సీ:కులము కులమటంచు కులుకుచుందురు గాని
కోరికవడి తెచ్చుకొనిరె కులము
మతము మతమటంచు కతలుజెప్పుదురెల్ల
వారి మతములొక్క తీరు గాదె?
ధనము నాకేయున్నదని గర్వ మేలకో?
పైసలనేదిని బతుకగలమె?
అధికార బలమున్నదని తుల్లెదరు నాయ
కుల జేసినది ప్రజాబలము గాదె?
తే: ప్రజల కన్నీటిలోని ఆపదలనెల్ల
తీర్పజాలిన నాడు-విద్వేష బుద్ధు
లింకిపోవవే? కాని నెడెందు జూడ
నాయకులె రెచ్చగొట్టుట నడుచు చుండె
చ:మతముల పేరుజెప్పుకొని మారణహోమము రేపి చీకటుల్
బతుకులలోన నింపుట-శవమ్ములపై పడు చిల్లరేరు దు
ష్కృతములు సాగవెల్లపుడు-కిందిది పైనది కాకపోదు-స
మ్మతములు తారుమారుగను మారక పోవునె?భారతావనిన్
ఆ:మతములోన గలుగు మానవత్వమ్మును
గొంతుబిసికి చంపి గోతి లోన
పూడ్చిపెట్టి సుద్ద పూసమాటలు నేడు
చెప్పు చుండ్రి లేని గొప్ప కొరకు
క: పరమతములపై పడి యె
వ్వరు’దూషింపండి’యనుచు ప్రవచించిరి నె
త్తురులను పారింపుమనుచు
విరచించిరె గ్రంథముల పవిత్రత నెరుపన్
ఆ:మధ్యలోన పుట్టి మధ్యలోనే పోయె
గతమునందు కొన్ని మతములవని
మానవత్వమనెడు మతమొక్కటే మాన
వాళితోడ చివరి వరకు నిలుచు
తే:చెట్టుపై కిచకిచలాడు పిట్టలందు
కులము మతములు గలిగెనే? కుట్రలేవి
యేని పొడసూపెనే?లేని పోని లొల్లు
లొక్క మనుషులందే కల్గియుండుటేమి?
తే:మనది ఉపఖండమని చెప్పుకొనుచు
పక్క వారి సంస్కృతి కించపరుచ నేల?
మాలలో తీరుతీరైన పూలు గలుగ
చూడ ముచ్చట గొల్పదే శోభ హెచ్చి –
