కవికోకిల బిరుదాంకితుడు,వనకుమారి,జలదాంగన,కృషీవలుడు మొదలగు కావ్యాలను రచించిన ఉత్తమ కవి.
” కవిత్వతత్త్వ నిరూపణము” అను ఆలంకారిక కావ్యాన్ని రచించిన లాక్షణికుడు.తన ఖండకావ్యాలలో కొన్నింటిని ఇంగ్లీష్ లో ” వాయిస్ ఆఫ్ ది రీడ్” గా ప్రకటించి ఆంగ్లంలో కూడా ఘనతను వహించిన కవిపుంగవుడు దువ్వూరి రామిరెడ్డి.
తెలుగు సాహిత్య నందనోద్యానం లో ఆవిర్భవించిన కవితా కుసుమం రామిరెడ్డి గారు 9-11-1895 సంవత్సరంలో గూడూరులో జన్మించారు.పాఠశాలలో చదువుకోవడం తక్కువే అయినప్పటికీ స్వయం కృషితో ఇంగ్లీష్, ఫ్రెంచ్ ,లాటిన్, జర్మన్,బెంగాలీ,పర్షియన్,ఉర్దూ,తమిళం,సంస్కృతం నేర్చుకున్న బహుభాషావేత్త.చిత్రలేఖనం,శిల్పం,ఫోటోగ్రఫీ,రేడియో ఇంజనీరింగ్ అన్నింటిలో తన ప్రతిభను చాటుకున్నారు.తెలుగు సాహిత్యంలో పద్యాలు రాయడమే కాక వచనంలో కూడా లయబద్దత ఉంటుందని నమ్మేవారు. అభ్యుదయ,భావ,మాతృ దాస్య విముక్తి,దేశభక్తి గీతాలు,,కర్షక సాహిత్యం,నాటకాలు,అనువాదం అనేక ప్రక్రియల్లో రచనలు చేసి అందరిని మెప్పించిన కవి రామిరెడ్డి. 1929 సంవత్సరంలో బెజవాడ ఆంధ్ర మహాసభలో “కవికోకిల” గా బిరుదు ప్రదానం ,నెల్లూరు రెడ్డి జనసంఘం వారి “స్వర్ణ పతకం”,విజయనగరం మహారాజా స్థానంలో వనకుమారి కావ్యానికి అందుకున్న నగదు పురస్కారం రామిరెడ్డి గారి సాహిత్య ప్రతిభకు తార్కాణం.
ఇంత ప్రముఖ కవి సాహిత్య కృషీవలుడు 11-9-1947 సంవత్సరం అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాకే స్వేచ్చా భారతాన్ని చూసి కన్నుమూశారు.
రామిరెడ్డి గారికి మిత్రులు,సమకాలికులు వ్రాసిన లేఖల్లో, మిత్రులకు రామిరెడ్డి గారు వ్రాసిన లేఖల వల్ల విశేషాలు తెలుసుకోవడానికి వీలుంది.
తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారికి రామిరెడ్డి వ్రాసిన లేఖ వల్ల రామిరెడ్డి జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.పందొమ్మిది సంవత్సరాల వయసులో బ్రతుకులో జరిగిన ఒక సంఘటన వల్ల కవి అయ్యాడని,ఏ క్షణంలో కవిత్వం హెచ్చరిక చేయకుండా వదిలి పోతుందేమోనని భయం కలుగుతుందని వ్రాశాడు.
వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాల్లో శ్రద్ధ చూపించే వాడినని చెప్పుకున్నాడు.
1911 సంవత్సరంలో విజయనగరం మహారాజా వారు నడిపిన కావ్య రచనా స్పర్థలో నా ” వనకుమారి” సాధించిన ప్రథమ స్థానమునకు చిహ్నముగా ఐదు వందల రూపాయలు బహూకరించిరి”. అని వ్రాయడం వలన ఆ కాలం కవుల్లో రామిరెడ్డికి గల స్థానాన్ని ఊహించవచ్చు.
తెలుగులో కవిత్వం వ్రాయడమే కాక ఆయన కవిత్వాన్ని ఇంగిలీషులో అనువాదం చేయడం వల్ల రామిరెడ్డికున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం,అంతర్జాతీయ స్థాయిలో రామిరెడ్డి పొందిన గౌరవస్తానం ఈ లేఖ ద్వారా విదితమౌతుంది. ^బ్రిటిష్ ఎంపైర్ ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్రీ” ( బ్రిటిష్ సామ్రాజ్య దేశాలందు రచింపబడిన ఇంగ్లిష్ కవిత్వ సంపుటము) లో నా పద్యములు మూడు ప్రకటింపబడినవి.విదేశీయులైన కవిత్వ సంకలన కర్తలు తెలుగుకవి నొకనిని గౌరవించుట యిదే ప్రథమమేమో! డా.జేమ్స్ కజీన్సు గారు’ సమదర్శన’ యను తమ గ్రంథమందు ” భారతీయ భాషా కవిత్రయము” అను భాగమున మహమ్మద్ ఇక్బాల్ ను,పురాణ సింగ్ ను,మరి నన్ను గురించి వ్రాసిరి.ఇంగ్లీష్ కవిత్వ ఛందోరీతులలో కాక,సేవ కల్పించుకొనిన స్వచ్ఛంద కవిత్వ రచనా నిర్మాణ కౌశలమును,నా స్వతంత్ర భావనాశక్తిని వారు మెచ్చుకొనుచు ” అమెరికాలో వుత్పత్తి చేయబడుచున్న దానికంటె ఎన్నో మడుగులు యిది హెచ్చయినది.” అని వ్రాసారు. శివశంకరశాస్త్రి గారికి లేఖ వ్రాయడం వల్ల వ్యక్తిగత విషయాలు,ఆయన గడించిన అంతర్జాతీయ ఖ్యాతి మొదలగు విషయాలు తెలుస్తున్నాయి.తెలుగు కవుల్లోనే కాక భారతీయ భాషా కవిత్రయం లో ఒకడుగా రాణించి తెలుగు సాహిత్యానికే వన్నె చేకూర్చాడు రామిరెడ్డి.
తెలుగు భాష పట్ల గౌరవం,అనురాగం రామిరెడ్డికి ఎక్కువ అనే విషయం’ జగత్పతి’ గారికి వ్రాసిన లేఖ ద్వారా విదితమౌతుంది.పరాయిపాలనలో తెలుగుభాషకు గౌరవం లేదని బాధపడాల్సిన అవసరం లేదని” ఆంధ్ర్స్ కావ్యము చేత బట్టుట అవమానకరమనుకొన్న దుర్దినాలు గడిచిపోయినవి.” అని అంటూనే
” మన పోతన,తిక్కన, శ్రీనాథాఫై మహాకవుల కంటె మిల్టన్,షెల్లీ,కీట్స్ చాలా గొప్పవారను అజ్ఞాన విలసితమైన అపోహ అంతరించినది.మాతృభాషపై మమత హెచ్చినది. “సత్కవి యద్యప్తి రాజైన కిమ్’ అన్న కవితా సామ్రాజ్యము పునః ప్రతిష్ఠితమైనది.తెలుగు తేజము,తెలుగు కత్తి, తెలుగు నుడికారము,తెలుగు నేల అను మాటలు ప్రతి విద్యార్థి నాలుక కొనన నృత్యము చేయుచున్నది.” అనడం వల్ల ఆ కాలంలో తెలుగుభాష తెలుగుదేశంపై గల అభిమానం వ్యక్తమౌతుంది.
రామిరెడ్డి గారి కావ్యాలను చదివి ప్రముఖ సాహితీవేత్తలు,మిత్రులు తమ అభిప్రాయాలను లేఖాముఖంగా తెలిపారు. వేదం వేంకటరాయ శాస్త్రి గారు వనకుమారి,జలదాంగన, కృషీవలుడు గ్రంథాలను చదివి
“కవితా బీజమయిన ప్రతిభ నాకు గోచరించినది.శబ్ద సౌష్టవ ప్రణవత్వము గూడ నగపడుచున్నది.అనియు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ” చక్కని భావములు,శైలియును నిగ్గుదీరియున్నవి.” అనియు గిడుగు రామమూర్తి గారు ” గ్రంథ కర్త సంప్రదాయ సిద్ధములగు పద్ధతులనుండి స్వతంత్రించి కాలమునకు తగిన మార్గమున పద్యములు వ్రాయ ప్రయత్నిస్తున్నారని విని చాలా సంతోషించినాను.” అనియు రాజమన్నారు గారు కవిత్వ తత్త్వ నిరూపణము అను కావ్యంపై ” మీ యీ కృతి ఆంధ్రభాషకు వన్నె పెట్టగల పువ్వు.కేవలము ప్రత్యేక కవులపై విమర్శలు దక్క మన భాషయందు కావ్య స్వరూప నిర్ణయము గాని ,రసతత్త్వ విచారము గాని లెనేలేవని చెప్పవచ్చును.అట్టి పనికి మీరే పూనుకొని నిర్వర్తించినది ఆంధ్రభాష భాగ్యము.” అనియు కీర్తించారు.కాలంతో పాటు కవితా రీతుల్లోను మార్పును ఆశించి నూతన ఫక్కీలో కావ్యాలను రచించి పలువురి ప్రశంసలను పొందిన గొప్పకవి దువ్వూరి.ప్రత్యేకంగా వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేప్పట్టిన గిడుగు వారు కూడా కాలానికి తగ్గట్టు స్వతంత్రగా వ్రాసే పద్ధతిని ప్రయత్నం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వ్యావహారిక భాషా వాదులు గిడుగు రామమూర్తి పంతులు తన పత్రికలో ” కృషీవలుడు, జలదాంగన కావ్యాలను సమీక్ష చేయడానికి అభ్యంతరం లేదని,వాటిలో నిజమైన కవిత్వమున్నదని అంటూనే ” వ్యక్తంగానో,అవ్యక్తంగానో కవి వాడుకలో లేక గ్రంథములందే నిలిచిన పదాలను ప్రయోగించడం చూచి నాకు విచారము కలిగింది. వీటిలో కొన్నిటిని యిటీవల డాంబిక పండితులే సృష్టించినారు”. అని లేఖ ద్వారా వెల్లడించారు.కొత్తదనంతో రాయడానికి ప్రయత్నించినప్పటికీ గ్రాంథిక పదాల వాడకంపై కొద్దిగా మనసు నొచ్చుకొన్నట్లు తెలుస్తుంది.
దువ్వూరి తెలుగు వారి చేతనే కాక పాశ్చాత్యుల చేత కూడా ప్రశంసింపబడ్డాడు.జె.హెచ్.కజిన్స్ గారు రామిరెడ్డికి రాసిన ఉత్తరాల్లో రామిరెడ్డి ఆంగ్లంలో రాసిన పద్యాలను మెచ్చుకుంటూ భారతీయులు రాసిన ఇంగ్లీషు కవిత్వమునకు ఉపోద్ఘాతములు వ్రాయకూడదను నా నియమమును మీ పుస్తక విషయమున ఉల్లంఘించుటకు సంతోషించుచున్నాను.మీది యీ పద్దున పడదు.మహోత్తమమైన దేశభాషా కవిత్వమునకు ఇది ఆహ్లాదకరమైన అనువాదము.తొలిపలుకులలో దానిని పరిచయముచేయ సంతోషింతును.” అనడం వల్ల రామిరెడ్డి కవితా వైశిష్ట్యం వెల్లడవుతుంది. కజిన్స్ గారే రామిరెడ్డికి రాసిన ఇంకో లేఖలో ” నేనొక ఉపోద్ఘాతమును గూడ చెప్పితిని గాని యిది ముందుగా వెల్లడి చేయగూడదు.మీ కావ్యము తన గుణముల మీదనే ఆధారపడి నిలువవలెను .నిలువగలదు ” అని స్తుతించారు.ఉపోద్ఘాతము కానీ,ముందుమాట కానీ రాసి పాఠకులకు ప్రోత్సాహాన్ని కల్గించాల్సిన అవసరం లేక సహజంగా కావ్యం గుణవంతమైనప్పుడు పాఠకులు మనస్సులో తనదంటూ ఒక ముద్రవేసుకొని గౌరవాన్ని పొందుతుందని పరోక్షంగా కావ్యగుణాన్ని పొగిడారు.
సమాజాభ్యుదయంలో నాటక రంగానికి చాలా ప్రాధాన్యమివ్వబడింది.బళ్ళారి రాఘవ గారు రామిరెడ్డికి రాసిన లేఖలో ” ప్రేక్షకుల దృష్టిని బట్టి నాటకానికి విలువ” వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రేక్షకులను ఆనందింపజేసేదే ఉత్తమ నాటకం.సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా నాటక రచనలో వైవిధ్యము ఉండాలని
” రాజమన్నారు గారు రచనల్లో ఎక్కువశాతం ” జమీందారీ భూములకు సంబంధించిన అంశాలు ఏకాంక నాటకాలతోనే తృప్తి పడ్డారని విమర్శించారు రాఘవ.
కవిత్వం తెలిసినవారికంటే ఏవో టెక్నిక్ లు చూపించి,పలుకుబడి కోసం తాపత్రయపడే కవులు ఎక్కువ వున్నారనే విషయం జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి లేఖ వల్ల విదితమౌతుంది. ప్రజ్ఞ ఉన్నవారు మూలబడుతున్నారు.ప్రజ్ఞ లేని వారు ఉన్నత పీఠాన్ని అధిరోహిస్తున్నారు.ఇటువంటివి అంతరిస్తేనే ” ఆంధ్ర ప్రతిభ వెలిగిపోతుందని ఆకాంక్షించారు.ప్రతిభ వున్నా అండదండలు లేకపోతే రాణించడం కష్టమని సమాజ వ్యవస్థను తెలియచేశారు.ఆనాటి సమాజంలోను ఇదే దుస్థితి.మస్కాకొట్టే వారికి ఎప్పుడైనా పెద్దపీటే నాడైన, నేడైనా.
వేణుగోపాల్ రాసిన లేఖలో ఆనాటి సామాజిక పరిస్థితి విదితమవుతుంది.” చదువురాని తెలుగు ప్రొఫెసర్లు విశేషము సకల కళాకోవిదులనిపించుకొనుట సంప్రాప్తిఞ్చి గర్వమెక్కిపోవుట చేత బ్రిటిషు ఆంధ్ర రాష్ట్రములో నుండి పెద్దవారలను పిలిపించి యిక్కడ వారి గర్వమణచవలయుననియు,వారికేమి రాదని ప్రజలలో అభిప్రాయము కలుగ జేయవలయునని యెంచి అనేక మందిని పిలిచి పెద్ద పెద్ద సభలు చేయవలెనని ఆలోచన ఉండడం వలన ఒకరిమీద ఒకరికి పడకపోవడం,దానివల్ల ఏదో నిందవేసి గర్వమణచే ప్రయత్నాలు చేయడం, ద్వేషభావ వాతావరణం కనిపిస్తుంది.
రాజకీయ నాయకుల మనస్తత్వం,వారు వ్యక్తిత్వాన్ని కాపాడుకొన్న విధానం,అసలు ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా వుండాలో నిరూపిస్తుంది బి.గోపాల్ రెడ్డి గారి లేఖ. మంత్రి పదవి పొందిన గోపాల్ రెడ్డి గారు
” గౌరవాదికములుగల హోదాయనికాక,బాధ్యాతాయుతమైనది…లాఠీకి ఎదురొగ్గి చెఱసాలలో మ్రగ్గిన అజ్ఞాతుడూ,అనామధేయుడూనయిన స్వచ్ఛంద సేవకుని ప్రతినిధిగా నేనిక్కడ వున్నాననే విషయమెప్పుడూ మరువను.” అని రాశారు.నిస్వార్థంతో ప్రజలకు స్వచ్చందమైన సేవ చేసేవారని,పదవి రాగానే ఉబ్బిపోక బాధ్యతాయుతంగా భావించేవారని తెలుస్తుంది.ఈ కాలంలో వలె ఓటు కోసం మాయమాటలు చెప్పి అధికారం రాగానే ఓటు వేసిన ప్రజలనే మరచి,ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మరచి,స్వార్థంతో ధనాకాంక్షచూపే ప్రజా ప్రతినిధులు ఆకాలంలో తక్కువన్న నిజం వ్యక్తమౌతుంది. నిష్కల్మషమైన రాజాకీయా వాతావరణం ఉండేది అని భావించవచ్చు.
రామిరెడ్డి ఆవంత్స రంగారావు గారికి రాసిన లేఖలో అనువాద ప్రక్రియ గురించి తెలిపారు.
” ఒక్క విషయము మీరు చక్కగ జ్ఞప్తికి పెట్టుకొనవలయును.మనకు సంప్రదాయ సిద్ధములైన కొన్ని యుత్ప్రేక్షలు,ఉపమానము ఇంగిలీషులోకి తర్జుమా చేయబడినప్పుడు ఆ భాష ప్రతిభననుసరించి చాలా నీరసములుగను, మెకానికల్ గను అగుపడును.ఇంగిలీషు భాషలోకి
తర్జుమా కాబడవలసిన కవిత్వమునందు యూనివర్సల్ అప్పీల్ వుండవలయును.అట్టివే ఏరుకొనిన బాగుగనుండును.ఇంగ్లీషులోని భావములు తర్జుమా చేయగలమేగాని మన సంప్రదాయము ననుసరించి ఆ భావముల నావరించిన ‘అట్మాస్ఫియర్ ను’ తర్జుమా చేయలేము.అందువలన పద్యములు కొన్ని తర్జుమాలో మూలములో నుండినంత ఆహ్లాదకరముగ నుండుటలేదు.నేనీ రహస్యముతో టాగూరు తర్జుమా చేయబడినది. చేయబడినది అందువలన అది చాల విచిత్రమైన రమ్యమైన భావానువాదముగా ఏర్పడినది.ఇట్లు చేయుట… లో కనిపెట్టితిని మూలములో మూడు పేజీలు ద్విపద ” ఫిలాసఫర్స్ స్టోన్’ అని తర్జుమా చేయబడినది. ఇట్లు చేయుట ఇంగ్లీష్ చదుకున్నవారి మనస్తత్వమున కనుకూలముగ కొంత కన్ సెషన్ చూపినట్లగును.తెలుగువారికి ఇంగిలీషు అనువాదములు అవసరము లేదు ఎవరికి అవసరమో వారికి యూనివర్సల్ అప్పీల్ వుండిన పద్యములు ఏర్పరుచవలెను ” ఒక భాషలో నుండి వేరే భాషలోకి అనువాదం చేయడం ఎంత కష్టమో అనువాదం చేయాల్సినపుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాడు. అనువాదం చేయవలసి వచ్చినప్పుడు ఎటువంటి విషయాన్ని ఎన్నిక చేసుకోవాలో,ఇంగిలీష్ భాషలోకి అనువాదం చేసిన కవిత్వంలో సార్వజనీన దృష్టి వుండాలంటారు. ఆ భాషా సంప్రదాయాన్నానుసరించి ఆ భాషా భావాలనావరించి ఉన్న వాతావరణాన్ని తర్జుమా చేయలేము.ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి అనువాదం చేసేప్పుడు ,భావాన్ని మాత్రమే చెప్పగలరు.తన తెలుగు కావ్యాలను ” వాయిస్ ఆఫ్ ది రీడ్” గా ఇంగిలీషులోనికి అనువాదం చేసినవారు కావడం వల్ల అనువాదం చేయడంలో గల కష్ట నిష్ఠూరాలను వ్యక్తం చేశారు.అనువాదం చేయదం కూడా ఒక కళే. భావం దెబ్బతినకుండా అనువాదం చేస్తే అనువదింపబడిన భాషలో కవిత్వాన్ని చదివినవారు స్వభాష వలె కవిత్వం ఆనందాన్ని అనుభవించగలుగుతారు.అనువాద ప్రక్రియ ఎంత కష్టతరమైందో అనుభవపూర్వకంగా వివరించారు.
దువ్వూరి రామిరెడ్డి లేఖలవల్ల ఆయన కవితా ప్రతిభ,అనువాద విధానం, నాటకాల సార్థకత అనే విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి.
తెలుగు సాహిత్యంలో అందరిమన్ననలు పొందిన బముముఖ ప్రజ్ఞాశాలి,బహు భాషా కోవిదుడు దువ్వూరి రామిరెడ్డి సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని స్థిరపరచుకున్నారు.
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి