ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజనాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వ జ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు. అలాంటి వారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమిరత్నం యజ్ఞ కృష్ణమదాసు,
యజ్ఞకృష్ణదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లా మారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేతపని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారాలన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తిమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువబడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాళీ పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.
విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంధాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడం పట్ల అభివృద్ధి పెరిగింది. గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు. ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జన సంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.
వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధు పత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సుభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞకృష్ణను దాసు పరిచయమయ్యాడు.
బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమ దాసులో గల పరణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు. అక్కడి నుండి ఆయనలో చెప్పుకోతగినంత సాహిత్య పరిణతి కలిగింది.
యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.
వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞకృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. పశువుల కాపరై పద్మశాలిగపుట్టి
కట్టెలేరుకొనియు గడుపు నన్ను
అవధానములు చేయు నట్టిసభనజూచి
కడుపేద నైనను కరుణజూపి
సంస్కృతముద్దూయు ఛందస్సులను నేర్పి
నట్టిబెల్లంకొండ నాచార్య సోదర
ద్వయముకంజలి తనువు వీడువరకు
యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను
తే. దేశ బంధుపత్రికనాకు దిశనుజు
పత్రికసభల అధ్యకునై పాల్గొనుమని
బెల్లంకొండసోదరులైన వారె నిలను
నొందినఘనులనేమని నుడువువాడ
యజ్ఞ కృష్ణ దాసు కథలు:
యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతి శర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దుకున్నప్పటికీ కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.
యాజ్ఞకృష్ణదాసు అర్ధశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమదాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథ వైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.
ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్ధమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాధాలహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమలమాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనే వివరం పేర్కొంది.
ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈ కథ తెలియజేస్తుంది.
ఇంద్రమాలిక కథలో మంజీరకా దేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకా దేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్య ఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.
కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలో నూక మంజీరకా దేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆ జామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంత వలె శంకువులేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.
పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకుల వలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కామోన్మాదిరాజు గా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.
ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్య వచ్చును. ఇంద్రమాలిక నిద్రించువారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.
ఒకనాటి మాఘస్నాన ప్రారంభంలో రాజు గర్వానికి అడ్డుకట్ట వేసి సందర్భం ఏర్పడుతుంది. రాజు పల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళ తోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైన మలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు. అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వతశ్రేణిలోకి తీసుకొని వెళ్తారు. రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకోవచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్య వలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజు రాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాట లేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈ కథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.
విమర్శ:
కృష్ణ దాసు “భారతీయ సాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామ సంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యానికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవన పరిధిలోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపర లోక
సార్ధకత ఏ విధంగా పరిరవిల్లిందో అదే విధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారత భాగవతాలను రచించిన వారి జన్మ ధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్యనికులు చెప్పిన కవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్య సాధన అవసరమని తెలిపాడు. “దర్శనా ద్వ ర్ణనాచ్చాడ రూడాలోకే కవి శ్రుతి. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణరస హృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.
ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించినవాడు ఉత్తమ కవి కాజాలడు అన్నాడు. “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలించాడు.
“సశబ్దో నసన్యా యోన సావిద్యా నసా కళా
తే యన్న కావ్యాంగ మతో భారో మహా కమే”
సావిద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞకృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయ తలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తి లోపం వలన ప్రతిభ నశించి పోతుందని చెప్పటానికి
” అవ్యుత్పత్తి కృతో దోషః శక్తా సంప్రియతే కవేః
జ స్త్వశక్తి కృతస్థన్య ఝడిత్యేవా వభాసత “
అని తెలిపాడు. ప్రతిభ గుణ సంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞ కృష్ణమదాసు కవితా విమర్శనం చేశాడు.
ఈ విధంగా కృష్ణమదాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథా రచయితగా, విమర్శకుడిగా, పత్రిక రంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరం ప్రతాపరెడ్డితో మెప్పు పొందిన మేటి రచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.
యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమే కాదు. ఆయన ఆర్య సమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర మహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరం తుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞకృష్ణమదాసు వంటివారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.