సాయి,తేజ బడి నుంచి రాగానే నాన్నమ్మ, తాతయ్య దగ్గరకు పరుగు తీశారు.
నాన్నమ్మా–నానమ్మా ! “ఓ మంచి కథ చెప్పవా”! అంటూ బుద్దిగా కూర్చున్నారు.
“అలాగే చెపుతానురా! శ్రద్ధగా వినాలి మరి” అంటూ చెప్పుకొచ్చింది నాన్నమ్మ. ఓ కాకమ్మ కథను.
ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న పసిబిడ్డ లాంటి చల్లని పల్లె ఆ ఊరు.పచ్చదనానికి పెట్టింది పేరు.
ఊరి పొలిమేరలో ఉంది పురాతన కాలం నాటి శివాలయం.
ఆ ఆలయ ప్రాంగణంలో గున్న మామిడి చెట్టు మీద తన పిల్లలతో కాపురం వుంటుంది ఓ కాకమ్మ.
ఆకసమంతా విహరించి తన పిల్లల కోసం ఆహారం సేకరించి తినిపిస్తుంది.
ఓ రోజు ఆ చెట్టు కిందికి వచ్చింది ఓ నక్క.
ఆత్మీయంగా మిత్రున్ని ఆహ్వానించింది తన రెక్కల రెప రెపతో కాకి.
ఇంకేముంది–తన సహజ స్వభావానికి
పదును పెడుతూ– మిత్రమా ! అంటూ ప్రేమగా పిలిచింది. కుశల ప్రశ్నలు అడిగింది నక్క.
నీ మధుర గానంతో నాకు వినుల విందు చేయమని కోరింది.
“నేనా!” అంటూ సంశయం వ్యక్తం చేసింది కాకి.
నీవే! నీవెవ్వరు? కోకిలమ్మ ఇంటి పంటవు.
పుట్టింటి గళ మాధుర్యం ఎక్కడికి పోతుంది అంటూ ప్రశంసల జల్లు కురి పించింది.
నోటిలోని ముక్కను కాళ్ళ మధ్య పెట్టుకొని రాగాన్ని అందుకుంది కాకి.
నీ గాన మాధుర్యానికి నేను మై మరిచిపోయాను.
ఓసారి నాట్యం కూడా చేయవా ! అంటూ మరో ఎత్తుగడకు సిద్ధ మయ్యింది
ఓ అదెంత భాగ్యం! ఆడుతూ పాడుతాను. పాడుతూ ఆడించగలను అంటూ తన కాళ్లలోని మాంసం ముక్కలు చెట్టు కొమ్మల్లో పెట్టి ఆ రసాలసాల వేదికపై తన గాన కచేరి చేసింది.
నీ గానం, అభినయం అద్భుతం మిత్రమా!
మరి!
నేను వస్తాను! అంటూ మరో ప్రణాళికను రచించడానికి దారి వెతుక్కుంటూ ముందుకు సాగింది నక్క.
నీవు ఎందుకు వచ్చావో! నాకు తెలుసు అనుకుంది మదిలో వాయసం.
మిత్రమా! మిత్రమా– కారణం ఏదైనా- నీవు నా ఇంటి ముందుకొచ్చిన ఆత్మీయ అతిథివి.
అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. అంటూ తన పిల్లల కోసం తెచ్చిన ఆహారంలో ఓ నాలుగు ముక్కలు కిందకు వేసింది.
మిత్రమా! మోసం,ద్వేషం అపజయానికి సోపానాలు.
ఇచ్చిపుచ్చుకునే లక్షణమే స్నేహాన్ని కలకాలం నిలుపు తుంది సుమా!
మనలోని అనైక్యత మరొకరికి బలం కారాదు.
ప్రేమకు, విశ్వాసానికి, నిజాయితీకి, మానవులకు మనమే ఆదర్శం.
ఒకరి కష్టానికి ఒకరం ఆసరాగా నిలబడటం జీవితేచ్చను పెంచు తుంది.
మిత్రమా! నీకు నేనున్నాని ఏనాడు మరువకు–
అంటూ రివ్వున ఆకసాన ఎగిరింది వాయసం.
కృతజ్ఞతా పూర్వకంగా వాయసం ఎగిరిన వైపే చూస్తున్నది జంబూకం.
నాన్నమ్మ ! ఈ కథను తాతయ్య మరోలా చెప్పారు తెలుసా!అన్నారు పిల్లలు. అవును! నాన్న
కాలం మారింది.
ఈ కథను మీరు మరోలా చెప్పే ప్రయత్నం చేయండి. చూద్దాం అంది నానమ్మ.
అలాగే? నాన్నమ్మ.
ఈ “కథ మాత్రం చాలా బాగుంది ! అంటూ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు.