”తెలుగే గొప్ప భాష కాని కనుమరుగవుతున్నది” పుస్తక రచయిత శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు. వీరు ప్రముఖ రిటైర్డు ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీరు. 1963 నుండి 2003 వరకు విద్యుత్ సంస్థలో పని చేశారు. ప్రస్తుతం ఎనభై ఏండ్ల వయసులో తెలుగు భాష కోసం, వ్యాప్తి కోసం, తెలుగు నుడి కోసం, తెలుగు పునరుజ్జీవనం ఔన్నత్యం కోసం తపిస్తూ, అహమ్మదాబాదు నుంచి కోయంబత్తూరు, అమెరికా వరకు తిరుగుతూ తెలుగే ప్రాణంగా తన ఊపిరిగా బతుకుతున్నారు. ఈ పొత్తానికి ముందు మాట పారుపల్లి కోదండ రామయ్య గారు ఎక్కుపెట్టిన ఉద్యమ కోదండం- డాక్టర్ అద్దంకి శ్రీనివాస్, నా మెచ్చుకోలు ముచ్చట.. కవి గాండీవి బిరుదాంకితులు ఎమ్మెస్సీ (న్యూక్లియర్ ఫిజిక్స్) ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్, కాలయాపన లేకుండా మనం కదలాలి-చెన్నూరి ఆంజనేయ రెడ్డి ఐ.పి.యస్., తెలుగు భాష నిబద్దతకు చెకుముకి రాయి జయధీర్ తిరుమలరావు, నేను చెప్పే చిన్నమాట వంగూరి చిట్టెన్ రాజు వంగూరి ఫౌండేషన ఆఫ్ అమెరికా, హూస్టన్ టెక్సాస్ (అమెరికా) వారు రాశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి రజతోత్సవాల సందర్భంగా ప్రచురించిన ఈ అపురూపమైన గ్రంథం చిట్టెన్ రాజు గారి 77వ ప్రచురణ. వెనుమాటలో కోదండ రామయ్య గారు తెలుగు భాష సంస్కృతులను పట్టి పీడిస్తున్న కక్షుద్ర శక్తులను తరిమి కొట్టాలని చైతన్య స్ఫూర్తితో గొప్ప తెలుగు భాష కోసం మన జవసత్త్వాలన్నింటిని పెట్టి విస్ఫులింగాలులా విజృంభించాలని కదలండి, కదలి రండి, కదిలించండి, మనది న్యాయమైన పోరాటం తప్పక విజయం మనదే అని ఉద్భోదించారు.’వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ అమెరికా తెలుగు సాహిత్య వేదికను 1994లో స్థాపించారు. ఆ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ”చంద్రునికో నూలు పోగు” అన్నట్లు తెలుగు భాష, సాహిత్యానికి హితోధికమైన సేవ చేస్తున్నారు. వారి సేవలు అభినందనీయం.
నన్నయాదుల కన్నతల్లికి సన్నజాజుల మాలలు అర్పిస్తూ
ఆంధ్రకేసరి వీరమాతకు పాండ్ర కర్పూర హారుతలందిస్తూ
రాలుకరిగే త్యాగరాజుని రాగసుధలో పరవశిస్తూ
కూచిపూడి కళామతల్లికి అంజలులను సమర్పిస్తూ
అమెరికాలో తెలుగుతల్లికి సాహిత్యాలంకరణలు చేస్తూ
మురిసి పోదాం మనందరం – మనందరం తెలుగు భాషాభిమానులం.
ఇది పెయినిండిన మాతృభక్తికి, మాతృభాషాభిమానానికి, మాతృదేశానికి మనం అందించే ఘన నివాళి.
దైవములు లేరు తనుకన్న తల్లి కంటే
భాగ్యములు లేవు తన తల్లి భాష కంటె
స్వర్గములు లేవు తల్లి దేశంబు కంటె
నురలకీ సూత్రములు జీవనాడులండ్రు.
తెలుగు తల్లి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు వైభోగం, తెలుగు నేల పరిమళాలను ఆస్వాదించడం ప్రతి తెలుగువాడి కర్తవ్యపరాయణతకు గీటురాయి. జన్మఫల సార్థక్యం.
2022 ఆటా సందర్భంగా పారుపల్లి కోడండ రామయ్యను నేను అమెరికా, వాషింగ్ టన్ డి.సి.లో కలుసుకోవడం జరిగింది. ఏ మాత్రం డాంబికత, దర్పం లేకుండా వారు తెలుగు సమావేశానికి హాజరయ్యారు. తమ కూతుర్ని, అల్లుడు రాధాకృష్ణను సహాయంగా వెంట తీసుకొని వచ్చారు. నిరాడంబరత, నిశ్చలత్వం, శాంతం, సౌజన్యం వారికబ్బిన గుణసంపద. భేషజం ఏమాత్రం లేదు. వారిని చూస్తుంటే అప్పటి తెలుగు అధికార భాషాసంఘం కోసం అహర్శిలు తమ జీవితాన్ని అంకితం చేసి తెలుగు భాషోన్నతికి పాటుపడ్డ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు మరోసారి నా కను ముందు ప్రత్యక్షమయ్యారు.
ఇంచుమించు 17 సంవత్సరాల నుంచే ‘తెలుగు దండు’ సంస్థ ద్వారా పారుపల్లి కోదండ రామయ్య గారు నాకు సుపరిచితులు. ఇంచుమించు 22 సంవత్సరాల పదవీ విరమణ తరువాత కూడ ‘అమ్మ నుడి’ కోసం ఆరాటపడుతూ సామాన్య జనులకు కూడ అర్థంకాని అనేక విషయాలు వారు ”తెలుగే గొప్ప భాష కాని కనుమరుగౌతున్నది” అన్న ఈ పొత్తం 2019లో మూడవ ప్రచురణగా వెలువరించడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఒక పదవీ విరమణ చేసి విశ్రాంత చీఫ్ ఇంజనీరు విద్యుత్ సంస్థలో పని చేసిన అవిశ్రాంత తెలుగుభాష అధ్యయన శీలి. తెలంగాణలో కె.జి. నుంచి పి.జి. దాక ఆంగ్ల మాధ్యమమే అని కడియం శ్రీహరి, అంగన్ వాడీ (3వ యేట నుంచే) లోనే తెలుగు మాట్లాడనివ్వమని అంటున్న నారాయణ, తెలుగును ఇక ఒక తరం కాలంలోనే కనుమరుగు చేయనున్నారని, ఏమాత్రం పరిశీలన చేసిన వారికెవరికైనా తేటతెల్లంగా కనబడుతుందనే నిర్ణయాని కొచ్చారు.
ఈనాడు యూరపు ఖండ వాసులకు అనుకూలంగా ఉండే గేయాన్ని మనం నిరభ్యంతరంగా ఇండియా పిల్లలకు బోధిస్తున్నాం. తల్లిదండ్రులు కూడ దాన్ని ఆమోదిస్తున్నారు. అప్పుడే తమ పిల్లలు ఆంగ్ల భాషలో గీతాలను నేర్చుకొని అందలమెక్కుతున్నారని ఆనందిస్తున్నారు. ఇది ఎంత అసహజ మైనదో, అర్ధరహితమైనదో, వ్యతిరేకంగా ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు. మన సంస్కృతికి భిన్నమైన సంస్కృతి వచ్చి చేరుతుంది. కోట్ల మంది పిల్లలు దేశంలో వానా వానా వెళ్ళి పో అనడం వింతలలో వింత కదా !
వానా వానా వెళ్లి పో Rain Rain go away
ఇంకో రోజు వద్దువు గానీ Come again in another day
చిట్టి నాన్న ఆడుకోవాలి Littile Johny wants to play
వానా వానా వెళ్లిపో Rain Rain go away
అట్లే మనం ప్రస్తుతం నేర్పుతున్న మరో పాటను గమనించినట్లైతే
Jack and Jill went up the hill
రాముడు సీత కొండ మీదకు వెళ్లారు
To fetch a pint of water
ఓ బొక్కెన నీరు తేవడానికి
Jack fell down and broke his head (crown)
రాముడు కింద పడ్డాడు మాడు పగిలింది
And Jill come tumbling after
తరువాత సీత దొర్లుకుంటూ కిందికొచ్చింది.
నీళ్లు తేవడానికి కొండ మీదకు వెళ్లడమేమిటి? కిందపడ్డాక మాడు చిప్ప పగిలిందే అనుకుందాం. అందులో విశేషమేమిటి? తరువాత రాముడిని వదిలేసి సీత దొర్లుకుంటూ కిందకు రావడమేమిటి? మొత్తం మీద మనం పిల్లలకు చెప్ప దలచుకున్న నీతి, సందేశం ఏమిటి? తెలియకుండా ఉంది. నా కూతురును అడిగాను, మీకు ఈ గేయాలు అన్నీ ఉన్నాయా అని. మాది అంతా యాంత్రికాభ్యసనం అని కొట్టి పారేసింది.
అదే ఒక వేమన శతక పద్యాన్ని తెలుగులో బద్దెన విరచిత ‘సుమతీ శతక’ పద్యాన్ని పిల్లలకు చెప్పినట్లైతే దాన్ని జీవితాంతం వాళ్లు గుర్తుంచుకుంటారు. దాంట్లో నీతితో కూడిన ఒక సందేశ ముంటుంది.
ఉపకారికి ఉపకారం
విపరీతం కాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారం
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
ఇలాంటి సందేశాత్మకమైన నీతి పద్యాలు పిల్లల భావి జీవితంలో వారికెంతగానో తోడ్పడతాయి. వారి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడానికి ఉపకరిస్తాయి. చైతన్యాన్ని కల్గించి జీవిత విలువల్ని ఉద్బోధిస్తాయి. నీతిని నేర్పే నుడి సుడి మనది. భారతీయ సంస్కృతిని స్థాయిని, ఔన్నత్యాన్ని తెలిపే మన ‘అమ్మనుడి’ మనకు తలమానికం. మన జాతి యొక్క పాటను, ఆటను, అలవాటును, ప్రత్యేకతను, ఉన్నతిని భాషే తరువాతి తరాలకు చేరుస్తుంది. భాష లేకుండా ఏ జాతి సంస్కృతినైనా మనమూహించలేము. తూర్పు బెంగాలులో ఉర్దూ పెత్తనం ఎక్కువైనుడు తమ భాషను కాపాడుకోవడానికి వారు తమకు వేరే దేశం కావాలని పోరాడి, గెలిచి బంగ్లాదేశ్ ను సాధించుకున్నారు. భాష ముందు మతం లొంగిపోయింది. దాసోహమంది.
నేడు ఆడవారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి. స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మనం తెలుగు నేర్పకపోవడం వల్ల స్త్రీల పట్ల మనవారి మనస్తత్వం వైరుధ్యంగా మారి పోయింది. యాసిడ్ దాడులు, కుత్తుక కోయడాలు, ఆత్మహత్యలు, విడాకులు, భార్యా పిల్లల్ని చంపే నేరాలు, ఘోరాలు చూడాల్సి వస్తుంది. తల్లి నుడిలో మనం చదువు నేర్పక పోవడం వల్లనే ఈ పరిస్తితి దాపురించిందని ప్రొ.గారపాటి ఉమామహేశ్వర రావుగారు సూత్రీకరించారు. మనదైన సంస్కృతిని మనం పిల్లలకు నేర్పక పోవడం వల్ల మన తెలుగు ద్వారా విద్యా విజ్ఞానాలను అందించకపోవడం వల్ల, మన జాతి ఔన్నత్యాన్ని ప్రగతి మూలక సందేశాలను నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణలను, ప్రేమాప్యాయతలను, మమతానురాగాలను, బాంధవ్య బంధనాలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను, మహా పురుషుల త్యాగ ఫలాలను, సంఘ సంస్కరణ ఫలితాలను, మన తరువాతి తరాలకు చేరవేయలేక పోతున్నాం. జాతి నిర్వీర్యమై పోతుంది. కాబటత్టి తెలుగు మృతభాష అయితే తెలుగు వారిదైన సంస్కృతి కూడ చచ్చిపోతుంది. తెలుగుతో పాటు తెలుగు వారి విజ్ఞానం కనుమరు గవుతుంది. భావితరాలల్లో తెలుగు మాట్లాడే వాల్లుండరు. తెలుగు సంస్కృతి రూపురేఖలుండవు. తెలుగు వారిదైన జ్ఞానం ఉండదు. తెలుగు వారి వైభవోపేతమైన చరిత్ర ఉండదు. సంప్రదాయాలు అలవాట్లు, ఆనవాళ్లు ఉండవు. అంటే తెలుగు జాతి చచ్చిపోతుంది. తెలుగు భాష మృతభాష అవుతుంది. ఇది సత్యం, తథ్యం.
చెన్నై ఐ.ఐ.టి.లోని న్యూరో సైన్సు ఆచార్యుడు డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి తెలుగులో అపారమైన శబ్దపుష్టి ఉంది. కాని పదాలను వాడకపోతే అవి పువ్వుల్లా వడలిపోయి రాలిపోతాయి అని నుడివారు.
చచ్చే భాష లక్షణాలు ఏమిటి? తెలుగే గొప్ప భాష. తెలుగువారి ఆత్మ న్యూనతా భావం. మత భాషలు, తెలుగు, తెలుగుపై ఇతర భాషల దాడులు, ఇప్పుడేం చేయాలి? అనే ఏడు కణుపులు (అధ్యాయాలు)గా ఈ పుస్తకంలో విపులమైన వివరణలు ఇచ్చి పాఠకుల్లో పారుపల్లి కోదండ రామయ్య గారు చైతన్యాన్ని రగిలించారు. సవివరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం మన పిల్లలకు పోతన, నన్నయ, తిక్కన, ఎర్రన, వేమన, బద్దెన పేర్లు తెలియవు. రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి పంతులు గారి గురించిన వృత్తాంతాలు అసలే తెలియవు. అంతా అయోమయం, అంధకారం. తెలుగు భాష దైన్య స్థితికి బాధ్యులెవరు? చదువు రాని ప్రజా ప్రతినిధులా? పనికిరాని ప్రభుత్వాలా? నిర్లిప్త వైఖరిని ప్రదర్శించే పాలకులా? అధికార దర్పంతో ఊగిపోయె ఉన్నతాధికారులా? అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, పుణ్యానికి వచ్చిన పురస్కారాలు తీసుకుంటూ ఏ రోటికాడి పాట ఆ రోటి కాడ పాడుతూ తిరిగే కవులు, రచయితలు, కళాకారులా? లక్షలల్లో ప్రజాధనాన్ని దోచి దోపిడీ చేసే ప్రైవేటు విద్యాసంస్థలా? విద్యామంత్రుల నిర్ణయాధికారాల సదస్సులా? ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం తెలుగు భాష అతీగతీ ఎవరికీ పట్టడం లేదు. ”అంగట్లో అవ్వా అంటే ఎవరికి పుట్టినవు బిడ్డా” అన్నట్లుంది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే తెలుగు భాష మృతభాషయై కనుమరుగవడం ఖాయం!
ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయం వారు రెండు రాష్ట్రాలలోని 230 బడులల్లో మూడు ఏండ్లు పరిశోధన చేసి తెలుగును చదువుతున్న పిల్లలకే ఆంగ్లం బాగా వస్తుందని తేల్చి చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్లుగా మీ భాష నేర్చుకోకపోతే మా భాష మీకు ఎప్పటికీ రాదని తేల్చి చెప్పారు. మాతృభాషలో చదువుకొంటున్నప్పుడు మెదడులోని ”నియోకోర్టేక్స్” విశేషంగా స్పందిస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో సూక్ష్మబుద్ధి, కొత్త ఆలోచనల్ని వ్యక్తీకరించగల సామర్థ్యం వృద్ధి చెందుతాయని డాక్టర్ అశోక్ పంగారియా పూర్వాధ్యకక్షులు ఇండియన్ అకాడమీ న్యూరాలజీ తెలిపారు.
మాతృభాషను మరిచిపోయిన సమాజం సృజనాత్మకతకు సుదూరంగా ఉండి పోతుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు.
కొఠారీ కమీషన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని పాటించి మన దేశ భాషా విధానాన్ని స్పష్టీకరించింది.
గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూరు మాతృభాష మాతృస్తన్యం, పరభాష పోతపాలు, డబ్బా పాలు, ఆయా పాలు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
ప్రపంచ దేశాల్లోని విద్యావేత్తలు, మనో వైజ్ఞానిక తత్త్వవేత్తలు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి, సమగ్ర మూర్తిమత్వానికి నాంది ‘మాతృభాష’ యని నొక్కి వక్కాణించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజగోపాలాచారి మొదలైన ప్రముఖ వ్యక్తులు పాత రోజుల్లో తెలుగు చదివిన వారే. తరువాత ఆంగ్లాన్ని చదివి అందులో కూడ అందెవేసిన చేయి అనిపించుకున్నారు.
బెజవాడలో సబ్ కలెక్టరుగా పని చేసిన రహమతుల్లా గారు ”తెలుగు దైవభాష” అని ఒక పుస్తకమే రాశారు.
బ్రిటిషు మహారాణి కాళ్లను పట్టుకొని దండం పెట్టి ఇంటికి పోయి మీ మాతృమూర్తిని కాలితో తంతారా? ఇదెక్కడి సంస్కృతి? ఇదేమి సంస్కారం? అన్యభాషల దాడికి తెలుగు భాష నేడు విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సంఘర్షణ వాతావరణంలో, సంకట పరిస్థితుల్లో తల్లి భాష తెలుగును పరిరక్షించుకోవడం ప్రతి తెలుగు వాడి ప్రథమ కర్తవ్యం.
