* కరీంనగర్లో ఏటా సమైక్య సాహితీ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాలు
* ఆదర్శంగా నిలుస్తున్న స్నేహితులు
ముగ్గురు స్నేహితుల్లో చిగురించిన ఒక ఆలోచన ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన తమ తండ్రుల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటుతోంది.
ఒక ఆదర్శాన్ని భావితరానికి అందిస్తోంది.
తల్లి దండ్రులను , మూలాలను ఎన్నటికీ మరువరాదని సందేశం ఇస్తోంది.
పలు రంగాలలో వినుతికెక్కిన ప్రతిభామూర్తులను సమున్నతంగా సత్కరించుకుంటోంది.
ఆ ముగ్గురు శ్రీ మాడిశెట్టి గోపాల్, శ్రీ కేఎస్ అనంతాచార్య,శ్రీ రావికంటి శ్రీనివాస్‌లు.
ఆ తర్వాత పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్రీ జి.శ్యాంప్రసాద్ లాల్, డాక్టర్ శ్రీ రఘురామన్‌లు జత కలిశారు. ఏటా ఈ అయిదుగురు తమ తండ్రుల పేరిట సమైక్య సాహితీ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాలను అందిస్తున్నారు.
పురస్కారం అంటే అర్పించడం, ఇవ్వడం.. బహుమతి… పరమాత్మునికి పూజ తరువాత పురస్కారం చేస్తాం అంటే ఏదైనా పండు, ఫలం.. వస్త్రాన్ని సమర్పించి ఆయనను ప్రసన్నం చేసుకుంటాం. పురః కర అంటే పురస్కారం. గౌరవంగా అందించడం. ఇలాంటి అభ్యాసం మనకు పెద్దవాళ్ల నుంచి అలవడుతుంది. అనూచానంగా వచ్చే సంప్రదాయాన్ని కొనసాగించడమే సంస్కృతిలో భాగమవుతుంది. అలాంటి గొప్ప సంస్కృతిలో ఒకటి పురస్కారం. దీనినే అవార్డు అని కూడా అంటాం. ఈ ఒక నిర్దిష్ట రంగంలో పనిచేసిన వారి అద్భుతమైన కృషికి అందించే శ్రేష్టమైన గుర్తింపు పురస్కారం. అంటే ప్రతిఫలం ఆశించకుండా అందించేది. ఒక అసాధారణ సామర్ధ్యానికి, సృజనకు లేదా అత్యధిక నిబద్ధతకు అందించే ప్రశంసాపూర్వక సమర్పణ. రాజుల కాలంలో కవిపండితులను, కళాకారులకు భూములు, నగదు, బంగారు ఆభరణాలు, గ్రామాలను నజరానా కింద అందించి ప్రోత్సహించారు. అనేకమంది రాజులు దీనిని అనుసరించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు కూడా అవార్డులు ప్రకటిస్తున్నాయి. కళా సాహితీ సంస్థలు సైతం ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకొని నిర్వహిస్తున్నాయి. అలాంటి వాటిలో కరీంనగర్ చెందిన సమైక్య సాహితీ కూడా ఒకటి. జన్మనిచ్చిన జనకుల విశేషాలను లోకానికి జ్ఞాపకం చేస్తూ…ఆ బాటలో నడిచిన ఉన్నతశ్రేణి కవిపండితులను, కళాకారులు, అధ్యాపకులకు అందించే పురస్కారాలే సమైక్య సాహితీ విశిష్ట పురస్కారాలు.
2017 నుంచి ఏటా ఈ పురస్కార ప్రదానోత్సవాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా 2020, 2021లలో ఈ కార్యక్రమాలు జరగలేదు. శాలువా, మెమెంటోలతో సత్కరించడమే కాకుండా క్యాష్ అవార్డును కూడా ఇస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ చివరి వారంలో ఈ పురస్కార ప్రదానోత్సవం కరీంనగర్లో జరగనుంది.
(ఒక్క 2019లో మాత్రం తుమ్మల రంగస్థల పురస్కారాన్నికూడా ఇదే వేదిక నుంచి రచయిత, నాటక కళాకారుడు శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ కు ప్రదానం చేశారు)
కలకుంట్ల సంపత్కుమారాచార్య సంగీత పురస్కారం
కరీంనగర్‌కు చెందిన శ్రీ కలకుంట్ల సంపత్ కుమార్ ఆచార్యుల వేళ్లు హార్మోనియంపై సున్నితంగా కదులుతుంటే కర్ణపేయమైన సుస్వారాలు వినిపించాయి. ఆయన స్వరపరిచిన రాగాలు సంగీత ప్రియులను అలరించాయి. పరిచితరాగాలతో ప్రసిద్ధిగాంచిన సంగీతజ్ఞులు శ్రీ సంపత్ కుమారాచార్యులు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తను అడుగుపెట్టిన ప్రతి పాఠశాలలో పిల్లలు రాగాలు తీస్తుంటే విద్యాధికారులు ఆశ్చర్యపోయిన సందర్భాలెన్నో. హార్మోనియంలో ఉన్న ప్రతిభతో పాఠశాలల్లో పిల్లలచే నాటకాలు ఎన్నో ప్రదర్శింపజేశారు. భక్త ప్రహ్లాద, లవకుశ, శకుంతల, కృష్ణరాయబారం, భక్త సిరియాలతో పాటు సాంఘిక నాటకాలను విద్యార్థులను విద్యార్థులతో ప్రదర్శింప జేశారు. రవాణా సౌకర్యం లేని రోజుల్లోనూ ఎన్నో గ్రామాల్లో నాటకాలు వేయించారు. సంగీత పరిజ్ఞానంతో పాటు తెలుగు సాహిత్యం కూడా పరిచయం ఉంది. కరీంనగర్లో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ఆనాటి జిల్లా కలెక్టర్ తో పురస్కారం అందుకున్నారు సంగీత కళాకారుడిగా ఉపాధ్యాయుడిగానే కాకుండా ఆ రోజుల్లో పెద్దపల్లి ప్రాంతంలో ఆర్ఎంపీ గా పని చేశారు. వారి సేవలు స్ఫూర్తిగా నిలవాలని వారసుడు శ్రీ కేఎస్ అనంతాచార్య తండ్రి పేరిట ఏటా ఒక సంగీత విద్వాంసునికి పురస్కారం అందజేస్తున్నారు. ఈ ఏడాది సంగీత విద్వాంసుడు, తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిని గాయకులుగా తీర్చి దిద్దుతున్న సంగీత గురువు శ్రీ రామాచారికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు గతంలో రాఖీ, శ్రీ కొరిడె నరహరి, శ్రీ రామయ్య శర్మ, శ్రీ జయకుమారాచారి, శ్రీ కేబి శర్మ లకు ఈ పురస్కారం దక్కింది.
ఆచార్య రజనీ శ్రీ నాట్య పురస్కారం
హుస్నాబాద్‌కు చెందిన ఆచార్య రజనీ శ్రీ కళా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. ప్రముఖ నాట్యాచార్యులుగానే కాకుండా నటుడు,దర్శకుడు,కవి, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. 1959 నుంచి 2002 వరకు సాహిత్య రంగంలో.. నాటక రంగంలో అత్యంత ప్రతిభ చాటారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూనే సామాజిక చైతన్యం కోసం నాటకాల ప్రదర్శనలిచ్చి ప్రజాభిమానం పొందారు. కూచిపూడి, కథక్ ఆంధ్ర భరతనాట్యాలను అలవోకగా ప్రదర్శించారు. జానపద నృత్యాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సాంస్కృతిక రంగంలో నిబద్ధత కలిగిన కళాకారుడుగా ఉంటూనే అదే నిబద్ధతతో ఉపాధ్యాయ వృత్తిలో 37 ఏళ్లు పనిచేశారు. 1990లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా కలెక్టర్ నుంచి, 2000 సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకున్నారు. విభిన్న రంగాలలో కృషిచేసిన రజనీ శ్రీ స్ఫూర్తి కొనసాగాలని ఆయన తనయుడు, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ పురస్కారాన్ని అందిస్తున్నారు.తొలుత తండ్రి గురువైన డాక్టర్ మలయశ్రీకి రజనీ శ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తర్వాత ప్రసిద్ధ ఆంధ్ర నాట్య కళాకారులు శ్రీ కళాకృష్ణకు, ప్రముఖ నచ్చే కళాకారులు అంజి బాబుకు, ఈ అవార్డు ఇచ్చారు. ఈ సంవత్సరం ప్రముఖ పేరిణి నృత్య కళాకారుడు ప్రకాశ్‌కు ఈ పురస్కారం ప్రకటించారు.
శ్రీ మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారం
విధి నిర్వహణ అనేది ప్రతి మనిషి వ్యక్తిత్వానికి అందం తీసుకొస్తుందని భావించేవారు ఉపాధ్యాయుడు శ్రీ మాడిశెట్టి మల్లయ్య. ఆట, పాట, మాటలన్నింటినీ సమన్వయం చేసుకొని విద్యార్థులకు బోధించిన అక్షర సూర్యుడాయన. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన తల్లి ప్రోత్సాహంతో చదువుకొని ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. గణితాన్ని బోధించి గణాంకాలతో ఆటలాడించిన అధ్యాపకుడాయన. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించి విధులు నిర్వహించారు. వచ్చునూరు గ్రామానికి చెందిన ఈయన సొంత ఊరును ఆకుపచ్చనూరుగా మార్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన తనయుడు మాడిశెట్టిగోపాల్ తండ్రి పేరిట ఏటా ఒక ఉత్తమ ఉపాధ్యాయునికి పురస్కారం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ పాఠ్యపుస్తక రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, జాతీయవాది శ్రీ గాజుల రవీందర్‌కు ఈ పురస్కారం ప్రకటించారు గతంలో శ్రీ మానేటి ప్రతాపరెడ్డి, శ్రీ అవసర రాజయ్య,శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సువర్ణ వినాయక్ , పోరెడ్డి రంగయ్యలకు ఈ పురస్కారం దక్కింది.
శ్రీ రావికంటి రామయ్య గుప్త సాహితీ పురస్కారం
తెలంగాణ సాహితీ చరిత్రలో ఆరిపోని కవివరేణ్యుడు శ్రీ రావికంటి రామయ్య గుప్త. వేద శాస్త్రాల పుట్టినిల్లుగా భావించే మంథనిలో జన్మించిన రామయ్య ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందారు. మాటలాడుతున్నంత తేలికగా ఆటవెలది పద్యాలు రాసేవారు. ఆశువుగా అందరినీ అలరించారు. అందుకే రెడీమేడ్ పోయెట్ (ఆర్.ఎం.పి)గా పేరు పొందారు. అలతి అలతి పదాలతో ..హాస్య చతురోక్తులతో సహజ కవిగా, ప్రజాకవిగా సాహితీ లోకంలో నిలిచారు. కల్లగాదు రావికంటి మాట మకుటంతో ఎన్నో పద్యాలు రాసి సామాజిక చైతన్యం తెచ్చారు. తన చుట్టూ ఉండే పరిసరాలు, సందర్భాలు, వేడుకలు జ్ఞాపకాలను ఆసరా చేసుకుని పద్య రచన చేశారు. ఆయన ఏ పద్యం పాడినా గుండెలను తాకేది. ఆయన నీతి, నిజాయితీ, నిర్భీతితో శిరమెత్తి, కరమెత్తి కవిత్వాన్ని అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో వీరి పద్యానికి చోటు లభించింది . ఈ ఘనత సాధించిన ఆ కవికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మంథని సమాజం గౌరవాన్ని చాటుకుంది. వీరు రాసిన వాసవీగీత అనేక కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో మారుమోగుతోంది. మంథని గౌతమేశ్వరుని స్తుతిస్తూ గౌతమేశ్వర శతకం, కన్యకాపరమేశ్వరి శతకం, శ్రీ వరహాల భీమన్న జీవిత చరిత్ర (బుర్రకథ), వరద గోదావరి ఉయ్యాల పాట లాంటివి ఎన్నో రాశారు. వారి వారసుడు రావికంటి శ్రీనివాస్ తండ్రి పేరున ఏటా సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ పద్యకవి, అవధాని, పండితులు శ్రీ ముద్దు రాజయ్యకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. గతంలో శ్రీ మాడుగుల మురళీధర శర్మ, శ్రీ అల్లం వీరయ్య, శ్రీ ఎం నారాయణ శర్మ, శ్రీ అవుసుల భాను ప్రకాశ్, శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మలు ఈ పురస్కారం పొందారు.
డాక్టర్ శ్రీ దారం నాగభూషణం పరిశోధన పురస్కారం
డాక్టర్ శ్రీ నాగభూషణం కరీంనగర్లో పేరెన్నిక గన్న వైద్యులు. సామాజిక చింతనతో ప్రజల పట్ల అమితమైన అనురాగంతో సేవ చేసేవారు.చారిత్రక అంశాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తితో తపాలా బిళ్లలు, నాణేలు ఇతర రకాల వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ, దేశభక్తి , నైతిక విలువలు మూర్తీభావించిన వ్యక్తిత్వం అయినది. అవసరం ఉన్న మందులు మాత్రమే రాసి, న్యాయబద్ధమైన ఫీజు తీసుకొనే డాక్టర్ గా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. వారి సామాజిక సేవలు గుర్తించి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వయో శ్రేష్ఠ సన్మాన్ అవార్డు ప్రకటించగా ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని తీసుకున్నారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జీవన సాఫల్య పురస్కారాన్ని పొందారు. ప్రవృత్తి రీత్యా పురావస్తు సేకరణలో అగ్రగణ్యుడిగాపేరు పొందారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, ప్రాచీన కళలు, ఆచార వ్యవహారాల పట్ల మక్కువతో ..వాటిని ప్రతిబింబింపజేసే అరుదైన కళాఖండాలను, అబ్బురపరిచే వస్తువులను సొంత డబ్బులతో సేకరించి భద్రపరిచారు. తన సతీమణి పేరిట దారం సుశీల మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి స్మారకార్థం ఆయన తనయుడు డాక్టర్ రఘురామన్ 2023 నుంచి పరిశోధన పురస్కారాన్ని అందిస్తున్నారు.తొలుత చరిత్ర పరిశోధకుడు సంకేపల్లి నాగేంద్ర శర్మకు ఈ అవార్డును ప్రధానంప్ చేశారు.ఈ సంవత్సరం తెలంగాణ నవ చరిత్ర పరిశోధకులు ధ్యావనపల్లి సత్యనారాయణకు ఈ అవార్డు ప్రకటించారు. పురస్కారాలు..సృజనకు సోపానాలు.
-రూపావాస్
99088 92067