అలాగే నిలబడ్డ సుదీపని చూసి వాళ్ళ అత్తగారు,
“నీకుఈ ఇంటి పద్ధతులను చెప్తాను. రేపటినుండి అన్నిటిని ఫాలో కావాలి”అని చెప్పి వంటింట్లోకి తీసుకెళ్లింది.
చేయాల్సిన పనుల జాబితాను చూపించింది.
“ఎలాగూ నువ్వు ఇప్పుడు జాబ్ చేయడం లేదు. కాబట్టి పనులన్నీ నేర్చుకొని చేయాలి”అని చెప్పి తన పడక గదిలోకి వెళ్ళిపోయింది సుదీప అత్తగారు వరలక్ష్మి.
అసలే కొత్తగా ఇంట్లోకి వచ్చిన సుదీపకు ఏమి అర్థం కాలేదు. పనులు అయితే ఏం చేయాలో చెప్పింది. కానీ, ఎక్కడ ఏం సర్దాలి? ఏం వండాలి? అవేవి అర్థం కాలేదు. ముందు స్నానం చేసి లోపలికి వచ్చింది. చక్కని చీర కట్టుకొని, జడ వేసుకొని, బొట్టు, కాటుక దిద్దుకుంది. పూజగది దగ్గరికి వచ్చింది. అసలు అది పూజా మందిరమేనా? అనిపించింది. ఎక్కడికక్కడ దుమ్ము పేరుకొని ఉంది. దీపాలు వెలిగించిన కుందులు జిడ్డు కారిపోతున్నాయి. అసలు గదిని శుభ్రపరచిన దాఖలాలే కనిపించలేదు. ముందుగా దేవుడి గదిని శుభ్రపరిచింది. తనకు కూడా పెద్దగా పనులేమీ అలవాటు లేదు. కానీ తన తల్లి చేసేవి గుర్తుకు చేసుకొని ఒక్కొక్కటి శుభ్రపరిచింది.
పూజ పూర్తి చేసుకుని, చెంబులో నీళ్లు తీసుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో తులసి కోట ఎక్కడా కనిపించలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది సుదీపకు.
మళ్లీ నిద్రపోయి లేచి వస్తున్న అత్తగారు వరలక్ష్మిని అడిగింది.
“అత్తయ్యా! తులసి చెట్టు ఎక్కడ ఉంది పూజ చేసుకుంటాను”అని అడిగింది.
“తులసి చెట్టు లేదు అప్పుడు ఎప్పుడో ఉండేది” అంటూ బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు.
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనిపించింది సుదీపకి.
ఊపిరి సలపని పని చేయడం అలవాటు చేసుకుంది. భర్త సపోర్ట్ దొరకదని అర్థం అయిపోయింది. ఆయన ఎంతసేపు తల్లి ,చెల్లె భజన చేయడమే సరిపోయేది. మామ గారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. భార్య ఎంత అంటే అంత .అంతేగా అంతేగా అనే టైపు.
అంత పని చేయాలి. కానీ సొంత నిర్ణయం ఏది తీసుకోకూడదు. చివరికి టిఫిన్ చేయాలన్నా, రెండవసారి టీ పెట్టాలన్న, అత్తగారిని పర్మిషన్ అడగాలి. ఒక వస్తువు పక్కకు జరపాలన్న ఆడపడుచు ఆజ్ఞ కావాలి.
చూచాయిగా భర్తతో తన బాధను పంచుకోవాలని ప్రయత్నించింది. అసలు చెప్పక ముందే లేచి కొడతాడా అన్నంత దూకుడును చూసింది. అంతే తన మనసులోని భావాలకు కళ్లెం వేసింది.
మెల్లిగా జాబ్ కు అప్లై చేసింది. ఒకరోజు ఇంటర్వ్యూ కోసం వెళ్లాలని త్వరగా లేచి వంటింటి పని మొత్తం పూర్తి చేసి తయారై బయటకు వచ్చింది. అప్పుడే లేచి బయటకు వచ్చిన వసుంధర
“ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దున్నే తయారయ్యావు? అని అడిగింది.
“ఇంటర్వ్యూ ఉంది అత్తయ్య నేను ఇంటికి వచ్చేవరకు మూడు గంటలు అవుతుంది. వంట మొత్తం చేసి పెట్టాను” అని చెప్పింది.
“ఇప్పుడు నువ్వు జాబ్ చేయకుంటే గడవదా?మా అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు. ఇంకా మీ మామగారు కూడా రిటైర్ అవ్వలేదు. నువ్వు వెళ్లిపోతే ఇంట్లో పని అంతా ఎలా? “అని అన్నది.
ఆమె ఉద్దేశం సుదీపకు అర్థం కాలేదు. పెళ్లి కుదిరిన తర్వాత తాను తన పుట్టిన ఊళ్లో ఉండడం కుదరదు. కాబట్టి అక్కడ ఉద్యోగం చేయలేక భర్తతోపాటు అత్తవారింటికి వచ్చింది .ముందు అనుకున్న ప్రకారం వేరే ఉద్యోగం చూసుకోమని ఇంట్లో అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్న వైనం చూస్తే బాధ కలిగింది సుదీపకి.
కానీ మనసులో ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చి”నేను జాబ్ చేస్తానండి. నా తల్లిదండ్రులు ఇంత చదివించింది ఉద్యోగం చేయాలని కదా? స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. వాళ్లు సంపాదిస్తున్నారు కదా అని నేను ఊరికే ఉండలేనండి”అని మెల్లిగా జవాబు ఇచ్చింది.
ఆ జవాబు ఊహించని వరలక్ష్మి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అక్కడికి వచ్చిన శ్రీకర్
“కొన్నాళ్ల తర్వాత చేదువులే ఇప్పుడు ఏముంత తొందర వచ్చిందని?”అన్నాడు సుదీప తో.
కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్న సుదీప
“తొందర ఏం లేదండి దాదాపు ఆరు నెలలుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తాను .కాబట్టి మీరు కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూడండి”అన్నది ముఖంలో భావం ఏమీ కనిపించకుండా.
కోపంతో శ్రీకర్ కూడా అరిచాడు.
కానీ ఒక నిర్ణయానికి వచ్చిన సుదీప తన ఫైల్ మరియు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని దేవుడికి నమస్కారం చేసి చిరునవ్వుతో వెళ్ళొస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయింది.
సుదీప వెళ్ళిన అరగంట దాకా ఇంట్లో యుద్ధం నడుస్తూనే ఉంది.
ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వచ్చిన సుదీపకి అత్తగారి మొహం మాడిపోయి ఉండటం ,భర్త ముఖంలో కోపం తాండవ మాడటం కనిపించింది.
మౌనంగా లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వంటింట్లోకి వెళ్ళింది. అసలు అది ఇల్లేనా అనిపించింది. నెమ్మదిగా అన్ని సర్దేసి భోజనం చేసి తన గదిలోకి వచ్చి పడుకుంది.
ఉద్యోగంలో జాయిన్ అయిన సుదీపకు ఇంకా పనులు ఎక్కువైపోయాయి.
ఇంట్లో ఊరికే ఉండే అత్తగారు చిన్న చిన్న పనులకు కూడా సహాయం చేయదు. ఉద్యోగానికి వెళుతూ కూడా తను అన్ని పనులు చేసి వెళ్ళాలి. రాను రాను యంత్రంలా అనిపించింది బ్రతుకు. అసలు ఉద్యోగం ఎందుకు చేస్తున్నానని ఒక దశలో భావించింది .కానీ అదే “ఇంట్లో ఇలా రోజంతా గానుగెద్దులా చాకిరి చేస్తుంటే మనస్సు కూడా పంజరంలో చిక్కినట్లు అయిపోతుంది. కనీసం ఈ ఎనిమిది గంటలైనా మనసుకి స్వేచ్ఛగా ఉంటుంది” అని తలచింది.
ఆఫీసులో సుదీప పని మెచ్చుకొని చాలా తొందరగా ప్రమోషన్ ఇచ్చారు .
ఆఫీసర్ గదిలోకి వెళ్లిన సుదీపకి ప్రమోషన్ ఆర్డర్ చేతిలో పెట్టింది వాళ్ళ బాస్ సౌందర్య.
“కంగ్రాట్యులేషన్స్ సుదీప, ఇంత త్వరగా ప్రమోషన్ సంపాదించుకున్నావు. నీ పనిని నచ్చిన మన కంపెనీ వాళ్ళు నీకు శాలరీ పెంచడంతోపాటు ప్రమోషన్ ఇచ్చి, నీకు వెహికల్ కూడా ఇచ్చారు. కాకపోతే నీ జాబ్ ఇక్కడికి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట ఉంటుంది.”అని చెప్పింది సౌందర్య.
అంతా బాగానే అనిపించినా” వేరే ఊర్లో అంటే ఇంట్లో ఒప్పుకుంటారా?” అని భయమేసింది.. సౌందర్య తో ఉన్న చదువుతో తనకి విషయం చెప్పింది.
“ఏ కాలంలో ఉన్నావు సుదీపా? నిన్ను ఇంట్లో పనులు చేయొద్దని నేను చెప్పడం లేదు. కానీ నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా! వాళ్లతో పాటు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు .మరి ఇంత చాకిరీ చేసి బయటకి రావాలంటే కష్టం కదా! నీ భర్త అర్థం చేసుకోవడం లేదు. అయినప్పుడు ఎందుకు నెత్తిన బాధ్యతలు వేసుకుంటావు. చిన్న చిన్న పనులని ఆడపడుచు కూడా సహాయం చేయవచ్చు. నీ భర్త సహకారం అసలే లేదు. ఎవరికోసం ఈ త్యాగం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కచ్చితంగా చెప్తున్నాను. నువ్వు వేరే చోట జాబ్ చేయాల్సిందే. అప్పుడైనా వాళ్లకు నువ్వంటే ఏంటో అర్థమై నిన్ను ఒక మనిషిలా చూస్తారేమో? అయితే ఒక చిన్న లిటిగేషన్ పెడతాను నువ్వు ఇంట్లో చెప్పు’ నాకు ప్రమోషన్ వచ్చింది ఒకవేళ ఆ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయకుంటే జాబ్ రిజైన్ చేయమంటున్నారు. శాలరీ కూడా పెరిగింది’ అనే విషయం చెప్పు అది కూడా వేరే ఊళ్లో చేయాలని నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్. ఒప్పుకోకుంటే కామ్ గా వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వు. మరొక విషయం ఏమిటంటే నన్ను కూడా అదే బ్రాంచ్ కి పంపిస్తున్నారు. కాబట్టి నువ్వు నాతో ఉండొచ్చు”అని చెప్పింది.
ఇంటికి వచ్చిన సుదీప ఈ విషయం ఇంట్లో చెప్పింది అందరూ పెద్ద రాద్ధాంతమే చేశారు.
కానీ స్థిరమైన నిర్ణయం తీసుకున్న సుదీప
“జాబ్ రిజైన్ చేస్తే నాకు వచ్చే ఇంత శాలరీ పోతుంది. రేపు మనందరం బాగుండాలంటే నా శాలరీ కూడా అవసరమే కదా! రేపు మన అవసరాలు కూడా పెరుగుతాయి”అని చెప్పింది. డబ్బు గురించి అలోచించి ఒప్పుకున్నారు.
తొందరలోనే వేరే ఊర్లో ఉద్యోగానికి వెళ్ళసాగింది సుదీప. శని, ఆదివారాలు మాత్రమే ఇంటికి వచ్చేది.
మెల్లిమెల్లిగా వరలక్ష్మికి అర్థం కాసాగింది. ఉద్యోగానికి వెళితే కూడా ఇల్లును అందంగా ఉంచేది సుదీప. ఇప్పుడు ఆ కోపాన్ని కూతురు, కొడుకు మీద తీర్చుకో సాగింది.
“సుదీప అన్ని పనులు చేస్తూ ఉద్యోగానికి వెళ్ళేది. ఇప్పుడు పెద్దదాన్ని నేను ఇన్ని పనులు చేస్తుంటే, మీరు ఒక్క పని సహాయం చేయడం లేదు”అని అరిచింది.
మెల్లమెల్లగా అందరూ తలాఒక పనిచేయడం నేర్చుకున్నారు. శని ఆదివారాలు మాత్రం భారం అంతా సుదీప మీద పడేది.
రోజులు గడుస్తున్నాయి సుదీపకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారు. అప్పటికే సుదీప కొడుకు పెళ్ళీడుకు వచ్చాడు.
ఒక మంచి శుభ ముహూర్తంలో సుదీప కొడుకుకు పెళ్లి చేసింది.
ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకను జరిపించిన సుదీపకి ఇక కొడుకు కోడలితో హాయిగా ఉండాలని అనుకుంది.
కోడకు వచ్చిన వారం రోజులకి ఇంట్లో మార్పులు మొదలయ్యాయి.
ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సుదీపకి, తన అభిరుచులకు అనుగుణంగా పెట్టుకున్న వస్తువులు ఏవి కనిపించలేదు. వాటి స్థానంలో కొత్త బొమ్మలు కొత్త పెయింటింగ్స్ వచ్చి ఉన్నాయి.
“ఇదేంటి? ఎవరు ఇవన్నీ తీసేసారు?”అని అడిగింది సుదీప.
లోపల ఉండి బయటకు వచ్చిన కొడుకు కోడలు ,
“అవన్నీ ఓల్డ్ మోడల్ అత్తయ్య !అందుకని నేను ఇవన్నీ నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ లను ఇలా అరేంజ్ చేసుకున్నాను”అన్నది కోడలు ప్రియ.
“ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మ, ఇవన్నీ నేను ఎంతో ఇష్టంతో అలంకరించుకున్నాను. వీటిని ఒక వైపు ఉంచి, నువ్వు తెచ్చినవి మరోవైపు సర్దుకోవాల్సింది”అన్నది సుదీప నెమ్మదిగా
“ఏంటమ్మా అన్ని నీఇష్టా లేనా? పెళ్లయి అత్తగారింటికి వచ్చిన అమ్మాయికి, తన ఇష్టం వచ్చినట్లు సర్దుకోవాలని ఉండదా? ఇంకా నీ అథారిటీనేనా ? ఆ పాత బొమ్మలు ఏం చేసుకుంటాములే”అంటూ వెళ్లిపోయాడు.
సుదీప కు భూమిలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది.
తనకు ఏ ఇంట్లో స్థానం లేదు అనేది అర్థమైపోయింది అలాగే నిస్సత్తుగా కూర్చుండిపోయింది.
తర్వాత స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి కృష్ణుడి కళ్ళలోకి చూసింది.
ప్రశాంతంగా అనిపించింది.గీత బోధించినట్లు అనిపించింది.
“ఇల్లంతా ఎవరి అభిరుచికి తగ్గట్లు ఉన్నా, దేవుడి గదిలోకి మాత్రం ఓపికగా ఎవరూ రారు. కాబట్టి ఇది మాత్రమే నాకు సొంతం.” అని కళ్ళు మూసుకొని కృష్ణ భజన చేసుకో సాగింది తన్మయత్వంగా.