో సాధ్యపడగల ఘటనలను మనం చూడగల సన్నివేశాలను హేతుబద్ద ఆధారాలతో, రుజువులతో ఊహలతో కూడిన సాహిత్యాన్ని సైన్స్ ఫిక్షన్ అందిస్తుంది. ఇక్కడే ఉత్సాహవంతులైన రచయితలు, ఎన్నడూ సాధ్యపడని జరగబోని ఘటనలను, ఉనికిలో లేని లోకాలను ఊహించి ఫాంటసీలను సృష్టిస్తున్నారు. వాటిని సైన్స్ ఫిక్షన్లో చొప్పిస్తున్నారు. ఫాంటసీకీ సైన్స్ ఫిక్షన్‌కు అభేదాన్ని చూపుతున్నారు. సైన్స్‌కు విరుద్దమైన ఫిక్షన్, మరియు ఫాంటసీలు క్రమంగా సైన్స్‌తో జతకలిసి సాహిత్యాన్ని సృష్టించాయి. అందుకే సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఫాంటసీ అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. ఈ రెండు భావనలను ఒకేచోట చేకూర్చగల ”స్పెక్యులేటివ్ ఫిక్షన్” అనే మాటకు నేడు ఆమోదం దొరికింది. ఆ విధంగా సైన్స్ ఫిక్షన్ సాహిత్యానికి ఒక విశాల భూమిక ఏర్పడింది.
తెలుగు కథా సాహిత్యంలో సై.ఫి. కథలు చాలా తక్కువగా వచ్చాయి. సామాజిక పరిణామాలకు, సంఘ జీవితానికి పెద్దపీట వేసే ధోరణి వల్ల కావచ్చు, ఆధ్యాత్మిక వైఖరుల వల్ల కావచ్చు. క్లిష్టమైన పని కావడం వల్ల కావచ్చు. కొత్త ప్రయోగాలను ఆహ్వానించలేని దృష్టి కావచ్చు, ఇంకా ఇతర కారణాలేవైనా కావచ్చు తెలుగులో ఇలాంటి కథలు రాలేదు. తెలుగు సాహిత్యంలో ”సైన్స్‌ఫిక్షన్” ప్రాచుర్యం పొందడానికి కారణమైన వారిలో కె. సదాశివరావు ఒకరు. గ్రహాంతర యానాలను, నూతన మానవ జీవన శైలిని చిత్రించిన వీరి ”ఆత్మాఫాక్టర్” ”మానవ ఫాక్టర్” రెండు సీక్వెల్ కథలు. ఇలాంటి కథలు రాసిన అతి కొద్దిమందిలో డా|| మధుచిత్తర్వు ఒకరు. వీరి కథలను సైన్స్ ఫిక్షన్, మెడికల్ ఫిక్షన్ అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఎక్కువ క్లిష్టమైన సాంకేతిక వివరాలతో ఉంటే ”హార్డ్‌కోర్ సైన్స్‌ఫిక్షన్” అనీ సరళమైన వివరాలతో ఉంటే ”సాఫ్ట్‌కోర్ సైన్స్ ఫిక్షన్” అని పిలువచ్చని డా|| మధు అభిప్రాయపడ్డారు.
డా|| మధు చిత్తర్వు రాసిన కథ ”అంగారకం”
”ఏస్ట్రోనాట్ శరభ శర్మ!
కెప్టెన్ శరభశర్మ
”స్పేస్ సూట్లోనికి ఏదో పదునైన వస్తువు గుచ్చుకుపోయింది. అతను వేసుకున్న స్పేస్ సూటులో ఒత్తిడి క్రమంగా తగ్గిపోసాగింది. అంగారకుడి తక్కువ పీడనం ఉన్న వాతావరణం అతని శరీరాన్ని నొక్కివేయసాగింది. సూటుని గుచ్చుకున్న వస్తువు ఏమిటో! విరిగిపోయిన ఏ డిష్ ఏంటెన్నా రాడ్ ఏమో! లేక మరేదైనా పదునైన వస్తువు కావచ్చు! ఏదయి వుంటుంది? శరభశర్మ స్పేస్ సూటులోని ”సెన్సర్”లు వెంటనే రంద్రాన్ని పూడ్చివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆటోమాటిక్‌గా ఎక్కువ ఆక్సిజన్ వదిలాయి. సూటులోని ఒత్తిడి తగ్గిపోతుందని సూచించే అలారం చేతుల్లో మోగసాగింది”.
”కింద పడిన వెంటనే శరభశర్మకి కొంచెం కొంచెంగా స్పృహ తప్పసాగింది.
అతని చుట్టూ కుజుడిలోని భీకరమైన దుమ్ము తుఫాను చప్పుడు లేకుండా రేగుతూనేవుంది.”
పాఠకుడిని ఆకర్షించే సైన్స్ ఫిక్షన్ ఎత్తుగడ ఇది.
”కుజుడులో జీవమే లేదు. ఉండే అవకాశం కూడా లేదు. ఆక్సిజన్ లేదు. నీళ్ళు లేవు. వాతావరణం లేదు. సముద్రాలు మిలియన్ సంవత్సరాల క్రితమే ఎండిపోయాయి. గాలినిండా కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ అనే నోబుల్ గ్యాస్‌లు మాత్రమే వున్నాయి. ఎప్పుడూ ఎర్రటి ధూళి, ఇసుక, దుమ్ము, గాలి, పెద్ద ఎర్రరాళ్ళు, లోతైన క్రెటర్స్ అనబడే గోతులు! ఇవి తప్ప ఇక్కడ ఏమి లేదు. ఇది రోమాంటిక్‌గా లేని వాస్తవం”.
కుజగ్రహం పైన ఉన్న పరిస్థితి అది. అలాంటి గ్రహం పైకి పరిశోధనల నిమిత్తం వ్యోమగాములు వెళ్ళారు. అందులో శరభశర్మ ఒకడు. పైన స్పేస్‌వాక్ చేసే సమయంలో కుజ తుఫాన్ బారిన పడతాడు శర్మ. తన సహచరులు అతనిని వదిలి కుజగామినిలో వెళ్ళిపోతారు. ఇప్పుడు కుజగ్రహంపై అతనొక్కడే మిగిలాడు. ”ఇక్కడి నుంచి సమాచారం మాతృనౌకకి ఇవ్వాలి. షార్ కేంద్రానికి ఇవ్వాలి. ఎలా?” శరభశర్మ వ్యోమగామి అయినా దేవుడిని నమ్ముతాడు. హిందువు, తెలుగువాడు కాబట్టి ”ఏడుకొండలవాడా! ఈ ఉపద్రవం నుంచి కాపాడు” అనుకున్నాడు. నంబియార్, లతీఫ్, అశ్విన్, ఎక్కడరా మీరు? నన్నొదిలిపోతార్రా బాస్టర్డ్స్! నిశ్శబ్దంగా అరిచాడు. ఇలా సాగుతుంది కథ.
ఈ పరిస్థితుల్లో అతని ఆలోచనలు కుటుంబం చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ మానవ సంబంధాల విషయాలు, తదనంతర పరిణామాల్ని రచయిత చర్చించాడు. సైన్స్నుండి సమాజం వైపు కథ తిరిగింది. సైన్స్‌ఫిక్షన్ లో కేవలం సైన్స్ మాత్రమే కాకుండా మిగిలిన మానవీయ అనుభూతులను కూడా పొందుపరచవచ్చు. తప్పిపోయిన శర్మ గురించి ఇండియాలోని శ్రీహరి కోట నుండి గాలింపు మొదలయింది. బతికున్నాడో లేడో అనే ఆదుర్ధా, అతని భార్యకు ఏమి చెప్పాలో తెలియని అవస్థ అధికారుల్లో తలెత్తింది. ”నోనోసర్! మొత్తం మూడు వందల ఇమేజస్ క్లోజ్‌గా ఎనలైజ్ చేశాను. ఇకడౌట్లేదు. మనరోవర్ క్రాఫ్ట్ కార్గోషిప్కి ఏడు కిలోమీటర్ల దూరంలో కదుల్తోంది. డబుల్చెక్ చేసాను. రష్యన్లు, అమెరికన్లు కూడా ”కన్ఫర్మ్” చేశారు అంది శాటిలైట్ ఇమేజ్ ఎనలిస్ట్”. ఇది భూమి పై జరుగుతున్న పని.
శరభ శర్మ, కుజగ్రహంపై ఉండి భూమిపై ఉన్నవారితో ఎలా సంబంధాలు పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాడు. 1800 కిలోమీటర్ల దూరంలోని మౌంట్ ఒలంపస్ ప్రాంతానికి ప్రయాణించాలి. అక్కడ దిగబోయే అమెరికన్ అంతరిక్ష నౌక కోసం ఎదురుచూడాలి. అంతవరకు బతకాలి అనుకున్నాడు.
షార్‌కేంద్రం శ్రీహరి కోటలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. వీడియోకాన్ఫరెన్స్‌లో అమెరికా నాసా, చైనా అంతరిక్ష కేంద్ర అధికారులు ఉన్నారు. వనజామూర్తి, కేంద్ర మంత్రి కూడా మీటింగ్ లో ఉన్నారు.
సుబ్రావ్ చెప్పసాగాడు. ”సర్! అన్ని శాటిలైట్ ఫోటోల విశ్లేషణల అనుసారంగా ఒకటే స్పష్టం అవుతుంది. ఎస్ట్రోనాట్ శరభశర్మ బతికే ఉన్నాడు. రోజూరోవర్క్రాఫ్ట్లో ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఐదువరకు తిరిగి వెళ్తున్నాడు. ఇదే పని నెలరోజులుగా చేస్తున్నాడు. అతని వద్దనుంచి కమ్యూనికేషన్ లేదు.”
”రెండు రోజులలో అతను రెండు రోవర్ క్రాఫ్ట్ వాహనాలని కలిపి బిగించాడు అనిపిస్తుంది. ఇప్పుడు రెండు రోవర్లు ఒకదాని వెంట ఒకటి కదుల్తూ కనిపిస్తున్నాయి. బహుశ అతని ఉద్దేశ్యం ఒక రోవర్లో ఆహారం, నీరు సప్లయిలు పెట్టుకొని మరొక దాంట్లో సుదూర ప్రయాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడేమో! అది బహుశ భూమినుంచి వెళ్ళే మరొక మిషన్ నౌక దిగే చోటికి అయివుండొచ్చు” అన్నాడు షార్ డైరెక్టర్.
కేంద్రమంత్రి గంభీరంగా అన్నారు. ”త్వరగా ఏదో చేయాలి. మిష్టర్ సుబ్రావ్! ఈ రక్షణ కార్యక్రమం ఇన్చార్జ్గా బాధ్యత మీకిస్తున్నాను. మీరు డైరెక్ట్ చేయండి. వివరాలు రెండ్రోజుల కొకసారి తెలియజేయండి. ప్రెస్ వారికి కూడా ఇదే తెలియజేయండి. తప్పక సక్సెస్ కావాలి! ఇది దేశ ప్రతిష్టకి సంబంధించిన విషయం! అని లేచాడు.
అలా శరభశర్మను రక్షించటానికి అనేక ఆలోచనలు చేయసాగారు.
శరభశర్మ రోవర్లో ప్రయాణిస్తున్నాడు. ఉత్తరం వైపు రెండు వేల కిలోమీటర్లు దూరం ఇలా ప్రయాణించగలడా? ఆహారం సరిపోదు. కమ్యూనికేషన్స్ లేవు. మరణం తథ్యం అనిపిస్తుంది. మధ్యలో తనకున్న పరిజ్ఞానం ఉపయోగించి కమ్యూనికేషన్స్ వ్యవస్థ బాగు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ఎర్రని నేల, నల్లటి ఆకాశంలో రాత్రుళ్ళు మెరిసే చుక్కల మధ్య కుజుని చంద్రుళ్ళు డిమోస్, ఫోబియస్లు ఉదయించడం, అస్తమించడం, పల్చని వెన్నెల చిమ్మడం, ”కార్గోషిప్”లో సీడీలు టీవీలా చూడటం ఎండిపోయిన రొట్టెలు, పళ్ళు డబ్బాలోని పళ్ళ రసాలు, పాలతో కడుపునింపడం ఈ నిశ్శబ్దంలో దేవుడు కనిపించాడు శర్మకి. ఆదేవుడు విశ్వరూపుడు. అనంతుడు. కానీ తనని ఇప్పుడు రక్షించలేడు. ప్రార్థిస్తున్నా సరే! రోజు గంట ప్రార్థన చేసేవాడు…. నెల రోజుల తర్వాత ఓ రోజు నిజంగా అతని ప్రార్థన ఫలించింది.
ఈ రోజు ఉదయమే లేచి మళ్ళీ సిగ్నల్ యూనిట్‌కి, స్పీకర్ యూనిట్ వైర్లు కలిపి సోలార్ పవర్ కనెక్ట్ చేసి, డిష్ యాంటెనా వైరు కలిపి, వైరుని బయట షిప్ రూఫ్ మీద వేసి బటన్ నొక్కాడు.
ఆశ్చర్యం! రిసీవర్లో స్టాటిక్ చప్పుడు, శబ్దాలు!
”ఓ దేవదేవా! వెంకటేశ్వరా! తెలుగు దేవుడిని తల్చుకుని ”థాంక్యు” అని అరిచాడు శరభశర్మ. వెంటనే హెడ్ ఫోన్స్ పెట్టుకొని మైక్ తగిలించుకొని చకచకా ఫ్రీక్వెన్సీలు మార్చి బటన్స్ నొక్కసాగాడు.
”మే డే! మే డే! (ఎమర్జెన్సీని సూచించే పిలుపు) శర్మా హియర్, శర్మా హియర్, మార్స్ బేస్ క్యాంప్, మేడే మేడే” సందేశం ఇవ్వసాగారు. ఇరవై నిమిషాలు గడిచాక ఒక అద్బుతం. ”రోజర్! రోజర్! శర్మా! నేను అంగారకాయాన్ కమాండర్ అశ్విన్ మాట్లాడుతున్నా! నీ మెసేజ్ అందింది! నిన్ను తీసుకపోవడానికి ఖచ్చితంగా వస్తున్నాం. మళ్ళీ వినబడిందా చెప్పు!
అతనికి జీవితం మళ్ళీ తిరిగివచ్చి వేయి చేతులతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. ”రోజర్! రోజర్! నీ వాయిస్ క్లియర్!” ”మళ్ళీ కోపంగా” అన్యాయం కెప్టెన్! నన్నొదిలి అందరూ వెళ్ళి పోయారా? యూ బాస్టర్డ్స్! నన్ను చనిపోయాడని వదిలిపోయారా, యూపిగ్స్!”
కెప్టెన్ అశ్విన్‌కి కోపంగా లేదు. కూల్‌గా అన్నాడు. ”థాంక్స్! నీ మాటలు అన్ని క్లియర్‌గా వినిపిస్తున్నాయి. నాకే కాదు, మొత్తం భూమిలో అందరికీ, షార్‌లో, ఢిల్లీలో అమెరికాలో! సారీ శర్మా! నువ్వు బతుకుతావు అనుకోలే! సారీ రియల్లీ వుయర్ పిగ్స్! కానీ రియల్లీ రియల్లీ నీ కోసం రిస్క్ తీసుకొని మళ్ళీ వస్తున్నాం. నీ కోసం దిగుతున్నాం. ఇండియాకీ మాకూ ఎంత రిస్క్ అయినా, ఖర్చు అయినా తిరిగి దిగుతున్నాం. నిన్ను రక్షించి తీసుకుపోతాం! వెయిట్! 12 గంటలు అంతే ! కీప్ టాకింగ్!”
ఆ తర్వాత తెరమీద శరభశర్మ ప్రపంచానికి అందరికీ నమస్కరించాడు. అంగారక యాన్ నౌకలో తేలుతూ ఎగురుతూ పండగ జరుపుకుంటున్న అంతరిక్ష నావికులూ కనిపించారు.
పై కథలో సైన్స్, భక్తి, సంఘర్షణ, బాధ, కుటుంబ సంబంధాలు, బాధ్యత, మానవీయత, ఆత్మీయత, పరిశోధన, పట్టుదల, ధైర్యం, మొక్కవోని విశ్వాసం ఇలా సమస్తం కలిసి ఉన్నాయి. స్థలము కాలము రెండూ కూడా కుజగ్రహానికి చెందినవే.
సింహ భాగం సైన్స్‌దే కనుక ఇది సైన్స్ ఫిక్షన్ కథ.