రాఘవాచార్య
రాఘవాచార్య
రంగప్రసాద్ అపార్ట్మెంట్
ప్రముఖ కవి
రిటైర్డ్ ప్రాధమిక ప్రధానోపాధ్యాయులు
ఎం ఏ తెలుగు ప్లాట్ నెం 403 \ A
శేరి లింగంపల్లి
హైదరాబాదు - 500019
చరవాణి +91-8790593638
బరువులు దించుకున్న తట్ట
రాత్రంతా బోర్లపడో వెల్లకిలనో అడ్డదిడ్డంగానో నిద్రిస్తున్నట్లే పడి పోయి ఉంటుంది
తెల్లారితే చాలు
నిండా ఇటుకలు నింపుకుని
శ్రమపడుతునే ఉంటుంది
రికం లేదు
ఆకలి చల్లారని పొట్టకోసం
బరువులు నింపుకుని
తనను తల పైకి ఎత్తుకునే బాల కార్మీకుల చూసి బాధగా తట్టకు తట్టుకోలేని పది తట్టలంత దుఃఖం
మళ్లీ మళ్లీ కింద మీద పడుతూ
తట్టకు పొద్దు పోయే వరకు బరువులు మోసుడే !
అల్కగా ఉన్నా పనిలోకి దిగితే
బరువు బరువే!
జీవిత కాలమంతా శ్రమిస్తునే ఎత్తుల నుండి పడి ముక్కలు ముక్కలుగా కూలీకి పనికి రాకుండా తట్ట వైకల్యం వైకల్యం !
తల పై ఉంటే తట్ట చివరకు మక్కల కుప్ప
నిర్వాసితుల పొయ్యి కిందకో
చలి మంటల్లో పడో అడ్రసు లేకుండా పొగ పొగ.
కాలుస్తునే ప్లాస్టిక్ వాసన అంటూ ముక్కు మూసుకుంటారు మనుషులు !
“ప్లాస్టిక్ తట్టనైన నన్ను కాలుస్తూ
పర్యావరణ ప్రమాణాన్ని
పదిలం కాకుండా చేస్తారు!”
దుమ్ము దుమ్ము అనాథ ఒంటరి శ్రామికుడిలా తట్ట గుర్తింపు లేకుండా బూడిద బూడిద
తట్టంత బూడిద !
పిడికెడు అటుకుల గురించి
కలుపు గొలుపుగా దోసెడు మాటలు
మునుపు తాత ముత్తాతలు సంచారం పోతే
మూటలోని అటుకులే తోవలో కడుపుకు ఆసరా
తియ్యని వాగూ నీళ్లే గొంతులో
అమృత ధారాపాతం !
ఆగని నడకకు అటుకులే
బల అతిబల మహాబల !
సామాన్యుల అసామాన్య ఆహారం అటుకులే
కొద్ది కొద్దిగా కాదు నమిలినా కొద్ది
ఆస్వాదనగా రుచి రుచి !
దంపుడు అటుకులైతే
ఎంత తిన్నా దంగేవి కావు !
అంచుకు ఊరగాయ ముక్క
ఊరించే ఉల్లిపాయలు
ఎర్ర కారం కలుపుకుని
పిడికెడు అటుకులు తింటే
పొట్టకు కంచం నిండా పట్టనంత భోజనమే !
అటుకులే కదా అని తీసిపారేయకండి
శ్రీ కృష్ణుడు ప్రీతిగా పిడికెడు అటుకులు తింటే
కుచేలునికి జోలెలో పట్టలేనంత ఐశ్వర్యం
బ్రాండెడ్ అటుకులు !
ఇప్పుటికీ అటుకులు తక్కువేం కాదు
తింటే కడుపు నిండారా ఆయాసంగా ఎక్కువే
బ్రేవ్ బ్రేవ్ బ్రేవ్
పక్క ఊరికి వచ్చినా మా ఊరి
పిట్టలే కనిపిస్తున్నాయి
అవును ! నేను గుర్తు పట్టగలను
కిచ కిచలు నాకు ఎరుకైనా భాషనే మరి !
మా ఇంటి చూరు కింది పిచ్చుకలే
ఇక్కడి చూరుల్లో చేరినట్లున్నాయి
ఆశ్చర్యం ! నాకు తెలువకుండానే
పిట్టలు నా వెంటవచ్చినట్లున్నాయి
నేను బస్సులో
పిట్టలు ఆకాశంలో
చిన్ని రెక్కలకు ఎంత అలసటైందో
సంతనుంచి నూకలు తెచ్చి
పిచ్చుకలకు సంతర్పణ చేయాలి
నాలో పక్షి ప్రేమ గూడుకట్టుకున్నట్లే
అన్ని ఊర్ల పిట్టలు
మా ఊరి పిట్టల్లాగే అనిపిస్తాయి!
చెప్పుకుంటే అంతా హేలనచేస్తారు వికార ముఖంతో
పైన రెట్టలు రాలినట్లు !
వాళ్లు పక్షి ప్రేమికులు కాదన్నట్లే
ఎంత పెద్ద సంక్రాంతి ముగ్గు వేసినా
పిట్టలు ముగ్గుల్లో తిరుగాడితేనే
అది పెద్ద వాకిలి – పిట్టల స్టేడియం
లేకుంటే వాకిలి బోడ బోడ
నిజంగా పిచ్చుకలు ఊర్లో కనిపిస్తేనే
ఆ ఊర్లో ప్రాణాంతక
కాలుష్యం లేనట్లు
అయ్యో ! ఏ పాడు కాలానికైనా
మన పిట్టలు కనిపించకపోతే
ప్రకృతి తల్లి పిచ్చిలేసిపోతుంది
అకాలంగా మనిషి ఉనికికీ ప్రళయం
మనకు తెల్వదు ఊర్లన్నీ
పిచ్చుకలపేర్ల మీదే ఉంటాయి
అందుకే వాటిని ముద్దుగా
ఊర పిచ్చుకలంటారు !
లోపల ఇల్లేమో మనది
ఇంటి ముందు చూరేమో పిట్టలది
అదిగో ! అద్దాన్ని పిట్టలు
ముక్కుతో పొడుస్తున్నాయి
అద్దం కూడ పిట్టలదే
పిట్టల్లేని ఊరు పుట్ట కిందికి జమ
పిట్టలుంటేనే ఊరు
ఊరు పిట్టల జాగీరు
మనిషికి ముఖం ఉన్న దొకటే
ముఖంలో ఒకసారి విచారం
మరోసారి ఏడ్పు
మాటిమాటికి మాట మాటకు రంగులు మారే ముఖం
ఒక్క ముఖం పై ఎన్ని తెరలు తెరలో
రాత్రి కన్నులు మూసుకుంటే నిద్ర ముఖం
నువ్వు ఏది ఆలోచిస్తే అది ముఖం పై చెంపపెట్టే
పేరుకే పెద్ద ముఖం
కాని నవ్వు ముఖంలోకి రావడం అంటే కష్టమే
అద్దంలో చూసుకుని కావాలని నవ్వితే
అది నీ ముఖం కాదు
అద్దం సొంతమే
కారణం లేకున్నా
చిన్న పిల్లలు రోజుకు వందసార్లైనా నవ్వుతారు
బాల్యమే కారణ జన్మ !
అకారణంగానూ ఆనందమే
ఆనందో బాల్యం!
పెద్దలు కారణమున్నా నవ్వి ఏడ్వరు
భేషజం పెద్దరికం
అన్నీ నవ్వుకు అడ్డం దిడ్డం వస్తాయి
సర్కసులో జోకర్
సినిమాలో హాస్య నటులు మన ముఖాలను
నవ్వు ముఖాలుగా మార్చే గొప్ప శిల్పులు !
మహా రాజులు నవ్వడానికి విదూషకులను
ఎదురు బదురుగా ఉంచుకునే వారు
బీర్బల్ కథలు నవ్వు బలం
తెనాలి రామలింగని కథలు
రాయలు సైతం రాయలేన్నన్నీ !
నవ్వు నిజంగా ఆరోగ్యంగా
మన జీవితంలో ధన్వంతరి
ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరిదీ నవ్వు ముఖం కాదు
ఒక్క లాఫింగ్ బుద్ధ తప్ప
అదీ చైనాదే
పెండ్లిలో ఫోటోగ్రాఫర్ వధూ వరులను
నవ్వు ముఖం పెట్టమంటాడు
ఫోటోలోనైనా మనుషులు నవ్వితే ఫోటోలకు విలువ
ఫోటోగ్రాఫరుకు గిరాకి
నా కొడుకు నా కోడలు అంటూ గర్వపడతారు
ఆల్బమ్ ను వందల సార్లు చూస్తారు
అసలు పాలకులు బాగుంటే
ప్రజలందరివీ నవ్వు ముఖాలే
నిజంగా నవ్వు ముఖమే స్వాతంత్య్రంగా మనం
–
879059396
బలమైన పదార్థాలంటూ నా
యోగ క్షేమం వహామ్యహంగా
కొసరి కొసరి తిన్నవన్నీ నేనే
అమ్మ కడుపులో ఉండి
గుట్టు చప్పుడు కాకుండా ఆరగిస్తున్నాను
లొటుకలు వేసుకుంటూ !
ఎంత బరువు పెరిగి పోతున్నానో ఏనుగు గున్నలా!
అమ్మ కడుపులో కాలు మీద కాలు వేసుకుని ఎంత సుఖంగా పెరుగుతున్నానో !
జోర్ దార్ నవాబు దర్జా !
అమ్మకు పాదాలు ఉబ్బుతున్నాయట
ఎంత భారంగా నడుస్తుందో!
నా పాదాలూ నొప్పెడుతున్నాయి
అమ్మకు ఏమైతే నాకూ అదే !
నేను కడుపులో ఉన్నా నాకు
బయటవన్నీ వినిపిస్తునే ఉంటాయి !
నావి పాము చెవులనుకుంటా !
మా అమ్మ క్షేమ సమాచారం
ఎప్పటికప్పుడు నా కెరుకే
దివ్య శ్రవణం నాది
అమ్మ ఒడిలో పడ్డాకా పెద్ద పెరిగి
అమ్మను సుఖ పెడుతాను
అమ్మ కంట నీరు రానీయను
ఉల్లి గడ్డ కూడ కోయనీయను
చిన్న నోరు పెద్ద మాట మరి !
తప్పదు కదా
తప్పు కాదు కదా
బ్రహ్మ దేవుడు ఉపదేశమిచ్చాడు నాకు!
నీకు అమ్మనే బ్రహ్మ
నేను పేరుకే బ్రహ్మ
అమ్మను ప్రపంచ మహా రాణిలా చూసుకుంటాను
కాలు కింద పెట్టకుండా రెడ్ కార్పెట్ పై నడిపిస్తాను
మీకు తెలుసా !
అమ్మలను మనం సుఖపెడితే
నాన్నలకు ఎంత సంతోషమో
– కందాళై రాఘవాచార్య
8790593638
ఆ.వె : శ్రీ సరస్వతి ఇల సింగార రూపమ్ము
వాసర స్థలి నది వాసమాయె
వ్యాస మునులు నిలుప వాసికెక్కెనుగా
పద్యమాయె నీకు పసిడి అందె 1
పశువు వెంట వెళ్లు పసివాడి చూసిన
పలక లేదు బతుకు పలక పలిగె
బాలలకు చదువు బహు బంగారమాయెనా
పద్యమాయె నీకు పసిడి అందె 2
నన్నయ మరి తిక్కన ఎర్రన పోతన
కవుల కలము వెలసి కరుణ గాంచి
నట్లు నను కరుణించు నవ్య రీతిగ కళలు పొంగ
పద్యమాయె నీకు పసిడి అందె 3
వేదవాణి వినగ వెలసె రాయి ఒకటి
వాసరందు చిత్ర వాద్యముగను
రాయి కూడ గట్టి రాగ విధము నేర్వ
పద్యమాయె నీకు పసిడి అందె 4
గంగ అన్ననేమి గోదావరి అన్న
నేమి విద్యరూప నదియె చూడ
ఊరు ఊరు చదువు ఊరునట్లు పద్యమాయె నీకు పసిడి అందె 5
— కందాళై రాఘవాచార్య
8790593638
చోద్యం ! శిక్షలు ఎంతో సరలమై
నేరస్థుడి దోషాలు మాఘవేసినట్లే ఉంటాయి
ముఖం పై ఏ మాత్రం భయం సెగ ఉండదు
రిమాండులు కోర్టులు చెరసాలలూ
కీచకులకు సేదగా ఒయసిస్సులేనేమో
శిక్షా కాలంలోనూ గుడ్లు మాంసం తింటూ
అత్తవారిల్లు వైభవంగా గోవా ఊటిలాగే జైల్లా !!
శిక్షలు ఎంత సుఖమో !
శిక్షా స్మృతులు రాసేవారికి
ఆడ పడుచులున్నారా ??
శోధనగా మా ఆవేదనా ప్రకరణము
అల్లా ! మీ దేశాలలోని శిక్షలే శిక్షలు
అమ్మాయిల పై చేయి వేయడానికి
మరణ భయంతో వెనుకంజ వేసి
అక్కడికక్కడే పక్షవాతం వచ్చి పడిపోతారు
ఖబరస్తాన్ వాడి అడ్రస్
అసలు న్యాయంగా
వీధి వీధికి ఉరితాడు వేలాడుతూ
మదన కామరాజులకు అనగొండ దృశ్యం కావాలి
తల్లులు తమ కొడుకు పెరుగుతుంటే
గల్లీలోని ఉరితాడును
చూపుడు వేలితో ముక్కు సూటిగా చూపించి
గుణ పాఠాలు చెప్పాలి మరి మరీ
వాడికి భవిష్యత్తు దర్శనంగా !!
పగలైతేనేం అర్ధరాత్రి ఐతేనేం
సిక్కు వీరుల్లా మా అమ్మాయిలు
ఎక్కడైనా ఖడ్గాలు ధరించిన
వైనమే వైభవమే కావాలి మరి
స్వీయ చరిత్రకు స్వీయ రక్షణ
తల్లులూ ! వంటింట్లో రుచికరంగా
పరాటాలు చేయడమే కాదు
చేతి వాటంగా కరాటే చేయాల్సిందే
దెబ్బకు సీసా మత్తు దిగి
శాశ్వతంగా మగ పుట్వడిని మరువాల్సిందే
ఇక అమ్మాయి అంటే ఆయుధ పాణిగా
మనకెంతో నిర్భయం నిమ్మలం
పైకి శిశిరం అశుభంగా నియంతగా
చెట్టు చెట్టును ఎండగొట్టినట్లు
దృష్టి దృష్టి దోషం లోకానికి . . .
శిశిరం పాతబడ్డ పండుటాకులను మట్టిలో కలగలిపి
భూమిలో సారం సారం చేసి వేరు వేరుకు అందిస్తుంది
కొమ్మ కొమ్మను చిగురుల ఊయల చేస్తుంది
ఇకేం ! కోయిల వాలి ఊగనే ఊగుతుంది
ఇదంతా ఎవరికి ఎరుకా ??
శిశిరం పై అంతా దోసిల్ల కొద్ది దుమ్ము పోస్తారు
సింగారమైన వసంత ఋతువుకూ తెలియదు
అనామక శ్రామికురాలు శిశిరం
ఎండు ముఖమట
శిశిరానికి ఏ పండుగా లేదు
ఋతు చక్రంలో ఆడంబరం లేక
మంచు తెరలో ఏదో ఒక మూలకు
శ్రమ ఒకరిది
అందలం మరొకరికి
కవులైనా అంతే ! వసంతం పై కవిత్వం చెప్పి
సన్మానాలు చేయించుకుని పేరుకు వస్తారు
శిశిరం పై ఒక్క పద్యమూ అల్లుకోదు
ఎవరికి తెలుసు
అసలు వసంతం అంటే
పేరు మార్చుకుని వచ్చిన శిశిరమే
ఈ రహస్యం ఎప్పటికీ రహస్యమే